Sunday, December 14, 2008

బుల్లి కవితలు పార్ట్ II

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడిన నా కవితలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
http://www.aavakaaya.com/articles.aspx?a=l&categoryId=1


1. వాయిదా

నెలవంకా నేలా
ముచ్చట్లాడుకొంటున్నాయి.

ఎందుకనో నెలవంక గొంతు
పున్నమినాటంత బలంగా లేదు.
నేల తన గాలి ఊసులతో
ఊదర కొడుతుంది.

చీకటి చాపను మడుచుకొంటూ
పొద్దుపొడిచింది

చర్చలు వాయిదా పడ్డాయి.

By బొల్లోజు బాబా, Nov 5 2008 7:28PM



2. సాఫల్యం

ఏం బుద్ది పుడుతుందో
కొద్దికొద్దిగా నన్ను శ్వాసించటం
మొదలు పెడతావు.
నెమ్మది నెమ్మదిగా నన్ను
ప్రేమించానని తెలుసుకొంటావు.

ఆ క్షణమొక పుష్పమై
నీ మది కిటికీలోంచి తొంగిచూసి
నాకై వెతుకుతుంది.

నీ జీవితంతో నాస్వప్నాలు ఫలించాయి.

By బొల్లోజు బాబా, Nov 12 2008 4:09PM


3. మార్పు

చాలా కాలం తరువాత కలిసాం.
నా హృదయంలో ముద్రించుకొన్న
ఆ "నువ్వుని" నీలో ఎంత
శోధించినా కనిపించలేదు.

మనం కలుసుకోకుండా ఉంటే
ఎంత బాగుణ్ణు!

By బొల్లోజు బాబా, Dec 12 2008 5:16PM


బొల్లోజు బాబా


8 comments:

  1. "మార్పు" చాలా బాగుంది, ప్రతి ఒక్కరు జీవితం లో కనీసం ఒక్క సారైన ఈ అనుభవానికి గురి కాక తప్పదు.

    ReplyDelete
  2. బాబాగారూ మీ కవితలు బావున్నాయండి
    మీ బ్లాగుకు వచ్చానంటే నాకూ కవితలు రాయాలని బుద్దిపుట్టేసుంది అదేంటో

    ReplyDelete
  3. బాబా గారు చాలా బాగున్నాయి. వేణూ గారు చెప్పినట్లు "మార్పు" నాకూ బాగా నచ్చింది. బాగా వ్యక్త పరిచారు. అభినందనలు.

    ReplyDelete
  4. బాబాగారూ
    ౧ "వాయిదా"లో చీకటి చాప ముడుచుకుంటూ ప్రొద్దుపొడిచింది... బావుంది. మీరు మన ప్రొద్దువాళ్లకీయరాదూ ఈ కవితని.
    కానీ స్థూలంగా మీ రేం చెప్పదలచుకున్నారో నా కర్థంకాలేదు.
    ౨ "మార్పు" బావుంది. వేణుగా రన్నట్టుగా అనుభవసారమూ అనుభవవేద్యమూను.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. రాఘవగారు
    "కానీ స్థూలంగా మీ రేం చెప్పదలచుకున్నారో నా కర్థంకాలేదు"

    ఇక్కడ నేను ఒక దృశ్యాన్ని చెప్పయత్నించాను.
    నెలవంకా, నేల అనే ఇద్దరు మిత్రుల చర్చలలో , పున్నమినాడు చందమామ ఉత్సాహంగా ఉుటుంది, నెలవంక దినాల్లో బలహీనంగా ఉంటుంది.

    అనాదిగా జరిగే ఈ చర్చలు, ప్రొద్దు పొ్డవటంతో ఎప్పటిలానే, మరునాటికి వాయిదా పడ్డాయి అనే చిన్న చమత్కారం మినహా ఈ కవితలో విశేషమేమీ లేదండి.
    అంతర్జాల పత్రికలకు వర్జిన్ వెర్షన్ లు అడుగుతారనుకొంటానండీ.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. కవితలు చెప్పవు.జ్ఞాపకాల్ని రగిలిస్తాయి. అనుభూతుల్ని కలిగిస్తాయి. అనుభవాల్ని కలిగిస్తాయి. ధన్యవాదాలు.

    ReplyDelete
  8. మార్పు కవిత చాలా బాగుంది. కొన్ని సార్లు మనం తొలినాళ్ళలోని స్వచ్చతనే కోరుకొంటూ, మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా ఆ స్వచ్చతే కనిపిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఒకోసారి కనిపించకపోతే చాలా నిరాశకు గురవుతుంటాం. అలాంటి అనేక భావాల కూడలి మీ చిరుకవితలో ఉంది. ఆవకాయ డాట్ కామ్‌ లో మీ కవితలపై చర్చ కూడా బాగుంది.
    మంచి కవిత్వం రాస్తున్నారు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు
    మీ
    దార్ల

    ReplyDelete