Wednesday, December 4, 2019

change in my style of writing

పదేళ్ళ క్రితం వ్రాసిన కవిత ఇది. ఫేస్ బుక్ గుర్తుచేసింది. పదేళ్లలో శైలిలో వచ్చిన మార్పు ఆశ్చర్యం గా అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులు
1. భాష సరళమైంది.
2. క్లిష్టమైన పదాల వాడుక తగ్గింది.
3. నైరూప్య వర్ణణలకు బదులు కాంక్రీట్, సజీవ వర్ణణలు వాడుక పెరిగింది
4. ?
5 ?
భవదీయుడు
బొల్లోజు బాబా
*****
సాగర తీర సాయింత్రం
ఈ సముద్రం ఒక దట్టమైన నీలి కలువై
తన రేకల అలల అంచులతో
అచల ఏకాంత తీర సైకత మౌనాన్ని ముద్దిడి
తన హృదయలోతుల్లో జనించిన గవ్వల పుప్పొడితో
అభిషిక్తం చేస్తోంది, ఒకానొక ఆదిమ లాలసగా.
మానవజాతి కర్మజలాలన్నీ
ఈ సువిశాల కాలపాత్రికలో
కెరటాలు కెరటాలు గా మరుగుతున్నాయి.
నిర్జన సాగర మైదానాల అనంత దూరాల్ని
ప్రయాణించి అలసిన గాలి మేని నిండా చమట జిడ్డు.
గవ్వల శూన్యపు నిర్జీవ హోరులో
సరుగుడు చెట్ల గాలి ఊళలపై
నీలాంబరపు పారదర్శకతపై
నిర్లిప్త శిలల మౌన చర్మంపై
ఈ లోతైన క్షణాల కలంతో
ఈ సాగర తీర సాయింత్రం తన
మృత్యుగీతాన్ని లిఖించుకొంటోంది.
సూర్యుని కొల్లగొట్టి పిటపిటలాడుతూ
ప్రకాశించిన పగలు పగుళ్లు తీసింది.
పగుళ్లలోంచి రాత్రి మౌన చీకట్లు ఊరుతున్నాయి.
చలితడి ప్రవహిస్తూంది. వెలుగు వర్ణాలు కారిపోతున్నాయి.
వార్ధక్యంతో వంగిపోయిన
ఈ సాయింత్రానికవతల సుదూరంగా
వెన్నెల సంగీతంతోనూ, నిశ్శబ్ధ అలల పరిమళంతోనూ
నీ జ్ఞాపకమొకటి నా స్వప్న దారులలో
మిల మిలా మెరుస్తూ జ్వలిస్తూంది.
బొల్లోజు బాబా (January 2009)
**********
ఇటీవల వ్రాసిన ఒక కవిత
ఆట
ఆ పిలగాడికి
పెద్దజబ్బు చేసింది
చనిపోతాడనుకొన్నారు అందరూ
పదిరోజుల లంఖణాల తరువాత
చారు అన్నం తిని
అరుగుపై కూర్చొన్నాడు
వాడి స్నేహితులు
సైకిల్ తొక్కుకొంటూ
పరుగులెత్తుతో
కేకలు వేస్తూ
ఆడుకొంటున్నారు రోడ్డుపై
జీవించి ఉండటంలోని
సౌందర్యం
కొద్ది కొద్దిగా అర్ధమౌతోంది వాడికి
బొల్లోజు బాబా

No comments:

Post a Comment