Thursday, October 9, 2008

సిక్స్ పేక్ హృదయం


ఆల్చిప్ప కన్నుతో
మామిడి చెక్కు ఒలిచినట్లుగా
జ్ఞాపకాల ఒక్కో పొరనీ
ఒలుచుకుంటూ పోతే,
చివరకు ఒక స్ఫటిక సదృశ
కన్నీటి బిందువు మిగిలింది.

నీ అనంత శయనపు
చిత్తరువుని చూస్తూ
నే రాల్చుకొన్నదే.
దీని తస్సాదియ్యా! అదింకా ఉందా!

చీకటిని రెండు చేతులతో
బలంగా తోసుకుంటూ
ఎంతదూరం వచ్చేసానూ!

వెలుతురు శబ్ధాల్ని కళ్ళతో
భారంగా పీల్చుకుంటూ
ఎంత కాలాన్ని ఊదేసానూ!

నీడల్ని మాత్రమే ప్రతిధ్వనించే
లోయల్లోకి ఎన్నిరోజువారీ
వెర్రికేకల్ని గుమ్మరించానూ!

ఎంతైనా
ఇది సిక్స్ పేక్ హృదయం కదా!బొల్లోజు బాబా


12 comments:

 1. కవితలో చాలా నిగూఢత ఉందల్లే ఉంది. నేను అన్వయించుకున్న అర్థాన్నికి మాత్రం భలే ఉంది, సిక్స్ పాక్ హృదయం. నెనర్లు!

  ReplyDelete
 2. వెలుతురు శబ్దాల్ని అవడం కంటే వెలుతురు వెలుగుల్ని అంటే బావుంటుందేమో--

  ReplyDelete
 3. నిజమే ఎదలోయలలో గూడు కట్టుకొన్న జ్ఞాపకాల మధురిమ, వ్యధ, వాటిని అప్పుడప్పుడు తవ్వి తీసుకొనే వాళ్ళకే తెలుస్తుంది.
  Nice one.

  ReplyDelete
 4. మీకన్నా చిన్నవాడి నైనా నా రచనలను అదరించిన మీకు నా ధన్యవాదములు... మీ ఆశిసులు ఇలనే యెల్లప్పుడు వుండాలని, మీ కామెంట్స్, నా రచనలో తప్పులు ఏల్లపుడు సరిదిద్దాలని కోరుకుంటూ.

  మీ శ్రీసత్య.

  ReplyDelete
 5. చీకటిని రెండు చేతులతో
  బలంగా తోసుకుంటూ
  ఎంతదూరం వచ్చేసానూ! బాగుంది ఈ నవతరం సిక్స్ పేక్ హృదయ ఘోష.

  ReplyDelete
 6. బావుంది.

  మా మానసిక శాస్త్రంలో ఇలా "శబ్దాలని చూడటమూ" "వెలుగులని వినడమూ" లాటి అనుభవాలను synaesthesia అంటాము. కొన్ని రోగాలలో, కొన్ని మత్తు పదార్థాల వాడుకలో మాత్రమె కలిగే విచిత్రానుభావాలవి........

  ఎంత చిత్రమో కదా, కవి ఊహా శక్తికి అంతం అంటూ ఉండనే ఉండదు.

  ReplyDelete
 7. బావుంది బాబా..మంచి భావుకత ధ్వనించింది...ఈ కవితలో...

  ReplyDelete
 8. పూర్ణిమ గారూ
  ప్రతాప్ గారు విడమరచి చెప్పేసారు గమనించారా. థాంక్సండీ

  నరసింహ గారూ
  థాంక్సండీ. మీ సూచన కూడా బాగుంది. నెనర్లు.

  శ్రీ సత్యా
  గో అహెడ్. థాంక్యూ.

  రమణి గారూ
  థాంక్సండీ.

  మీ వాక్య చూస్తుంటే ఎప్పుడో చదివిన ఒక కొటేషను గుర్తుకు వస్తుంది.
  poetry is socially accepted madness.

  నేను వ్రాసిన దానిపై మీ శాస్త్రీయ వాఖ్య నాకు గిలిగింతలు పెడుతుంది.
  హేపీ గా కూడా ఉంది.
  థాంక్సండీ.

  భగవాన్ గారూ
  థాంక్సండీ. మొత్తానికి మీరే వచ్చి నా దసరా కవిత చదివేసారు చూసారా?

  ReplyDelete
 9. ప్రతాప్ గారూ
  స్పందించినందుకు థాంక్సండీ. పైన చెప్పటం మరచిపోయాను.
  బొల్లోజు బాబా

  ReplyDelete
 10. @ బాబా గారు
  వచ్చేసాను. మీ కుశల ప్రశ్న ప్రభావమో, వాతావరణం ప్రభావమో మరి మరలా రాసాను చాలా రోజుల తరవాత :-)

  ఇక పోతే కవితలో మీ మార్కు నిగూఢత, పరిణితి, ఆలోచన కనపడుతుంది... ... ఇంతకుముందు కూడా మనం "వెలుతురు శబ్ధం" గురించి మాట్లాడుకున్నాము... అలానే " నీడల్ని ప్రతిధ్వనించడం" కూడా నాకు అర్ధం కాని వర్ణన...

  ReplyDelete
 11. దిలీప్ గారు
  పునరాగమన స్వాగతం

  వెలుతురు శబ్దాలు. భావకుడి గారి కామెంటులో, దానికి నేనిచ్చిన జవాబులో మీక్కొంచెం వివరణ దొరుకుతుందనుకుంటాను.


  నీడల్ని మాత్రమే ప్రతిధ్వనించే
  లోయల్లోకి ఎన్నిరోజువారీ
  వెర్రికేకల్ని గుమ్మరించానూ!

  నీడలు ప్రతిధ్వనించటంలో నేచెప్పదలచుకొన్నది ఇది.

  ఇక్కడ లోయలంటే కాలం/రోజులు. రోజువారీ వెర్రికేకలంటే దైనందిక చర్యలు. కాలం గడిచినతరువాత జరిగిపోయినవిషయాల నీడలు మాత్రమే మిగులుతాయి తప్ప అసళ్ళు (ఒరిజినల్స్) కావు. ఆవిధంగా నీడల్ని మత్రమే ప్రతిద్వనించే లోయలు అని అన్నాను.

  ఆ నాలుగులైన్లలో కొంత సరళంగా వ్రాయాలనిపించినా "రోజువారీ" అన్న పదం నేననుకొన్న భావాన్ని పలికించగలుగుతదని భావించాను.

  ఈ కవితను నేను కొంత ఉద్దేశపూర్వకంగానే మిస్టిక్ గా వ్రాసాను.

  దీనికి ప్రేరణ. యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల నవల చివర ఉత్తరంగా అనుకోవచ్చు. (ఇది ఎప్పటినుంచో నాకు ఒక హాంటింగ్ మెలంకలీ)

  ఆ వుత్తరానికి ఈ కవిత ఒక విచిత్రమైన పొడిగింపు.
  అంతటి విషాదాన్ని ఎదుర్కొన్న ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల తరువాత తరచిచూసుకొంటే, బాధతోనో, నిర్లిప్తతతోనో చాలా దూరం జీవించేసానా? అని ఆశ్చర్యపడి,ఎంతకైనా ఇది బండబారిన హృదయం కదా అని సరిపెట్టుకోవటమే ఈ కవిత లో నేను చెప్పదలచుకొన్నది.

  హోప్ యు గాట్ ఇట్.

  ధన్యవాదములతో
  బొల్లోజు బాబా

  ReplyDelete
 12. enta baaga cheppaarandi. abhinandanalu. hRdayam kaThinamayipoyindi.

  ReplyDelete