Friday, April 3, 2026

కొన్ని మౌలిక ప్రశ్నలు.....

శ్రీ మందకృష్ణ మాదిగ లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యమైనవి కావు. అవర్ణులైన ప్రతి సామాజికవర్గమూ అడగాల్సిన ప్రశ్నలు అవి.

1. అన్ని వర్గాలవారు దేవుడిని పూజించినపుడు ఒక్క బ్రాహ్మణ వర్గం మాత్రమే పురోహితులుగా ఎందుకున్నారు? ఈ ప్రశ్న శతాబ్దాల క్రితమే మా శిల్పులు వేసారు. తామే తమ కాళ్ళకింద తొక్కి చెక్కిన శిల్పానికి ప్రాణప్రతిష్ట చేసాము అనే మిషతో ఆ తరువాత దానిని తాకనివ్వకుండా నిషేదించటాన్ని ప్రశ్నించారు.

ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనలో కోర్టుకేసులు కూడా నడిపి, బ్రాహ్మణులతో పాటు సమానంగా విశ్వబ్రాహ్మణులు కూడా అర్చక హక్కులు తెచ్చుకొన్నారు. ఆ వాదప్రతివాదనలన్నీ పుస్తకరూపంలో లభిస్తున్న "1818 డిసెంబర్ 15నాటి చిత్తూరు జిల్లా అదాలత్ తీర్పు" ద్వారా నేడు తెలుసుకోవచ్చు.

ఈ తీర్పు ద్వారా పూజలు, వివాహాలు, ఉపనయనాలు, ప్రాణ ప్రతిష్ఠ, గర్భగుడి అర్చనలు లాంటి హక్కులు విశ్వబ్రాహ్మణులు కూడా పొందారు. ఈ క్రమంలో ఎన్నెన్ని ప్రతిఘటనలు చవిచూసారో 1821, 1843-44 నాటి రివ్యూ పిటిషన్లు, బందరు కేసు, సేలం (1840), గుంటూరు జిల్లా (1912) విశ్వబ్రాహ్మణుల కేసుల ద్వారా తెలుస్తుంది.

చారిత్రికంగా బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించి కులనామాన్ని విశ్వబ్రాహ్మణగా మార్చుకొని (శాసనాలలో పంచానము వారు అని ఉంటుంది) వేదాధ్యయనం చేసి, జంద్యం ధరించి, పౌరోహిత్యం చేసి వారికి బలంగా ఎదురు నిలిచిన సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణ వర్గమే కావొచ్చు. ఈ మార్గంలో వారు ఎంత హింసను ఎదుర్కొని ఉంటారో అనేది కూడా సులభంగా ఊహించవచ్చు.
ఇదంతా చరిత్ర. కాలక్రమేణా బ్రాహ్మణాధిపత్య రాజకీయాలవల్ల ఈ హక్కులు చాలామట్టుకు క్షీణించాయి.

ఈ రోజు రాజ్యాంగం శాసించిన ప్రకారం అన్ని వర్ణాలవారికి అర్చకత్వ అర్హతనిచ్చే వేదం నేర్పుతున్నారు. కానీ వారిని అర్చకులుగా తిరుపతి, అన్నవరంలాంటి ప్రధాన ఆలయాలలో నియమించటం లేదు. అలా ఎందుకు జరుగుతోందని ప్రతీ అవర్ణ సామాజిక వర్గమూ ప్రశ్నించాలి.


2. మరొక ప్రశ్న- ఎక్కడో పుట్టిన ఇస్లాం, క్రిష్టియానిటీలు విశ్వవ్యాప్తం అవ్వగా అంతకన్నా ప్రాచీనమైన హిందు మతం ఎందుకు విస్తరించలేకపోయింది?

అంతేకాదు ఇక్కడే పుట్టిన బౌద్ధం కూడా జపాన్ నుండి శ్రీలంకవరకూ విస్తరించి ఒక ప్రపంచ మతంగా స్థిరపడింది. ఈ మతాలలో లేనిది హిందూ మతంలో ఉన్నది ఒకటే- కులవ్యవస్థ. సాటి మతావలంబిని చంపేటంత ద్వేషాన్ని నూరిపోయటం ఈ కులవ్యవస్థ లక్షణం.
సాటిమనిషి పట్ల ఎంత వివక్ష చూపిందనటానికి మనుధర్మ శాస్త్రమే ప్రమాణం. ఇంకా చెప్పాలంటే ఓ పదిశాతం ద్విజులను మినహాయిస్తే మిగిలిన 90% జనాభాకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరాకరించి వారిని సేవకులుగా చేసింది కులవ్యవస్థ. ఇలాంటి అసమానత్వ లక్షణాలతో ఎలా విస్తరించగలదు?

ఈ శూద్ర అతిశూద్ర వర్గాలను హిందూమతంలోనే ఉండేలా చేసింది భక్తి, సూఫీ ఉద్యమాలు. నిజానికి ఈ ఉద్యమాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు. వాటిని సంస్కరణల పేరుతో హిందూమతం క్రమేపీ తనలో కలిపేసుకొంది.

దుర్మార్గమైన ఈ వివక్షను తట్టుకోలేక ఇతరమతాలలోకి వెళితే వివక్షను మరింత బలంగా అమలు చేయడం సమకాలీన విషాదం.

ఇది కేవలం పూజాధికారాల కోసం కాదని — సమానత్వం, గౌరవం, మనిషితనాన్ని తిరిగి సాధించుకునేందుకని ప్రతిఒక్కరూ గుర్తించాలి.

బొల్లోజు బాబా

Post Script Comments: 

1. అసలు ప్రశ్న — అవకాశం అందరికీ సమానంగా ఉందా లేదా? అని.
ఒక వ్యవస్థను పూర్తిగా త్రోసిపుచ్చడం కన్నా దాన్ని ప్రజాస్వామ్యీకరించడం (democratize)  ఒక సామాజిక విప్లవం.
“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదే” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.
డా. బాబాసాహెబ్ చెప్పినట్లు అసమానతలపై పోరాడటంలో దీన్ని కూడా భాగం గా చూడాలి అనుకొంటాను

2. నేను బ్రాహ్మణులను వ్యతిరేకించను, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తాను. 
వేదాల ఆధారంగా, యజ్ఞాలు,  కులవ్యవస్థతో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రాచీన మత వ్యవస్థ ను బ్రాహ్మనిజం అంటారు.  బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణులు ఒక్కరే పాటించరు...శూద్ర అతిసూద్ర వర్గాలలో కూడా ఉంటుంది. ఇది సూక్ష్మ విషయం. చాలామందికి అర్థం కాదు. 

3 ఒక బ్రాహ్మణుడు కావాలంటే నేర్చుకొని బట్టలు నేయవచ్చు, కుండలు చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అదే నేర్చుకొని నేతకాడు, కుమ్మరి పౌరోహిత్యం ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి.
రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. అలా నేర్చుకొన్న దళిత పూజారులను పెద్ద ఆలయాలో ఎందుకు నియమించటం లేదని మరో ప్రశ్న.
గుర్తుపెట్టుకోండి ...“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదీ” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.

No comments:

Post a Comment