Tuesday, October 14, 2008

శలవుల్లో కాలేజీ


శలవుల్లో కాలేజీ
పక్షులెగిరి పోయిన వేడాంతంగళ్ లా ఉంది.

ఇసిక తుఫానులో తడిచిన
ఖర్జూరపు చెట్టులా
కాలేజీ గదుల కళ్ళపై ధూళి పొర
పరచుకొంది.

సరస్వతీ దేవికి నిద్రా భంగం కాకూడదని కామోసు
ఇస్మాయిల్* నడచిన చెట్టుపై చిలకల సందడి
విరామం తీసుకుంది.

ఉపన్యాసాల పావురాళ్ళను ఎగరేసే
తరగతి గదులు వర్జించిన పక్షిగూళ్ళై
నిశ్శబ్ధాన్ని ధరించాయి.

తమపై వ్రాసిన ప్రేమరాతలను
చదువుకొంటున్న చెక్క బల్లలు
వసంతంలో భ్రమరాలతో తమ సరాగాల్ని
తలపోసుకొంటున్నాయి.

శలవుల్లో కాలేజీ మొత్తం
విత్తనాలకై ఎండబెట్టిన బీరకాయలా
పొడిపొడిగా ఉంది.

కోతకోసిన వరిచేను దుబ్బుల
జీవరాహిత్యం గ్రవుండులోని
పాదముద్రలలోకి ప్రవహించింది.

విద్యార్ధుల్లేని కాలేజీ
తలతెగిన వృక్షంలా, వృక్షాల్ని నరికిన వనంలా
వనాల్ని మింగిన శిశిరంలా ఉంది.
అచ్చు
పగలు చూస్తే రాత్రి కవితలోకొచ్చేలా.బొల్లోజు బాబా*ఇస్మాయిల్ గారు మాకాలేజీలో పనిచేసారు

14 comments:

 1. కవిత చాలా బాగుంది.
  అయ్యో!నాకు మీ కవితను పొగిడేంత భాష రాదే.
  "imageries", "similes" చాలా బాగున్నాయి.
  "వేడాంతంగళ్" అంటే ఏమిటి?

  ReplyDelete
 2. చాలా బాగుంది. అచ్చు చదవగానే గుర్తుండిపోయ్యేలా ఉంది.

  ReplyDelete
 3. మీ టపాలన్నీ చదువుతున్నా టైం కుదరక బాగుంది అనే మాట సర్పొదెమో అనిపించి కామెంటనే లేదు.కానీ చేప్పాలి కదా ఎలాగైనా అందుకే చెప్తున్నాను.మీ కవితల్లో ఎదో తెలీని భావావేశం ప్రతి ఒక్కరిని తాకుతుంది.ఇది నిజం.సింప్లీ సూపర్బ్ అండి మీ కవితలు అన్నీ

  ReplyDelete
 4. శెలవుల్లో మా బడిని చూసినప్పుడల్లా నాకు కలిగే భావాలని మీ కవిత ప్రతిబింబిస్తోంది, అచ్చు మీ కవిత చదవగానే చిన్నప్పటి మా బడి గుర్తుకొచ్చినట్లే.

  ReplyDelete
 5. దాదాపు 5 సంవత్సరాల తరువాత ఒకసారి శెలవుల్లో ఖాళీగా ఉన్న మా మైసూర్ కాలేజీకి వెళ్ళాను. చాలా depressing గా అనిపించింది.

  కొత్తగా ఏమీ చెప్పలేనిగానీ,మీ పదచిత్రణ అధ్బుతం.నా మనసుమూలను తాకారు. కొన్ని జ్ఞాపకాలను రేపారు.

  ReplyDelete
 6. "తమపై వ్రాసిన ప్రేమరాతలను
  చదువుకొంటున్న చెక్క బల్లలు
  వసంతంలో భ్రమరాలతో తమ సరాగాల్ని
  తలపోసుకొంటున్నాయి."

  Beautiful

  ReplyDelete
 7. ఎవ్రీ థింగ్ ప్రీసియస్ గారికి
  థాంక్సండీ.
  వేడాంతంగళ్ అనేది ఒక migratory bird sanctuary అండీ.

  సత్యాగారికి
  థాంక్సండీ

  క్రాంతి గారికి
  మీ అభిమానానికి ధన్యవాదములు. కలుద్దాం. మీరీమద్య వ్రాయటం లేదు.

  ప్రతాప్ గారూ
  మొన్న దసరా శలవులకు ఆఫీసుపని మీద కాలేజీకి వెళ్లి నప్పుడు బోసిపోయిన కాలేజీ అదోలా అనిపించింది. (ఇది వరలో శలవురోజుల్లో చాలా సార్లు చూసినా ఈసారి కొంచెం కవితా దృష్టితో చూడటం జరిగింది)

  మహేష్ గారూ
  వెయ్యి నెనర్లండీ.

  కొత్తపాళీ గారూ
  నెనర్లండీ.
  thanks for your encouragement sir.

  dhanyavaadamulatO
  bollojubaba

  ReplyDelete
 8. చక్కని విషయాన్ని అద్భుతమైన పదచిత్రాలతో కవిత్వీకరించారు!
  శీర్షికే కొంచెం నాకు అసంతృప్తిగా ఉంది. అలా సూటిగా కాకుండా "వసంతంలో శిశిరం" లాంటిదేదైనా (లేదా మరో కొత్త పోలికో) పెడితే బావుంటుందేమో.

  ReplyDelete
 9. బాబా గారు మీలో కవితావేశం ఈ మధ్య తీవ్ర స్థాయికి చేరుకున్నట్టుంది... చాలా విషయాల మీద ఆసువుగా రాసేస్తున్నారు... :-)

  ReplyDelete
 10. విత్తనాలకై ఎండబెట్టిన బీరకాయలా
  పొడిపొడిగా ఉంది.--మీ కిలాంటి ఊహలు ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నాయండీ బాబూ--beautiful.

  ReplyDelete
 11. బాబాగారు,
  మీ వూహల్ని దొంగతనం చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పండి!

  ReplyDelete
 12. బాబా గారూ.. కవి స్వీయానుభవాన్ని ఎంతచక్కగా చెప్పగలడో అనడానికి ఇదో మచ్చు తునక..అప్పుడు రావులపాలెం కాలేజీ నుంచి ఏప్రిల్ సెలవల్లో రిలీవయ్యొస్తున్నప్పుడు కవితలో కొన్ని ఫీలింగ్స్ మాచ్ అయ్యాయి..మాంచి కవిత అందించినందుకు అభినందనలు.

  ReplyDelete
 13. భైరవభట్ల గారికి
  కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదలండీ. మీరన్న సూచన బాగుంది. పేరు మార్చటానికి ప్రయత్నిస్తాను.
  దిలీప్ గారికి
  థాంక్యూ వెరీమచ్

  నరసింహ గారికి
  థాంక్సండీ

  సుజాత గారికి
  మీరు మరీ మునగ చెట్టు ఎక్కించేస్తారు మేడం

  భగవాన్ గారికి
  అవునా. కరక్టే కదూ.

  స్పందించిన అందరకూ థాంక్శండీ.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 14. చాలా వత్తిడుల మద్య చదివాను
  ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యాను.

  ఉపన్యాసాల పావురాళ్ళను ఎగరేసే
  తరగతి గదులు వర్జించిన పక్షిగూళ్ళై
  నిశ్శబ్ధాన్ని ధరించాయి.

  నా మాటలు నిశ్శబ్దాన్ని ఆహ్వానిస్తోంది

  ReplyDelete