మధ్యతరగతి జీవనాల “ఉమ్మడి స్వరం” – ఈ “జీవన స్వరం”శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారి కథలసంపుటి పేరు “జీవన స్వరం”. ఈ సంపుటిలో మొత్తం ఇరవైనాలుగు కథలున్నాయి. ఇది వీరి ప్రధమ కథల సంపుటి. శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు 1967 నుంచీ కథలు వ్రాస్తున్నా ఈ ఇరవైనాలుగు కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ఇటీవల ప్రచురింపబడినవే కావటం గమనార్హం. ఈ కథలనిండా మధ్యతరగతి జీవితాలకు చెందిన అనుభవాలు, ఆత్మీయతలు, కష్టాలు, సుఖాలు, మంచితనం, మానవత్వం, కపటత్వం లాంటి ఉద్వేగాలు అడుగడుగునా కనిపిస్తాయి. వాటిని నేర్పుగా తన కథనంలో లీనం చేయగలిగారు మూర్తిగారు. ఈ కథలను చదువుతున్నంతసేపూ వాటిలోని అనేక పాత్రలతో మనల్ని మనం పోల్చుకొంటాం, మమేకమౌతాం, సొంతం చేసుకొంటాం. ఈ కథలు ఆలోచింపచేస్తాయి, మనం ఇలా జీవించాలి కదా అనే స్పృహను కలిగిస్తాయి. ఈ కథలన్నీ మధ్యతరగతి జీవనాల “ఉమ్మడి స్వరం”మంచి కథకు ఉండాల్సిన లక్షణాలలో థీమ్, ప్లాట్, కాన్ ఫ్లిక్ట్ లను ప్రధానంగా పేర్కొంటారు. కథమొత్తాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెపుతామో అదే థీమ్. ఉదాహరణకు రామాయణానికి థీమ్ “ఆదర్శం”. కన్యాశుల్క నాటకం థీమ్ “సంఘ సంస్కరణ”, చలం మైదానానికి థీమ్ “స్త్రీ స్వేచ్ఛ” ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.నరసింహమూర్తి గారి చాలా కథలలో స్థూలంగా “మంచితనం’, “మానవ సంబంధాలు” థీమ్స్ గా కనిపిస్తాయి. ఈ సంపుటిలోని జీవితచక్రం, కరణేషు మంత్రి, బలిపశువు, ఆదిత్యహృదయం కథాశీర్షికలు కూడా కథ థీమ్ ని ఒక్క ముక్కలో చెప్పేస్తాయి. శీర్షికను బట్టి కథను కొంత ఊహించుకోవచ్చు.ఇక ప్లాట్ అంటే సంఘటనలు, సంభాషణలు, వర్ణనలు తో కథ థీమ్ ను చెప్పిన విధానం. దీన్నే కథనం అంటారు. మూర్తిగారి కథనశైలి క్లిష్టంగా ఉండదు. సూటిగా హాయిగా చదివించేరీతిలో సాగుతుంది.కాన్ ఫ్లిక్ట్ ను సంఘర్షణ అంటారు. కథలో కాన్ ఫ్లిక్ట్ అంటే పరస్పరవ్యతిరేక భావాల మధ్య సంఘర్షణ. విరుద్దభావాలను ప్రకటించే పాత్రలను సృష్టించి ఒకదానితో ఒకటి సంఘర్షించుకొనేలా చేసినపుడు ఆ కథ పాఠకులకు ఆసక్తి కలిగిస్తుంది. ఆలోఛింపచేస్తుంది. ఎక్కువకాలం గుర్తుంటుంది. ఏ కథైనా మనకు గుర్తుండిపోయిందంటే ఆ కథలోని కాన్ ఫ్లిక్టే కారణం. కాన్ ఫ్లిక్ట్ రెండురకాలు. ఇంటర్నల్ కాన్ ఫ్లిక్ట్, ఎక్స్ టర్నల్ కాన్ ఫ్లిక్ట్. ఇంటర్నల్ కాన్ ఫ్లిక్ట్ అంటే ఒక పాత్ర తనలో పరస్పరవైరుధ్యభావాలను సమన్వయపరుచుకోలేక మధనపడటం. షేక్స్ పియర్ “To be or not to be” దీనికి చక్కని ఉదాహరణగా చెపుతారు. ప్రసిద్ధి చెందిన డా. ఫాస్టస్ చివరి ఉపన్యాసం కూడా అంతర్ సంఘర్షణే. అలా కాక పాత్రలు బయట శక్తులతో తలపడినపుడు ఏర్పడే కాన్ ఫ్లిక్ట్ ను ఎక్స్ టర్నల్ కాన్ ఫ్లిక్ట్ అంటారు. విలన్ తోనో, ప్రకృతితోనో, సమాజంతోనో వచ్చే కాన్ ఫ్లిక్ట్స్ లు ఈ కోవకు చెందుతాయి.కథనైనా, కవితనైనా నిలబెట్టేది దానిలోని కాన్ ఫ్లిక్టే. మూర్తిగారి కథలలో కాన్ ఫ్లిక్ట్ ఎలా వ్యక్తీకరించబడిందో చూద్దాం.ఈ సంపుటిలోని మొదటి కథ “ఆదిత్య హృదయం”. అరుణకుమారి, శాంతి స్వరూప్ లకు పెళ్ళి నిశ్చయమౌతుంది. నాలుగు నెలల వరకూ ముహూర్తాలు లేకపోవటంతో తాంబూలాల ప్రక్రియ వాయిదాపడుతుంది. ఈ వ్యవధిలో అరుణకుమారి ఒంటిపై తెల్లమచ్చలు వచ్చిన కారణంగా శాంతిస్వరూప్ పెళ్ళికి నిరాకరిస్తాడు. అరుణకుమారికి వచ్చిన తెల్లమచ్చలు విటమిన్ లోపం వలన వచ్చినవని ఆదిత్యరాం అనే ఆయుర్వేద వైద్యుడు గుర్తించి వైద్యం చేసి నయం చేస్తాడు. ఆదిత్యరాం, అరుణకుమారిలు ఒకరినొకరు ఇష్టపడటంతో వారిద్దరికి వివాహం జరిపిస్తారు పెద్దలు.అయిదు పేజీల కథయినా దీనిలో మూర్తిగారు రెండు కాన్ ఫ్లిక్ట్ లను బలంగా చెప్పగలిగారు. కథప్రారంభంలో “పెళ్ళికింకా నాలుగునెలలు ఆగాలా” అని ఆందోళనపడ్డ శాంతి స్వరూప్ చివరకు వచ్చేసరికి “ఒక రకంగా అదృష్టవంతుణ్ణి, పెళ్ళికాకముందే రోగం బయటపడింది” అని భావిస్తాడు. ఇది కరుణ, సహానుభూతి లేకపోవటం వల్ల మానవసంబంధాలలో ఏర్పడిన కాన్ ఫ్లిక్ట్.ఇక రెండో కాన్ ఫ్లిక్ట్ – కార్పొరేట్ వైద్యం, ప్రకృతి వైద్యంల మధ్య నడుస్తుంది. అరుణకుమారికి వచ్చిన తెల్లమచ్చల చికిత్సకొరకు కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే, ఆ పరీక్షలనీ, ఈ పరీక్షలనీ వేలకు వేలు గుంజుతారు. ఇచ్చిన వందరకాల మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆదిత్యరాం పాత్రద్వారా మానవుల చర్మ ఆరోగ్యం కొరకు సూర్యకిరణాల అవసరాన్ని చెప్పిస్తారు రచయిత. ఆ రకంగా వ్యాపారపోకడలు పోతోన్న ఆధునిక వైద్యానికి, ప్రకృతి జీవనానికి మధ్య కాన్ ఫ్లిక్ట్ ను సమర్ధవంతంగా ఎదురెదురుగా నిలిపి, ప్రకృతి జీవన ఆవశ్యకతను గుర్తుచేస్తాడు కథకుడు.“జీవిత చక్రం” కథలో ఒక స్త్రీ సంపూర్ణ జీవితాన్ని పుష్కరాల నేపథ్యంలో వర్ణిస్తారు మూర్తిగారు. ఈ కథలో ప్రధాన పాత్రపేరు గౌతమి. ఆమెకు 84 సంవత్సరాలు. అదేనెల తన రిటైర్మెంట్ కారణంగా శెలవు దొరకని ఆమె కొడుకు ఆమెను ఒంటరిగా రాజమండ్రి పుష్కరాలకని ట్రైన్ ఎక్కించటంతో కథ మొదలవుతుంది. ఆమె తనజీవితంలో చూసిన పుష్కరాలను ఒక్కొక్కటిగా నెమరువేసుకోవటమే ఈ కథ. ఈ కథకు జీవితచక్రం అన్న పేరు చక్కగా అమరింది. పన్నెండేళ్ల వయసులో గౌతమి తన మొదటి పుష్కర స్నానం తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి చేస్తుంది. రెండో స్నానం భర్త, అత్తమామలు, ఆడపడుచులతో, మూడవసారి భర్త ఇద్దరు పిల్లలతో చేస్తుంది గౌతమి. నాలుగో పుష్కరానికి అత్తమామలు గతించిపోతారు. చిన్నప్పుడు నలభైమందితో కలిసి పుష్కరాలకు వెళ్లగా ఇప్పుడు నలుగురుం మిగిలాం అనుకొంటుంది గౌతమి. అయిదో పుష్కరసమయానికి తల్లిదండ్రులు గతించటం, భర్త రిటైర్ కావటం, పిల్లలు పెళ్ళిల్లు అయి ఎక్కడెక్కడో స్థిరపడటం లాంటి మార్పులెన్నో జరుగుతాయి గౌతమి జీవితంలో.తనజీవితంలోని ఆరో పుష్కరసమయం ఈ కథలోని కథాకాలం. అప్పటికి భర్తను కోల్పోయింది గౌతమి. కొడుకు రిటైర్మెంట్ తీస్కొంటున్నాడు. మూడో మునక వేసే సమయంలో గౌతమికి భర్త గుర్తుకొస్తాడు, గుండె లయతప్పుతుంది, పట్టుతప్పి ప్రవాహంలో కొట్టుకొని పోవటంతో కథ ముగుస్తుంది.ఈ కథలో కాన్ ఫ్లిక్ట్ ఎక్కడ ఉందని అనిపించవచ్చు. అనాదిగా కాలంతో మనిషి పడుతున్న సంఘర్షణే ఈ కథలోని కాన్ ఫ్లిక్ట్. కాల గమనము, జీవితాలలో వచ్చేమార్పులు, గోదావరి ప్రవాహమూ ఎవరికొరకూ ఆగక, గంభీరంగా సాగిపోతూనే ఉంటాయి అన్న సత్యం ఈ కథ ఎరుకపరుస్తుంది.ఈ సంపుటిలోని “స్థితప్రజ్ఞత” కథ ఆసక్తికరంగా, మంచిబిగితో సాగుతుంది. శశికాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కాళింది అతని భార్య. కాళింది అమ్మనాన్నలు పల్లెటూరి వాసులు. వారి ఆహార్యం, అలవాట్లపట్ల శశికాంత్ కు చిన్నచూపు. కాళింది అమ్మ, ఆమె తాతగారినుంచి నేర్చుకొన్న ఆయుర్వేదవైద్యంతో ఇరుగుపొరుగువారి చిన్నచిన్న రోగాలకు ఉచితంగా మందులిస్తూంటుంది. అదంతా మిడిమిడిజ్ఞానమని శశికాంత్ ఎద్దేవా చేస్తూంటాడు.కాళింది గర్భవతి అయి నెలలు నిండుతాయి. కూతుర్ని పంపమంటే పల్లెటూర్లో సరైన వైద్యం ఉండదు అని పంపడు శశికాంత్. చేసేదేమీ లేక కూతురికి సహాయంగా తల్లి అల్లుడి ఇంటికి వస్తుంది. పురిటినొప్పులు మొదలయ్యే సమయానికి భారీవర్షాలు వచ్చి రోడ్లపై, సెల్లార్ లో నిలువెత్తు నీళ్లు నిలబడి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. హాస్పటల్ వారు చేతులెత్తేస్తారు. ఆ సమయంలో శశికాంత్ అత్తగారు మంత్రసానిగా వ్యవహరించి కూతురు పురుడుపోసి పండంటి బిడ్డను శశికాంత్ చేతికందిస్తుంది. అప్పటికి కానీ శశికాంత్ కు అర్ధం కాదు అత్తగారి గొప్పతనం.ఈ కథ చదవటానికి చందమామ కథలా అనిపించినప్పటికీ- అనూచానంగా వస్తున్న విజ్ఞానానికి ప్రకృతి ప్రకోపానికి నిస్సహాయంగా మిగిలిపోయే ఆధునిక విజ్ఞానానికి మధ్య జరిగే కాన్ ఫ్లిక్ట్ ను ఈ కథలో అద్భుతంగా పలికించారు మూర్తిగారు. ఒక వ్యక్తి సౌశీల్యం వారి అలవాట్లు, ఆహార్యం వల్ల తెలియదని; ఆపత్సమయాలలో వారు ప్రదర్శించే స్థితప్రజ్ఞత వల్ల బయటపడుతుందన్న జీవితసత్యం ఈ కథ మనకు తెలియచేస్తుంది.“కరణేషు మంత్రి” కథలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకొని సంసారాన్ని సౌఖ్యంగా, ఆదర్శవంతంగా ఎలా నడిపించుకోవచ్చో – కృష్ణమూర్తి, అర్చన పాత్రలద్వారా చెప్పిస్తారు మూర్తిగారు. కథా ప్రారంభంలో కృష్ణమూర్తి, అర్చనలది అందరూ ఈర్ష్యపడే దాంపత్యం. కొంతకాలానికి కృష్ణ మూర్తిలో మార్పు వస్తుంది. పరధ్యానంగా ఉంటూంటాడు. భార్యపిల్లల పై చిర్రుబుర్రులాడుతూ అసహనం ప్రదర్శిస్తూంటాడు. అదికాక ఇంట్లో నక్లెస్ ను దొంగతనం చేస్తాడు. కృష్ణమూర్తి ప్రవర్తనలో వచ్చిన మార్పుకు ఆందోళనకు గురవుతూంటుంది అర్చన. కృష్ణమూర్తి ఆఫీసుకు సెలవలు పెడ్తున్నాడని, లక్షరూపాయలు అప్పుతీసుకొని వాయిదాలు కట్టటం లేదన్న విషయం అర్చన తెలుసుకొంటుంది. ఆ రోజు రాత్రి భర్తను నిలదీస్తుంది. భార్యను ఇంకా మోసం చేయటం ఇష్టం లేని కృష్ణమూర్తి నిజం చెప్పేస్తాడు. తాను ఒక మిత్రుని నమ్మి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టానని నష్టమొచ్చిందని. అర్చన అతని నిస్సహాయతను అర్ధం చేసుకొని- ఖర్చులు తగ్గించుకొందామని, తనుకూడా ఏదైనా ఉద్యోగం చేస్తానని, నెమ్మదిగా అప్పులు తీర్చుకొందామని భర్తకు భరోసా చెప్పటంతో కథ ముగుస్తుంది.ఈ కథలో ఉన్న కాన్ ఫ్లిక్ట్ భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు. డబ్బంతా తగలేసావు అంటూ అర్చన భర్తపై సాధింపు మొదలు పెడితే వారి కాన్ ఫ్లిక్ట్ మరింత పెద్దదయి ఉండేది. వారి సంసారము, జీవితాలు దుర్భరమయిఉండేవి. అలా కాక అపోహలను తొలగించుకొని సమస్యను పరిష్కరించుకొనే దిశగా అడుగులు వేయటం ద్వారా మంచి దాంపత్యం ఎలా ఉండాలో సూచిస్తున్నారు మూర్తిగారు. భార్యాభర్తల మధ్య ఏర్పడే సంఘర్షణలు శృంగారంలో ముగియటం సహజంగా జరిగేదే. ఆ విషయాన్ని ఎంతో నర్మగర్భంగా చెపుతారు ఇలాభర్త ఎంత డబ్బు తెచ్చాడని భార్య చూడదండీ…. ఎంత ప్రేమ పంచుతుంటే అంత సంతోషిస్తుంది” అంటూ భర్తను అనునయించింది. భార్య ఎదపై వాలిపోయాడు భర్త. ఆమె అతనికి దగ్గరైంది. ఇద్దరి మధ్య గాలి స్థంభించింది.కూతురిపై ఏసిడ్ దాడి చేస్తాను అని బెదిరిస్తున్న ఒక రౌడి కుర్రాడిపై, ఒక తల్లి ముసుగువేసుకొని యాసిడ్ దాడి చేసి శిక్షించటం ఇతివృత్తంగా “మాతృదేవోభవ” కథ సాగుతుంది. ముందుమాటలో MVS ప్రసాదు గారు అన్నట్లు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం సబబేన అన్న ప్రశ్న ఉదయించకమానదు ఈ కథ చదివాక. బహుసా “పొయిటిక్ జస్టిస్” చేయాలనుకొన్నారేమో కథకుడు అనిపించింది.నేడు బాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాలను “బలిపశువు” కథలో చక్కగా ఎత్తిచూపారు. “తిరుగుబాటు” కథలో పాత్రల అంతఃసంఘర్షణ బాగుంది. మామగారికి ఇష్టంలేకపోయినా ఇంట్లోకి ప్రవేశించిన పాత్ర చివరలో మామగారి మనసు ఎలా గెలుచుకొందో తెలిపే కోడలి కథ “ఆకాశంలో సగం”.ఈ కథలలో చాల పాత్రలు తమతప్పుతెలుసుకొని చివరలో పరివర్తన చెందుతూంటాయి. అలా పరివర్తన చెందినట్లుగా చెప్పటం కథాప్రవాహంలో అసహజంగా అనిపించదు. ఎందుకంటే పాత్రల చిత్రణ, పరివర్తనకు దోహదపడే బలమైన సన్నివేశాల కల్పన, కథనశైలి లాంటివి కారణాలుగా నిలుస్తాయి. కథానిర్మాణంలో ఎత్తుగడ ప్రాముఖ్యం తెలిసిన వ్యక్తి మూర్తిగారు. కథల ఎత్తుగడ ఆసక్తికరంగా ఉండి ఆకర్షిస్తుంది. మొదటి పారాగ్రాఫు కథముగింపును కొంత ఊహించేవిధంగా ఉండటం మూర్తిగారి శైలి.ఈ “జీవనస్వరం” గురించి ఒక్కవాక్యంలో చెప్పాలంటే “ఈ లోకంలోని మంచివాళ్లగురించి, ఒక మంచి మనసున్న మనిషి వ్రాసిన కథలు” అని అంటాను.బొల్లోజు బాబాxx
Wednesday, December 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment