Wednesday, December 4, 2019

మల్లిక్ గారి కొన్ని హైకూల అనువాదాలు

Dr. Kumarendra Mallick జియో ఫిసిక్స్ లో సైంటిస్ట్. కొంతకాలం హైదరాబాద్ లో పనిచేసారు. సున్నితమైన భావాలను వ్యక్తీకరించే వీరి హైకూలు, చదవగానే ఆకట్టుకొని, వెంటాడుతాయి. లోతైన పరిశీలన, విలక్షణ వీక్షణం వీరి కవిత్వ బలం. మల్లిక్ గారి కొన్ని హైకూల అనువాదాలు ఇవి.
1. శిధిలాలయం
రాళ్లమధ్య ఎదుగుతోన్న మొక్కపై
ఓ పక్షి గూడు
2. సుదీర్ఘ వియోగం...
దూరాలన్నీ మా టీకప్పుల్లో
కరిగిపోయాయి
3. స్కూలునుంచి
షూస్ నిండా సాయంసంధ్య శకలాల్ని
నింపుకొని వచ్చాడా పిలగాడు.
4. స్నానాల రేవు నీళ్లపై
నెలవంక స్వప్నాన్ని
మబ్బులు కమ్మేసాయి
5. గొప్ప అందగత్తె
ఆమె నీడనుండి
నా చూపుల్ని మరల్చలేకున్నాను
6. ఆమె శ్వాస
నా సముద్రంలో
చెలరేగిన తుఫాను
7. వసంతకాల ఉదయం
కోయిల
నా వేణువును ఊదుతోంది
8. ప్రాతఃకాల కిలకిలారావాలు
పక్షులు నా మాతృభాషలో
పాడగలవా?
10. ఉదయపు పనులు
పక్షుల కిలకిలారావాలలో
ఆమెదే ప్రధాన స్వరం
11. చిన్నపగులులో చిగురించిన
అడవిపూవు రూపంలో
రాయి నవ్వుతోంది.
12 ఖాళీ గూడు
ఆకులెన్ని ఉన్నా
చెట్టు దిగంబరంగా కనిపిస్తోంది.
13.తెల్లారేసరికి సాలీడు
మామిడి చెట్టునీ
నా కిటికీని కలిపి ముడివేసింది.
14. దీపావళి
ఒక్కొక్క తార నేలదిగి
పిల్లల దీపాలను వెలిగిస్తోంది
15. సుదూర గమ్యం
పక్షులను అనుసరించాలనే
ఒక అనాది కాంక్ష
16. ఒక జింక
చిత్రకారుని కళ్లకు ఒక పండగ
వేటగానికి గొప్ప విందు
17. ఏకాంకనాటకం
తాత క్రిస్మస్ తాతలా
నటించాడు
18. నది ప్రవహిస్తోంది
ప్రతీ ప్రయాణమూ
రేపటి సముద్రంలో అంతమౌతుంది.
19. కొద్దిపాటి చిరుజల్లు వచ్చిపోయింది.
ఆమె బుగ్గసొట్టలు మాత్రమే
నిండాయి.
20. ఒయాసిస్సులో కుంచెను ముంచి
ఎండమావిని చిత్రిస్తున్నాడు
ఎడారి స్వాప్నికుడు.
source: Haikus of Dr. Kumarendra Mallick
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment