Thursday, October 2, 2008

కళంకిత

ఆమె కళంకిత
ఆమె చేసిన తప్పల్లా
లేత కన్నుల యవ్వనాన్ని
ఆకర్షణ అనే లోయలో
ఒలకపోసుకోవటమే!

హృదయం ముంగిట
కలల కళ్లాపి జల్లి
తెరమరుగయ్యే
వేకువ వెన్నెలను
ఆహ్వానించటమే!

తప్పిదాన్ని
తెలుసుకొనేలోనే
జీవితం
వాస్తవాల చీకటికొట్లో బంధీ
దేహం కుదింపబడి, కుదింపబడి
ఒక్కచోటే కేంద్రీకృతమై
అదే జీవనాధారమై
అదే మృత్యుదాతయై........

మునుల శాపాలూ లేవు,
విమోచనాలూ
లేవు,
అశరీరవాణి సాక్ష్యాలూ లేవు,
నయనమ్ముల జాలువారే
జలపాతమ్ములు
తప్ప....

బొల్లోజు బాబా

27 comments:

 1. బాబా గారు
  మీరు ఒక శతాబ్ధం వెనుకపడి ఉన్నారు.
  రోజులు మారి పోయాయండీ.
  ఇప్పుడు ఆ పని ఒక కారీర్ గా మారింది.
  గంటకు లక్షల్లోనే సంపాదిస్తున్నారు.
  మీరింకా పాత రొడ్డ కొట్టుడే కొడుతున్నారు.

  ReplyDelete
 2. అనామకా .. ఇక్కడి పద్యంలో విషయం వేశ్యావృత్తికాదు. అమాయకంగా మోసపోయిన ఒక అమ్మాయి కథ. చాలా తేడా ఉంది. గంటకి లక్షల్లో సంపాయించే హైక్లాసు లంజలు లేకపోలేదు. కానీ అపుడెప్పుడో ఎన్ని పదుల ఏళ్ళ క్రితమో శ్రీశ్రీ రాసిన "పడుపుకత్తె రాక్షస రతి" కూడా ఇవ్వాళ్టికీ ప్రత్యక్షమే. మీరే కాలమాన ప్రపంచంలో బతుకుతున్నారో నాకు తెలీదు.

  ReplyDelete
 3. కొపా గారూ, మొదటిసారి చూస్తున్నాను - మీ కలం అదుపు తప్పడం.

  ReplyDelete
 4. ఆఖరి రెండు లైన్లు సూపర్బ్....మంచి ఫీలుంది కవితలో....

  ReplyDelete
 5. పాళీ గారూ,సిరా ఒలికినట్లుంది, కేప్ సరి చూసుకోండి! :)

  ReplyDelete
 6. కొత్తపాళీ గారూ
  ఏమి వ్రాయాలో తెలియటం లేదు సారు.
  మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  అనానిమస్ గారూ
  ఇది చాలా అన్యాయం. కొత్తపాళీ గారి సమాధానం అర్ధమయిందనుకుంటాను. ఇంక అంతకన్నా మాట్లాడటానికి నావద్దమాటలేమి లేవు.

  చిన్నమయ్యగారు,తెరెసా గారూ,
  వలికిన సిరా వెనుక నాపై ఉన్న అవ్యాజమైన ప్రేమ కనపడుతుందండీ.
  భగవాన్ గారూ,

  ఈ కవితను చానాళ్ల క్రితమే వ్రాసింది. ఇందులో ఒక అమాయక యువతి మోసగింపబడి, జీవితం చెరచబడుతుంది.
  దీనికి ప్రాచీన సాహిత్యంలో అయితే, మునుల శాపాలు, దానికి విమోచనాలు, లేక పోతే జడ్జిమెంటు టైములో అశరీరవాణి సాక్ష్యాలు ఉండి ఆ యువతి రక్షింపబడేది.
  కానీ ప్రస్తుత కాలంలో నయమ్ముల జాలువారే జలపాతమ్ములు తప్ప మరేవీ లేవని, ఒక కాంట్రాస్ట్ తీసుకు వద్దామని ఒక ప్రయత్నం చేసాను. అందులోని ఫీల్ గ్రహించినందుకు అందరికీ కృతజ్ఞతలు.

  కొత్తపాళీ గారికి భావాన్నర్ధం చేసుకొని సమర్ధించినందుకు సదా కృతజ్ఞుడను.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 7. modaTi enimidi ,chivari naalugu lainulu

  super(ikkadal ee word karekTu kaahdu kaani)

  ReplyDelete
 8. బాబాగారూ
  శిరస్సు వంచి పాదాభివందనం? మీ బ్లాగ్ మీద కామెంట్ రాసినందుకు? నాకు నవ్వు ఆగట్లేదు ఇక్కడ. మఖ లో వికసించి పుబ్బ లో కల్సిపోయే కంప్యూటర్ యుగంలో ఎవరికెవరండీ? ఇలాంటి పెద్ద మాటలు అనవసరం.

  Kotta PALI:
  ఇదేనా సివిల్ గా మాట్లాడ్డం అంటే? గాజు భవనాల్లో ఉండేవాళ్ళు ఎదుటివాళ్ళ మీదకి ఏం విసరకూడదో గుర్తుందా గురువుగారు?

  ఇన్నయ్యని మేమేదో అన్నామని మమల్ని సివిల్ గా కామెంట్ చేయమని ఇప్పుడు మీరే?

  ET TU?

  ReplyDelete
 9. అనామకా .. ఇది సివిలిటీకి సంబంధించిన విషయం కాదు. ఇంగితం ఉంటేగా గ్రహింపుకి రావడానికి? చెప్పబూనడం నాదే బుద్ధి తక్కువ.

  ReplyDelete
 10. (మీ) తెలుగు బ్లాగు(లు) చదవడం మొదలెట్టాక ఇంకా ఇంగితం ఎక్కడేడిసింది లెండి, చెప్పేవన్నీ శ్రీరంగనీతులు...హెహ్?

  ReplyDelete
 11. అయ్యా అనామకా
  నేనన్నది మఖలోపుట్టి, పుబ్బలో కలిసే బ్లాగుల గురించి కాదు. మీరంత నవ్వుకోవలసిన పని లేదు.
  చాలా మంది కామెంటు చేసినట్లు గా, ఎన్నడూ తొణకని పాళీ ఈ బ్లాగులో ఒక కవితకు స్పందన ద్వారా తన మోడెస్టీని వదులుకోవలసి వచ్చినందుకు, పాదాభివందనం. ఎదురుగా ఉంటే కౌగిలించుకొనుండే వాడినేమో.
  అంతే తప్ప అందులో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇంగితం ప్రశక్తి లేదు.

  దయచేసి ఇంక రచ్చ చేయవద్దని మనవి.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 12. చాలా బాగుంది. మొదటి ఎనిమిది లైనులూ ఇంకా బాగా నచ్చేసాయి.

  ReplyDelete
 13. కొత్తాపాళి గారు చెప్పినదాంట్లో "అదుపుతప్పడం", సివిలిటీమీరడం ఎక్కడున్నాయో నాకైతే అర్థం కావడం లేదు!!! ఒకవేళ వారు వాడిన "లంజలు" అనే పదం వల్లనైతే, ఇప్పటివరకూ తెలుగు సాహిత్యంలో ఆపదం యొక్క వాడుకని తెలుసుకోమని కోరుతున్నాను.

  బాబాగారూ,మీ కవితల్లో మనసుకు హత్తుకునే మహత్తుంటుంది. ఒక సారి ప్రేమగా, మరోసారి నిరాశగా, ఇంకోసారి నిస్సహాయపు కోపం కూడా ఆవరిస్తుందు. బహుశా ఇందుకేనేమో వ్యాఖ్యలు కూడా అలాగే ఉంటాయి.

  ReplyDelete
 14. మహేష్ వ్యాఖ్య ఆసరా తీసుకుని నన్ను నేను సమర్ధించుకోవచ్చు గానీ, వెనక్కి తిరిగి చూసుకున్నాక బహుశ అక్కడ ఆ మాట అనాల్సిన అవసరం లేదనే అనిపించింది. హైక్లాసు వేశ్యలు అన్నా నే చెప్పాలనుకున్న అర్ధం వచ్చి ఉండేదే. బాబా గారూ, ఆర్ద్రతతో నిందిన మీ పద్యం కింద అనవసరంగా ఇలాంటి రచ్చకి కారణమైనందుకు విచారిస్తున్నా. My sincere apologies to you. మీ అభిమానానికి మనసు చెమర్చింది.

  ReplyDelete
 15. ఆ జలపాతాల జాడ కూడా లేని నాడు
  ఆమెకిక మరణమే శరణ్యమా !!! వేరే దారే లేదా ???

  ReplyDelete
 16. @కొత్తపాళీ:
  You don't need to waste your breath, but then
  "..ఆ మాట అనాల్సిన అవసరం లేదనే అనిపించింది. హైక్లాసు వేశ్యలు అన్నా నే చెప్పాలనుకున్న అర్ధం వచ్చి ఉండేదే." ఔను.

  ReplyDelete
 17. బాబాగారు, కవిత బాగుందండి.

  ReplyDelete
 18. చర్చ ఎలాగూ పక్కదారి పట్టింది కాబట్టి నే చెప్పాలి అనుకున్న ఆ రెండు ముక్కలు కూడా చెప్పేస్తా .

  @కొత్తపాళీ గారు : Hats off to your recent comment "మహేష్ వ్యాఖ్య ఆసరా తీసుకుని నన్ను నేను సమర్ధించుకోవచ్చు గానీ, వెనక్కి తిరిగి చూసుకున్నాక బహుశ అక్కడ ఆ మాట అనాల్సిన అవసరం లేదనే అనిపించింది. హైక్లాసు వేశ్యలు అన్నా నే చెప్పాలనుకున్న అర్ధం వచ్చి ఉండేదే. బాబా గారూ, ఆర్ద్రతతో నిందిన మీ పద్యం కింద అనవసరంగా ఇలాంటి రచ్చకి కారణమైనందుకు విచారిస్తున్నా. My sincere apologies to you." .. KottaPali's Comment : October 3, 2008 8:03 AM

  ఇలాంటి వ్యాఖ్యల వలనే మీకు/మీ వ్యాఖ్యలకు ఓ విశిష్టస్థానం, గౌరవం ఇవ్వబడుతుంది ... దానిని నిజంగా మరొక్కసారి నిలబెట్టుకున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. It's very highly and greatly appreciated and Kudos to you.

  సమర్ధింపులు చూసిన/చదువుకున్న తరువాత మీ స్థానంలో 'ఉండవలసిన' వారు ఉండి ఉంటే, అలాగే మీరు కాకుండా వేరే ఎవరైనా ఆ పద ప్రయోగం చేసి ఉన్నా ... ఆ 'అందరూ' ఇంకా రచ్చ రచ్చ చేసి ఉండేవాళ్లు.

  Once again it's great to see such a well balanced response.

  ReplyDelete
 19. ఎంత శాంతంగా ఉన్నా, సమన్వయంగా ఉన్నా కూడా ఎవరికైనా ఒక్కోసారి కోపం వస్తుంది. అది కొత్తపాళీగారికి వచ్చింది. నా ప్రపంచం బ్లాగునుండి డైరెక్టుగా ఇక్కడికి వచ్చినట్టున్నారు. అందుకే అలా వ్యాఖ్యానించారు.

  అనామకులుగారు,,
  మీకు పేరు చెప్పే ధైర్యం లేదు. కాని ఆలోచించకుండా వ్యాఖ్యానిస్తారు. పేరు, అడ్రస్ ఇచ్చుకుంటే నామోషీనా , లేక భయమా? పేరు రాయకున్నా మీ వివరాలు తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఏ రచన ఐనా రాసినవారి దృష్టితో చూడండీ. అర్ధం కాకుంటే వదిలేయండి.తెలుగుబ్లాగులు చదివి మీ ఇంగితజ్జానం పోయిందని బాధపడేవాళ్ళు ఎందుకు చదువుతారు. మిమ్మల్ని ఎవరూ బొట్టు పెట్టి పిలవలేదే.. మీరు అంత విజ్ఞానవంతులు ఐతే మీరే బ్లాగు మొదలెట్టి రాయండి.

  బాబాగారు,
  ముందు Anonymous వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయండి.

  ReplyDelete
 20. నయనమ్ముల కారే,
  జలపాతమ్ములు తప్ప..
  అద్భుతం అన్న పదానికే ఇదో అద్భుతం. కంటనీరు తెప్పించడమో, మనస్సును కదిలించడమో కవి ఉద్దేశ్యం కాదు, అతని ఉద్దేశ్యమల్లా ఆలోచించేలా చెయ్యడమే. బాబా గారు మీరీ శిఖరాన్ని ఎప్పుడో దాటిపోయారు, మీకవితలు ఆలోచనల పర్వతాలని దాటి, ఎదలోయల్లోకి పరుగెత్తి, అక్కడ నిలిచి ఉన్న కన్నీటి పాతాల గంగని పైకి వచ్చేలా చేస్తాయి అంటే అతిశయోక్తి కాదు.

  @లచ్చిమి గారు,
  ఇదేదో చిన్నపిల్ల మాట్లాడినట్టు లేదు మరి. మంచి ఆలోచన, వివేచన గల ఆధునిక యువతి గొంతు వినిపిస్తోంది.

  @కొత్తపాళీ గారు,
  తప్పులు చెయ్యడం మానవ సహజమే, చేసిన తప్పుని సరిదిద్దుకోవడం, చేసిన తప్పుని చెయ్యకపోవడం మాత్రం మహనీయుల లక్షణం అని పెద్దలు ఏనాడో చెప్పారు. Hats off to you sir.

  ReplyDelete
 21. ఆహా బాబాజీ....మాకు చక్కగా తాంబూలాలిచ్చేశారు..ఇహ మాపని......

  ReplyDelete
 22. ఎ భావాలని అయినా, ఎ ఆలోచనలని అయినా, ఎ బాషని అయినా blogs లో ఆవిష్కరించే సౌలబ్యం లేకపోతె .. ఇక బ్లాగుల విశిష్టత ఏమిటి?? ఇక బ్లాగులు దేనికి? ఎవరి కోసం?? ఎందు కోసం?? కనుక కొత్త పాళీ గారు వాడిన భాష 100% కరెక్ట్.

  ReplyDelete
 23. బాబా గారు,
  నాకు కూడా "వేశ్యా విషయకంగానే" అనిపించింది మీ కవిత--కాకపొతే మోసపోయిన పడుచు గతి లేక "అదే జీవనాధారమై......." ఆ వృత్తిలో దిగినట్టు చిత్రీకరించారు అని అనిపించింది.  అనామకుడిని ఆక్షేపించిన వారికి,
  ౧. అనామకుడిగా ఉండటం తప్పేమీ కాదు -ఎవరి ఇష్టం వారిది -అంత మాత్రం చేత వారు చేసిన వ్యాఖ్యలను కాక వారు అనామకులుగా ఉండటం పై వ్యాఖ్య చేయటం బాలేదేమో అని అనిపించింది. ఆలోచించండి.

  ౨. కొత్త పాళీ గారే ఒప్పుకున్నట్టు ఆ మాట అక్కడ వాడటం నిజంగా అంత అవసరం లేదు. కాబట్టి అది ఎత్తి చూపటంలో నాకు తప్పు కనపడలేదు.

  ౩. అనామకుడు "ఇంగితం" అనేది తనంతట తాను అక్కడ అనలేదు ----కొత్త పాళీ గారు ఆయన చేసిన ఆక్షేపణకు జవాబివ్వక ఆ మాట అంటే తను తిరిగి అదే విధంగా జవాబు ఇచ్చారు. ఇందులో కూడా నాకు తప్పు కనపడలేదు.

  ౪. అనామకుడి మొదటి వ్యాఖ్యను తీసుకుంటే చివరి వాక్యం అభ్యంతరకరంగా ఉంది నిజమే కాని మిగితా వ్యాఖ్య అంతా నిజమే కదా- ఆ వృత్తిలో ఉన్న వారు కొంత మంది నిజంగా డబ్బు కొరకే అది చేస్తున్నారన్నది నిజమే కదా ?

  ౫. ఆయన బ్లాగులను "పుబ్బలో వచ్చి..... " అని అనలేదు కంప్యూటర్ యుగాన్ని అన్నారు. కాబట్టి ఎందుకు మనం personalise చేసుకోవాలి?

  ౬ . ఇక పొతే ఆయన తెలుగు బ్లాగులన్నిటిపై దండెత్తలేదు అని నా అభిప్రాయం. ఇక్కడ "మీ తెలుగు బ్లాగులు...." అంటూ అన్నది కొత్త పాళీ గారి బ్లాగులు అని నా అనుమానం. ఈ personalised attackకు కారణం కొత్త పాళీ గారి "ఇంగితం" వ్యాఖ్య, వారిరువురి మధ్య ఉన్న పాత వైరం అని అర్థమవుతుంది. కాకపొతే ఈ "ఇన్నయ్య" విషయం ఏమిటో మనకు తెలీదు కాబట్టి మనం వారి మధ్య ఉన్న పాత వైరాలు వగైరాలు మనం ఎరగం

  కొత్త పాళీ గారు,
  నిజంగా మిమ్మల్ని మేచ్చుకోవాలండి, చేసిన దాన్ని వెంటనే ఒప్పుకున్నారు. great.

  ఇకపోతే నిజంగా ఆ పదం వాడొచ్చా కూడదా అన్న విషయం--నా మటుకు నాకు అలా పిలవటంలో తప్పు కనపడదు. its a term to describe their profession and in derogatory terms, which is appropriate.

  ఎందుకంటే అలాటి నిందా పూర్వక, హేలనా పూర్వక పిలుపులు వల్ల ఆ పని చేసేవారు, అది ఆనందించే మగవారు నిజంగా సమాజానికి భయపడతారు. కొంతైనా తమ ప్రవర్తనలకు అడ్డు కట్టలు వేస్తారు, లేదా వేయటానికి ప్రయత్నిస్తారు.

  ఆలోచించండి if we desensitise the term/work/profession or make it more palatable or socially acceptable, where is the question of motivation to give it up. ఆలోచించండి.

  బాబా గారు,

  చర్చ మీ కవితాపరంగా కాకుండా పక్క దారి పట్టినా. చర్చించ వలసిన విషయాలు కనపడ్డాయి కాబట్టి ఆగలేకపోయాను. అభ్యంతరం లేదనుకుంటాను.

  "కొత్త పాళీ గారు కొన్ని సందర్భాలలో నాతొ ఏకీభవించనందుకు ఇలా సమయం వచ్చింది కదా అని రాళ్ళు విసురుతూ కెలికేస్తూన్నానా" అని కూడా ఆత్మ విమర్శ చేసుకున్నాను. లేదు, నిజంగా అనవసరమైన విషయాలలో అనామకుడిని ఆడిపోసుకుంటున్నారు అనిపించింది. అందుకని రాయాల్సి వచ్చింది.

  కొన్ని సార్లు చర్చ, విభేదాలు, వైరాలు మనస్సుకు ఇబ్బందికరంగా ఉన్నా అవే కొన్ని కొత్త విషయాలను నేర్పుతాయి-ఉట్టి మెచ్చుకోటాల కంటే .............ఇది నా స్వానుభవం.

  ReplyDelete
 24. oh--by the way, nenu kaadu aa anaamakudini---migitaa vaaru adigelope cheptunnaanu :-)

  ReplyDelete
 25. తలుపు సందులోంచి తొంగిచూస్తూ గొడవలన్నీ సద్దుమణిగాకా బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు వస్తున్నాను.

  కొత్తపాళీ గారికి మీసహృదయకు చాలా చాలా దన్యవాదములు. కానీ మీరు చెప్పే అపాలజీని మీపై గల గౌరవంతో నేను స్వీకరించటం లేదు. క్షమించండీ. నేను రచ్చ అని వాడిన మాట అనానిమస్ నుద్దేసిందినదని మీరు గ్రహించారని భావిస్తాను.

  మహేష్ గారూ, మీ కామెంటుకు ధన్యవాదములు. కొత్తపాళీగారి వాఖ్య పై మీ విశ్లేషణ కరక్టే. నా కవితపై మీ వివరణలకు ధన్యవాదములు.

  లచ్చిమి గారూ
  నేనిక్కడ ఆత్మహత్యలగురించి చెప్పటం లేదండీ. ఒక తప్పని సరి పరిస్థితులలో వేశ్యా వృత్తి రుద్దబడిన అమాయక యువతికి, ఆ క్రమంలో తన దేహమే ఒక జీవనాధారమై, అదే మృత్యుదాతయై పరిణమిస్తుందని నా భావం. అది మృత్యుదాత ఎందుకైందన్నది ప్రస్థుతపరిస్థుతలలో చెప్పనక్కరలేదనుకుంటాను. అంతే తప్ప కన్నీటి జలపాతాలెక్కువైనవని మరణమే శరణ్యం అని కాదు. మరణం కూడా రుద్దబడింది.
  నా కవితల్లో నిరాశ ఉంటుంది కానీ అది జీవితంలోని అసంబద్దత పట్ల, హిపోక్రసీ పట్ల, నిస్సహాయతపట్లే తప్ప, దానికి పరిష్కారంగా చావుని ఎప్పుడూ నేరుగాగానీ, పరోక్షంగా కానీ ప్రొజెక్ట్ చేయలేదని నా నమ్మకం. బహుసా మీ వాఖ్యను నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది. unless you get me clarified my response will be like this.

  thankyou.

  నెటిజెన్ గారికి ధన్యవాదములండీ.

  తెలుగు వాడిన్‌ గారికి
  మీ రె్స్పాన్స్ లు వలన నాకు కొత్త ఉత్సాహం వస్తుందండి. థాంక్యూ సర్.
  మీ విశ్లేషణ చాలా చాలా కన్వింసింగా ఉందండి.

  జ్యోతి గారికి,
  మీ సూచన పాటిస్తాను. మీ స్పందనకు కృతజ్ఞతలండీ.
  తమ్ముడూ ప్రతాప్ (అలా పిలువచ్చా? పిలవాలనిపిస్తుంది. అభ్యంతరమైతే తెలియచేయండి.)
  థాంక్యూ వెరీమచ్. మీ విడి విడి వాఖ్యానాలు బాగున్నాయి.
  భగవాన్ గారూ,
  తాంబూలాలిచ్చేసానా..... మీరు మరీనీ...... రోడ్డుకీడ్చేస్తారు.

  క్రిష్ణారావు గారు
  థాంక్సండీ. స్పందించినందుకు

  మల్లీ భావకుడున్ గారికి,
  మీరన్నది కరక్టే. లచ్చిమిగారికిచ్చిన సమాధానంలో వివరించాను ఇదే విషయమై. ముందుగా వ్రాసుకొన్న కవితా పాదం ఇదీ. కొంత ఎబ్బెట్టుగా ఉందని కొంచెం మా్ర్చాను.

  దేహం కుదింపబడి, కుదింపబడి
  ఒక్కచోటే కేంద్రీకృతమై
  ఆ "భాగమే" జీవనాధారమై
  అదే మృత్యుదాతయై........

  మీ అభిప్రాయాలు కన్వింసింగా ఉన్నాయి.
  మీరన్నట్లు డిస్కషన్ల ద్వారా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. భిన్న దృక్పధాలు ఆవిష్కరించబడతాయి. ఏకీభవిస్తున్నాను.
  చాలా ఓపికతో మీ అభిప్రాయాలను తెలియచేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 26. అప్పుడెప్పుడో ఎక్కడో చెప్పినట్లు కవిత్వంలో నేను బహు వీకు. కవితల్ని తూచటం నాకు రాదు. కాబట్టి అసలు కవితమీద కామెంటటం లేదు.

  ఇంత గొడవకి కారణమైన అనామకుడి వ్యాఖ్యలో చివరి వాక్యం మినహాయిస్తే మిగిలినదాంట్లో అభ్యంతరపెట్టాల్సింది నాకైతే ఏమీ కనిపించలేదు. చివరి వాక్యం కూడా కాస్త వ్యంగ్యంగా (కొంతమందికి ఫన్నీగా కూడా అనిపించి ఉండొచ్చు) ఉందేకానీ అగౌరవపరిచేవిధంగా లేదు కదా. ఇంతమంది కలగజేసుకుని తలంటేశారేంటో పాపం అతనికి.

  ముగిసిపోయినదాన్ని కెలికానా? నా అభిప్రాయం రాశానంతే. గొడవ కొనసాగించాలని కాదు.

  ReplyDelete
 27. బాబా గారు మీరలా పిలవడం నా అదృష్టం గా భావిస్తాను.
  అభిమానంతో,
  తమ్ముడు.

  ReplyDelete