Wednesday, December 4, 2019

china poems translations

చైనాలో డబ్బైల వరకూ కవిత్వం ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటూ కమ్యూనిష్టు రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాయబడేది. కవులు వ్రాసే ప్రతీ వాక్యమూ క్షుణ్ణంగా స్కృటినీకి గురయ్యేది. ఆ తరువాత ఎనభైల నుంచీ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కవిత్వం కమ్యూనిష్టు బంధనాలను ఛేదించుకొని, స్వేచ్ఛాయుతమై కొత్త పుంతలు తొక్కింది. ఈ పునర్వికాస దశలో వచ్చిన కవిత్వాన్ని avant-garde కవిత్వమని పిలుస్తున్నారు.
అలా వచ్చిన ఆధునిక చైనా కవిత్వఉద్యమాన్ని నడిపించిన వారిలో Han Dong (1961- ) ఒకరు. అతని రెండు కవితల అనువాదాలు. ఈ రెండు కవితలూ ఆధునిక జీవితం లోని సంక్లిష్టతను, అసంబద్దతను వ్యక్తీకరిస్తాయి. ఒక కవిత మరొకవితకు కొనసాగింపుగా అనిపించినా రెండూ భిన్న కాలాలలో వ్రాసినవి.
1. కొండ ప్రజలు - Mountain People by Han Dong
చిన్నప్పుడు తండ్రిని అడిగాడు అతడు
“ఆ కొండలకు అవతల ఏముంటుందీ? అని
“కొండలు” తండ్రి చెప్పాడు
“వాటి వెనుక”
“ఇంకా పెద్ద పెద్ద కొండలు”
ఏమీ మాట్లాడలేదు
కనుచూపుమేర పరచుకొన్న కొండల్ని చూస్తున్నాడు
కొండల గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోయాడు
“ఈ జీవితంలో ఆ కొండల్ని దాటి వెళ్లగలనా
అవతల సముద్రం ఉందట…. చాలా దూరంగా
అక్కడకు చేరేలోగా సగం దారిలో చచ్చిపోతాను
కొండల మధ్యే చచ్చిపోవచ్చు బహుసా” అనుకొనేవాడు
తన ముసలి పెళ్లాన్ని తీసుకొని బయలుదేరితే
ఆమె దారిమధ్యలో ఒక కొడుకుని ఇస్తుంది
తాను చనిపోయేనాటికి ఆ కొడుకు పెద్దవాడవుతాడు
ఆ కొడుకు కూడా వాని ముసలి పెళ్లాంతో ప్రయాణం కొనసాగిస్తాడు
అలా ఆ కొడుకు కొడుకుకు పుట్టిన కొడుకు కూడా పెద్దవాడవుతాడు
అతను ఆలోచించడం మానేసాడు
ఈ కొడుకు ఊహలతో అలసిపోయాడు
నా పూర్వీకులు ఇలా ఆలోచించలేదు
లేకపోతే
నేను ఈ రోజు సముద్రాన్ని చూస్తూ ఉండేవాడిని కదా
అని బాధ పడ్డాడు.
*****
2. నువ్వు సముద్రాన్ని చూసావు - So you’ve seen the sea by Han Dong
నువ్వు సముద్రాన్ని చూసానంటావు
నువ్వు ఊహించుకొన్న సముద్రాన్ని
మొదటగా నువ్వు సముద్రాన్ని ఊహల్లో నిర్మించుకొన్నావు
తరువాత అదెలా ఉందో చూసావు
అంతే అలాగే ఉంటుంది
నిజానికి నువ్వు సముద్రాన్ని చూసావు
నువ్వో నావికుడవు ఏమీ కాకపోయినా
అప్పటికే దాన్ని ఊహించావు కూడా
అంతే అలాగే ఉంటుంది
నువ్వు సముద్రాన్ని ఊహించావు
నువ్వు ఊహించిన సముద్రాన్ని చూసావు
దాన్ని ఇష్టపడ్డావు కూడా
దాదాపు …అంతే అలాగే ఉంటుంది
నువ్వు సముద్రాన్ని చూసావు
ఇంకా దాన్ని అప్పటికే ఊహించావు
కానీ ఆ సముద్రపు నీళ్ళల్లో మునిగి చనిపోవాలని
నీకు ఏమాత్రమూ ఇష్టం లేదు కదూ!
అంతే అలాగే ఉంటుంది
అందరకీ కూడా అంతే
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment