.
యానాం చరిత్రలో శంకోలు/శంగోలు (రాజదండం) ఒకప్పుడు చాలా వివాదాస్పద సామాజిక పాత్ర పోషించింది.
తూర్పుగోదావరి జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెంది జమిందారులుగా పేరుగాంచిన కుటుంబం మన్యం వారిది. కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790 లలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి చాలా సంపదలు గడించాడు. ఈయన 1827 లో పోలవరం ఎస్టేట్ వేలానికి వచ్చినప్పుడు దానిలో కొంతభాగమైన గూటాల అనే ప్రాంతాన్ని 2,30,000 రూపాయిలకు రాజా అప్పారావు వద్దనుండి కొన్నాడు. ఆ విధంగా మన్యం కుటుంబానికి గూటాల జమిందారీ లభించింది.
జమిందారీ చిహ్నాలైన ఢంకా, నగరా మరియు వెండి శంకోలులను ఉపయోగించుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం మన్యం కనకయ్యకు అనుమతినిచ్చింది. దీనిద్వారా వెండి శంకోలు కలిగి ఉండి రెండు కాగడాలతో పల్లకిలో తిరగే అర్హత పొందాడు.
ఈ మన్యం కనకయ్య ఫ్రెంచి యానాంలో కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవాడు. యానాంలో కూడా తనకు పై సదుపాయాలకు అనుమతినిప్పించమని అప్పటి ఫ్రెంచి యానాం పెద్దొర Delarche ను కోరాడు.
18, ఆగస్టు 1828 న Delarche మన్యం జమిందారుకు వెండి శంకోలు ధరించటం, రెండు కాగడాలతో పల్లకి ప్రయాణం సదుపాయాలను కల్పించాడు. అంతే కాక ఆ సదుపాయాలను కల్పిస్తున్నట్లు 9 మంది ఫ్రెంచి దేశస్థుల సంతకాలతో కూడిన ఆ అనుమతి పత్రాన్ని పాండిచేరీలో ఉండే ఫ్రెంచి గవర్నరుకు ఆమోదం కొరకు పంపించాడు కూడా.
ఆ విధంగా మన్యం జమిందారుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించటం పట్ల యానాం సమాజం భగ్గుమంది. డబ్బులు వెదజల్లి అలాంటి హోదాను పొంది, సామాన్య ప్రజలను మన్యం జమిందారు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అంతేకాక హిందూ వర్ణ వ్యవస్థ ధర్మాలను బట్టి కనకయ్య వర్ణానికి అలాంటి సదుపాయాలు లేవని; అట్టి అనుమతులను నిరసిస్తూ 31 ఆగస్టున తొంభైమంది యానాం ప్రముఖుల సంతకాలతో కూడిన ఒక పిర్యాదు పాండిచేరీ గవర్నరుకు పంపబడింది.
కనకయ్యకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరుగుతూ మరో పిర్యాదుపై సంతకాలు తీసుకొంటున్న ఇద్దరు యానాం ప్రముఖులను 7 సెప్టెంబరున Delarche అరెస్టు చేయించాడు. దీనితో అంతవరకూ నివురుకప్పిన నిప్పులా ఉన్న్ ఆగ్రహజ్వాలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వందల సంఖ్యలో జనం చేతకర్రలు ధరించి Delarche ఇంటి తలుపులు బద్దలు కొట్టి దాడికి పాల్పడ్డారు.
Delarche భారతీయ వనితను వివాహం చేసుకొన్నప్పటికీ ఆనాటి ప్రజలలో పాతుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థ స్వరూపాన్ని అర్ధం చేసుకోవటంలో విఫలం అయ్యాడనే అనుకోవాలి.
సెప్టెంబరు 18 న గవర్నరు కోర్డియర్, Delarche కు రాసిన ఒక లేఖలో అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయించి పాండిచేరీ పంపమని ఆదేశించాడు. ఈ లోపున కనకయ్యకు శంకోలు, పల్లకి సదుపాయం కల్పించవలసిందని యానాం నుంచి 132 మంది సంతకాలు చేసిన రెండు వినతిపత్రాలు గవర్నరుకు పంపటం జరిగింది. వీరంతా జమిందారు వద్ద పనిచేసే ఉద్యోగులు, జమిందారు బంధువులు.
పై వినతిపత్రాలను అందుకొన్న గవర్నరు యానాంలోని పరిస్థితి తీవ్రతపై అనుమానం వచ్చి Delarche ను సంయమనం పాటించమని ఆదేశించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయమన్న గవర్నరు గారి ఆదేశాల మేరకు Delarche 18 అక్టోబరున ఆపనికి శ్రీకారం చుట్టి ఆ మొత్తం ఉదంతాన్ని నడిపిస్తున్న కొంతమందిని అరెస్టు చేయించాడు. దీనితో నిరసన జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ సారి ప్రతిఘటన చాలా బలంగా వచ్చింది. సుమారు రెండువేలమంది ఆందోళన కారులు కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి ప్రతిదాడులకు సిద్దమయ్యారు. ఈ సందర్భంలో పరిస్థితులను అదుపులో ఉంచటానికి ఫ్రెంచి అధికారులు సమీప బ్రిటిష్ పోలీసుల సహాయం తీసుకోవలసి వచ్చింది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫ్రెంచి గవర్నరు, Delarche ను తొలగించి యానాంలో ఇదివరకే పనిచేసి అవగాహన ఉన్న లెస్పార్డాను పంపించింది. లెస్పార్డా ఎంతో చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్ది, నిందితులందరికీ గవర్నరునుండి క్షమాభిక్ష కూడా ఇప్పించటంతో మొత్తం అల్లర్లకు తెరపడింది.
***
ఈ మొత్తం ఉదంతంలో ఒక వర్ణానికి చెందిన వ్యక్తి వెండి శంకోలు ధరించటమనే అంశం కేంద్రంగా ఉంది. ఆ వర్ణానికి శంకోలు ధరించే అర్హత లేదన్న పాయింటు మీద తీవ్రమైన ఉద్యమం నడవటం గమనార్హం.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా కలిగి ఉన్నామని చెప్పుకొనే ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకానొక దశలో ఈ ప్రతిఘటనకు చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుత "సందర్భానికి" "Those who cannot remember the past are condemned to repeat it” - George Santayana కొటేషనును గుర్తుచేసుకోవటం అసందర్భం కాదనుకొంటాను.
పి.ఎస్.
నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి ఇదొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ సెంగోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం రాజకీయం.
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.
.
బొల్లోజు బాబా
"ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా" పుస్తకం నుంచి.
డౌన్ లోడ్ చేసుకొనే లింక్ కామెంటులో కలదు.
అధికారమార్పిడికి ఇదొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ సెంగోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు
ReplyDeleteఈ మధ్య నెహ్రూ గారి ఫోటో శంగోళము తో దుశ్శాలువ కప్పుకుని వుండడము ఒకటి వచ్చిందే ? ఇది సరికాదాండి ?
అది బహుమతిగా స్వీకరిస్తున్నప్పటిది... మౌంటుబాటను నుండ్ అధికారికంగా పవర్ ట్రాన్సపర్ జరుగుతున్నట్లా? మీరే చెప్పండి
Deleteకాదు. ఈ మవుంటు బ్యాటెన్ ని మధ్యలో ఇరికించినట్లుంది :)
Delete