బజారులన్నీ జనాలతో బలిసినయ్.
డబ్బు, డబ్బు, డబ్బు
కుంభవృష్టి గా కురుస్తూంది.
కొనుగోలు శక్తి మధ్యాహ్నపు టెండై
ప్రకాశిస్తోంది.
భాషతో నిమిత్తం లేకుండా
సర్వాంగాలతో సంభాషించే ఆటకత్తెలా
మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.
ప్రపంచ కుబేరుల జాబితాలో మనవాళ్ళు .
ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల సంఖ్య.
లక్షల ఎల్కేజీ చదువులకై బారులు తీరిన జనం.
కొత్తకారు టెస్ట్ డ్రైవ్ కై పోటీ.
అక్షయ తృతీయనాడు స్వర్ణ విస్ఫోటనం.
రాడో వాచీలు, రేబాన్ అద్దాలు, పెద్ద తెర టీవీలు, కోట్లు పలికే విల్లాలు
రవ్వల దుద్దులూ, డిజైనర్ దుస్తులూ, డిజిటల్ దినాలు.
పబ్బులూ, డిస్కోతెక్ లూ, ఏరోడ్రోములు, హెలికాప్టర్లు,
చలువరాతి హర్మ్యాలు , ఇంద్ర భోగాలు, చంద్రయానాలు. .
నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?
చేటలోని రోజుల శిశువు ఎర్రని ఎండలో భయం భయంగా చూస్తుంటూంది.
బోరుబావిలో పడిన గ్రీజు మరకల బాల్యానికి ఊపిరాడదు.
కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది.
సెంటు స్థలం కోసమై పోరాడే ప్రాణాన్ని తూటా తన్నుకు పోతాది.
అమ్మకానికి శిశువులు, ఇక్కడ స్త్రీ ఓ గర్భాగారం.
రోడ్డు పక్క డేరాలనిండా నిర్వాసిత గిరిజనులు.
హైవే పక్క మెరుపుల చీర చెయ్యూపుతూంటుంది.
"బ్లడీ బెగ్గెర్స్ బ్లడీ ఇండియా" BMW కారు అద్దం పైకి లేచింది.
ద్రావకం మింగిన కంసాలి , నూలు పోగుకు ఉరేసుకొన్న నేతకాడు,
పురుగుమందూ-పత్తిరైతూ, లాడ్జీలో కుటుంబం సెన్సెక్స్ హత్య
ఇక్కడ చావంటే ఎక్స్ గ్రేషియా - ఎక్స్ గ్రేషియా కోసమే చస్తారు.
నా దేశపు సౌభాగ్యమంతా ఎక్కడికి పోయింది?
ఇక్కడ రెండు దేశాలు కనపడుతున్నాయి
ఒకటి సంపన్న భారతం
మరోటి దరిద్ర భారతం.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
మొన్న పేపర్ లో చదివాను.. ఇలాంటివార్తలు ఇంతకు ముందు కూడ చదివాను.. ఒక తల్లి తన బిడ్డలను అమ్మకానికి పెట్టింది అని :( చాలా బాగా రాసారు బాబ గారు
ReplyDeleteబాగుంది బాబా గారు.
ReplyDelete@బాబా గారు
ReplyDelete"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."
కట్టిపడేసే ప్రయోగం... బతుకులని నిశితంగా సహానుభూతితో గమనిస్తేనే, వారి కష్టాలని పంచుకోవడంలోనే ఇలాంటి ప్రయోగాలు చెయ్యగలరు... మీకు మీరే సాటి..
ఒక్క క్షణం గుండె ఆగింది. ఇండియా- భారత్ ల మధ్య తేడా ఇంత సుస్పష్టంగా చెప్పిన కవిత ఇంతవరకూ చదవలేదు.అభినందనలు.
ReplyDelete"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది."
ReplyDeleteకట్టిపడేసే ప్రయోగం... బతుకులని నిశితంగా సహానుభూతితో గమనిస్తేనే, వారి కష్టాలని పంచుకోవడంలోనే ఇలాంటి ప్రయోగాలు చెయ్యగలరు... మీకు మీరే సాటి..
ఒక్క క్షణం గుండె ఆగింది. ఇండియా- భారత్ ల మధ్య తేడా ఇంత సుస్పష్టంగా చెప్పిన కవిత ఇంతవరకూ చదవలేదు.అభినందనలు.
dear baba:
ReplyDeleteee kavita baagundi.
yanam ni eppatikee marachi polenu.
ee saari vacchinappudu tappaka kalustaanu.
afsar
అహా.. ఆ భారతానికి, ఈ భారతానికి ఏ వారధి వేయగలమంటారు? నాకు నేనే దూరమవ్వుతుంటే ఏ వంతెన వేయాలి?
ReplyDelete"కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది." yes మీకు మీరే సాటి.
ReplyDeleteఒకటి సంపన్న భారతం
ReplyDeleteమరోటి దరిద్ర భారతం
well said
కవిత లోని విషయాలు నేనెప్పుడూ వినేవే కాబట్టి, నాకంత బలంగా తాకలేదు కానీ వావ్...పూర్ణిమ గారి కామెంట్ మొదటి సారి సరిగ్గా అర్ధం కాక, రెండోసారి చదివితే, ఒక్క జోల్ట్ వచ్చింది.
ReplyDeleteఅలా ఒక దగ్గర్నుంచి ఇంకో దగ్గరికి లీప్ తీసుకొని, తనలో ఇప్పటికీ ఉన్న ఒకప్పటి తనకు, తనలోనే ఉన్న ఇప్పటి తను క్రమంగా దూరం అవుతుంటే ఏమి చేయగలను అన్న వేదన ధ్వనించింది నాకు.
మీది అదే భావమా పూర్ణిమ గారు? లేక నేను కొంచెం ఓవర్ చేస్తున్నానా?
ఒకవేళ మీదీ అదే భావమే అయితే కనక, మిమ్మల్ని మీరే వంతెన క్రింద మార్చ గలరేమో చూడండి.
రెండు భారతాల వర్ణన చాలా బాగుంది బాబాగారూ.
ReplyDeleteఒక్క విషయమేమంటే అందరూ అభివృద్ది రైలు ఎక్కేయాలనే ఆత్రంలో ఉన్నవారే. దానికి వ్యవస్థనీ, ప్రభుత్వాలనీ మనం తిడుతూ ఉంటాం కానీ. సర్వమానవులూ శ్రమపడని సంస్కృతిని అందుకోవాలనుకొనే వారే. శ్రమ మిగలంది మానవతా విలువలు మిగలవు. అభివృద్ది రైలు ఎక్కినవారంతా దానికి మేము కారణం కాదు ఆ రైలే కారణం అని ఆ రైల్లోనే నిద్దరోతుంటారు.
రైలు ఎక్కిన తర్వాత మనల్ని అది మానవ మూలాల నుండి దూరాలకు తీసుకెళుతూనే ఉంటుంది. మూలాల దగ్గర తారట్లాడుతున్నవారు తారట్లాడుతూనే ఎప్పటికప్పుడూ తాముకూడా రైలెప్పుడెక్కాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొంతమంది తిప్పలు పడో రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం కలిసివచ్చో రైలుని అందుకొంటారు. ముఖ్యమైన విషయమేమంటే రైలెక్కిన తర్వాత వీళ్ళు కూడా నిద్దరోతారు.
@kumar: Spot on! :-)
ReplyDeleteDear Baba!
ReplyDeletemee kavita lO
"నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?" oka vyaMgyaM..... oka vekkirimpu ....
"సెంటు స్థలం కోసమై పోరాడే ప్రాణాన్ని తూటా తన్నుకు పోతాది." sA,mAjika avagAhana . excellent!
darla
ఈ కవితలోని భావాలను అర్ధం చేసుకొని, పంచుకొన్నందుకు ధన్యవాదములండీ.
ReplyDeleteనేస్తం గారు, చైతన్య గారు, దిలీప్ గారు, మహెష్ గారు, నరశింహ గారికి దార్ల గారికి రాధిక గారికి, శివ గారికి, కామెంటినందుకు థాంక్సండి
పూర్ణిమ గారు రెంటికీ వారధి మనమేనండీ. (మధ్య తరగతి). మనం వారధిలానే పని చేస్తున్నాము కనుక మనకు రెండూ కనపడుతున్నాయి, మనలను మనం తడుముకొంటున్నాము.
కుమార్ గారు పై వివరణ మీకూనూ. కాదంటారా?
సీతారాం రెడ్డి గారు,
మీ విశ్లేషణ బాగుందండీ. చాలా మట్టుకు నిజమే. కానీ నిద్దురపోయేవాళ్ళ శాతం ఎక్కువైనప్పటికీ, ఇలా వెనక్కు చూసుకొనే సందర్భాలు కూడా ఉంటాయి కదండీ.
మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.
అన్న వాక్యాలలో ఆ మూలాలే శ్రమ అండి. శ్రమకు దూరమైన డబ్బు, అంటే శ్రమపడకుండా వచ్చిపడే డబ్బు అని భావం. అలాంటి వ్యక్తులు చేసే విచ్చలవిడితనమే పైన చెప్పుకొన్న వర్ణణలు.
బహుసా నా భావాలు మీకు అర్ధమయ్యాయనుకొంటున్నాను.
దార్ల గారికి
మీరు నాబ్లాగు సందర్శించి కామెంటు వ్రాయటం నాకెంతో ఆనందాన్నిస్తుందండీ.
థాంక్యూ వెరీమచ్ సర్.
బొల్లోజు బాబా
ప్రతిబింబిస్తున్న విషయాలు కవర్ చేశారు..
ReplyDeleteబాగుంది, మార్పుకొసం మన [పయత్నం ఇంకా జరుపనిద్దాం.
ఒకో సారి మీ కవితలు చదువుతుంటే కొరడాతో ఛళ్ళుమనిపించిన భావం కలుగుతుంది బాబాగారు. తెలిసిన విషయాలే కానీ పదునైన మాటలతో మరోసారి తెలియచెప్తారు. Hats off.
ReplyDeleteకూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది.
ReplyDelete"బ్లడీ బెగ్గెర్స్ బ్లడీ ఇండియా" BMW కారు అద్దం పైకి లేచింది.
ఇక్కడ చావంటే ఎక్స్ గ్రేషియా - ఎక్స్ గ్రేషియా కోసమే చస్తారు.
వేటికవే సాటి. ఒక చిన్న కవితలో భరతావని రెండుపార్స్వాలను ఒక్క సారిగా కళ్ళముందుంచారు
అఫ్సర్ గారు
ReplyDeleteమీకు నేను అభిమానినండీ.
దార్లగారి పుణ్యమాని మిమ్ములను ఇలా కలుసుకోవటం ఆనందంగాఉంది.
మా యానాన్నిమరువనందుకు ఆనందంగా ఉందండీ
బొల్లోజు బాబా
బాబా గారు మీకు మీరే సాటి...
ReplyDeleteభారతదేశం గూర్చి బ్రహ్మాండంగాను...
India గూర్చి Excellentగాను వ్రాసారు.
ఈ రెండిటినీ జయించి నేను రేపు నిర్మించే దేశం నాకపుడే కనపడుతుంది. మహాత్ముడొద్దు, సుభాషుబోసొద్దు, నాకొక మామూలు మానవుడు కావాలి, అతడే నా సైన్యం.
ReplyDeleteతిండికి లేక చచ్చే దేశం ఆవైపు
ReplyDeleteతిన్నదరక్క చచ్చే దేశం ఈవైపు
శాంతం ప్రేమతో నిర్వీర్యమైన దేశం ఇటువైపు
మతం పేరుతో తమ్ములజంపే దేశం అటువైపు
మోక్షం అంటూ ముక్కుమూసుకున్న దేశం అక్కడ
పురోగతంటూ జనంతలలుదన్ని నింగికెగిరిన దేశం ఇక్కడ
చాలా బాగా చెప్పారు బాబా గారు. అభినందనలు.
gud one..
ReplyDeleteఇంతకన్నా నా దగ్గర మాటలు లేవు.
నవభారత౦ యొక్క యదార్ధదృశ్య౦ కళ్ళము౦దు చక్కగ చిత్రీకరి౦చారు.
ReplyDeleteఎన్నో సార్లు విన్నదే అయినా, "India is poor but not indians" ఇందుకే అ౦టారేమో!
ReplyDelete>>భాషతో నిమిత్తం లేకుండా
ReplyDeleteసర్వాంగాలతో సంభాషించే ఆటకత్తెలా
మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.
చాలా బాగుంది. ఈ disparities ని తొలగించడానికి మనం ఏమన్నా చేయగలిగితే ప్రయత్నిద్దాం.
పద్మార్పిత గారికి,
ReplyDeleteఉష గారికి
ఆత్రేయగారికి
ప్రతాప్ గారికి
శ్రీలేఖ గారికి
మురారి గారికి
స్పందించిన అందరకూ ధన్యవాదములు.
ఏ పంక్తి కా పంక్తే బావుంది. ప్రత్యేకంగా ఈ పంక్తులు మీరు చెప్పదలచుకున్న విషయాన్ని తేటతెల్లం చేస్తూ అందాన్నిచ్చాయి:
ReplyDelete"నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?
నా దేశపు సౌభాగ్యమంతా ఎక్కడికి పోయింది?
ఇక్కడ రెండు దేశాలు కనపడుతున్నాయి.
ఒకటి సంపన్న భారతం.
మరోటి దరిద్ర భారతం."
చాలా చక్కగా వ్రాసారు. అభినందనలు. అభివందనములు.