ఈ రోజు యానాం -కవి సంధ్య ఆధ్వర్యంలో ప్రముఖ కవి స్వర్గీయ శ్రీ వింజమూరి అచ్యుత రామయ్య గారి “అమ్మ పుట్టిన ఊరు” కవిత్వసంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ సభకు శ్రీ దాట్ల దేవదానం రాజు గారు అధ్యక్షత వహించారు. శ్రీ శిఖామణి పుస్తకావిష్కరణ చేసారు. శ్రీ సన్నిధానం నృశింహశర్మ, శ్రీ మధునాపంతుల సత్యన్నారాయణ మూర్తి, శ్రీ అద్దేపల్లి ప్రభు, శ్రీ సుంకర గోపాల్, శ్రీ కుంచే సత్యనారాయణ లు, శ్రీ ఇంద్రగంటి ప్రసాద్, శ్రీ మార్ని జానకి రామ్ చౌదరి లు మరియు వింజమూరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆ పుస్తకంపై నేను చేసిన ప్రసంగ పూర్తి పాఠం ఇది.
***
సామాజికానుభూతుల సమ్మేళనం – శ్రీ వింజమూరి అచ్యుత రామయ్య “అమ్మ పుట్టిన ఊరు”
.
శ్రీ వింజమూరి అచ్యుతరామయ్య గారి కవిత్వం చాలా సరళంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ గాఢమైన భావాలను నింపుకొని ఉంటుంది. వైయక్తిక అనుభవాలను కవిత్వీకరించటం కత్తిమీద సాములాంటిది. ఒకప్పుడు కథ, పాత్రలచిత్రణ, కవిత్వం ఒకదానినొకటి పెనవేసుకొని ఉండేవి. ఆధునిక కాలానికి వచ్చేసరికి కథ, నాటకీయత వేరుపడి స్వతంత్రంగా మనుగడసాగిస్తున్నాయి. వర్ణణలు, భావనలు మాత్రమే ఆధునిక వచన కవిత్వానికి మిగిలాయి.

"కవిత్వం పాలు ఎక్కువై కథాంశ ప్రాముఖ్యం తగ్గుతున్న కొద్దీ పాఠకుల, శ్రోతల పరిధి తగ్గుతూ ఉంటుంది" - అంటారు ప్రముఖ విమర్శకులు శ్రీ పెన్నా శివరామకృష్ణ.
ఇలాంటి నేపథ్యంలో కథనాత్మకతను వదలకుండా కవిత్వం చెప్పిన కవులను పాఠకులు నెత్తిన పెట్టుకొంటున్నారన్నది ఒక చారిత్రిక సత్యం. అది రూమీ కావొచ్చు, బుకోవ్ స్కీ కావొచ్చు, శ్రీశ్రీ కావొచ్చు, తిలక్ కావొచ్చు, శిఖామణి కావొచ్చు, కొంతవరకూ శివారెడ్డిగారు కావొచ్చు. శ్రీవింజమూరి అచ్యుత రామయ్య గారి కవిత్వం కూడా ఆ కోవలోకే చెందుతుంది.
ఈ పుస్తకంలో రంగురాళ్ల తవ్వకంపై వ్రాసిన “అడవినుండి రాస్తూ”; హైవేల పక్కన పడుపువృత్తి సాగించే వారిపై వ్రాసిన “ మైలురాయి”; 2001 లో గుజరాత్ లో భుజ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం పై వ్రాసిన “భూగందరగోళం”; పరీక్షహాలులో విద్యార్ధులు పరీక్షలు రాసే క్రమాన్ని వివరిస్తూ వ్రాసిన “భవిష్యత్ పుస్తకం”; లాంటి అనేక కవితలు కథనాత్మకంగా సాగుతూ గొప్ప జీవనపార్శ్వాలను వ్యక్తీకరిస్తాయి.
చాలామంది కవులు తాము జీవిస్తున్న జీవితాలను విస్మరిస్తూ, పెద్ద పెద్ద సిద్ధాంతాల వెనుక, రాజకీయాల వెనుక నిలబడి కవిత్వం రాస్తారు. రాజకీయాలు, సిద్ధాంతాలకు కాల పరిమితి ఉంటుంది. కానీ మనిషి జీవితం ఒక నదీప్రవాహం. ఒక సతతహరితారణ్యం. దీన్నే ఇస్మాయిల్ గారు “ క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం? అంటారు. శ్రీవింజమూరి అచ్యుత రామయ్య గారి కవిత్వం జీవితాన్ని దాటి సాముచేయదు. ఆయనకు ఎదురైన చిన్న చిన్న అనుభవాలకు అక్షరరూపమిచ్చారు. ఆ అనుభవాలను మనలోకి ప్రసరింపచేసి అనుభూతింపచేసారు. అనుభూతి ప్రధానంగా వ్రాసిన కవిత్వం చదువరిలోకి చొచ్చుకొని పోతుంది. కవితో, పాఠకుడు మమేకం కావడం కన్నా సాహిత్యానికి మరే ఇతర ప్రయోజనం ఉంటుందీ?
ఈ పుస్తకం పేరు “అమ్మ పుట్టిన ఊరు”. ఎంత ఆత్మీయంగా ఉంది. శిఖామణి గారు ముందుమాటలో అన్నట్లు అమ్మమ్మ గారి ఊరు అనికూడా అనొచ్చేమో… కానీ అమ్మపుట్టిన ఊరు అన్న పేరులో మానవసంబంధాల పరిమళం మరింత వీస్తోంది. అదే పేరుతో ఉన్న కవిత నాకెంతో ఇష్టమైనది. అమ్మ పుట్టినఊరికి వెళ్ళడమనే అనుభవం వైయక్తికమైనది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు, అనుభూతులు ఉంటాయి.
శిఖామణి గారు తెలుగు సాహిత్యంలో “అమ్మలేని కవి”. ఆయన ఇలాంటి కవిత వ్రాయగలరా? మా అమ్మగారిది కూడా యానమే. నేను రాయగలనా? ఎప్పటికీ రాయలేకపోవచ్చు. ఒకవేళ రాసినా భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యాలు ఒక్కొక్కరికీ విభిన్నంగా ఉంటాయి.

ఆ కవిత ప్రారంభమే -
డింగి బుడింగు మందీ అంటే
అమ్మతో పాటు అంతా కాలువలో గల్లంతే --- అంటూ మొదలౌతుంది. పరవళ్ళుతొక్కుతూ ప్రవహించే కాలువను డింగి లో దాటుతూ అమ్మపుట్టిన ఊరికి వెళ్ళే భౌగోళిక నేపథ్యం అందరికీ ఉండకపోవొచ్చు.
డింగి బుడింగు మందీ అంటే
అమ్మతో పాటు అంతా కాలువలో గల్లంతే --- అంటూ మొదలౌతుంది. పరవళ్ళుతొక్కుతూ ప్రవహించే కాలువను డింగి లో దాటుతూ అమ్మపుట్టిన ఊరికి వెళ్ళే భౌగోళిక నేపథ్యం అందరికీ ఉండకపోవొచ్చు.
ఇక ఈ కవితలో కనిపించే - మామిడికాయల పచ్చళ్ళు, మండువా ఇల్లు, బెల్లపు ఆవకాయ, పాలు కాయగా పాత్రకు అడుగున అంటుకొన్న గోకుడు, దాలిమీద కాగిన దోరపాల మీగడ, అరుగుపై కూచుని ఆలపించే భజగోవింద గీతాలు, అన్నంలో అద్దుకునే అప్పడాల పిండి - లాంటి వివిధ అంశాలకు ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంది. కొన్ని కుటుంబాలలో కనిపించే సాంప్రదాయిక వారసత్వం కనిపిస్తుంది. ఇలాంటి వైయక్తిక అంశాలను ప్రస్తావించటం లో ఏ సాహిత్యప్రయోజం ఉందీ అది ఉత్త నాస్టాల్జియా కాదా అంటారు కొంతమంది. ఎందుకంటే నాస్టాల్జియా ను తెలుగు విమర్శకులు ఒక నిషిద్ద వస్తువుగా పరిగణిస్తారు. నిజానికి కవిత అక్కడితో ఆగిపోయి ఉన్నట్లయితే పై వర్ణణలు అన్నీ నాస్టాల్జియాగాను, మొత్తం కవితను పాత తలపోతల వ్యవహారంగాను అనుకోవచ్చు. శ్రీవింజమూరి అచ్యుత రామయ్య గారు ప్రతిభావంతులు. కవిత్వం ఎక్కడ ఉంటుందో తెలిసినవారు. అక్కడ నిలిచి కవిత్వాన్ని వ్యాక్యాలలోకి ఆవాహింపచేయగల శక్తికలిగినవారు.
ఆ తరువాత వాక్యాలలో అమ్మపుట్టిన ఊరికి కాలానుగుణంగా వచ్చిన మార్పులను చెపుతారు. మండువాలోగిలి ఇల్లు కొట్టుకుపోయిందట, అమ్మమ్మ ఊరు ఆక్సిజన్ లేని ఖాళీ సిలిండర్ లా ఉందట, అప్పడాల మాదిరి కుటుంబ వ్యవస్థ ముక్కలయిందట కొసమెరుపుగా అమ్మమ్మ ఊరు అమెరికాలో అంతర్భాగం అయింది అంటారు. ఈ రెండో భాగం వల్ల ఈ కవిత గొప్ప ఉదాత్తతను సంతరించుకొంది. సమకాలీన వాస్తవికతను ప్రతిబింబిస్తోంది. ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాలలో గత మూడు దశాబ్దాలుగా వచ్చిన సాంస్కృతిక మార్పులను రికార్డు చేసింది. ఉదరపోషణార్ధమో, ఉజ్వల భవిష్యత్తు కొరకో పిల్లలు, ఉన్నఊరిని, కన్న తల్లిదండ్రుల్ని విడిచి పొరుగూర్లకు పోవటం మానవసంబంధాల కోణంలో ఆలోచిస్తే ఒక విషాదం. మానవ విషాదాన్ని కవి తప్ప మరొకరు రికార్డు చేయరు. ఆ విధంగా “అమ్మపుట్టిన ఊరు” తెలుగునాట గడచిన రెండు, మూడు దశాబ్దాలలో కాస్త చదువుకొన్న కుటుంబాలలో నెలకొన్న విషాదాన్ని అద్భుతంగా రికార్డు చేసిందని భావిస్తాను.
ఈ పుస్తకంలో నన్ను విశేషంగా ఆకర్షించిన మరొక కవిత “వైరస్ వైరం”. ఇది నిప్పులు చిమ్ముకొంటూ పైకెగసి, నెత్తురు కక్కుకుంటూ నేలరాలిన సాఫ్ట్ వేర్ దిగ్గజం సత్యం రామలింగ రాజు పై వ్రాసినది. ఆయన చేసినది చట్టపరంగా తప్పే కావొచ్చు కానీ దక్షిణ భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్తల పతనాల వెనుక రాజకీయకారణాలు కూడా ఉంటున్నాయనే వాదన వినిపించింది అప్పట్లో. ఏది ఏమైనా సత్యం రామలింగ రాజు గారి పతనం చాలామందిని కలచివేసింది. బహుసా ఆయన చేసిన దాతృత్వపనుల వల్ల కావొచ్చు. వారు ప్రారంభించిన 108 వాహనాల నిర్వహణ కావొచ్చు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని సత్యం షేర్స్ కొని కట్నంగా ఇచ్చి కూతుర్ల పెళ్ళిళ్ళు చేసారు కొంతమంది. ఇరవై ఏళ్లక్రితమే కోనసీమలో బైర్రాజు ఫౌండేషన్ ద్వారా 2 రూపాయిలకే 20 లీటర్ల మినరల్ కేన్లు పంపిణీ చేయటం చూసాను. అలాంటి వ్యక్తి నెత్తురు కక్కుకుంటూ రాలిపోవటం చాలామందిని కదిలించింది. కానీ ఏ ఒక్క తెలుగు కవీ ఆయనగురించి కవిత్వం రాసినట్లు గుర్తులేదు, ఒక్క అచ్యుతరామయ్యగారు తప్ప. ఇది ఆయనలోని మానవీయకోణాన్ని ప్రతిబింబిస్తుంది.
కుండలీకాల్ని
కండలతో పెకలించి
వైరస్ సోకిన కంప్యూటరు ముందు
మూగబోయి మౌసై నిలబడ్డావు//
.
కామధేనువైన నీ ఎకౌంటుని
నిశాచర పిశాచరులు
పీక్కుని తిన్నా
“అంభా”నీ అని రంకె
వేయలేకపోయావు.
అపర దానకర్ణా
నీది పతనం కాదు
రంగుల పతాకానివి నువ్వు -- (వైరస్ వైరం)
కండలతో పెకలించి
వైరస్ సోకిన కంప్యూటరు ముందు
మూగబోయి మౌసై నిలబడ్డావు//
.
కామధేనువైన నీ ఎకౌంటుని
నిశాచర పిశాచరులు
పీక్కుని తిన్నా
“అంభా”నీ అని రంకె
వేయలేకపోయావు.
అపర దానకర్ణా
నీది పతనం కాదు
రంగుల పతాకానివి నువ్వు -- (వైరస్ వైరం)
కవిత్వంలో హాస్యం పండించటం తెలుగు సాహిత్యానికి సంబంధించి పేరడీలవరకే పరిమితమయ్యింది. శ్రీశ్రీ సిప్రాలీలతో, ఆరుద్ర కూనలమ్మపదాలతో కొంత ప్రయత్నం జరిగినా అవి నిలబడలేదు. హాస్యం వేరు. వ్యంగ్యం వేరు. "హాస్యం నవ్విస్తుంది. వ్యంగ్యం నవ్విస్తూనే ఆలోచింపచేస్తుంది" అంటారు ఈ పుస్తకానికి వెనుక మాట వ్రాసిన శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారు. వింజమూరి వారి బుల్లి కవితలలో నాకు హాస్యం కన్నా వ్యంగ్యం ఎక్కువగా కనిపిస్తుంది.
కార్లు కార్బన్ డయాక్సైడ్ ఎర చూపిస్తూ
అమాంతంగా కొండల్ని డిక్కీలో పడుకోబెడతాయి (అడవి నుండి రాస్తూ….) అన్న మాటలో ఆలోచింపచేసే వ్యంగ్యమే ఉంది. అమాయకంగా ఉండే అడవిలోకి కార్లలో బడాబాబులు వెళ్ళి, అక్కడి కొండల్ని/రంగురాళ్లని కబ్జాచేయటంగా అర్ధం చేసుకోవాలి పై వాక్యాలను. ఇక్కడ కార్లు చేసే కాలుష్యాన్ని ఒకవైపు సూచిస్తూనే, మరోవైపు అదే కార్బన్ డయాక్సైడును చెట్లకు ఎరగాచూపి రంగురాళ్లను ఎత్తుకుపోవటం అనే అర్ధం నేటి గిరిజనప్రాంతాలలో రంగురాళ్ల వ్యాపారంపై ఎక్కుపెట్టిన మంచి వ్యంగ్యాత్మక వ్యాఖ్య.

చెట్టుమీద వాలిన పిట్ట
కృతజ్ఞతగా
రెట్టను ఎరువుగా వేసి
మరోచెట్టుపైకి ఎగిరిపోయింది -- అనే ఇష్టపదిలో పిట్ట రెట్టవేయటం హాస్యంగా అనిపించినా- పిట్టకు ఉన్నపాటి కృతజ్ఞత మనకు ఏపాటి ఉందని ప్రశ్నించటం అన్యాపదేశం.
కృతజ్ఞతగా
రెట్టను ఎరువుగా వేసి
మరోచెట్టుపైకి ఎగిరిపోయింది -- అనే ఇష్టపదిలో పిట్ట రెట్టవేయటం హాస్యంగా అనిపించినా- పిట్టకు ఉన్నపాటి కృతజ్ఞత మనకు ఏపాటి ఉందని ప్రశ్నించటం అన్యాపదేశం.
ఇష్టపదులలో ప్రముఖ కవుల వ్యక్తిత్వాలను అల్పాక్షరాలలో అనంతార్ధాలు ధ్వనించేలా చెప్పటంలో వింజమూరి గారి ప్రజ్ఞాపాటవాలు దర్శనమౌతాయి.
పల్లె పల్లెనా అద్దేపల్లిని
అక్షరం హత్తుకుంటూ ఉంటుంది
గజల్ గానం జర మధురం – పల్లె, అద్దే “పల్లి” పదాలలో పన్ ఉంది. జర అన్నఉర్దూ పద ప్రయోగం ద్వారా గజల్ ప్రక్రియ మూలాల్ని గుర్తుచేస్తారు.
అక్షరం హత్తుకుంటూ ఉంటుంది
గజల్ గానం జర మధురం – పల్లె, అద్దే “పల్లి” పదాలలో పన్ ఉంది. జర అన్నఉర్దూ పద ప్రయోగం ద్వారా గజల్ ప్రక్రియ మూలాల్ని గుర్తుచేస్తారు.
మో ఓ మొగలిపొద అంటారు మరో ఇష్టపదిలో. నిజంగానే మో ఒక మొగలి పొదే. ఆయన కవిత్వం మొగలిరేకుల మత్తు లాంటిది. ఆ తోటలో స్వేచ్చగా తిరగాలని ఉంటుంది. కానీ అస్ఫష్ట ఇమేజెరీల నాగుపాములు కాటువేస్తాయని భయం వేస్తూంటుంది.
శ్రీ వింజమూరి అచ్యుతరామయ్య గారి కవిత్వానికి ఉన్న మరొక బలం పన్. పన్ అంటే ఒకే పదాన్ని చిన్నచిన్న మార్పులతో రెండర్ధాలలో ప్రయోగించటం.
కట్టుకోబోయే ఇంటిలో – నాకో పఠన మందిరం, బార్యకో పటాల మందిరం అంటారు. పఠన, పటాల పదాల మధ్య సారూప్యం వల్ల చక్కని పన్ ఏర్పడింది.
పోటీపడి కుర్చీనుండి
ముందుకు వంగి కొందరు రాస్తుంటే
పోటుపడి వెనక్కు వంగి
మరికొందరు కుర్చీని రాసుకుంటూంటారు. పై వాక్యాలలో పోటీపడి, పోటు పడి; రాస్తుంటే, రాసుకుంటూ అనే పదాలను హృద్యంగా పన్ చేసారు.
ముందుకు వంగి కొందరు రాస్తుంటే
పోటుపడి వెనక్కు వంగి
మరికొందరు కుర్చీని రాసుకుంటూంటారు. పై వాక్యాలలో పోటీపడి, పోటు పడి; రాస్తుంటే, రాసుకుంటూ అనే పదాలను హృద్యంగా పన్ చేసారు.
ఊర పిచ్చుకలు – ఏ లోనూ లేకుండా ఎలోన్ గా గృహప్రవేశం చేసుకున్నాయి అనటంలో కూడా పన్ దాగిఉంది.
పవరున్నోడు
పవరుప్లాంట్ లు కడతాడు
పవరు కట్టయినోడు
పవరున్న పార్టీలో ప్లగ్గైపోతాడు - ఇక్కడ పవరు అన్నపదం అధికారం, కరంటు అనే రెండర్ధాలలో ప్రయోగించబడి చక్కని పన్ అయింది. ఇది నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది.
పవరుప్లాంట్ లు కడతాడు
పవరు కట్టయినోడు
పవరున్న పార్టీలో ప్లగ్గైపోతాడు - ఇక్కడ పవరు అన్నపదం అధికారం, కరంటు అనే రెండర్ధాలలో ప్రయోగించబడి చక్కని పన్ అయింది. ఇది నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది.
శ్రీ వింజమూరి అచ్యుతరామయ్య గారి కవిత్వం అనుభూతి కవిత్వం. సాధారణంగా అనుభూతి కవిత్వం మేధోపరమైన, భావపరమైన, నైరూప్యచిత్రణలతో ఉంటూ సామాజిక చిత్రణ తక్కువగా వ్యక్తీకరిస్తుంది. కానీ వింజమూరి గారి కవిత్వంలో సామాజిక, రాజకీయ పరమైన అంశాలు అంతర్భూతమై ఉంటాయి. అనుభూతిని, సామాజిక స్పృహని ఏకకాలంలో పండించగలగటం చాలా కష్టం. దాన్ని వింజమూరి గారు చాలా అలవోకగా సాధించారనిపిస్తుంది.
తుళ్ళూరునే నమ్ముకున్న తూనీగలు పిచ్చుకలు
ఎటు ఎగిరిపోయాయో
కలవరించి పలకరింపు ఫోను చేస్తే
అవుటాఫ్ కవరేజి ఆ తరువాత స్విచ్ఛాఫ్ ---- నేడు దేశంలో అభివృద్దిపేరిట జరుగుతున్న భూమి దోపిడీని ఇంత క్లుప్తంగా, గొప్పగా ఏ కవితా ఆవిష్కరించ లేదు అని నేను భావిస్తాను.

ఈ పుస్తకానికి శ్రీ శిఖామణి, శ్రీ దేవదానం రాజుగారు ఆత్మీయమైన ముందుమాటలు వ్రాసారు. ఈ పుస్తకానికి చిన్నారి కవర్ పేజ్ డిజైన్ చేసారు. వెనుక మాటలుగా అనేకమంది ప్రముఖులు వివిధ సందర్భాలలో వెలువరించిన అభిప్రాయలు, కుటుంబ సభ్యులు ప్రేమపూర్వక భాషణలు ఉన్నాయి. అవన్నీ చదివాక గుండెలు బరువెక్కక మానవు. శ్రీ అచ్యుతరామయ్య గారు ఈ రోజు మనమధ్య లేకపోవటం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. వారు ఉన్నప్పుడు కాక లేని సందర్భంలో ఇలా మాట్లాడవలసి రావటానికి నాకు దిగులుగా అనిపిస్తోంది. అందుకు క్షంతవ్యుడను.
బొల్లోజు బాబా
21/7/2019
21/7/2019
No comments:
Post a Comment