Wednesday, December 4, 2019

కోరంగి మాంగ్రోవ్స్....

కోరంగి మాంగ్రోవ్స్....
ప్రతిరోజూ ఎంతో మంది వచ్చిపోతూంటారు
పిల్లలతో, ప్రియురాళ్లతో
ఒంటరిగా, సమూహాలుగా.....
చెక్కల వంతెనదారికి ఇరువైపులా పరచుకొన్న
సౌందర్యాన్ని ఆస్వాదించటానికి,
గుంపులు గుంపులుగా నిద్రిస్తోన్న నత్తలని
నిబిడాశ్చర్యంతో చూడటానికి,
చిక్కని ఆకులతో మడచెట్లు పట్టే గొడుగు నీడల
స్నానం చేయటానికి,
రాత్రిపూట ఏదో జంతువు వదిలిన పాదముద్రల్ని
డీకోడ్ చేసేందుకు,
అసౌందర్యాన్ని రాల్చి ఎటో ఎగిరిపోయిన తెల్లకొంగను
దృశ్యంగా బంధించటానికి
ప్రతిరోజూ ఎంతో మంది వచ్చిపోతూంటారు
వచ్చిన వాళ్ళే మరలా మరలా వస్తూంటారు
ఈ వనానికి ఎప్పుడో గుప్పెడు క్షణాలు రుణపడ్డట్లో
ఈ బురదనేలలో పోగొట్టుకొన్న ఏ స్వప్నాల్ని వెతుక్కోవటానికో
గాలిపీల్చుకోవటానికి భూమిపైకి వచ్చిన వేళ్ళలా
ఉరుకుల ఆయాసం తీరటానికి ఏ లోలోపలి ఊపిరికోసమో
వచ్చిన వాళ్ళని
పొన్నచెట్టు నీడలు, గుగ్గిలపు ఆకుల గలగలలూ
నవ్వుతూ పలకరిస్తాయి.
అభయారణ్యం మధ్యలో ఉన్న
క్షీణమైన పురాతన లైట్ హౌసు, దాని వలయాకార మెట్లు
ఏ కొద్దిమంది సాహసులనో ఆకర్షిస్తాయి
ఉత్సాహంగా ఉరకలు వేస్తూ, కేరింతలు కొడుతో
దానిపైకి ఎక్కి ఫొటోలు తీసుకొంటారు
వారిలో ఏ ఒకడో
దూరంగా కనిపించే సువిశాల సముద్రాన్నీ
లంగరు వేసిన ఓడల్ని, నగర హర్మ్యాల్ని
ఇంకా సుదూరంగా కనిపించే ఫాక్టరీ గొట్టాల్ని
శిధిలమైపోయిన ఒకనాటి కోరంగి మహానగరాన్ని
తదేకంగా చూసి
మౌన భారంతో మెట్లు దిగుతాడు
నదీపాయల నడుమ నారాయణ పక్షుల బారుని
డీజిల్ శబ్దం
చెల్లాచెదురు చేస్తుంది.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment