పట్టపగలు నగరంలో
హత్య
పాతపగలో కొత్త వగలో
కారణాలనవసరం
ప్రజలు చూస్తుండగానే
హత్య జరిగిపోయింది
పక్కనించే
ప్రజలు నడుచుకుపోయారు
కనీసం ఆగి ఏమిటని కూడా చూడలేదు
వారికి ఖాళీలేదు
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి
వెళ్ళాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయి
భయంతో నిలువరించలేకపోవటం అటుంచి
కనీసం
ఆగి ఏంజరుగుతూందో చూసే ఖాళీ కూడా లేదు
ప్రజలు ఖాళీగా లేరు
ప్రజలు ఖాళీగా లేరు
ఎవరి ప్రపంచం వారిది.
కంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు తప్ప
మిగిలినవారందరూ మనుషులే కాదన్నంత
దూరం మనిషికి మనిషికీ మధ్య.
ఒక ప్రాణం పోయింది
గణాంకాలలో ఒక సంఖ్య
ఒకచోట తొలగించబడి మరో చోట చేర్చబడింది.
ప్రపంచం సాగిపోతూనే ఉంది
గమ్యాలవైపు, లక్ష్యాలవైపు.
మనిషి చచ్చిపోయిన దృశ్యం
కాలంలో ఘనీభవించింది
బొల్లోజు బాబా
No comments:
Post a Comment