Wednesday, December 4, 2019

డా. రాధేయ కవితాపురస్కారం (2019) పొందిన కవితల విశ్లేషణ

డా. రాధేయ కవితాపురస్కారం (2019) పొందిన కవితల విశ్లేషణ
.
“కవిత్వం నాకు కన్నుమూతపడని జ్వరం” డా. రాధేయ
గతమూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా, ఉత్తమ కవిత్వమే ప్రమాణంగా తీసుకొని డా. రాధేయగారు నిర్వహిస్తున్న ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు తెలుగు కవులకు ఒక ఎవరెస్టు శిఖరం లాంటిది. తెలుగు సాహిత్యానికి డా.రాధేయ గారు చేస్తున్న కృషిని ప్రేరణగా తీసుకొని వారి శిష్యులు- శ్రీ దోర్నాదుల సిద్ధార్థ, శ్రీ సుంకర గోపాల్‌, డా. పెళ్లూరు సునీల్‌ ''డా||రాధేయ కవితా పురస్కారం'' పేరిట జాతీయ స్థాయి అవార్డు నెలకొల్పారు. డా. రాధేయ కవితాపురస్కారం పదేళ్లు గా ఇస్తున్నారు. ఈ పురస్కార దశాబ్ది అవార్డు సభ కాకినాడలో జరుపుకోవటం మనందరం చాలా సంతోషించదగిన సందర్భం. ఈ పదేళ్లలో ఈ పురస్కారాన్ని పొందిన వారిలో శ్రీ ర్యాలి ప్రసాద్, శ్రీ మౌనశ్రీ మల్లిక్, శ్రీ కొత్తపల్లి సురేష్, శ్రీ బండారి రాజ్ కుమార్, శ్రీ జ్యోత్స్న ఫణిజ, శ్రీ పుప్పాల శ్రీరామ్ లాంటి లబ్దప్రతిష్టులెందరో ఉన్నారు.
తమకు కవిత్వపాఠాలు చెప్పిన గురువుగారి పేరిట ఒక అవార్డు నెలకొల్పి దానిని నిర్విరామంగా కొనసాగించటం మామూలు విషయం కాదు. విశ్వనాథ వారు తన గురువుగారైన చెల్లపిళ్ల వారిని ఉద్దేశిస్తూ- తనబోటి గొప్ప శిష్యుడిని కలిగి ఉండే భోగము అల నన్నయకు లేదు తిక్కనకు లేదు” అంటారు. అదేవిధంగా తమ సాహితీ గురువు గారి యశస్సును దశదిశలా వ్యాపింపచేస్తూన్న గొప్ప శిష్యులు సమకాలీన కవులలో మరే ఇతర కవులకూ లభించలేదంటే అతిశయోక్తి కాదు. ఇది బహుసా శిష్యులపై చూపించిన ప్రేమాభిమానాలకు బదులుగా రాధేయ గారు పొందుతున్న గురుదక్షిణగా భావిస్తాను. నిజానికి తెలుగు సాహిత్యచరిత్రలో ఇదొక అరుదైన ఉదంతంగా మిగిలిపోతుంది.
ఈ దశాబ్ది అవార్డుకు నన్ను ఒక న్యాయనిర్ణేతగా ఉండమని శ్రీ గోపాల్ కోరారు. కవులపేర్లు కానీ, ఫోన్ నంబర్లు కానీ లేకుండా ఓ యాభై కవితలను నా చేతిలో పెట్టి ఇందులో మీకు నచ్చిన ఓ అయుదు కవితలను ఎంపిక చేయండి అన్నారు. ఏ ప్రాతిపదికపై ఎంపిక చేయమంటారు అని అడిగాను. మంచి కవిత్వమే ప్రాతిపదిక అన్నారు.
అంత స్వేచ్ఛ ఇచ్చాక నా పని సులువయింది. ఆ యాభై కవితలలోంచి – వస్తువు, అభివ్యక్తి, సమకాలీనత అనే మూడు అంశాల ప్రాతిపదికగా ఓ 5 కవితలను ఎంపిక చేసి నా లిస్టు ఇచ్చేసాను. నాకు ఆ తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ అవార్డుకు శ్రీ వంశీ కృష్ణ గారు, శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణలు కూడా జడ్జిలుగా ఉన్నారని. ముగ్గురు జడ్జిలు ఎంపిక చేసిన అయిదు కవితలలో నాలుగు కవితలు కామన్ గా ఉండటం నాకు సంతోషం కలిగించింది. వాటిలో మొదటి స్థానాలలో ఉన్న మూడు కవితలకు ఈ అవార్డు ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఈ అవార్డు ఇవ్వటంలో ఉత్తమ కవిత్వానికి మాత్రమే ప్రాధాన్యత లభించిందని మీకు చెప్పటం కొరకే.
శ్రీ అనిల్ డాని మంచి కవి, చక్కని రచయిత. ఒక దశాబ్దకాలంగా కవిత్వం వ్రాస్తున్నా “ఎనిమిదో రంగు” కవిత్వ సంపుటితో తెలుగు సాహిత్యలోకంలోకి సాధికారికంగా ప్రవేశించాడు. అనిల్ వ్రాసిన “ఆకుపచ్చని కన్నీరు” లో వస్తువు రైతు. రైతుల జీవనంపై ఇప్పటివరకూ వందలాది కవితలు, దీర్ఘకవితలు, కథలు, నవలలు వచ్చాయి. అలాంటి నేపథ్యంతో కవిత వ్రాయటం అంటే సాహసమైన విషయం. చర్విత చరణమైన వస్తువుపై వ్రాసిన రచనను చదివినపుడు ఆ కవి ఏ నూతన విషయాన్ని చెపుతున్నాడు? ఎంత కొత్తగా చెపుతున్నాడు అని చూడటం సహజం. ఒకప్పుడు రైతుకు పంటను కాపాడుకోవటం మాత్రమే పని కానీ ఇప్పుడు అదే రైతుకు తన భూమిని కాపాడుకోవటం కూడా పోరాటంగా మారిన విషయాన్ని అనిల్ వ్రాసిన “ఆకుపచ్చని కన్నీరు” కవిత అత్యద్భుతంగా వ్యక్తీకరిస్తుంది. అందుకనే ఇది ప్రధమ స్థానంలో నిలిచింది. పరిశ్రమలకోసమని, అభివృద్దికోసమని, కొత్తనిర్మాణాల కోసమని పచ్చని పంటలు పండే భూములను బలవంతంగా లాక్కోవటం ఇప్పుడు కొత్త “అభివృద్ది నమూనా”. తరతరాలుగా సాగుచేసుకొంటున్న భూమిని బలవంతంగా రాజ్యం రకరకాల జీవో ల పేరుతో లాక్కొంటుంటే నిస్సహాయంగా మిగిలిపోతున్నాడు నేటి రైతు. సమాజ దుఃఖమే కవి దుఃఖం. ఆ రైతు దుఃఖాన్ని అనిల్ తన దుఃఖంగా చేసుకొని ఈ కవిత వ్రాసాడు.
1. ఆకుపచ్చని కన్నీరు - ప్రధాన కవిత శ్రీ అనిల్ డాని
ఆకుపచ్చని కన్నీరు కవిత నాకు మూడు భాగాలుగా అనిపిస్తుంది. మొదటి భాగంలో రైతుకు తాను పండిస్తున్న చేనుపై ఉన్న అనుభందాన్ని చెపుతాడు.
//మంచెమీద నిలబడి ఎన్ని ఒడిసెలు
తిప్పి ఉంటావు
నిన్ను నువ్వే విత్తనంలా పాతుకొని
పంటగా రూపాంతరం చెందినప్పుడు
నువ్వొక పాదుకట్టిన మొక్కవి
ఎదిగిన పంటకి ఎరువువి
కనీస ధర పలకని వేలం పాటవు
దోసిటనిండా చేదుకుని ఎన్నిసార్లు దుఃఖాన్ని తాగి ఉంటావు!//
ఫై వాక్యాలలో రైతుకు నేలతో ఉన్న అనుభందాన్ని మొదట్లో మంచెమీద ఒడిసెలు విసరటం, విత్తనంలా పాతుకోవటం లాంటి వర్ణణలతో హృద్యంగా చెప్పినప్పటికీ చివరలో ధరపలకని వేలంపాట, దుఃఖాన్ని తాగటం లాంటి విషయాలతో వాస్తవాన్ని చిత్రిస్తాడుఅనిల్. వస్తువును రొమాంటిసైజ్ చేయడు. నేలపై నిలుచునే కవిత్వం చెపుతాడు.
రెండవభాగంలో తరతరాలుగా సాగుచేసుకొంటున్న భూమి ఎలా హఠాత్తుగా రాత్రికి రాత్రి పరాయిదయిందో వర్ణిస్తాడు.
//ఎప్పుడో బీడు భూమిలో తాత నాగలి కర్రు మోపిన చోటంతా
కొత్త జీవోల కలుపు మొక్కలు
అప్పటి దాకా నాన్న పండించిన ఎర్రమిరప పంట
లిప్ స్టిక్ రంగులోకి మారి కార్పొరేట్ బ్రాండ్ లేబిల్ ఐపోతుంది
ఒకప్పుడు మంచాల కింద దొర్లాడిన కూరగాయలు
మాల్స్ ల కవర్లలో ఊపిరాడక చల్లగా గడ్డకట్టి పోతాయి.
వాన ప్రియురాలా
ఇప్పుడిక నల్ల మాగాణులని
తడపాల్సిన అవసరం లేదు//
రైతుల నుంచి బలవంతంగా భూముల్ని సేకరించి బడాబాబులకు కట్టబెడుతోంది రాజ్యం. ఆ ప్రాంతాలలో మాల్స్, పెద్దపెద్ద భవనాలు లెగుస్తున్నాయి. అలాంటి చోట్లలో కొన్ని వర్గాల వారికే ప్రవేశం ఉంటుంది. సామాన్యులు కాలు కూడా మోపలేరు. ఆ విషయాల్ని లిప్ స్టిక్ రంగు, కార్పొరేట్ బ్రాండ్ లేబుల్, ఎసి మాల్స్ లో కూరగాయలు అనే వాక్యాలలో గొప్ప అధిక్షేపంతో వ్యక్తీకరిస్తాడు అనిల్. రైతుకు వాన ప్రియురాలు లాంటిది. ఎప్పుడు కరుణిస్తుందో తెలియదు. అలాంటి ప్రియురాలిని సంభోదిస్తూ నీ అవసరం లేదు అని వ్యంగ్యాత్మకంగా అంటాడు.
ఇక మూడవ భాగంలో- ఇంత జరిగాకా ఆ రైతుని ఈ సమాజం ఏ విధంగా చూస్తుందో అత్యంత కరుణాత్మకంగా వర్ణిస్తాడు అనిల్. ఈ భాగం కవి ఈ సమాజాన్ని ఎలా అర్ధం చేసుకొన్నాడో తెలియచేస్తుంది.
//సిరిచాపలా పంటభూమంతా అదృశ్యచేతులతో చుట్టబడ్డాక
సాగుచేసేవాడి మరణం అసందర్భ సంగతి
అంతస్తుల వనాల వేర్లకి రైతుల అస్థిపంజరాలు అడ్డమొస్తాయి
నీ అసమాన త్యాగం
కొత్తరాజధాని పునాదులకి మూల స్థంభమని
నాలుగో ఎస్టేట్ గొప్ప పతాక శీర్షిక రాస్తుంది/
/పౌంటేన్ నుంచి అందంగా ఎగసిపడుతున్న నీరంతా
నీ ఆకుపచ్చని కన్నీరు//
పై వాక్యాలలో రైతుకి జరుగుతున్న అన్యాయం పట్ల కవికి సంపూర్ణమైన సహానుభూతి ఉందని తెలుస్తుంది. ఈ మొత్తం కుట్ర మూలాల పట్ల కవి అవగాహన సహేతుకమేనని అనిపిస్తుంది. ఫౌంటేన్ నుంచి ఎగసిపడే నీటిని రైతు ఆకుపచ్చని కన్నీరు అనటం గొప్ప ఊహ. మనం జబ్బలు చరచుకొంటున్న అభివృద్ధి వెనుక దాగిఉన్న కుట్రలను అద్భుతంగా ఒడిసిపట్టుకొంది.
మొత్తంమీద ఆకుపచ్చని కన్నీరు కవిత రైతులపై సమకాలీనంగా జరుగుతున్న ఒక సామాజిక విధ్వంసానికి అద్దం పడుతుంది. మనం గొప్పది అని భావిస్తున్న ఒక అభివృద్ది నమూనాను చాలా లోతుగా ప్రశ్నిస్తుంది. అస్థిపంజరాలపై నిర్మించిన అభివృద్ది మూలాలలో ఉన్న విషాదాన్ని ఎత్తిచూపుతుంది. ప్రతిఒక్కరినీ ఆలోచింపచేస్తుంది. అనిల్ డానీకి అభినందనలు.
2. సానిటరీ నాప్కిన్ - ఉత్తమ కవిత అఖిలాష్
ప్రపంచవ్యాప్తంగా మెన్సెస్ సమయంలో స్త్రీలు ఆంక్షలకు గురి అవ్వటం అనాదిగా జరుగుతున్న ఒక దురాచారం. చిత్తూరు జిల్లాలో కుప్పం గ్రామంలోని బాలికలు, స్త్రీలందరూ నెలసరి మూడురోజులూ గాలిచొరబడని, కరెంటులేని ఒక ఇరుకు ముట్టుగుడిసెలో ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రముఖ రచయిత్రి శ్రీమతి కె.ఎన్ మల్లీశ్వరి గారు వ్రాసిన ఒక వ్యాసం ఇటీవల సంచలనం సృష్టించింది. స్త్రీల మెన్ స్ట్రువల్ బ్లీడింగ్ గురించి మాట్లాడు కోవటం ఈనాటికీ ఒక నిషిద్ద విషయమే. బహిష్టు అనేది ఒక సహజ శారీరిక లక్షణమని, అది మాట్లాడకూడని అంశమేమీ కాదని నేడు దేశవ్యాప్తంగా “హాపీ టు బ్లీడ్” పేరుతో మంచి చర్చ జరుగుతున్నది. దాని ఫలితంగా స్కూళ్లలో, కాలేజీలలో సానిటరీ నాప్కిన్ లు ఉచితంగా పంపిణీ చేయటం, విద్యార్ధినులలో అవగాహన కల్పించటము జరుగుతున్నది. దీనివల్ల నేటి యువతీయువకులు బహిష్టు పట్ల పాత భావజాలాన్ని మెల్లమెల్లగా ఒదిలించుకొని దాన్నొక దేహధర్మంగా గుర్తించే స్థాయికి వస్తున్నారు.
అఖిలాష్ వ్రాసిన “సానిటరీ నాప్కిన్” లోని వస్తువు అతి నవ్యాతినవ్యమైనది. అభివ్యక్తి చాలా స్పష్టంగా, పదునుగా ఉంది. ఈ కవిత నాలుగేసి లైన్ల చొప్పున మొత్తం పదకొండు ఖంఢికలుగా ఉంది. ఒక ఖండికకు మరొక ఖండికకు సంబంధం లేదు. దేనికది విడివిడిగా స్వతంత్ర భావాలు. కానీ అన్నీ – నెలసరి అనేది ఒక దేహ ధర్మమని, దానిపట్ల నిషిద్దం తప్పు అని, మానవజాతి కొనసాగటానికి అదొక ముఖ్యమైన ప్రక్రియ అని కవితాత్మకంగా వ్యక్తీకరిస్తాయి.
సానిటరీ పాడ్ వ్రాసిన అఖిలాష్ పురుషుడైనప్పటికీ ఈ కవిత స్త్రీ స్వరంలో ఉంటుంది. అతని సహానుభూతి మెచ్చుకోదగినది.
1.
Yes, iam bleeding
So, what?
People says bleeding is desecrated
No not at all, it was consecrated
మొదటి ఖంఢిక ఇంగ్లీషులో ఉంటుంది. అవును నాకు నెలసరి స్రావమౌతుంది, అయితే ఏంటటా? అంటూ గొప్ప ధిక్కారంతో మొదలౌతుంది. నిజానికి ఈ మాటలు ఆ సమయంతో సిగ్గుతో ఆత్మన్యూనతతో బయటకు చెప్పుకోలేక మధనపడే ప్రతీ బాలిక, ప్రతీ స్త్రీ తమ హృదయాలలో శిలాక్షరాలతో లిఖించుకోవాల్సిన వాక్యాలు. బహుసా ఈ విషయంలో మొదటగా ధైర్యం తెచ్చుకోవాల్సిందే స్త్రీ మాత్రమే అనే విషయాన్ని స్పష్టపరుస్తున్నాడు అఖిల్.
//చేతిరుమాలు గురించి మాట్లాడేవారు
రక్తరూమలు గురించి మాట్లాడటా నికి సిగ్గిందుకు?//
చాలా సూటి ప్రశ్న. ముక్కులోంచి కారే మలినాలను శుభ్ర పరచే చేతిరుమాలు గురించి మాట్లాడుకొన్నప్పుడు సానిటరీపాడ్ గురించి మాట్లాడటానికి ఎందుకు సిగ్గుపడాలి అంటాడు. ఇక్కడ రక్త రుమాలు అన్న ప్రయోగం ద్వారా వ్యక్తీకరణలో గొప్ప సంస్కారం కనిపిస్తుంది.
//పారే నది అపవిత్రం ఎలా అవుతుంది?/
రక్తిం మలినం కాదు; మరణమో,జననమో!
ఇన్ని వేల సంవత్సరాల మానవజాతి ప్రయాణాన్ని నదీ ప్రవాహం అనుకొంటే పారేనది అపవిత్రం ఎలా అవుతుందన్న ప్రశ్న లోతు అర్ధమౌతుంది.
సైన్సు ప్రకారం – నెల నెలా విడుదల అయ్యే అండం ఫలదీకరణ చెందితే పిండంగా రూపొందుతుంది. ఫలదీకరణ జరగకపోతే గర్భాశయపు గోడల లోపలి పొర, కొంత రక్తము, మ్యూకస్ తో కలిసి ఆ అండం బహిష్టు స్రావంగా బయటకు వస్తుంది. అందుకనే మెన్సెస్ ను మెడికల్ పరిభాషలో “Weeping of the disappointed womb” అంటారు. రక్తం మలినం కాదు మరణమో జననమో అనటంలో అర్ధం ఇదే.
6.
నా రక్తం పాపమైతే
నీ వీర్యం రాక్షసత్వమే కదా
నీ దీపం వెలుతుతోందంటే
అందులో మరిగేది నా రక్తమే.
7.
మనిషంటే ఎవరనుకున్నారు?
నాలోని ఒక రక్తపు బొట్టేకదా
ఇప్పుడు పుడమిపై ఉన్నది మనుషులు కాదు
నా లోలోన ప్రవహించిన రక్తపు చుక్కలు
రక్తమూ, వీర్యమూ ప్రత్యుత్పత్తి ప్రక్రియకు సంబంధించిన స్రావాలు అనుకొన్నప్పుడు ఒకటి పాపము మరొకటి పాపరహితము ఎందుకయ్యాయి అని ప్రశ్నిస్తున్నాడు కవి. అంతే కాక నీ బ్రతుకు, నీ వెలుగు నా వల్లనే అని స్పష్టపరుస్తాడు. ఈ భూమిపై నడుస్తున్న మానవులందరూ నా రక్తపు చుక్కలే అనటం కవితా వస్తువును మొత్తం పరాకాష్టకు తీసుకువెళ్ళి వదలటమే. ఈ ఖండిక చివరలో ఉంటే బాగుండేది. పాఠకుని ఉద్వేగ స్థాయిని ఊహకందని ఎత్తులో ఉంచి కవితను ముగించినట్లయితే ఆ ఉద్వేగ స్థితిలో పాఠకుడు చాలాసేపు ఆలోచిస్తూ ఉండి మంచి అనుభూతి పొందుతాడు.
సానిటరీ పాడ్ కవిత చక్కని అభివ్యక్తితో ఆధునిక సమకాలీన చర్చనీయాంశాన్ని గొప్పప్రతీకలతో వ్యక్తీకరించిన మంచి కవిత. అఖిలాష్ కు అభినందనలు.
3. నీలి కలలు - ఉత్తమ కవిత శ్రీమతి పద్మావతి రాంభక్త
శ్రీమతి పద్మావతి రాంభక్త గారి కవిత్వం స్త్రీవాద దృక్ఫధంతో, సూటైన అభివ్యక్తితో, తేటగా, శక్తివంతంగా ఉంటుంది. వీరు ఇటీవల కవిసంధ్య కవితా పురస్కారాన్ని కూడా పొందారు. నీలి కలలు కవితావస్తువు మారిటల్ రేప్. భార్య అంగీకారం లేకుండా భర్త సెక్స్ జరపటాన్ని మారిటల్ రేప్ అంటారు. స్త్రీవాద ఉద్యమాల ఫలితంగా మారిటల్ రేప్ ను గృహ హింసగా గుర్తించటం జరుగుతున్నది. అభివృద్ది చెందిన దేశాలలోని చట్టాలు, భార్య అంగీకారం లేకుండా భర్తచేసే సెక్స్ ను మారిటల్ రేప్ గా పరిగణిస్తాయి. ఈ వస్తువుపై మాట్లాడుకొనేటపుడు శ్రీమతి మందరపు హైమవతి గారు పాతికేళ్లక్రితం వ్రాసిన “సర్ప పరిష్వంగం” కవిత గుర్తుకు రాక మానదు. ఆ కవిత ఇలామొదలౌతుంది
//అంతా బాగానే ఉంటుంది
అప్పటి వరకు
కామంతో నైతేనేమి
మోహంతో నైతేనేమి
ఇరువురి తనువులొకటైనాక
అద్వైత సిద్ధి పొందినాక
ఈ లోకాన్నే మరచిపోయిన
అమృత ఘడియలలో
అక్షర తూణీరం నుంచి
ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు
”జీతమెప్పుడిస్తారు?”
వేశ్య కూడా ఆ సమయంలో
ఆ ప్రసక్తి తేదు
పశువైనా ప్రవర్తించదు// - సర్ప పరిష్వంగం- మందరపు హైమవతి
తన పని ముగిసాకా భర్త “జీతమెప్పుడు ఇస్తారు” అని అడగటం ద్వారా, అంతవరకూ తనను ఒక భోగవస్తువుగా, జీతం తెచ్చే మరమనిషిలా చూస్తున్నాడన్న సున్నితమైన విషయాన్ని అద్భుతంగా వ్యక్తీకరిస్తారు హైమవతి.
పద్మావతి గారు నీలి కలలు కవితలో పచ్చిబాలింత పట్ల నిర్దయగా భర్త సాగించిన సంసారాన్ని అక్షరీకరిస్తారు. ఒకపక్క భర్త రాక్షస రతి, గుక్కపట్టి ఏడ్చే పసిపాప; మరొక పక్క ఏమీ చేయలేని నిస్సహాయత కవితలో కరుణరసార్ధ్రభరితంగా ఆవిష్కృతమయ్యాయి.
//పాపాయి పక్కన గుక్కపెడుతున్నా
పాలుగారే పర్వత శిఖరాలను చిదిమేస్తూ
నీకనుగుణంగా చదును చేసుకొని
విషపు పెదవుల స్పర్శతో
నీ సముద్ర కెరటాల హోరును జోకొట్టుకొంటావు.//
పసిపాపకొరకు పర్వత శిఖరాలు కార్చే పాలు విషపు పెదవుల పాలవటం అన్న భావం చాలా హృదయవిదారకరమైనది. కామసముద్ర హోరును జోకొట్టుకోవటం అనే ప్రయోగంలోను తీవ్రమైన అధిక్షేపణ కనిపిస్తుంది.
//రక్తమోడుతున్న నేలను గునపాలతో పెళ్లగించి
నీక్కావలసిన నిధినిక్షేపాలను వెతుక్కునే పనిలో తలమునకలౌతూ
నా వైపొకసారి పొరపాటుగానైనా తలతిప్పి చూడవు//
పై వాక్యాలలో రక్తమోడుతున్న నేల అనే వర్ణణ ఆ బాలింత దయనీయమైన స్థితికి అద్దం పడుతుంది. తనలోపల దాగున్న పచ్చిగాయపు సలపరింతను స్ఫురింపచేస్తుంది.
//నీకు నా దేహమొక క్రీడా స్థలం
ఎప్పుడు పడితే అప్పుడు
నా ప్రమేయమేమీ లేకుండానే ఆడుకొని
నువ్వుమాత్రమే గెలిచి
విజయగర్వంతో
తృప్తిగా ఠీవిగా నడిచిపోతావు
నేను నా విరిగిపడిని ముక్కలను ఏరుకుంటూ
నా సలపరించే పచ్చిబాలింత అవయవాలను పోగుచేసుకుంటూ
రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను//
శృంగారాన్ని ఇద్దరూ గెలిచే యుద్ధం అని అంటారు. కానీ మారిటల్ రేప్ లో ఒకరే విజయం పొందటంలోని పైశాచికత్వాన్ని పై వాక్యాలలో వర్ణించారు పద్మావతిగారు. అలా జరిగే గృహ హింసవల్ల ఆ భార్య హృదయానికి అయిన గాయాన్ని- అవయవాలను పోగుచేసుకోవటం, రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకోవటం అనే మాటలద్వారా అద్భుతంగా వ్యక్తీకరించారు కవయిత్రి.
ప్రాచీనకాలంలో స్త్రీ, పుత్రుని ఉత్పత్తి చేసే సాధనంగా, భోగ వస్తువుగా చూడబడింది. కానీ ఆధునిక కాలంలో కుటుంబంలో స్త్రీ పాత్రపట్ల అర్ధవంతమైన చర్చజరిగి ఆమెకు సముచితస్థానమివ్వటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోంచి చూస్తే – దాంపత్యంలో పురుషుడు ప్రదర్శించాల్సిన నైతికతను, “మారిటల్ రేప్” లో జరుగుతున్న గృహహింసను శ్రీమతి పద్మావతిగారు ఈ నీలి కలలు అనే కవిత ద్వారా చర్చకు తెచ్చారు. ఆ కోణంలోంచి చూస్తే ఈ కవిత చాలామందిని ఆలోచింపచేస్తుంది.
మొత్తం మీద మూడు కవితలూ వస్తుపరంగా విశిష్టమైనవని, అభివ్యక్తి పరంగా నవ్యమైనవని, సమకాలీన ప్రాసంగిత కలిగినవని భావిస్తున్నాను. అవార్డులు పొందిన అందరకూ నా అభినందనలు. ఇలా ఆ కవితలపై మాట్లాడే అవకాసం ఇచ్చిన శ్రీ సుంకర గోపాల్ గారికి, డా. రాధేయ గారికి నా ధన్యవాదాలు.
బొల్లోజు బాబా
14/7/2019

No comments:

Post a Comment