Thursday, March 30, 2017

ఉగాది కవిసమ్మేళనంలో కవితా పఠనం

ఆంధ్రప్రదేష్ భాషా సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో కవితాగానం మరియు మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి గారిచే సన్మానం.
ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ జి.వి. పూర్ణచంద్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.



వసంతసేన ఏమంది?

శీతవేళ సెలవు తీసుకొన్నాక
వసంతసేన మల్లెలపల్లకిలో అరుదెంచింది
కోయిలలు, మామిడిపూతలు, వేపచిగుర్లు, 
వెన్నెల రాత్రులు ఆమె  సైన్యం

ఆమెకు పదార్చనచేయటానికి కవులు
అక్షరసుమాల్ని సమాయత్తం చేసుకొన్నారు.
శుకపికములు ఆమెకు స్వాగతగీతాలాలపించాయి.
ఆమె బంగారు మేని తేజస్సు చుట్టూ పరిభ్రమించే
సీతాకోకలు దివ్యత్వాన్ని పొందుతున్నాయి.
నులివెచ్చని కాంతి తన కిరణాల వేళ్లతో
ఆమెను తాకి మురిసిపోతోంది
కోయిలలు తమ శ్రావ్య గళాలతో
ఆమె సౌందర్యాన్ని గానం చేస్తున్నాయి
ఆమె రాకకు పులకించిన తరువులు 
కొత్తపూతల పుప్పొడులను రాల్చుకొన్నాయి

తేనెలూరు చూపులతో పరికించి చూసిన వసంతసేన 
"కాలం ఒక్కటే శాశ్వతం.... ప్రేమే సత్యం" అని అంది.

నిజమే కదా!
అనాదిగా సమస్త ప్రకృతీ ఆమె మాటల్లో 
లయం అయ్యే ఉంది.
పుడమి సంగీతాన్ని నూత్నసృష్టి, మృత్యువు
నిత్యం శ్రుతిచేస్తూనే ఉన్నాయి.
జీవితపు దారులను ప్రేమ తన పరిమళాలతో
ప్రకాశింపచేస్తూనే ఉంది

మిత్రమా!
కాలానికో, ప్రేమకో వినమ్రంగా నమస్కరించి
అస్థిత్వాన్నో ఆత్మనో ఆనందంగా 
సమర్పించుకోవటంలో ఎంతటి
జీవనమాధుర్యముంది!

బొల్లోజు బాబా



No comments:

Post a Comment