Sunday, February 9, 2020

అమెరికన్ అధోజగత్ జీవనానుభవాల కవి


Charles Bukowski అమెరికన్ కవి. (1920-1994) బుకోవ్ స్కీ కవిత్వం ముతకగా ఉంటుంది. ఇంతకు మించి కోల్పోవటానికి ఏమీ లేదు అనే అనుభూతిని, ఉద్వేగాన్నీ కలిగిస్తుంది. ఒకరకమైన సినికల్ ధోరణిగా అనిపిస్తుంది కూడా.
నాలుగురోజుల క్రితం మా అమ్మాయి బుకోవ్ స్కి గురించిన ఒక కొటేషన్ ను చూపించింది.
ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంలోని ప్రారంభ వాక్యాలట అవి.
"Charles Bukowski was an alcoholic, a womanizer, a chronic gambler, a lout, a deadbeat and on his worst days, a poet. He is probably the last person on earth you would ever look to for life advice"
ఇతన్ని నువ్వు చదివావా అని అడిగింది. కొన్ని అనువాదాలు కూడా చేసాను అన్నాను తను ఏమనుకొంటాదో అని భయపడుతూ (ఆ కొటేషన్ మేటర్ అలాంటిది మరి  )
ఈ రోజు బాల సుధాకర్ మౌళితో మాట్లాడుతున్నప్పుడు బుకోవ్ స్కి ప్రస్తావనవచ్చింది.
నేను చేసిన అనువాదాలను ఒక సారి చూసుకొన్నాను. అయిదేళ్ళుగా బుకోవ్ స్కీతో ప్రేమలో ఉన్నానని అర్ధమైంది.
అవన్నీ చూసి.... ఎందుకు అనువదించానో నన్ను నేను ఒకసారి తరచిచూసుకొనే ప్రయత్నమిది.
***
I Met A Genius- Charles Bukowski
ఈరోజు రైల్లో
నేనో మేధావిని కలిసాను
ఆరేళ్ళ వయసుంటుందేమో
అతను నా పక్కనే కూర్చున్నాడు
రైలు సముద్రతీరం వెంబడి వెళుతోంది
సముద్రాన్ని చూస్తూ అన్నాడతను
“పెద్ద అందంగా ఏం లేదని”
అవును నిజమే కదా అనిపించింది
మొదటిసారిగా
1 October 2015
అనాదిగా సముద్రం అందాన్ని వర్ణిస్తూ అనంతమైన సాహిత్యం వచ్చి ఉంటుంది. అదేదీ తెలియని ఒక చిన్నపిల్లవాడు సముద్రం పెద్ద అందంగా ఏం లేదు అన్నప్పుడు అతడిని మేధావిగా వర్ణించటం ద్వారా పాతతరం కవుల్నందరినీ దోషులుగా నిలబెడతాడు బుకోవ్ స్కి. . అదే అర్ధం వచ్చేలా Great art is horseshit అంటాడు మరోచోట.
***
ఈ రాత్రికి ----- Tonight by Charles Bukowski
“నీ ప్రియురాళ్ళపై నీవు వ్రాసే కవిత్వం
మరో యాభై ఏళ్ళు నిలుస్తుంది.....
వాళ్ళు గతించిపోయినప్పటికీ”
నా ఎడిటర్ ఫోన్ చేసి అంటున్నాడు.
మిత్రమా
వారేనాడో నన్ను విడిచి వెళ్ళిపోయారు
నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.
ఐతే
ఒక్క నిజమైన సజీవ స్త్రీని నాకొరకు ఈ రాత్రికి పంపించు
నా వైపు నడుచుకొంటూ వచ్చే ఒక్క స్త్రీని...
నా కవితలన్నీ నీకిచ్చేస్తాను
మంచివీ, ముతకవీ
ఇకపై నేను వ్రాయబోయేవీ కూడా.
నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.
నేనేమంటున్నానో నీకు అర్ధమైందా?
13 March 2016
ప్రేమ కవిత్వం అంతా విరహంలో పుడుతుందన్న సూచన, లేనిదాని కొరకు చేసే అన్వేషణే సాహిత్యం అన్న అర్ధాలు పై కవితలో కనిపించాయి. బహుశా బాలగోపాల్ అన్న "ఖాళీలను పూరించటమే సాహిత్యం చేసే పని" అనే వాక్యం పై కవితకు అన్వయించుకోవచ్చనుకొంటాను.
***
కొద్దిసేపటి క్రితమే -- it was just a little while ago by Charles Bukowski
తెల్లారింది
టెలిఫోను తీగలపై పిట్టలు
ఎదురుచూస్తుండగా
నిన్న మరచిపోయిన సాండ్విచ్ ను
ఇప్పుడు తింటున్నాను.
ప్రశాంతమైన ఆదివారపు ఉదయం
గది మూలన నిల్చుని ఉంది ఒక చెప్పు
మరొకటి దానిపక్కనే
అవును
కొన్ని జీవితాలు వృధా కావటానికే
సృజింపబడతాయి.
20 November 2016
ఒక మెలంకలీ పరుచుకొన్న కవిత ఇది. దృశ్యాలు, సంఘటనల ద్వారా బాధను ఎంత బలంగా చెప్పొచ్చో తెలియచేస్తుంది. శని ఆదివారాలు వీకెండ్ అనుకొంటే వృధా అయిన శనివారాన్ని చెపుతున్నట్లు తోచింది.
***
రూములు రెంట్ కి ఇచ్చే అందమైన అమ్మాయి - by Charles Bukowski
న్యూ ఓర్లియాన్స్ నగరంలో అద్దెకు గది చూపించింది
ఓ అందమైన అమ్మాయి.
చీకటిగా ఉందాచోటు
చాలా దగ్గరగా నిలుచున్నాం మేం
"ఈ గదికి వారానికి నాలుగున్నర డాలర్ల అద్దె" అందామె
"నేను సాధారణంగా మూడున్నర చెల్లిస్తూంటాను" అన్నాను
ఆమెను అప్పుడప్పుడూ చూస్తుండొచ్చుకదా అని
నాలుగున్నర చెల్లించటానికి నిర్ణయించుకొన్నాను
ఆ అమ్మాయి లాగే
స్త్రీలు ముందుగా తాము చొరవచూపరెందుకో అర్ధంకాదు
మననుంచి ఆశిస్తారు
చివరకు నేనే "రూము తీసుకొంటాను" అని చెప్పి డబ్బులు చెల్లించాను
దుప్పట్లు మురికిగా ఉన్నా, మంచం సర్ది లేనప్పటికీ
నేను అస్కలిత యవ్వనస్తుడను
కంగారులో ఉన్నాను కూడా
డబ్బులు తీసుకొని
తలుపు వేసి వెళిపోయిందామె.
రూములో టాయిలెట్ లేదు
సింకు లేదు, కిటికీ కూడా లేదు
రూమంతా ఆత్మహత్య, మృత్యువులతో తడితడిగా ఉంది
మంచంపై పడుకొన్నాను
అక్కడొక వారం ఉన్నాను
హాల్ లో చాలామందిని కలిసాను
ముసలి తాగుబోతుల్ని
ఉపశమనం పొందుతున్నవారిని
పిచ్చివాళ్లని
చురుకైన పడుచువాళ్లను
జబ్బైన వృద్ధులను
కానీ
ఆ అమ్మాయిని మాత్రం మరలా చూడలేదు
చివరకు
అక్కడనుంచి మరొక చోటుకు మారాను
వారానికి మూడున్నర డాలర్ల బాడుగ
అందవిహీన నేత్రాలు, ముడుతలు పడిన చర్మంతో
డబ్బై అయిదు ఏండ్ల వయసున్న స్త్రీ నడుపుతోంది ఆ చోటును
అక్కడ ఏ సమస్యా లేదు
సింక్ ఉంది
టాయిలెట్ ఉంది
రూమ్ కు కిటికీ కూడా ఉంది.
10 January 2019 •
పై కవితగురించి పెద్దగా చెప్పటానికి ఏం లేదు. ఒక కాంట్రాస్ట్ చెపుతున్నాడు. చాలా సరళమైన జీవన వాస్తవికత అది.
***
మరచిపోలేని నవ్వు by A smile to remember by Charles Bukowski
కిటికీ పక్కన టేబుల్ పై ఓ గాజుపాత్రలో
వలయాకారంలో ఒకదాని వెనుక మరొకటి తిరిగే
గోల్డ్ ఫిష్ లు ఉండేవి.
మా అమ్మ నిత్యం నవ్వులు చిందిస్తూ
మమ్మల్ని కూడా ఆనందంగా ఉండమని అంటూండేది
“సరదాగా ఉండు హెన్రీ” అని నాతో అనేది.
ఆమె చెప్పింది నిజమే,
ఎంత ఆనందంగా ఉండగలిగితే అంత మంచిదే కదా.
మా నాన్న మాత్రం తన ఆరున్నర అడుగుల దేహంతో ఊగిపోతూ
మా అమ్మను, నన్నూ విపరీతంగా కొట్టేవాడు
ఎందుకంటే
ఎవరు అతన్ని లోపలనుంచి హింసిస్తున్నారో
అతనికి అర్ధమయ్యేది కాదు.
మా అమ్మ, పాపం గోల్డ్ ఫిష్
రోజూ దెబ్బలు తింటున్నా ఆనందంగా ఉండాలనుకొనేది
నన్ను ఉంచాలనుకొనేది
“హెన్రీ, నువ్వెందుకు నవ్వుతూ ఉండవూ?” అంటూ
ఎలా నవ్వాలో తను నవ్వి నాకు చూపించింది ఒకసారి
నేను చూసిన అత్యంత విషాదకర నవ్వు అది.
ఒక రోజు గోల్డ్ ఫిష్ లన్నీ చచ్చి నీటిపై తేలాయి
కళ్ళు మాత్రం తెరుచుకొనే ఉన్నాయి.
ఇంటికి వచ్చిన మా నాన్న వాటిని
పిల్లికి ఆహారంగా వంటింటి నేలపైకి విసిరాడు
అపుడు
మా అమ్మ నవ్వుతూండటం నేను చూసాను
20 February 2019
అనువదించిన వాటిలో నన్ను చాన్నాళ్ళు పట్టికుదిపిన కవిత ఇది. ఎంతటి విషాదం! ఎంతటి జీవన బీభత్సం!
బుకోవ్ స్కి అమెరికన్ దిగువమధ్యతరగతికి ప్రతినిధి. ఇతని కవిత్వంలో పేదరికం, విచ్చలవిడితనం, క్రమరాహిత్యం, సౌందర్యలేమి, ప్రేమలేకపోవటం లాంటి ఉద్వేగాలు విస్మయపరిచే శైలిలో వ్యక్తీకరింపబడతాయి.
"ఎవరు అతన్ని లోపలనుంచి హింసిస్తున్నారో" అన్న వాక్యం మొత్తం కవితకు కీలకం. ఎన్ని కోణాలనైనా ఆవిష్కరిస్తుందా వాక్యం.
"అత్యంత విషాదకర నవ్వు" వద్ద కవిత ఆగిపోయినప్పటికీ అది బరుమైన కవితే. కానీ ముగింపులోని విషాదం చదువరిని వెంటాడి వెంటాడి వేటాడుతుంది.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment