Friday, September 2, 2016

రవీంద్రుని క్రిసెంట్ మూన్


2009 లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువదించాను. చాలామట్టుకు నా బ్లాగులో పోస్ట్ చేసాను.
ఒక మిత్రుడు వాటిని చదివి ఇవి చిన్నపిల్లలపై వ్రాసిన గీతాలు, వీటిలో భాష సరళంగా లలితంగా ఉండటం సముచితం, కానీ నువ్వు గంభీరమైన, కఠినమైన పదాల్ని ఎక్కువగా ఉపయోగించావు అన్నాడు. అతని అభిప్రాయం కరక్టే అనిపించింది. మిగిలినవి సరిచూద్దామని అనుకొన్నాను కానీ ఆసక్తి, వీలు చిక్కలేదు.
మిత్రుడు Kks Kiran చలం గీతాంజలిలో కూడా ఉన్న ఒక క్రిసెంట్ మూన్ అనువాదాన్ని తన వాల్ పై పోస్ట్ చేసారు. అదే గీతానికి 2009 నేను చేసిన అనువాదమిది.
3. మూలం -- విశ్వకవి రవీంద్రుని క్రిసెంట్ మూన్ Source
శిశువు కళ్లపై వాలే నిద్ర
ఎక్కడనుంచి ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసా?
ఓ ఇంద్రజాలిక గ్రామం చెంత
అడవి నీడల మధ్య మిణుగురుల కాంతిలో
మిల మిల మెరిసే రెండు సిగ్గు మొగ్గలు వేళ్లాడుతున్నవట.
శిశువు కళ్లని ముద్దుపెట్టుకోవటానికి నిద్ర అక్కడినించి
బయలుదేరి వస్తుందని అంటారు.
నిదురించే శిశువు పెదవులపై కదలాడే ఆ చిరునవ్వు
ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా?
పారిపోతున్న శరన్మేఘాంచలాన్ని
నెలవంక తొలికిరణ మొకటి తాకిందట.
అక్కడ ఆనాటి మంచుకడిగిన ఉదయస్వప్నంలో
ఈ నవ్వుకు తొలి జననమని అంటారు.
నిదురించే శిశువు పెదవులపై కదలాడే ఆ చిరునవ్వుకి.
శిశువు మేనిపై మెరిసే మిసిమి
ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉందో ఎవరికైనా తెలుసా?
శిశువు తల్లి కన్యగా ఉండినపుడు
ఆమె హృదయంలొ మృదుల మౌన కోర్కెవలే నిగూఢంగా దాగిఉన్న ప్రేమే
శిశువు మేనిపై మెరిసే మిసిమి గా వికసించిందంటారు.
తెలుగు అనువాదం--- బొల్లోజు బాబా
మొత్తం అనువాదాన్ని ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.

No comments:

Post a Comment