Sunday, February 9, 2020

శ్రీకాంత్ కవిత్వం

Living itself takes a form of Writing for me - Srikanth

“All that is gold does not glitter,
Not all those who wander are lost;
The old that is strong does not wither,
Deep roots are not reached by the frost.– Tolkien

పై వాక్యాలు శ్రీకాంత్ కవిత్వానికి సరిపోతాయి. తెలుగు కవిత్వలోకానికి శ్రీకాంత్ ఒక ఎనిగ్మా. చుట్టూ ప్రలోభపెట్టే ప్రవాహలమధ్య నిలుచుని దేన్నైతే దర్శించాడో, దేన్నైతే అనుభూతి చెందాడో, దేన్నైతే కవిత్వమని నమ్మాడో దాన్నే రాసాడు. నేను ఇంతే ఇదే “శ్రీకాంత్ కవిత్వం” అని నిజాయితీగా నిర్మొహమాటంగా చెప్పుకొన్నాడు.

శ్రీకాంత్ కవిత్వంనిండా మూడువంతులు స్త్రీలే. భార్య, ప్రియురాలు, కూతురు, వృద్ధ తల్లి, “నువ్వు”గానో రకరకాల రూపాలతో. ఒక్కోచోటా ఒక్కో ఉద్వేగాన్ని పలికిస్తూంటారు.

ఆమె
ఆమె నవ్వడాన్ని తరచూ చూడవు నువ్వు
వంటలో నిమగ్నమై, హఠాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేత్తో
తన మొఖాన్ని తుడుచుకుంటూ

నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను

మరి
ఇక ఆ తరువాత, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది
ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా, ఉజ్వలంగా (ఆమె) ఈ కవిత మొదటి భాగం ఒక సప్తశతి గాథను తలపిస్తుంది. రెండవభాగంలో అందమైన జీవన లాలస వెల్లువై పలుకుతుంది. అందం, ఆనందం జీవనేచ్ఛై పరిమళించే పద్యమిది
***
ఇలాంటిదే మరో కవిత

అరచేతుల మధ్య ఒక కప్పును పుచ్చుకుని పొద్దున్నే తేనీరుగా మారుతావు కదా నువ్వు. అప్పుడు అల్లంవాసన వేస్తాయి నీ చేతులు. మరి నీ పెదాల మధ్యనుంచి కొంత ఏలకుల సుగంధం కూడా//

// ఆ మెత్తని నిశ్శబ్దంలో, దుప్పటిలో ముడుచుకుని అస్సలే కదలరు మన పిల్లలు. ఇల్లంతా ఒక శాంతీ, కాంతీ, గోరువెచ్చని నీడలూ, అలంకారిక పింగాణీ వస్తువులపై ఆగే లోకమూ అతి సూక్ష్మంగా వాటిపై పేరుకొనే కాలపు ధూళీనూ! సరిగ్గా అప్పుడే నీ వెనుకగా చేరి నా చేతుల మధ్యకు తీసుకుంటాను నిన్ను, చూడు:
ఇక ఈ ఉదయాన మరో కప్పు తేనీరు త్రాగవచ్చు మనం నింపాదిగా, శాంతిగా, తొలిసారిగా (తేనీరు)

తేనీరు వంకతో శృంగారానుభవాన్ని పండిస్తున్నాడిక్కడ. కవిత్వంలో స్త్రీ గురించి వ్రాయటాన్ని Burden of Women అని అంటారు విమర్శకులు కానీ జీవితంలో స్త్రీని అలా అనగలరా? కవిత్వానికి జీవితానికి ఉన్న సన్నని రేఖను చెరిపేసే శ్రీకాంత్ కి ఇవేమీ పట్టవు. అనుభవాన్ని కవిత్వీకరించటమొక్కటే తెలుసు
***
ఒక గృహిణి దైనందిన జీవితాన్ని వర్ణించే ఓ కవితను ఇలా ముగిస్తాడు

రాత్రి నిలువునా చీలిపోయింది. గదిలోని దీపం
సగంగా చిట్లిపోయింది. పగిలి పగిలి
నీ ముంగిట్లోకి తూలుతూ వచ్చింది నేనే

విరిగి విరిగి నిదురలేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే

ఎన్నడైనా ఉన్నానా నేను నీకు
ఎన్నడైనా ఉన్నావా నువ్వు నాకు అని
నువ్వూ అడగలేదు-నేనూ చెప్పలేదు- (ఒక సాధారణ వచనం)

దృశ్యాన్ని కళ్లకు కట్టటం గొప్ప విద్య. ఆ టెక్నిక్ అంచుల్ని చూపించే నేర్పరి శ్రీకాంత్. పై సందర్భానికి నిలువునా చీలటం చిట్లిపోవటం స్మశానాన్ని శుభ్రం చేయటం, ప్రమిద వెలిగించటం లాంటి వర్ణణలు సందర్బంలోని ఉద్వేగాన్ని కళ్ళముందు నిలుపుతాయి. గగుర్పొడుస్తాయి కూడా. ఇక చివరి వాక్యాలలోని తర్కం ఎస్కేపిజాన్ని సూచిస్తున్నా వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.
***

How was the day అని అడుగుదామని అనుకుంటాడు అతను తనని//
//నిస్సత్తువుగా కుర్చీలో జారగిలబడి, భుజాన బ్యాగుని పక్కకు వదిలి
కళ్ళలోని వాననీ
శరీరంలో వడలిన
పూలనీ, రేగే ధూళినీ తుడుచుకుంటూ, సొమ్ముసిల్లుతున్న నవ్వుతో
అతి కష్టం మీద
ఇలా అంటుంది
తను అప్పుడు
అతనితో;
“కొద్దిగా ఓ గ్లాసు మంచి నీళ్ళు అందిస్తావా?” -- (ఇవ్వాల్సినది)---

ఎంత సామాన్య దృశ్యమిదీ? ఎంత గొప్ప సజీవ సంబంధపు చిత్రీకరణ. కవితలో గొప్ప పదచిత్రాలు, తాత్విక చర్చలూ ఏమీ లేవు. ఉత్త వచనం. బయట పనిలో అలసి వచ్చిన భార్యో/ప్రియురాలో ఇంటికి వస్తే పూర్వకాలపు కవులలా చమట చుక్కలు వజ్రపుతునకల్లా మెరుస్తున్నాయనకుండా కాసిన్ని మంచినీళ్ళిస్తావా అనిపించటం కవిత్వాన్ని భూమార్గం పట్టించటం కాదూ? చాలా కవితల్లో ఇదే భావనను ఇంకా బలంగా వ్యక్తీకరిస్తాడు శ్రీకాంత్.
***

// “కొద్దిగా తోడు ఉండు నాకు. అప్పుడప్పుడూ చాలా బెంగగా ఉంటుంది – ఒంట్లో బావోలేదు. నాప్కిన్స్ తెచ్చుకోవటానికి ఓపిక లేదు. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది” అని తను ముడుచుకు పోతే, అప్పుడు నువ్వొక నిస్సహాయుడివి. నేలపై వ్యాపించే రాత్రివి. అంత నొప్పిలోనూ ఉదయం తనుకడిగిన ఇంట్లో తన శరీరం వాసన. ఎలెక్ట్రిక్ కుకర్లో ఉడుకుతున్న అన్నం వాసన. తెరచిన బాల్కనీలోంచి చీకటి వాసన//

//కడుపునొప్పికి మాత్రలు, వాలుతున్న తన కనురెప్పల కింద చలించే అరణ్యాలు, నుదిటిపై తెరలుగా వీచే పురాస్మృతులూ… ఇక అరచేతిలో తను నీ అరచేతిని గట్టిగా పట్టుకొని పడుకొంటే//…
//చదువరీ, ఇక ఇప్పటికి ఇదే జీవితం, ఇదే కవిత్వం; నువ్వే చెప్పు ఇక, ఇంతకు మించి వీటన్నిటినీ దాటి మిగిలేది ఏమిటి? నీకూ నాకూ – మనకూ (ఇక ఇప్పటికి)---

అసలు ఇలాంటి కవిత తెలుగులో ఇంతవరకూ వచ్చిందా అని అనుమానమే. ఇది కాదూ జీవితం.
కవిత్వం అంటే సంస్కృత పదాలతో బరువుగా ఉండాలనీ, అమూర్త భావనలతో లోతుగా ఉండాలనీ, ఏవేవో పెద్ద పెద్ద సిద్ధాంతాలను ప్రవచించాలని, సమాజాన్ని ఉద్దరించాలని, ప్రజల్ని గొప్పపనులకై కార్యోన్ముఖుల్ని చేయాలని, అభ్యుదయాన్ని కాంక్షించాలని ఎన్నెన్ని కుట్రలు చేసారూ, ఎన్నెన్ని కట్టుకథలు చెప్పారూ ఇంతవరకూ పెద్దలందరూ అనిపించక మానదు.
ఒక జీవితానుభవం. ఒక మానవీయ దుఃఖం. ఒక తడి సందర్భం. శ్రీకాంత్ వాక్యాల్లోనే చెప్పాలంటే ఇక ఇప్పటికి ఇదే జీవితం, ఇదే కవిత్వం.
***

“భయపడ్డావా” అంటూ తెగిన పెదాలపైనుంచి నెత్తురిని మెత్తగా నీ
తెల్లటి దుప్పట్టాతో తుడిచినా, నా లోపలి వొణుకు ఆగదు//
“ఇలా దగ్గరకు రా. కొరకనులే ఈ సారి. భయపడకు” అంటూ మళ్ళా తనే, నన్ను జాగ్రత్తగా
తన తల్లితనపు పాలిండ్లలో పొదువుకుంటే, ఇక అలా వెచ్చగా ఒదిగి
తన చుట్టూ చేతులు వేసి, తనని గాట్టిగా పట్టుకుని
ఆ చీకట్లలో నా ముఖం దాచుకుని, అలా పడుకుని
బయట కురిసే వానని, తన శరీరంలోని ప్రవాహాన్నీ
వింటుంటే అడుగుతుంది తను, స్ఖలించినంత హాయిగా;
“I like this night and
I like this Bacardi Rum
Do you” ----

ఒకానొక ప్రియురాలి ప్రేమోన్మత్తత. వివశో, పరవశో తెలియదు. కానీ అనుభవం కళ్ళముందు నిలుస్తుంది. శృంగారం ఇక్కడ బహుశా వివాహం వెలుపలది కావొచ్చేమో - జీవితంలో నిషిద్దవస్తువేం కాదుకదా. దాహం వేసినపుడు చల్లని నీళ్ళు తాగినపుడు కలిగే అనుభవాన్ని అద్భుతంగా చెప్పిన ఇస్మాయిల్ మరో చోట యుద్ధాంతాన/కళ్ళు తేలేసి/నిర్వికల్ప సమాధిలో/సర్వాంగాలూ స్తంభించే/యోగిని కూడాను (స్వారీ) అంటాడు. శ్రీకాంత్ కవిత్వం నేలమీదే సంచరిస్తుంది. జీవితంలోంచే వస్తువుల్ని ఏరుకొంటుంది. కథనాత్మకత శ్రీకాంత్ కవిత్వానికి ఆయువు. ఇతని కవిత్వం ఆడంబరాలను, హిపోక్రిసిని దుస్తులుగా ధరించదు.
***

అర్ధరాత్రి నిదురలోంచి లేచొచ్చి, ఒక మూడడుగుల మల్లెపూవు
నా పక్కగా వచ్చి ‘నాన్నా’ అంటో
నన్ను హత్తుకుని పడుకుంది. ఇక
ఆ చీకట్లో ఒక నెగడు రగిలి, పేరులేని సుగంధమేదో
గాలిలో వీయగా, ఎక్కడో కొమ్మల్లో గూళ్ళల్లో
పక్షులు రెక్కలు సర్దుకుంటున్న సవ్వడి://

//కొంత అలజడి, కొంత అబ్బురమూ కొంత
జీవితం పట్ల కృతజ్ఞతా, కొంత
కరుణా, బోల్డంత ఇష్టమూ (ఎలా నిదురోగలం?) --

ఈ కవిత చదివాకా "దినచర్య" అనే మరో కవితలో శ్రీకాంత్ చెప్పిన. “ఇంతా చదివి ఇదేమిటని మీరడిగితే, ఇక నేను ఏమీ చెప్పలేను. నిండుగా సజలమైన ఈ నా హృదయంలో మీ చేయి జార్చి ఒక అద్దాన్ని వెలికి తీసి మిమ్మల్ని మీరు చూసుకోమని చెప్పటం తప్ప” అనే వాక్యాలు గుర్తొస్తాయి.

రాత్రివేళల పిల్లలు మనల్ని కావలించుకోవటమో, మనపైన కాళ్లువేసుకొని పడుకోవటమో ఎవరికి అనుభవంలోనికి రాని విషయాలు? ఎన్ని మెటఫర్లతో ఆ అనుభవాన్ని శ్రీకాంత్ మన అనుభవంలోకి తీసుకొస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. మూడడుగుల మల్లెపూవు, పేరులేని సుగంధం, పక్షులు రెక్కలు సర్దుకోవటం, జీవితం పట్ల కృతజ్ఞత లాంటి ఉపమానాలు ఆ సంఘటనలోని భిన్న కోణాల్ని ఎంతో సటిల్ గా ఆవిష్కరిస్తాయి. ఈ కవిత్వం అంతా శ్రీకాంత్ హృదయంలోంచి తీసిన అద్దంలో మనల్ని మనం చూసుకోవటమే. కవిత్వానికి ఇంతకు మించిన పరమార్ధం ఏముంటుందీ?
***
అమ్మల పై వ్రాసిన కవితలు అనేకం ఈ సంపుటిలో కనిపిస్తాయి. ఒక్కో చోట ఒక్కో కొత్తకోణంలో అమ్మలు కనిపిస్తారు. చాలా చోట్ల ప్రేమ, కొన్ని చోట్ల అమ్మను సరిగ్గా చూసుకోలేకపోతున్నందుకు అపరాధనా భావన, అమ్మ ఎలాఉందో ఈ వేళ అంటూ చేసే ఊహలు.

తాగి వచ్చి సంజాయిషీ చెప్పుకొనే కొడుకుతో “పొద్దుపోయింది వెళ్ళు. వెళ్ళి ఇంత అన్నం తిను. ఖాళీ కడుపుతో పడుకోకు” అని చెపుతుంది అమ్మ ఓ కవితలో.

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ – ఎక్కడో-
నన్ను తలుచుకుంటో
ఏ చింత చెట్ల నీడల కిందో
ఓ ఒంటరి గుమ్మం ముందో
కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు గాటుపై
ఓ చేయుంచుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ (యిలా) -- అంటూ అమ్మ కవి జ్ఞాపకాలలో మెసలుతుంది మరో కవితలో. ఆ వక్షోజపు గాటు పట్టించుకోని కొడుక్కి ఒక మెటానొమి అనుకొంటే ఎంతటి భీతావహమైన ఊహ అది.

తనకొడుకులు వాళ్ళ అమ్మని “అమ్మా నువ్వు తినమ్మా. తిన్నావా లేదా?” అని అడిగినపుడు- అదే మాటను సరైన సమయంలో ఎన్నడైనా నా తల్లిని అడిగానా నేను” అని అమ్మ గుర్తుకొచ్చి వ్యాకుల పడతాడు కవి “ఒక క్షణం” కవితలో.

//ఏమీ లేదు
ఈ ఉదయం ఇంటికి వెళ్ళాను
ఒక అతిధివలే అమ్మని చూసి వచ్చాను// (అతిథి) అనే కవితలో అనివార్యమౌతున్న ఆధునిక జీవన భీభత్సాన్ని కళ్ళకు కడతాడు.
***

శ్రీకాంత్ కవిత్వంలో సమాజం నడుస్తున్న తీరుపట్ల ఆగ్రహం ఉంది. దాన్ని వ్యక్తీకరించిన విధానం కథనాత్మకంగా ఉంటుంది.

ఒక ముస్లిం వ్యక్తి వినాయక నిమజ్జనం రోజున ఇంటికి చేరుకోవటాన్ని వర్ణించిన తీరులో శ్రీకాంత్ జీవన వాస్తవికనుండి ఎస్కేప్ అయ్యే కవికాదు అని అర్ధమౌతుంది.

ఆ ముస్లిమ్ వ్యక్తి రోడ్డుపై ఇంటికి వెళుతున్నప్పుడు “//ఒక మస్జిద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరామ్ అని నినదించలేదు/గణగణగణమనే గంటలతో నుదిటిన త్రిశూలాలవంటి బొట్లతో ఎవరూ అతన్ని భయభ్రాంతుడిని చేయలేదు/అతని ఒళ్ళంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు// అంటాడు. ఒక్కో ఇమేజెరీ నేటి రాజకీయ వికృతక్రీడను శక్తివంతంగా అక్షరీకరిస్తుంది. ఇదే వస్తువుని డమడమల శబ్దాలతో వ్రాసే విధానానికి శ్రీకాంత్ ఎంచుకొన్న శిల్పానికి అసలు పోలిక తేలేం. ఒక సామాజిక అంశాన్ని శక్తివంతంగా చెప్పటానికి శిల్పం యొక్క అవసరం పై కవిత నిరూపిస్తుంది.
***

"పిల్లలు నిన్నుపట్టుకొని ఏడ్చినపుడు" అనే కవితలోని సందర్భం అపురూపమైనది.

“మృత్యువు నుంచి తప్పించుకు వచ్చిన అమ్మాయి” కవితా వస్తువు వినూత్నమైనది. ఆర్థ్రత హృదయాన్ని ద్రవింపచేస్తుంది.

"అమ్మ"అనే కవిత “ఆమె ఎవరైతేనేం?” కవితను స్ఫురింపచేస్తుంది.

"లమ్డికే" కవిత చెర్నకోలతో చరచినట్లుంటుంది.

“మహా మంత్రగత్తె” కవిత మంత్రముగ్ధంగా నడుస్తుంది.

“జణగణమన అంబానీ అను రిలయన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కవిత పల్చగా ఉంది.

“అనేక సార్లు పడుకొని ఉంటాను అతనితో” గొప్ప శక్తివంతమైన వ్యక్తీకరణ.

“ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు” లోతైన భావాలను పొదువుకొన్నది.

“అమ్మ చెప్పిన కథ” ఇంటలెక్చువల్ కవిత.

“ఒక రాత్రి”, “ఒక రోజు” ఇంకా మరికొన్ని కవితలలో హద్దుమీరిన బూతు వాంఛనీయం కాదనిపిస్తుంది. ఇదేమీ విక్టోరియన్ మొరాలిటీ సిద్ధాంత చర్చ కాదుకానీ, తెలుగు నేల ఇంకా ఆ స్థాయిని అందుకోలేదని అనుమానం. బహుశా తెలుగు కవిత్వంలో ఉన్న మోనోటనీని బద్దలుకొట్టటానికే ఆ కవితలు రాసాడేమో.

శ్రీకాంత్ అభివ్యక్తి విలక్షణమైనది. ఇతని వ్యక్తీకరణ పదునుగా, మేధోపరంగా ఉన్నత స్థాయిలో సాగుతుంది. వస్తువులు కూడా ప్రత్యేకమైనవి. విస్తృతి అధికం. మూడునాలుగు కవితలలో అధివాస్తవిక ధోరణులు కనిపించినా అస్పష్టత మాత్రం లేదు.

శ్రీకాంత్ కవిత్వపరంగా లోలోపలకు చేసిన ప్రయాణం సింహభాగంగా ఉంది. బయటకు చేసిన ప్రయాణం కొన్ని కవితలలో తెలుస్తున్నా వానిలో అనుభూతి సాంద్రత లోపించటం గమనిస్తాం. ఇతని కవిత్వాన్ని స్థూలంగా అంతర్ముఖత్వ కవిత్వంగా భావించవచ్చు. శ్రీకాంత్ కవిత్వంలో కథనాత్మకత ప్రముఖంగా కనిపించే శిల్పం. ఆ విషయంలో శ్రీకాంత్ కవిత్వాన్ని బుకోవ్ స్కీ కవిత్వంతో పోల్చవచ్చు.

విభిన్నమైన కవిత్వాన్ని ఇష్టపడేవారికి, అత్యాధునిక వ్యక్తీకరణను తెలుసుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది.

సంపుటి పేరు “శ్రీకాంత్”. దీనిలో మొత్తం 210 కవితలు ఉన్నాయి. పేజీలు 312.

ఫోన్: 9848666846

బొల్లోజు బాబా

No comments:

Post a Comment