Tuesday, November 25, 2008

వంశవృక్షం

ఒక వృక్షం
ఇష్టంతోనో, అయిష్టంగానో
కొమ్మలు రెమ్మలుగా విడిపోయి
నలుదిక్కులకూ చెదిరిపోవటం
ఎంతటి అనివార్యమిపుడు!

అవసరపడో, అనురాగంతోనో
ఆ కొమ్మలన్నీతమ పువ్వుల, తుమ్మెదల
సమేతంగా గుమిగూడటం
ఎంతటి అబ్బురం!

తమలో ప్రవహిస్తున్న పత్రహరితపు
మూలాల్నీ, మార్గాల్నీ
తెలుసుకోవటం, తెలియచెప్పటం
ఎంతటి సంబరం!

అన్ని వర్ణాలూ
ధవళ కాంతిలోకి కుప్పకూలినట్లుగా
అన్ని శాఖలూ
వంశమనే అద్దంలో ఒదిగిపోవటం
ఎంతటి లీలా వినోదం!

నాస్టాల్జిక్ పొత్తిలిలో
కేరింతలు కొడుతున్న
వృక్షశకలాలను సమయం
చెర్నకోలై అదిలించటం
ఎంతటి ఛిధ్ర దృశ్య విషాదం!

బొల్లోజు బాబా

7 comments:

  1. పత్రహరితపు మూలాలు, వంశమనే అద్దాలు, నాస్టాల్జిక్ పొత్తిలి - బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  2. ఎంత సహజంగా రాసారండి.అభినందనలందుకోండి.

    ReplyDelete
  3. బాబా గారు చాలా బాగుంది. నా స్పందనను నా బ్లొగులో ప్రచురించాను.
    http://naakavitalu.blogspot.com/2008/11/blog-post_9695.html

    కొమ్మకు రెమ్మకు రెక్కలు వచ్చి
    చెట్టును పొమ్మని రొమ్ములు దన్ని
    అందలమెక్కే కర్కశ కొమరుల
    అశ్లీలతను అనివార్యత అనను

    ఆస్తిని తుంచే అనురాగంతోనో
    కొరివిని పెట్టే అవసరమొచ్చో
    పువ్వుల ముసుగుతొ ముళ్ళనుగప్పే
    ప్రబుద్ధుల చూసి అబ్బుర పడను

    హరిత పత్రపు దాసుడు వీడు
    దానినందే మూలాల్ని మార్గాల్ని
    తెలుసుకుంటూ తనవారిని మరిచిన
    వాడిని చూసి సంబర పడను

    వర్ణాలన్నీ ధవళ కాంతి
    నుంచి విడివడినట్లుగా
    వంశం అద్దంపు పగిలిన పెంకులు
    తామూ అద్దలుగా ప్రకటించటం ఏమి వినోదం ?

    నాస్టాల్జిక్‌ పొత్తిళ్ళనొదిలి పరుగిడుతున్న
    వంశవృక్షాల శకలాలను సమయం
    చెర్నకోలై అదిలించక పోవటం - అవును
    ఎంతటి చిద్ర దృశ్య విషాదం !

    ReplyDelete
  4. సూటిగా బాగుంది

    ReplyDelete
  5. ఈ మధ్య కొంచెం బిజీ గా ఉండి బ్లాగుల వైపు చూడలేదు.

    ఆత్రేయగారు
    మీ స్పందన అదిరింది.
    నా పాత పోస్టైన నువ్వు నువ్వే నేను నేనే కవితకు స్పందనగా భైరవభట్లగారు ఒక కవితనుటంకించి ఒకే అంశంపై భిన్న కోణాలు చూడ ముచ్చటగా ఉంటాయన్నారు.

    ఇప్పుడు మీ కవితా స్పందన చదివిన తరువాత నాకూ అదే అనిపిస్తుంది. రసపట్టులో తర్కం కూడదన్నారు అయినప్పటికీ మీకవితను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను.

    సుమారు ఒక గంట వ్యవధిలో ఇంత చిక్కని కవితాత్మకస్పందనని వెలువరించటం మాటలు కాదు.
    ఇదొక ముచ్చట అంతే.

    మీ కవితా భావ వెల్లువలో కొట్టుకుపోకుండా, నా కవితలోని రెండు వాక్యాలు నా కవితను కాపాడినవని భావిస్తున్నాను.
    1. ఇష్టంతోనో, అయిష్టంగానో
    2.అవసరపడో, అనురాగంతోనో

    మిమ్ములను అంతగా స్పందించచేసి నాకవిత ధన్యమైంది అని భావిస్తున్నాను.
    మీకు ధన్యవాదములు.

    సత్యప్రసాద్ గారు
    కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు
    నరసింహ గారు
    థాంక్సండీ
    శివ గారు
    ధన్యవాదములండీ
    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. నిజమే,
    ఎక్కడో పుడతాం. అవసరాల రెక్కలు తొడుక్కుని ఏచెట్టుమీదో గూడు కట్టుకుంటాం.ఏ అవకాశమో అందర్ని ఒకచోట చేర్చినపుడు అన్ని వర్ణాలు కలిసిపోయిన అద్దాన్ని అవసరం(సమయం)అనే కొరడా ఝుళి పించటం ఎంతటి దారుణం.
    సాధారణ విషయాలను అసాధారణంగా అక్షరాల్లో చిత్రీకరించేవాడే నిజమైన కవి అని అంటారు. మీరు కృతకృత్యులయ్యారు.

    ReplyDelete