Sunday, April 23, 2017

జీవించటమే.......


ఓ రోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరచిపోయింది. చాలా బెంగ పట్టుకొంది దానికి, గమ్యం లేని జీవితమేమిటని. తన గమ్యాన్ని వెతుక్కొంటూ ప్రయాణం కట్టిందా దారి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది.
పిట్టల్ని పెంచే కులవృత్తిని కోల్పోయి ఏదో ఫాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఓ ముసలి చెట్టును అడిగింది "నా గమ్యాన్ని ఎక్కడైనా చూసావా" అని. "తూర్పువైపున బోల్డన్ని గమ్యాలుంటాయని మా పూర్వీకులు చెప్పేవారు ఆ వైపు ప్రయత్నించు" అంది ఆ చెట్టు. అటుగా కదిలింది. పొద్దున్నుంచీ ఏమీ తినలేదేమో నిస్సత్తువ ఆవరిస్తోంది.
ఎదురుపడ్డ ఒక ఎర్రనత్తను అడిగితే "నన్ను అనుసరించు" అంటూ వెనుకకు నడవటం మొదలెట్టింది. దారికి దాని వాలకంపై అనుమానం వేసి ముందుకు సాగింది.
చీకటి పడింది. అడవి గుండా ప్రయాణం. ఏవేవో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. దారికి భయం వేసింది. అయినా సరే గమ్యాన్ని కనుక్కోవాలన్న నిశ్చయం సడలలేదు. ఆకలి చలిలా కొరుకుతుంది.
కొందరు దారిదోపిడి దొంగలు పొదలమాటునుండి మీదపడి దారిని బంధించారు. ఓపికలేక ప్రతిఘటించలేకపోయింది. గమ్యం లేదని గమనించి ఒదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
తెల్లారింది. నెమ్మదిగా అన్వేషణ కొనసాగించింది దారి. ఏదో ఊరు కనిపించింది. పాత ఫ్లెక్సిలతో చేసిన గూళ్ళలో మనుషులు జీవిస్తున్నారు. వస్తూన్న ఒక వ్యక్తిని దాహం అడిగింది. నీళ్ళు తాగుతూ అతన్ని చూసింది. ఒక కాలు లేదు అతనికి. ఏమైంది అని ప్రశ్నించింది. "రైల్లో పల్లీలమ్ముతాను, ఓ రోజు ఆక్సిడెంట్ అయ్యింది" అన్నాడు. అతని లేని కాలును చేతిలోకి తీసుకొని తడిమింది. కన్నీళ్ళు వచ్చాయి. ఆకలి వల్ల ఎక్కువ బాధపడలేక పోయింది.
వెళ్ళిపోతున్న అతని వెనుక చేరి బుట్టలోంచి గుప్పెడుపల్లీలలను దొంగిలించి గబగబా నోట్లో కుక్కుకొంది. రైలుపట్టాలకు అంటుకొన్న రక్తం జ్ఞాపకాలు గొంతుకడ్డుపడ్డాయి. కుంటుకొంటూ పడమరవైపు వెళుతోన్న అతన్ని చూస్తుంటే అర్ధమైంది గమ్యం అంటే ఏమిటో. ఇంకెప్పుడూ అది గమ్యం కొరకు అన్వేషించలేదు.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment