Sunday, February 9, 2020

కవిత్వ కడియం- తగుళ్ల గోపాల్



తగుళ్ల గోపాల్ కల్వకుర్తి ప్రాంత కలకొండకు చెందిన కవి. కవులను ప్రాంతాలకు కుదించటం నాకు ఇష్టం ఉండదు. కానీ గోపాల్ తన ప్రాంతాన్ని, తన కాలాన్ని, తన సమాజాన్ని, తన జీవితాన్ని నోరారా చెప్పుకొన్నాడు. గుండెవిప్పి మనముందు పరిచాడు “దండకడియం” గా. ఈ విషయాన్ని నారాయణ స్వామి ముందుమాటలో “సబ్ ఆల్ట్రన్” అన్నారు. గొప్ప గమనింపు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గొప్పకావ్యాలుగా నిలిచినవాటిలో చాలామట్టుకు సబ్ ఆల్ట్రన్ రచనలే అనేది ఒక సత్యం.
***
ఈ సంపుటిలో నన్ను ప్రధానంగా ఆకర్షించినది భాష. ఒక వింతైన వొడుపుతో సాగే భాష. గోదావరి జిల్లావాడిగా నాకు తెలంగాణ యాసతో పెద్దగా పరిచయంలేదు. ఆ అవసరమూ రాలేదు. సాహిత్యపరంగా ఏదో మిస్ అవుతాను అనుకొన్నప్పుడు బుద్ధిగా కూర్చుని ఆ కథనో, నవలనో, కవితనో చదూకున్నానే తప్ప వంటపట్టించుకోలేక పోయాను. ఇది బహుశా నా దౌర్భల్యమే కావొచ్చు.

గోపాల్ ప్రేమ మళ్ళీ చాన్నాళ్ళకు అలా కూర్చోబెట్టింది నన్ను. ఎసొంటి, ఒడువని, సర్వమీది, నీళ్ళసాకలు, డిల్లెంపల్లెం దరువులు, దగ అల్సుకొని, శనగుగ్గీలు, నాల్గుబుక్కల, చేతిలో వడ్డంక, దీవెనార్తులు, పాడువడ్డ, పొటుకులు, అల్కగా లాంటి పదాలలో ఉండే సౌందర్యం, ఆ పదాలను పైకి చదూకొన్నపుడు గొంతునిండా ఒక హాయైన మెత్తందనం అనుభవానికి వచ్చాయి.
***
ఇక గోపాల్ కవిత్వంనిండా బాల్యం, అమ్మ, నాయిన, అక్క, తాత, మేనత్తలు, ఊరిమనుషులు, బడిసార్లు, మేడమ్ లు. వాక్యవాక్యాన జ్ఞాపకాల ప్రవాహం. జ్ఞాపకాలను కవిత్వం చేయటం అందరూ చేసేదే. వాటిని ఎంత ప్రతిభావంతంగా చేసేడన్నది గమనిస్తే ఒక నాస్టాల్జియా కవికి ఒక “మేలిమి గింజ” కవికి వ్యత్యాసం ఇట్టే తెలిసిపోతుంది. శివారెడ్డి గారు ముందుమాటలో అన్నట్లు గోపాల్ ఒక “మేలిమి గింజ”

గోపాల్ కవిత్వం నిండా తలపోతలనుండి తలపోతలలోకి చేసే ప్రయాణంకనిపిస్తుంది. ఈ ప్రయాణంలో – మనకు ఒక గ్రామీణ సౌందర్యం కనిపిస్తుంది. ఒక ప్రాంత అస్తిత్వంగా రూపుదిద్దుకొన్న భాషతాలూకు సౌరు కనిపిస్తుంది. మానవసంబంధాలలోని ఆర్థ్రత కనిపిస్తుంది. వస్తువును కవిత్వంగా మలచిన విద్య కనిపిస్తుంది. బహుజన జీవన పరిమళం కనిపిస్తుంది.

గోపాల్ మెత్తని హృదయమున్న కవి. అనుబంధాలను ప్రాణంగా పదిలపరచుకొనే మనిషి.
//మా మధ్య ఏ బంధుత్వమూ లేకపోయినా
ఆమె నన్ను నాయనా… అంటది
నేను ఆమెను అమ్మా… అంట
ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం
ఇది చాలదా?
మేం బంధువులం కావటానికి. (ఒకే ఆకాశాన్ని కప్పుకొన్నవాళ్లం).

ఇదంతా హృదయ నైర్మల్యం. ఉత్త పల్లెటూరి స్వచ్ఛత ఇది. మేకపొదుగునుండి నోటిలోకి పిండుకొనే కలుషితం కాని నురుగుల పాలధార.
***
తెలంగాణ కవిత్వంలో చెరువు వస్తువుగా అనేక కవితలు కనిపిస్తాయి. బహుశా ఆ ప్రాంతసాంస్కృతిక, భౌగోళిక నేపథ్యానికి చెరువు ఒక సిగ్నేచర్ అనుకొంటాను. దీనికి కాంట్రాస్ట్ గా ఆంధ్రప్రాంత కవిత్వంలో కాలువల ప్రస్తావన ఉండటం గమనిస్తాం. గోపాల్ చెరువుపై వ్రాసిన కవితలో

//మనిషిని ముట్టుకోకుండా జేసిన
కులంగీతల్ని దాటి
మనుషులంతా ఇక్కడే
తామరపువ్వులైవిచ్చుకుంటారు.//
దూపగొన్న జివ్వాలగుంపుల్ని
చెర్లకు మర్లేస్తుంటే
తువ్వాలలో
పసిపాపై నిద్రవోతున్న సద్దిమూట
కండ్లు తెరిచేది ఈ చెరువుగట్టుపైనే//

ఊరిమైలనంతా కడిగి
గుండెగూట్లో దీపం వెలిగించే
చెరువుకూడా మనింటి ఆడబిడ్డే (చెరువుగట్టు మీద)

చెరువు అనగానే గట్టు, చెట్టు, తామరలు, మనుషులు, పంటనీరు అంటూ దృశ్యాల్ని, పనుల్ని వర్ణించటం సాధారణం. పై కవితలోని మనుషులు తామరపువ్వులవ్వటం, పసిపాపై నిద్రపోయే సద్దిమూట, గుండెగూట్లో దీపం వెలిగించటం లాంటి పోలికలు కవితను నిలిచిపోయే కవితగా చేసాయి.

సామాజిక సంఘటనలు స్పందనగా రాసే కవిత్వంలో ఆగ్రహం బలంగా పలుకుతుంది ఎక్కువగా. కానీ గోపాల్ రాసిన కవితలో కరుణ పలకటం గమనార్హం. ఆసిఫా మరణంపై రాసిన ఈ వాక్యాలు చూడండి

//ఊర్లో కథలు చెప్పెటోళ్లకు
పదిరూపాలిచ్చి నీ పేరు సదివిచ్చుకుంట
నీతోటి దోస్తుల పెండ్లీలైతుంటే
ఏ ముత్యాలపందిరి కింద ఉన్నవో అని వెతుక్కుండ

నువ్వు పట్టుకున్న వస్తువులను
ఇప్పుడు నేను పగలగొట్టుకోలేను
నీకని కుట్టిచ్చిన గౌనులను
పారేయ మనసొస్తలేదు// (అడవిలో పొద్దూకినట్లు)

ఇదంతా దుఃఖం. ఆ దుఃఖోద్వేగంతో మమేకమౌతాం. కథలు చెప్పేటోళ్ళతో పేరు సదివిచ్చుకుంటా అనటంలోని ఆర్థ్రత గుండెల్ని మెలిపెడుతుంది. ఆ సందర్భంతో ఈ కవి హ్రుదయం మమేకమైన తీరులో నిజాయితీ కనిపిస్తుంది. కవికి ఉండాల్సిన మొదటి లక్షణం నిజాయితీ అని కొప్పర్తి అంటారు.

ముల్లును ముల్లుతోనే
తీసిన చేతులు గదా!
అందుకే ఈ పిడికిలికి
ఇంతటి ధిక్కారపు గొంతు // (ముల్లుపాఠం) అన్న శక్తివంతమైన వాక్యాలు కలిగిన కవితనిండా మార్దవతే తప్ప కాఠిన్యం కనిపించకపోవటం గోపాల్ శిల్ప చాతుర్యం. ఇది సాధనతో వచ్చేదికాదు, హృదయగతమై ఉండాలి. ఆ ఆర్ధ్రత, మెత్తదనం, ఊహను స్థానికీకరణ చేసే మంత్రశక్తి గోపాల్ కు గుండె అంచులవరకూ ఉన్నాయి.

తండ్రి వృత్తిలో సహాయపడిన గొడ్డలిని వర్ణిస్తూ రాసిన ఈ వాక్యాలలోని ఐరనీ ఒక జీవితకాల విషాదం

ఈ గొడ్డలితోనే
చిటారు తుమ్మకొమ్మల్ని నరికి
మేకలకు మండ దెచ్చేటోడు//
నాన్న చనిపోతే
ఆ గొడ్డలితోనే పాడెకట్టెలు కొట్టుకొచ్చారట (నాన్న గొడ్డలి).
***

గోపాల్ వస్తువుని కవిత్వం చేసే రహస్యాన్ని తెలుసుకొన్నవాడు. ఊహను పదచిత్రంగా, పదచిత్రాల్ని ఉద్వేగాలుగా చెక్కటంలోని మెళకువల్ని సాధించాడు. “మేలిమి గింజ” కవిగా ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు. ‘దండ కడియం” ఒక గొప్ప ప్రారంభం. సబ్ ఆల్టర్న్ అస్తిత్వ చైతన్యానికి అద్భుతమైన కవిత్వరూపం ఇచ్చాడు.

గుండెలోపలి జ్ఞాపకాల భాస్వరాన్ని బయటకు తీసుకొని వెలిగించుకొంటూ, దారులు వెతుక్కుంటో తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. బయట వెలుగు-లోపలి చీకటి, లోపలి వెలుగు-బయట చీకటులతో మరిన్ని ఘర్షణలు పడాలి. ఆ ఘర్షణలలోంచి బయటపడే మరింత విస్తారమైన రహదారులపైన తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడన్న నమ్మకం నాకుంది.

“దండ కడియం” తగుళ్ళ గోపాల్ కు అభినందనలతో

బొల్లోజు బాబా

No comments:

Post a Comment