Wednesday, December 4, 2019

గాథాసప్తశతి - తాజా అనువాదాల పార్ట్ 1
రెండువేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా జీవించారో గాధాసప్తశతిలోని అనేక గాథలలో కనిపిస్తుంది. భార్యా, పిల్లలను గ్రామంలో ఉంచి పనుల నిమిత్తమో, వ్యాపారం కోసమో దూరదేశాలు ప్రయాణించటం ఒక జీవనవిధానంగా ఉండేది.
ఈ నేపథ్యంలోంచి వ్రాసిన అనేక గాథలు ఆనాటి ప్రజల జీవితాలను, అనుభవాలను, ఉద్వేగాలను నేటికీ మనకళ్లకు కడతాయి.
అలా పొరుగూరు వెళ్ళిన భర్తలు వానాకాలం సమీపించేలోగా సొంత ఊర్లకు చేరుకొనేవారు ఎందుకంటే వానాకాలంలో వాగులు, నదులూ పొంగి దారులన్నీ మూసుకుపోతాయి. లేకపోతే వరదలు తగ్గేదాకా కనీసం రెండు మూడు నెలలు ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వచ్చేది.
1. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి వానలు సమీపించకముందే ఇంటికి చేరాలని ఎంత ఆత్రపడుతున్నాడో ఈ గాథలో చూడవచ్చు.
వానాకాలం సమీపిస్తుండటంతో
ఇంటికి త్వరగా చేరుకోవాలని
ఆ బాటసారి దారిని చుట్టి మూటకట్టేస్తాడు
దానిని ముక్కలు చేసి ఒక్క గుక్కలో మింగేస్తాడు. (696)
2. వానాకాలం వచ్చేసిందేమో, ఇక భర్త మరో మూడునెలలపాటు రాడేమో అని ఆందోళన పడుతున్న ఒక విరహోత్కంఠితను బహుసా ఆమె అత్త ఎలా ఓదార్చుతుందో ఈ గాథ చెపుతుంది.
వింధ్య పర్వత శిఖరాలపై నీవు చూసేది
వేసవి కార్చిచ్చు వలన రేగిన నల్లని బూడిద
కారు మబ్బులు కావు
నీ భర్త రాక గురించి దిగులు చెందకు. [70]
3. బహుసా పై గాథలోని అమ్మాయినే మరో సందర్భంలో ఇలా సముదాయించి, ఆమె బాధను పంచుకొన్న విధానం కరుణాత్మకంగా ఉంటుంది.
'చూడు అమ్మాయి! ఏడవకు
అతను వస్తాడు. ఈరోజు జరుగుతున్న తీర్థానికి
అతను ఏనాడూ లేకుండా లేడు'
అంటూ బోలు మాటలతో కోడల్ని ఓదార్చి
పక్కకు తిరిగి కనులనీరు తుడుచుకొంటోందామె.
4. మనసుకు ఇష్టమైనవారు దూరమైనప్పుడు అనుభవించే అనుభూతిని విరహం అంటాం. ఇప్పట్లా, ఫోనులు, విడియోకాల్ లు లేవు. భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడొస్తాడో తెలియదు. అసలు వస్తాడో రాడో కూడా అంతకన్నా తెలియదు. అందుకనే అప్పట్లో ఏడు సంవత్సరాలు వరకూ రాకపోతే అతను మరణించినట్లు పరిగణించి, కర్మకాండలు, ఆస్తిపంపకాలు చేసుకోవచ్చని చాణుక్యుని అర్థశాస్త్రం చెపుతుంది. . (ఇది ఈనాటికీ అంతే అనుకొంటాను మిస్సింగ్ కేసులలో)
ఈ క్రింది గాథలో ఒక భార్య ఇరవైరోజులకే ఎంత ఆందోళనపడుతోందో గమనించవచ్చు.
భర్త దూరదేశమేగాకా
ఆమె మొదట చేతివేళ్లతో రోజులు లెక్కవేసుకొంది
అవి అయిపోయాకా కాలివేళ్లతో లెక్కించుకొంది
అవీ అయిపోయాకా ఇక ఎలా లెక్కించాలో తెలీక
భోరున ఏడవటం మొదలెట్టింది. [307]
5. వానాకాలం వచ్చేసింది. భర్త మరో మూడునాలుగునెలలు రాడని నిశ్చయమైపోయింది. ఒకవైపు వాననీరు, మరొకవైపు కన్నీరు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని ఎంత గొప్పగా చెపుతున్నాడీ పూర్వకవి.
చూరునుండి కారుతున్న నీటి ధారలలో
ఆమె తల తడుస్తున్నా
కొడుకుని ఒళ్ళోకి తీసుకొని కాపాడుతోంది
పాపం మగని వియోగంచే కలిగిన కన్నీళ్ళతో
వాడు అప్పటికే నిండా తడిచిపోయాడని
గమనించటం లేదామె [623]
6. వర్షాకాలం మొదలయ్యాకా కూడా భర్త రాకకోసం ఇంకా ఎదురుచూసే ఒక స్త్రీ ని సముదాయిస్తూ, చిరుకోపం ప్రదర్శించటంలో ఉన్న ఆనాటి మానవ సంబంధాలను "ఫ్రీజ్ షాట్" తీసిన కవిని అభినందించకుండా ఉండలేం.
పిచ్చిదానా
మేఘాలు గర్జిస్తున్నాయి
దారులలో గడ్డిమొలిచింది
నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి
ఇంకా నీ భర్త కోసం ఎదురుచూస్తున్నావు [729]
7. భర్త చెంతలేకపోవటవల్ల ప్రేమరాహిత్యంతోనో, జీవిక కోసమో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఉంటుంది..... ఒకే ఒక ఆశతో.... మగడు ఇంటికి ఎంతో కొంత డబ్బునో, సంపదలనో తీసుకొస్తాడని. భర్త ఉత్తచేతులతో వస్తే ........ ..
అతను లేకపోవటం కన్నా
ఇక్కడ నేను పడ్డ దురవస్థ కన్నా
తను ఏ ప్రయోజనమూ సాధించకుండా
తిరిగి రావటమే నన్నెక్కువ బాధిస్తున్నది [76]
గాథాసప్తశతి లో రెండువేల సంవత్సరాల నాటి అనుభూతుల ప్రాసంగిత ఈనాటికీ చెక్కుచెదరలేదు. అవి నేటికీ పదే పదే ఇతర ప్రపంచ భాషలలోకి అనువదించబడుతున్నాయి అంటే కారణం వాటిలోని ఉద్వేగాలు, కవిత్వమూ అనుకొంటాను.
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment