నేనో పాతికసంవత్సరాలపాటు
వెతికి వెతికి నిన్ను చేరుకుంటాను.
నువ్వో ఇరవై వసంతాలలో నాకై
చూసి చూసి నన్ను ఆహ్వానిస్తావు.
అంతవరకూ మనం జీవించినకాలమంతా
నిలువునా కుప్పకూలుతుంది.
సహజీవనమనే కొత్తవేషం కడతాం.
శరీరాలు ఒకదానికొకటి
ఎంతవెలిగించుకొని కరిగించుకొన్నా
ఎవరి పరిమళాలు వారివే!
ఎన్ని స్వాంతనలూ, ధైర్యాలూ,
ఓదార్పులూ ఇచ్చిపుచ్చుకొన్నాఎడారులూ,
ఎడారులకొనలవేలాడే మృగతృష్ణలూ,
నీవి నీవే! నావి నావే.
ఇరువురి ఆశల్ని, ఆశయాల్ని
ఎంతఒకే తెరపై చిత్రించినా
ఎవరి వర్ణాలు వారివే!
తమబరువుని తామే
మోసుకుతిరిగే మేఘాల్లా
ఎవరి శ్వాసభారాన్ని వాళ్ళే మోసుకోవాలి.
సముద్రం తరపుననీళ్ళు వకాల్తా తీస్కొని
ఎట్లైతే ఆటుపోట్లని నృష్టించలేదో
అలాగే
ఒకరి దప్పిక, ఆకలి, నొప్పులను
మరొకరు పూరింపలేరు.
ఎన్ని రోజులు కలిపి మండించినా
ఎన్ని రోజాల్ని కలిసి పండించినా
నువ్వు నువ్వే, నేను నేనే.
నేనే నువ్వు అనుకోవటం
నువ్వే నేను అనుకోవటమంతమాయ.
అయినా సరే
లోకం దృష్టిలో మనిద్దరిదీ
ఎప్పటికీ అన్యోన్యదాంపత్యమే.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
బాబా గారు చాలా బాగుందండి. వచ్చిన భావాన్ని వచ్చినట్టు రాసినట్టుంది. ఏవరితోనో మాటాడినట్టుంది. నాదీ అదీ శైలి.
ReplyDeleteఇరువురి ఆశల్ని, ఆశయాల్ని
ఎంతఒకే తెరపై చిత్రించినా
ఎవరి వర్ణాలు వారివే!
పైన మీరు పిల్లలను సూచించారా ?
ఇక్కడ ౩ వర్ణాలా ? ౨ వర్ణాలా?
ఈ కవితలు నాలో నాకు తెలియని "నన్ను"ని పలకరించిపోతాయి. ఆ తర్వాత ఆ "నన్ను", నన్ను పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు! ఈ మధ్య అందుకే ఇటు వైపుగా రావటం లేదు.
ReplyDeleteఒకరి దప్పిక, ఆకలి, నొప్పులను
మరొకరు పూరింపలేరు.
పూరింపలేరన్నది నిజం! కానీ ఒకరి నొప్పి ఇంకొకరిలో సృష్టించే అలజడి- దీని సంగతేంటి? నాది* కాని నొప్పి నన్నెందుకు చిత్రహింస పెడుతుంది? అవతల వారి బాధను చూస్తూ ఉండలేక, వదిలి వెళ్ళలేక "నిస్సహాయత" విశ్వరూపం మనమనిపించడం దేనికి? అన్యోన్యం అంటే ఇది కాదా? :-) (అనుమానం మాత్రమే సుమా!)
థాంక్స్! చాలా మంచి కవిత.
అయితే ఓ సందేహం బాబా గారూ..
ReplyDelete"మనము" లో, కేవలం "మనమే" ఉండాలా? మనం లోనే నువ్వూ, నేనూ కూడా ఉంటే తప్పేంటి? అసలు నన్నడిగితే అలాగే ఉండాలంటాను.
పూరింపలేరు..నిజమే... పూరింపాలా? అని నా ప్రశ్న.
అలాగే..మనం అంటూ నువ్వూ నేనూ కొంచెం వెడల్పైనప్పుడు అది ఎంతో కొంత నీ లోకి నేనూ, నా లోకి నువ్వూ వ్యాకోచించడం వల్లే కదా!
అలాంటప్పుడు నువ్వు నువ్వేనేమో కాని, అందులో నేనూ ఉన్నాగా!?..కాని నువ్వంతా నేనే అవ్వాలని అనుకోవడం, ఓ అనారోగ్యకరమయిన అంచనా కాదా? అయ్యో అలా కాలేకపోయామే అన్న నిరాశాభావన ఓ రకమయిన అనాగిరకతేమో?
-----------------------
డిస్ క్లెయిమర్.
ఇది ఏ రకమయిన వ్యక్తి గత దాడి కాదండీ..కవిత చదవగానే నాలో ట్రిగ్గర్ అయిన సందేహాలు మాత్రమే..
బాఉంది కవిత..
ReplyDeletesomehow my copy+paste skipped out this first line
మంచి ప్రయత్నం.
ReplyDeleteఈ కవిత చదవగానే "నీ నవ్వు చెప్పింది నాతో" అన్న పాటలో (ఇది నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి) ఈ చరణాలు గుర్తుకు వచ్చాయి:
ReplyDeleteనాకై సాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఎంతటి contrast! ఒకో కవి అనుభూతి ఒకోటి! ఇందులో సందేహాలకీ, ప్రశ్నలకీ తావులేదు.
"రసపట్టులో తర్కం కూడదు" :-)
శ్రీధరుగారు, రమణిగారు, మీరు ఒకే విషయంలో మంచి భావాలను వ్యక్త పరిచారు. ఎవరి వ్యక్తిత్వాన్ని వారు గౌరవించుకుంటూ ఒకరికోసం ఒకరు అనేప్రేమతత్వంలో భాంధవ్యాన్ని కొనసాగిస్తూ, నువ్వు నువ్వే నేను నేనే అని అనుకోవడం అన్యోన్య దాంపత్యమే అవుతుంది. నీ కోసం నేను నాకోసమే నువ్వు అనేవి సినిమాలో డైలాగుల్లా ఉంటాయి. సంభంధ భాంధవ్యాల స్వచ్చత కు దోహదపడేలా ఉన్నాయి మీ కవితలు.
ReplyDeleteconcept బావుంది బాబా గారూ. ముఖ్యంగా ఎత్తుగడ.
ReplyDeleteభావంలోనూ, వ్యక్తీకరణలోనూ ఇంత పరిణతి సాధించిన మీరు వాక్య నిర్మాణం మీదనూ, వాడుతున్న ప్రతీకలమీదనూ ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇవి నేనొక ఎడిటర్ గా మాట్లాడుతున్న మాటలు అనుకోండి.
"శరీరాలు ఒకదానికొకటి" - శరీరాలు ఒకదానినొకటి .. అని ఉండాలి.
"తమబరువుని తామే
మోసుకుతిరిగే మేఘాల్లా
ఎవరి శ్వాసభారాన్ని వాళ్ళే మోసుకోవాలి."
ఈ పోలిక నప్ప లేదు. మేఘాలే ఎందుకు? మనుషులూ జంతువులూ అన్నీ తమ బరువుని తామే మోస్తున్నాయి గదా! ప్రకృతి ప్రకారం వాదిస్తే గాలి మోస్తోంది మేఘాల బరువుని!
స్వాంతన కాదు, సాంత్వన. స్వాంతన అనే మాట లేదు. స్వాంతము అంటే గుండె, మనసు. సాంత్వన అంటే ఓదార్చడం, బుజ్జగించడం. రాధికా సాంత్వనము అంటే కృష్ణుడు అలిగిన రాధని బుజ్జగించడం.
"సముద్రం తరపుననీళ్ళు వకాల్తా తీస్కొని
ఎట్లైతే ఆటుపోట్లని నృష్టించలేదో
అలాగే
ఒకరి దప్పిక, ఆకలి, నొప్పులను
మరొకరు పూరింపలేరు."
ఈ చరణంలో భావం చాలా బావుంది, పరమ (వేదాంత) సత్యం కూడా, కానీ పోలిక అస్సలు నప్పలేదు ఐపించింది. నేనేదన్నా hidden angle మిస్సవుతున్నానా?
ప్రస్తుతానికింతే. మీతో ఉన్న చనువుని పురస్కరించుకుని, పైగా అన్యధా భావించరనీ ఈ విమర్శ ఇక్కడే రాస్తున్నాను.
రవభట్ల కామేశ్వర రావు: మంచి పాటను గుర్తుచేశారు. నెనర్లు!
ReplyDeleteనిజం, రసపట్టులో తర్కం ఉండకూడదు. కానీ stray thoughts ని ఎక్కడో చోట పెట్టాలనిపిస్తుంది కదా!
బాబాగారు: రసాస్వాదన లేదనకుని నన్ను మన్నించేయండి. :-)
ఆలశ్యానికి మన్నించాలి,
ReplyDeleteతుఫాను కదా నెట్ పనిచేయలేదు.
స్పందించిన అందరకూ ధన్యవాదములు,
ఈ కవితను,
నేనే నువ్వు అనుకోవటం
నువ్వే నేను అనుకోవటమంతమాయ.
అన్న ఒక్క భావన చుట్టూ అల్లినటువంటిది. ఆ భావనలో కొన్ని సందర్భాలలో అవసరమో/హిపోక్రిసీ యో కనిపిస్తుంది.
ఆత్రేయ గారు
అబ్బబ్బే కాదండీ. ఎవరి ఆశలు, ఆశయాలు వారివే. అనే ఉద్దేశ్యంలో వాడానండీ.
ఒకవేళ పిల్లల గురించనుకొన్నా ఎక్కువమంది పిల్లలుండే పాతకాలంలో అమ్మకూచిలు, నాన్న కూచిలు ఉండేవారుగా.
పూర్ణిమగారూ
అలజడి ఖచ్చితంగా ఉంటుందండీ. పైన చెప్పినట్లుగా ఒక అమూర్త భావనను తీసుకొని దాని వెనుకున్న రియాల్టీని/మెటీరియలస్టిక్ /ప్రాక్టికాలిటీ
చెప్పాలనుకొన్నాను.
జీవితం పెండ్యులంలా అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది కదండీ. ఒక్కో అప్పుడు అలా(చూడుడు ఈ లింకులోని మరో కవితలోలా
http://sahitheeyanam.blogspot.com/2008/04/blog-post_29.html) మరో అప్పుడు ఇలా. ( నువ్వునువ్వే నేను నేనే కవితలా)లేక పోతే జీవితానికి వైవిధ్యం ఏముంటుందందీ.
ఎంతటి గొప్ప జంట అయినా, ఏదో ఒక సందర్భంలో gimmi some personal space అనే సందర్భాలు ఉండక పోవుగా. ఉంటాయనే స్పృహతో వ్రాసినటువంటిదండీ.
మీ అభిప్రాయాలను పంచుకొన్నందుకు ధన్యవాదములు.
కామేశ్వర రావు గారు బహుసా రసపట్టులో తర్కం ఉండకూడదన్నది మిమ్ములను ఉద్దేసించి కాదేమోనండీ. వారుటంకించిన కవితకు, నాకవితకు మధ్య తర్కం జరపటం ఇష్టం లేక అనుకొంటాను.
మీకు రసాస్వాదన లేకపోవటం ఏమిటండీ? భలేవారే!
కుమార్ గారు
ఇది వ్యక్తిగత దాడెందుకవుతుందండీ. (ఏదో బ్లాగులో నాకు తలంటేసారు దాన్ని దృష్టిలో ఉంచుకొనా) మంచివారే. మీ ప్రశ్నలన్నీ నాకవితపై తప్ప, నా గురించి కాదుగా?
మీ సందేహాలకు కొన్ని సమాధానాలు పూర్ణిమగారికిచ్చిన పై సమాధానంలో చూడవచ్చును.
నువ్వే నేను, నేనే నువ్వు అన్న వాక్యానికి లిటరల్ గా అర్ధం తీసుకొంటే పూరింపాలి కదా. అదే ఖండించాను. (మీరు కరక్టే. కవితలో శ్వాస, ఆకలి నొప్పిలు అనే పోలికలు ఎవరికి ఎవరూ పూరింపరానివి :-) )
నువ్వు నువ్వేనేమో కాని, అందులో నేనూ ఉన్నాగా-....... ఇది ఒక సౌహార్ధ్ర పూరిత ఆలోచన. గొప్పది. కానీ కొంచెం పెండ్యులం గురించి కూడా ఆలోచించండి.
కుమార్ గారు, ఒరెమునా గారికి
ధన్యవాదములు
కామేశ్వరరావు గారికి
మంచి పద్యాన్ని పంచుకొన్నందుకు ఆనందంగా ఉందండీ. ఎవరు వ్రాసారండీ దీనిని.
థాంక్యూ సర్.
పైన నేనిచ్చిన లింకు లోని కవితను చదివి ఉంటారనే అనుకొంటాను.
వేదగారూ,
మీ వివరణ నా కవితకు బలాన్నిచ్చింది. థాంక్సండీ.
చిన్న సందేహం శ్రీధరు, రమణి గార్ల కామెంట్లేమైనా మిస్ అయ్యాయాండీ?
కొత్తపాళీ గారికి
గురువుగారూ,
మీ కామెంట్లంటే నాకెప్పుడూ అపురూపమే.
i sincerely say that you never will have to hesitate to correct and direct me sir. i take it as a boon to be directed by you. i will be
very happy if you do so as kottapalee rather than an editor. :-)
శరీరాలు ఒకదానినొకటి అనేది నా తప్పే. మీరు చెప్పేదాకా కూడా గమనించలేకపోయాను. థాంక్యూ వెరీ మచ్ సర్.
ఎవరి శ్వాస భారాన్ని వాళ్లే మోసుకోవాలి అనటంలో నా ఉద్దేశ్యం మీరన్నట్లు గానే మేఘాలకు ఏవిధమైన ఆధారం లేకుండా ఉన్నట్లు కనిపిస్తాయి. (గాలి కనపడదు కనుక). మిగిలిన వస్తువులన్నిటికీ భూమో, నీరో వాటి బరువునుమోస్తున్నట్లుగా కనిపిస్తుంది.
అంతేకాక మెఘాలలో ఉండేది గాలి (నీటి ఆవిరి), శ్వాసలో ఉండేది కూడా గాలే. అనే ఉద్దేశ్యాలతో ఆ ప్రతీకను తీసుకోవటం జరిగింది.
ఇక పోతే స్వాంతన గురించయితే అది పూర్తిగా నా అజ్ఞానమే. నేనింతవరకూ ఓదార్చటం అనే అర్ధంతో స్వాంతన అనే మాటను వాడేస్తున్నాను. మరో జోక్ ఏమిటంటే ఎవరో బ్లాగులో పాపం ఆ బ్లాగరి సాంత్వన అని వ్రాస్తే, కరక్ట్ చేసుకోమని సలహాకూడా పాడేసానోసారి.
|-). థాంక్యూ వెరీమచ్ సర్.
సముద్రం, దానిలో ఉండే సాగర జలాలు రెండూ ఒకదానికొకటి విడదీయరాని భంధాన్ని కలిగి ఉంటాయి. (భార్య భర్తలలానే). జలాలు లేని సముద్రాన్ని ఊహించలేం. ఒక వేళ ఉన్నా దాన్ని సముద్రం అనం.
ఇంత అన్యోన్యంగా ఉండే సముద్రం, జలాల మధ్య కూడా ఒకరి పనిని మరొకరు చేయలేరు (క్రింద ఉదహరించిన భార్యభర్తల మధ్య పనులు లాగ )అనే అర్ధం కోసం ఆపోలిక తీసుకు రావటం జరిగింది సారు. అంతకు మించి మరే హిడెన్ మీనింగునీ నేను ఉద్దేశించలేదు.
మీరన్న తరువాత నేనూ ఆలోచిస్తున్నాను సారూ. ఇంకెక్కడైనా పొరపాటు ఉందేమోనని.
మీరు మరలా ఇటొచ్చినపుడు పై విషయాలను గమనించగలరు.
మీ నుండి ఇటువంటి విషయాల పట్ల స్పందనలను ఆకాంక్షిస్తున్నాను. మీకు అటువంటి చనువు ఎప్పుడూ ఉంటుదని మనవిచేసుకొంటూ
భవదీయుడు
బొల్లోజు బాబా
వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా గారూ..నేనూ కవిత చదవంగానే ఏదో ఆవేశంలో రాసానే తప్పితే, అంత ఆలోచించి కాదు.
ReplyDeleteకాపోతే చాలా పుస్తకాల్లో, సినిమాల్లో ప్రేమ జంటల గురించి కొన్ని విపరీతమయిన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయబడడం గమనించాను. ఎవరి వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకుంటూ, ఒకరంటే ఒకరు బహు అభిమానంతో, ఇద్దరూ కలసి చేయాల్సిన భాద్యతలు చేస్తే సరిపోదా(తల్లి దండ్రుల, పిల్లల responsibilities etc.?, అది ఆదర్శమయిన జంట కాదా, అన్యొన్యమయిన దాంపత్యమవదా? Epic Stories లో కనపడ్డట్లుగా ఒకరంటే ఒకరు పడి చచ్చి, ఒకరితో కొద్ది సేపు ఎడబాటు కలిగినా, ఇంకొకరికి జీవితమే ఆగిపొతుందేమో అన్నంత ఒకరిలోకి ఒకరు వెళ్ళిపోయి ఉంటేనే అది ఆదర్శమయిన ప్రేమవుతుందా? అలాంటి ప్రేమలే విలువైన ప్రేమలు, అంత సాంద్రత లేనివన్నీ ఏదో మామూలు సహజీవనాలు మాత్రమే అన్న భావన ఎక్కడ కనబడ్డా నాకీ మధ్యన ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి.
అలాగే ఒకరిలోకి ఒకరు, నువ్వూ నేనూ మిగలనంతగా ఏకమవ్వాలీ అన్న subtle expectation అనారోగ్యకరమయినదే కాకుండా, కొంచెం not-so-civilized thought గానూ అనిపిస్తూందీ మధ్యన.
Again, thanks a lot for your reply. You are a wonderful writer of poems.
నిజం.. ఒకరికి ఒకరే.. కానీ ఎవరికి వారే...!
ReplyDeleteమనసులు కలవని మనువులోని metaphysical emptiness ని చాలా హృద్యంగా ఆవిష్కరించారు.తార్కికంగా చూసినా నాకు అనుభూతిమాత్రం మెండుగా దొరికింది. రసస్పందన అయ్యింది. తర్కంకూడా ఒక రసస్పందన మార్గమే...సినిమాల సమీక్ష చేస్తూ ఈ విషయం అర్థమయ్యింది. మీ కవిత చదివిన ప్రతిసారీ అనిపించింది.
ReplyDeleteచర్చ ప్రేమలగురించి ఎందుకుసాగిందో అర్థం కాలేదు!
వేదగారి ఉద్దేశ్యం ఇటీవల శ్రీధర్, రమణి తమ తమ బ్లాగుల్లో రాసిన టపాలు అని అనుకుంటున్నా. వివరణ బావుంది. వివరించినాక మేఘాల పోలిక బానే ఉంది కానీ సముద్రం పోలిక ఇంకా కప్ప గంతు వేసినట్టే ఉంది :)
ReplyDeleteశ్రీధర్ గారి బ్లాగులో పర్సనల్‌జోన్స్ అని ఒక పోస్టు రాసారు. దానికి రమణి గారు , మీరు కామెంటులు రాసారు. అక్కడే మీరు నువ్వు నువ్వే కవిత ఇలాటి భావాలతో రాసాను అన్నారు. రమణి కామెంట్ భావం కుడా అదే .అందుకే వారిని కూడా మీ బ్లాగు లోనే అభినందించాను.
ReplyDeleteబాబా గారు, బాగుంది అండి మీ కవిత.
ReplyDeleteపూర్ణిమ గారు మొదట చెప్పిన మాట బాగుంది. "నాది* కాని నొప్పి నన్నెందుకు చిత్రహింస పెడుతుంది? అవతల వారి బాధను చూస్తూ ఉండలేక, వదిలి వెళ్ళలేక "నిస్సహాయత" విశ్వరూపం మనమనిపించడం దేనికి? అన్యోన్యం అంటే ఇది కాదా".
అదే కదా ప్రేమ అంటే.
మీ ఉద్దేశం ఇది కాకపోయినా చదవగానే, 'అనుబంధాలు లేవు, అంతా meterialistic ' అనే భావనతో రాసినట్టు ఉంది. science ని poetic గా చెప్పనట్టు ఉండి. :)