Wednesday, December 4, 2019

discussion

కవిసంగమం లో ప్రముఖ విమర్శకులు శ్రీ లక్ష్మి నరసయ్య గారు వ్రాసిన ఒక పోస్టుపై జరుగుతున్న చర్చలో నే చేసిన కామెంటు
***
నేనీ వ్యాసాన్ని మొదటి సారిగా చదివినప్పుడు ...
//.......ఘర్షణలనుంచీ, తిరుగుబాట్ల నుంచీ , ప్రతిఘటనలనుంచీ వచ్చే విషయం ఉత్తమ కవిత్వానికి ఆధారమౌతుంది. విషయంలో ఎదో పేచీ, ఎదో గొడవ, ఎదో లాడాయి ఉండాలి. క్రమ బద్ధమైన ప్రశాంత జీవనం నుంచి వచ్చే విషయం మంచి పోయేటిక్ టెక్నిక్ ప్రమేయం వల్ల ఉత్త కవిత కాగలదు. ఉత్తమ కవిత కాలేదు// (జి.ఎల్. ఎన్. )
పారాగ్రాఫ్ వద్ద ఆశ్చర్యానికి కు గురయ్యాను. తెలుగు సాహిత్యాన్ని గత మూడు దశాబ్దాలుగా సర్వనాశనం చేసిన విమర్శనా ధోరణి బలహీనపడింది అనుకొంటున్న క్షణంలో మళ్లా ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తుందా అనిపించింది. ఇది సాహిత్యాన్ని సాహిత్యకారులనూ రెండుగా చీల్చే వాదన అని యశస్వి గ్రహించగలిగినందుకు సంతోషం.
ప్రపంచవ్యాప్తంగా కాలం చెల్లిన ఈ ధోరణి, వాదనలు ఇంకెంతకాలం బ్రతికిస్తారు తెలుగులో. సాహిత్య అకాడమీ ప్రచురించే ఇండియన్ లిటరేచర్ పుస్తకాన్ని రెగ్యులర్ గా చదువుతాను. ఆ కవిత్వంలో ఎంత విస్తారమైన మానవజీవితం పరుచుకొని ఉంటుంది. దేశమంతా ఒక దారి అయితే తెలుగు సాహిత్యంలో శాసనాలు మరోలా ఉంటాయి.
ఈ వాదనవల్ల తెలుగుకవులు దాదాపు హిపోక్రైట్స్ గా మారుతున్నారు. జీవించేది భద్రజీవితం రాసేది పీడనకవిత్వం. ఎందుకంటే అది ట్రెండింగ్ లో ఉంటుంది కనుక. విమర్శకులు మెచ్చుకొంటారు కనుక. (వాస్తవాలు మాట్లాడుకొందాం)
రాజకీయాలు జీవితంలో భాగమే తప్ప అదే జీవితం కాదు. కవిత్వం జీవితాన్ని ప్రతిబింబించాలి. ప్రపంచ కవిత్వం, దేశీయకవిత్వం లో అదే జరుగుతుంది. తెలుగునాట మాత్రం ఇంకా పాత చింతకాయపచ్చడి విమర్శలతో కవిత్వానికి గొడవలు, లడాయిలు, అలజడి జీవితమూ అంటూ పలవరిస్తోంది.
ఏ డఫోడిల్ కవిత ఎందుకు అనర్హమౌతుంది కవిత్వాంశకు. ఏ పీడనా ప్రతిబింబించని- బి వి వి కవితలో, వసీరా కవితలో, ఇస్మాయిల్ కవితలో ఎందుకు కవిత్వమవ్వవు?
కొంతమంది కవులకు, విమర్శకులకు జీవితమనే గడ్డిమేటులోంచి వస్తువులను ఎంచుకోగలిగే సత్తా ఉండదు.
పొద్దున్నే న్యూస్ పేపరు ఇచ్చే స్ఫూన్ ఫీడింగ్ తో పీడనను తాగి పిల్లిలాగ ఘర్జించేయటం ఈజీ కనుక.
విమర్శలో హేతువులు, కళాత్మకవ్యవహారం, కావ్యహేతువులు, వివేచన, సామాజికత అంటూ పడికట్టు పదాలను బాగానే వంటపట్టించుకొన్నారు శ్రీరాం. సంతోషంగా ఉంది.
జీవితాన్ని కవిత్వం చేయటం ముఖ్యం. అందులో పీడన ఉంటే పీడన కూడా కవిత్వం అవుతుంది. జీవితంలో అప్పుడప్పుడూ కనిపించే పసిపాప నవ్వులు, ఒడ్డున పెరిగే గడ్డిపోచలు, మేఘపు అంచున మెరిసె మెరుపులను చెప్పటం ఎవరో శాసిస్తున్నారని ఉత్తకవిత్వం అవ్వదు. అది కూడా ఉత్తమ కవిత్వమే అవుతుంది. దాన్ని ఉత్తమకవిత్వం చేయాలని కృతకంగా ప్రయత్నించి వాటికి కూడా పీడన రోదనలను రుద్దటం హిపీక్రిసీ అనిపించుకొంటుంది.
(ఇది చర్చ కనుక నా అభిప్రాయాలు చెప్పాను తప్ప ఎవరిపై నాకు రాగద్వేషాలు లేవు)

No comments:

Post a Comment