Wednesday, December 4, 2019

A Man by Nicanor Parra

నికనార్ పర్రా తన కవిత్వాన్ని "యాంటి పొయట్రీ" అన్నాడు. సంప్రదాయ కవిత్వవ్యూహాల్ని బద్దలు కొట్టిన కవిత్వంగా అది పేరుతెచ్చుకొంది.
ప్రేమ గురించి చెప్పవలసి వచ్చినపుడు, ఉద్యానవనాలు, జంట పక్షులు, మన్మధబాణాలు, దూతికలు, కెంపు చెక్కిలులు, కలువలు చందమామ, తుమ్మెద పద్మాలు వంటి వర్ణణలు ఉండాలి అని లాక్షణికులు నిర్ధేశించారు. ఇది ఒకరకంగా ఒక ప్రామాణిక చట్రంగా ఉండింది. ఆధునిక కాలంలో విప్లవంలాంటి అత్యాధునిక వస్తువును వర్ణించేటపుడు కూడా- నెత్తురు, అరణ్యం, సూర్యుడు, తూరుపు, పురిటినొప్పులు, కొత్తసృష్టి, మరో ప్రపంచం లాంటి తత్సంబంధ ఆంబియన్స్ వచ్చేలా వ్రాయటం నేటికీ మనం చూడవచ్చు.
ఈ నియమాలను బ్రేక్ చేసేదే "యాంటి పొయెట్రీ"
ఈ క్రింది కవిత తల్లికి జ్వరం తో మొదలవుతుంది. నిజానికి సాంప్రదాయ సాహిత్యంలో తల్లి జబ్బు పడితే హీరో వెళ్ళి రక్తాన్ని కొనుక్కొని రావటం, ఆ బాటిల్ పగిలిపోయి సింబాలిక్ గా రక్తం నేలపై పడినట్లు చూపటం, ఆ తల్లి చనిపోవటం... లాంటి వరుస సీక్వెన్స్ లు ఉంటాయి.
కానీ ఈ కవితలో అలాజరగదు. అలా బయటకు వచ్చిన హీరోకు తన భార్యవేరెవరితోనో కనపడుతుంది. సరే రెండో ఎపిసోడ్ లోకి వెళదామా అనుకొంటే అందులో కూడా సాంప్రదాయతను పాటించడు కవి.....
ఈ కవితలో కనిపించే అనూహ్యత ఆధునిక జీవితంలోని సంక్లిష్టతగా అర్ధం చేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన "అసమర్ధుని జీవితయాత్ర" సీతారామారావ్ లో కూడా కొంచెం కనిపిస్తుంది.
ఇలా కవితలో ఒక్కొక్కటిగా విచ్చుకొనే ప్రతీ సంఘటననూ అనూహ్యంగా మళ్ళించి 'సాంప్రదాయ చట్రాన్ని" ముక్కలు చెక్కలు చేస్తాడు కవి అంతిమంగా.
దీన్నే యాంటి పొయెట్రీ గా చెప్పుకొన్నాడు నికనార్ పర్రా
ఇంతటి స్థాయిలో యాంటి పొయెట్రీ రాసిన తెలుగు కవులు ఉన్నారని నేను అనుకోను.
బొల్లోజు బాబా
A Man by Nicanor Parra
అమ్మకు విపరీతమైన జ్వరం
డాక్టరుని పిలవటానికని బయటకు వచ్చాడతడు
ఏడుస్తున్నాడు
వీధిలో అతని భార్య వేరొక పురుషునితో
చెట్టాపట్టాలేసుకొని కనిపించింది
చెట్లవెనకాల నక్కుతూ వారిని మెల్లగా వెంబడించాడు
ఏడుస్తున్నాడు
ఇంతలో అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు
చాలా ఏళ్లయింది ఇద్దరూ కలుసుకొని
వారిద్దరూ బార్ కు వెళ్ళి
పాత సంగతులు గుర్తుచేసుకొన్నారు.
స్నేహితుడు పాస్ పోసుకోవటానికి
బాత్ రూమ్ కు వెళ్ళిన సమయంలో
అంట్లుతోమే అమ్మాయి ఇతనికి పరిచయమైంది
ఆమె నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కొన్నాడు
ఇద్దరూ డాన్స్ చేసారు.
రోడ్డుమీదకు వచ్చారు
నవ్వుకొంటూ నడుస్తున్నారు
ఒక ఆక్సిడెంట్
ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది
ఫోన్ చేయటానికి అతను పరిగెట్టాడు
ఏడుస్తున్నాడు
లైట్లు వెలుగుతున్న ఓ ఇంటిలోకి చొరబడి
ఫోన్ చేసుకొంటానన్నాడు
అతనిని ఎవరో గుర్తుపట్టి పలకరించారు
కాదు
ఫోనెక్కడుంది? అన్నాడతను.
నీరసంగా ఉన్నావు, ఏదైనా తినివెళ్ళు' అన్నారు వాళ్ళు
తినటానికి కూర్చున్నాడతను
పిచ్చిపట్టినవాడిలా మద్యం సేవించాడు
నవ్వుతున్నాడు
వాళ్ళు అతనితో పాటలు పాడించారు
పాడీ పాడీ చివరకు అతను
బల్లక్రింద మత్తు నిద్రలోకి జారుకొన్నాడు.
మూలం: A Man by Nicanor Parra
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment