Wednesday, December 4, 2019

పాబ్లో నెరుడా- బుక్ ఆఫ్ క్వశ్చన్స్ –The Book of Questions by Pablo Neruda


సెప్టెంబరు 1973 లో పాబ్లో నెరుడా చనిపోవటానికి కొద్దినెలల ముందు The Book of Questions పుస్తకాన్ని పూర్తిచేసాడు. విలియం ఓడెలి అనువాదంచేసిన ఈ పుస్తకం నెరుడా మరణానంతరం వచ్చింది.
దీనిలో చిన్ని చిన్ని కవితలు ప్రశ్నలరూపంలో ఉంటాయి. ఒక అనుభవం, దాని తాలూకు ఉద్వేగం వీటి లక్షణాలు. నెరుడా అప్పటికే గొప్పసాహిత్యాన్ని సృష్టించాడు భిన్న కళాత్మక, రాజకీయ ఆలోచనా సారాలలోతుల్ని తరచిచూసి పండిపోయిన కవి.
The Book of Questions లో ఈ లోకంపట్ల ఒక శిశువు ఆశ్చర్యాన్ని, పెద్దవాళ్ల తర్కాన్ని ఎదురెదురుగా నిలబెడ్తాడు. ఇవి మొత్తం 316 ప్రశ్నలు. 74 పేరులేని ఖండికలుగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు తార్కిక సమాధానాలు దొరకవు.
నదులన్నీ తీయగా ఉన్నప్పుడు
సముద్రం ఉప్పుని ఎక్కడనుంచి తెచ్చుకొందీ?
పై ప్రశ్నలో నదులు, తీయదనం, సముద్రము, ఉప్పు లాంటి పదాలకు వాటి నైఘంటికార్ధాలు కాక ఏదో తెలియని కొత్త అర్ధాల్ని పొందుతాయి.ఆలోచింపచేస్తాయి. ప్రజలందరూ ప్రేమాస్పదులుగా ఉంటున్నప్పుడు ప్రజాస్వామ్యం క్రూరంగా ఎందుకుంటున్నదీ అని పై ప్రశ్నకు చేసే అన్వయం ఔచిత్యభంగం కాబోదు.
ఈ పుస్తకంలో నెరుడా ఊహలోకపు అంచుల్ని తాకుతాడు. ఇలాకూడా ఊహించవచ్చా అని విస్మయపరుస్తాడు. హృదయాన్ని, బుద్దిని జోడుగుర్రాలుగా నడిపించి గొప్ప విభ్రమాత్మక వాక్యాలను సృష్టిస్తాడు.
ఈ పుస్తకంలో నెరుడాని ఒక రాజకీయ కవిగానో, ప్రేమకవిగానో, ప్రకృతి కవిగానో, పశ్చాత్తాప కవిగానో చూడలేం. “నాలోనే అనేకులు ఉన్నారు” అని ఓ కవితలో అన్నట్లు జీవితంలోని అనేకతను, చీకటి వెలుగుల్ని కవిత్వంలో నింపిన కవి నెరుడా.
నెరుడా తనలోని వైరుధ్యాల పట్ల ఎరుకను కలిగి ఉన్నాడు. వాటిని యధాతధంగా స్వీకరించాడు. మానవజీవితం క్షణక్షణం మనముందు పరిచే అన్ని అనుభవాలకూ స్పందించాడు. ఇరుకు దారులనుంచి, ప్రమాదకరమైన సరళీకరణలనుంచీ, సిద్ధాంతాలనుంచీ, అహంకారంనిండిన ఆత్మస్తుతినుంచీ తన కవిత్వాన్ని విముక్తం చేసాడు. జీవితాన్ని పెనవేసుకొనే మానవానుభూతులకు కలకాలం నిలిచే కళాత్మక రూపాన్ని ఇచ్చాడు.
(పాబ్లోనెరుడా సృష్టించిన మహావిస్త్రుతమైన ఆ కళాత్మకరూపం ఈరోజు మొత్తం మూడువేల పేజీల చిక్కని కవిత్వ రూపంలో మనముందు ఉంది)
The Book of Questions లోని మొత్తం 316 ప్రశ్నలలో నాకు నచ్చిన వాటి అనువాదాలు ఇవి.
1.
స్వర్గంలో ఎన్ని చర్చిలు ఉంటాయి?
2.
రాత్రి టోపీకి
అన్ని చిల్లులెందుకున్నాయి?
3.
ఏ కలతచెంది అగ్నిపర్వతాలు
జ్వాలల్ని, ఉగ్రతను, ఉదాసీనతను చిమ్ముతాయి?
4.
బయటపడని కన్నీటిచుక్కలు
చిన్నచిన్న తటాకాలలో ఎదురుచూస్తుంటాయా?
లేక అవి అదృశ్య నదులుగా విషాదం వైపు ప్రవహిస్తుంటాయా?
5.
ఈ ఉదయించిన సూర్యబింబం నిన్నటిదేనా?
లేక ఈ తేజస్సు ఆ తేజస్సు కన్నా భిన్నమైనదా?
6.
ఇంతకీ నవంబరు వయసు ఎంత?
7.
రాతియుగం మనుషులు
కనిపించని సిరాతో ఎందుకు వ్రాసుకొన్నారు?
8.
దోమలు, సాహిత్యరక్షకభటులు
నన్నెందుకు కుడతాయి?
9.
నారింజ చెట్టులోని సూర్యకాంతిని
నారింజలు ఎలా పంచుకొంటాయి?
10
దానిమ్మ గింజల రసంతో
ఎర్రని కెంపులు ఏం చెప్పాయీ?
11.
శుక్రవారం తరువాత వద్దాములే అని
గురువారం ఎందుకు ఆలోచించుకోదు?
12
పిట్టనుండి పిట్టకు ఎగురుకుంటూ తిరిగే
పువ్వుని ఏమని పిలుస్తారు?
13
సముద్ర మధ్యభాగం ఎక్కడుంటుంది?
అలలు అక్కడికి ఎందుకు వెళ్లవు?
14
4 అందరికీ 4 గేనా
అన్ని ఏడులు సమానమేనా?
15
కలల్లో మోగే గంట
నీకెక్కడ దొరుకుతుందీ?
16
దుఃఖం దళసరిగాను
మనోవ్యధ తాటగాను ఉంటుందంటారు నిజమేనా?
17
ధనవంతులు తమ స్వప్నాలను
బంగారు పెట్టెలలో భద్రపరచుకొంటారా?
18.
నా ఎముకలు చిలీలో నివసిస్తూంటే
నేనెందుకు అక్కడనుంచి వలసవెళ్ళాలని అనుకొన్నాను?
19
చెగువెరా రాత్రి తరువాత
బొలివియాలో ఎందుకు ఉదయం రాలేదు?
20
చెట్టు ఆకాసంతో మాట్లాడటానికి
భూమి నుంచి ఏ భాష నేర్చుకొందీ?
21
ఇంధ్రధనసు ఎక్కడ అదృశ్యమౌతుంది
నీ హృదయంలోనా, దిగంతాలలోనా?
22
స్వప్నాలలోని వస్తువులు ఎక్కడకు వెళ్లిపోతాయి?
ఇతరుల స్వప్నాలలోకా?
23
ఒకప్పుడు నేనొక బాలుడిని . వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు?
నాలోనా లేక వెళ్ళిపోయాడా?
విడిపోవటం కోసమే అయితే మేమిద్దరం అంతకాలం ఎందుకు కలిసున్నాం?
నా బాల్యం చచ్చిపోయాకా మేమిద్దరం ఎందుకు చనిపోలేదు?
24
డిసెంబరు, జనవరిల మధ్య వచ్చే నెల పేరేమిటి?
25
పిచ్చుకలు చంద్రునిపైకి వలసపోతాయన్న వార్తలు నిజమేనా?
అవి వసంతాన్ని వాటితో పాటూ తీసుకుపోతాయా?
26
నేను నిద్రపోతున్నప్పుడు
నాకు బదులు ఎవరు బయటకు వెళ్ళి జీవిస్తారూ?
27
మనం దయను నేర్చుకొంటామా
లేక దయ ముసుగునా?
28
గతించిన కాలాన్ని
ఏ కిటికీలోంచి అలా చూస్తూ ఉండగలనూ?
29
ప్రేమ గురించిన ఆలోచనలు
చల్లారిన అగ్నిపర్వతాలలోకి కూలిపోతాయా?
30
రుతువులకు తమ దుస్తులు మార్చుకోవాలని
ఎలా తెలుస్తుంది?
నవంబరు వయసెంత లాంటి చమత్కార వాక్యాల నుండి స్వర్గంలో ఎన్ని చర్చిలు ఉంటాయి? లాంటి గంభీరమైన అంశాలదాకా ఈ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ ప్రశ్నలకు వివిధ విమర్శకులు అనేక వ్యాఖ్యానాలు చేసారు. ఉదాహరణకు ఒక శ్రామికుడు నాలుగు గంటల పనిచేస్తే దక్కే ప్రతిఫలం ఒక ధనవంతుడు నాలుగు గంటలు పని చేస్తే వచ్చే ప్రతిఫలంతో సమానం కాదు అనే విషయం 14వ ప్రశ్నచెపుతుందని అంటారు.
ఒక యూదుగాధలో- జీవితానికి అర్ధం ఏమిటని కొడుకు తండ్రిని అడిగినపుడు, “ఏదో ఓ జవాబు తెలుసుకొని, అంత గొప్ప ప్రశ్నను ఎందుకు నాశనం చేస్తావు? అని తండ్రి అన్నాడట. అలా పై ప్రశ్నలకు జవాబులు ఆశించటం, వెతుక్కోవటం నిష్ఫలం. ప్రశ్నను ఆస్వాదించటం, అనుభూతి చెందటం ముఖ్యం ఇక్కడ. బహుసా నెరుడా ఉద్దేశం కూడా అదే కావొచ్చు.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment