Wednesday, December 4, 2019

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పేరు చిన్నప్పుడు రేడియోలో లలిత సంగీతం కార్యక్రమంలో వినేవాడిని. "తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా" పాట దాదాపు కంఠస్థంగా ఉండేది.
వారి అనుభూతి గీతాలలోని మార్దవం అనుభవించినవాడిని. ఒక స్కూల్ ఆఫ్ పొయెట్రీకి ఆయన ఆద్యుడు అనలేను కానీ ఆయన మా తరానికి దీపస్థంభం లాంటివారు. శ్రీకాంత శర్మ గారి పట్ల గౌరవం, హీరో వర్షిప్ ఉండేది.
వారిని మొదట సారిగా కలుసుకొన్నది 2016 లో కాకినాడ పుస్తక ప్రదర్శనలో. "నీ పేరు వింటున్నాను. చాలా సంతోషం" అన్నప్పుడు భలే ఆనందం వేసింది.
శిఖామణి గురువుగారు శ్రీకాంత శర్మగారికి 2018 సంవత్సరానికి గాను శిఖామణి పురస్కారాన్ని ఇద్దామనుకొంటున్నాను అని చెప్పినప్పుడు "చక్కని ఎంపిక సర్... నిజానికి వారిని ఎంపిక చేసాకా రెండవ వ్యక్తి ఎవరు అని వెతికితే మరొక పది సంఖ్యల తరువాతే కనిపిస్తారు. అంత ఉన్నతమైన వ్యక్తికి మీరు అవార్డు ఇస్తున్నారు" అన్నాను. ఎందుకంటే అనుభూతి కవిత్వానికి చిరునామా శ్రీకాంత శర్మగారు. కవిగా, రచయితగా, విమర్శకునిగా వారి ముద్ర తెలుగు సాహిత్యంపై చెరగనిది.
ఆ తరువాత వారితో అప్పుడప్పుడూ ఫోనులో సంభాషించేవాడిని. ముఖ్యంగా గాథాసప్తశతి కవిసంథ్యలో సీరిస్ గా వచ్చిన రోజులలో. వారి వయసు, పాండిత్యాలతో పోల్చుకొంటే నేనేమీ కాకపోయినా చాలా వాత్సల్యంతో మాట్లాడేవారు. నా జీవితంలో నేనెంతో అభిమానించే గొప్ప వ్యక్తిని కోల్పోయాను
వారికి నా నివాళులు
బొల్లోజు బాబా

No comments:

Post a Comment