Wednesday, December 4, 2019

"ప్రసేన్ సర్వస్వం"

ఇటీవల మిత్రుల సంభాషణలో - "ప్రసేన్ సర్వస్వం" ప్రసక్తికి వచ్చింది. ప్రసేన్ సాహిత్యం ఈరోజు యువతరాన్ని ఆకర్షిస్తోంది. ప్రసేన్ వందేళ్ల తరువాత పుట్టాల్సినవాడు అని మో అంటాడు. ఎమిలీ డికిన్ సన్, మిల్టన్ లా కాక రచయిత బ్రతికుండగానే రిడిస్కవర్ కావటం సంతోషించదగ్గ విషయం.
ఖమ్మం త్రీ మస్కటీర్స్ లో మధ్యముడు ప్రసేన్.
కవిత్వం కన్నా వచనంలోనే ప్రసేన్ విరాట్ రూపం కనిపించింది నాకు .
చిన్న ఉదాహరణ
రమణజీవి ఓ మంత్రజాల కవి. అతని "నలుగురు పాండవులు" పుస్తకానికి ప్రసేన్ చేసిన సమీక్ష ఇలా మొదలౌతుంది.
***
తెలిసిన తనం చాలా ప్రమాదకరం. తెలిసిన తనం కన్నా అంతా తెలిసిందేనన్న తనం మరీ దుర్మార్గం. ఏదీ తెలియదు అనే శూన్యంలోంచి వస్తువులను, సందర్భాలను చూడగలిగినపుడు వాస్తవ దృశ్యాలు కనపడతాయి. భాషకు వ్యాకరణం లేకపోవడం అభావం కాదు. భావానికి వ్యాకరణం లేకపోవడం అవ్యక్తీకరణం అసలే కాదు. జ్ఞానం భాషకు కర్త కర్మ క్రియలను లేకుండా చేస్తుంది. జ్ఞానాన్ని తిరస్కరించే గుణం భావానికి వ్యాకరణం వద్దని చెపుతుంది. ఈ గుణమే మనం చాలా కాలంగా నమ్ముతూ వచ్చిన కార్యకారణాలను ధ్వంసం చేయమని చెపుతుంది. ఆ విధ్వంసంలోంచే కొత్తవ్యాకరణం పుట్టుకొస్తుంది. అప్పుడే పాండవులు ఐదుగురు కారని నలుగురెందుకు కాకూడదని ముగ్గురు కూడా ఐ ఉండవచ్చు కదా అని తోస్తుంది. ముఖ్యంగా ఐదుగురు మాత్రం కారని రూఢీ చేయాలనిపిస్తుంది. అందుకే పాండవులు నలుగురే అని అంటాం. అదే పనిని రమణ జీవి కూడా చేశాడు..... ఈ పాటల్లో సామాజిక ప్రయోజనాలను వెతకడం కవిత్వానికి అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు.
***
ఒక్కో వాక్యం ఒక్కో కొటేషన్ లా సాగిపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
రమణజీవిది అధివాస్తవిక ధోరణి. పై వాక్యాలలో రమణ జీవి కవిత్వాన్ని ప్రసేన్ ఇలా నిర్వచిస్తున్నాడు.
1. రమణజీవి భాషకు వ్యాకరణం లేదు
2. రమణజీవి భావానికి వ్యాకరణం లేదు. అది జ్ఞాన లక్షణమే తప్ప అజ్ఞానం కాదు. (అధివాస్తవికం)
3. పూర్వజ్ఞానాన్ని తిరస్కరిస్తే తప్ప రమణజీవి అర్ధం కాడు (ఏనుగులు ఎగరలేవు అన్న పూర్వజ్ఞానాన్ని రద్దుచేసుకొంటే తప్ప ఏనుగులు ఎగురుతాయి అనే రమణజీవి వాక్యం అర్ధం కాదు)
4. ఈ కవిత్వంలో సమాజం ఎక్కడుంది అని వాదించే విమర్శకుల ముందరి కాళ్లకు బంధం వేసాడు.
ఇన్ని విషయాలను ఒక ఇంటలెక్చువల్ డిస్కోర్స్ లాగా పదివాక్యాల్లో ఇమడ్చగలిగాడు ప్రసేన్ .
అలాగని ప్రసేన్ మెత్తమెత్తని వాక్యాలతో మెచ్చుకోళ్ళు కప్పే రకం కాదు. సందర్భం వచ్చినపుడు కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాల్ని చెప్పగలడు ఇలా
ప్ర. మీ సమకాలీన కవుల్లో మీకు నచ్చిన కవులెందరు (2001 నాటి ప్రశ్న)
జ. సమకాలీన అనేమాటను పక్కన పెడదాం. బాబ్ డిలాన్ పాటలో కవిత్వం ఇష్టం. మోహన ప్రసాద్ వాక్యం చాలా ఇష్టం. కమలాదాస్ ను బోలెడన్నిసార్లు ప్రేమించాను. ఒకప్పుడు శేషేంద్ర నచ్చేవాడు. శ్రీశ్రీ మీద పెద్దగా అభిమానంలేదు. // సీతారాం ఎమోషనల్ ఈడియట్. వాడంటే చాలా ఇష్టం. వంశీ కృష్ణ మంచి అండర్ స్టేట్ మెంట్. సతీష్ చందర్ పనితనం నచ్చుతుంది. ఎమ్మెస్ నాయుడు అర్ధం కాడు కానీ కవిత్వం బావుంటుంది. శ్రీకాంత్ బాగా రాయగలడు తనను తాను ఎడిట్ చేసుకుంటే. శిఖామణి, ఎండ్లూరి సుధాకర్, కొండేపూడి నిర్మల స్కీమింగ్ నచ్చదు. ఐనా నచ్చే కవిత్వమే ఉండాలి తప్ప నచ్చే కవి ఉండకూడదు.
తన సమకాలీనుల్ని నిక్కచ్చిగా తూకంవేయటం చలంలో చూసాను. తరువాత ప్రసేన్ లో. చలం వందేళ్ళ ముందు పుట్టాడని అనుకొంటాను. అలా చూస్తే ప్రసేన్ విషయంలో మో చెప్పింది సత్యమే.
.
"ప్రసేన్ సర్వస్వం" నేటి సాహితీలోక "ట్రెండింగ్"
బొల్లోజు బాబా

No comments:

Post a Comment