Monday, March 30, 2009

ఏమంటావూ?

సోక్రటిస్ తాతా!
చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?
అంటూ గొప్ప సందేహాన్ని ఒదిలి పోయావు.
ఆ ప్రశ్నకు జవాబింకా దొరక లేదు.


కాల మౌన గిలిటిన్ అతిసున్నితంగా
తనపని చేసుకుపోతోంది తప్ప
ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు.

ఏ ఒక్క ఆత్మా తిరిగొచ్చి
"ఇదీ సంగతి" అని చెప్పిన పాపానా పోలేదు.

మృత్యు పాత్రిక ఒంపులలో జీవితం
సుబ్బరంగా ఇమిడిపోతూనే ఉంది.

కొత్త అనుభవాలనూ, ఆలోచనలనూ
యాచించే బిక్ష పాత్ర
రోజూ ఉదయిస్తూనే ఉంది.

స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి.

తాతా
కొంపతీసి అంతా మిథ్యే నంటావా?
అన్నీ ఇక్కడే నంటావా?

బొల్లోజు బాబా



No comments:

Post a Comment