Sunday, February 9, 2020

రొట్టమాకు రేవు అవార్డు స్వీకరణ సభలో -- నా స్పందన



శ్రీ కె.ఎల్ నర్సింహారావు గారి పేరిట ఇస్తున్న ఈ రొట్టమాకు రేవు అవార్డును అందుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గౌరవానికి నన్ను పాత్రుణ్ణి చేసిన శ్రీ యాకూబ్, శ్రీమతి శిలాలోలిత దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

అవార్డు ఎంపిక కమిటీ సభ్యులైన శ్రీ వంశీకృష్ణ, శ్రీమతి శిలాలోలిత, శ్రీ రాజారామ్ తూముచర్ల గారలకు మనఃపూర్వక వందనాలు

నాతోపాటు ఈ అవార్డును అందుకొంటున్న శ్రీ నారాయణ స్వామి వెంకటయోగి, శ్రీమతి నిర్మలారాణి తోట గారలకు నా శుభాభినందనలు.

నా గురించి చెప్పుకోవాలంటే.... నేను యానాంలో పుట్టిపెరిగాను. జంతు శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కాకినాడలో నివసిస్తున్నాను. 2006 లో "యానాం విమోచనోద్యమం" , 2009 లో "ఆకుపచ్చని తడిగీతం", 2012 లో "ఫ్రెంచి పాలనలో యానాం" 2016 లో "వెలుతురు తెర", స్వేచ్ఛా విహంగాలు", 2018 లో "కవిత్వ భాష" పేర్లతో పుస్తకాలు వెలువరించాను. ఇవి కాక అనేక సమీక్షా వ్యాసాలు, అనువాదాలు ఇ.బుక్స్ రూపంలో ఉన్నాయి. ఇదీ ఇంతవరకూ చేసిన నా సాహితీ యానం.

మా నాన్న గారు "శ్రీ బొల్లోజు బసవలింగం" గారు పద్యకవి, నాటక రచయిత అవ్వటం వల్ల మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది.
నేను ఇంటర్ కొచ్చాక శ్రీ శిఖామణి గారి కవిత్వం నన్ను ఆకర్షించింది. ఆయనను ఆరాధీంచటం మొదలెట్టాను. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఎన్నో కవిత్వ పుస్తకాలు చదవమని ఇచ్చేవారు. అలా మాది ఈనాటికి గురుశిష్యుల అనుబంధం.
మా ఊరి కవి రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారు నన్నెంతో ప్రోత్సహించేవారు. "ఆకుపచ్చని తడిగీతం" కవిత్వ సంపుటి రావటంలో ఆయన స్పూర్తి, ప్రోత్సాహం మరువలేనిది.
****

ఇక శ్రీ యాకూబ్ గారు కవిగా ప్రసిద్ధులు. ఆయన నెలకి రెండు కవితలు, ఒకటో అరో వ్యాసమూ వ్రాసుకొంటూ ఉన్నా తెలుగు సాహిత్యలోకంలో ఆయన స్థానానికేమీ డోకా ఉండదు. ఈ రోజు యాకూబ్ గారి గురించి మాట్లాడుకోవటం అంటే "కవిసంగమం" గురించి మాట్లాడుకోవటమే. నిజానికి కవిసంగమం ఏర్పడకముందునుంచీ నేను అంతర్జాలంలో ఉన్నాను. అప్పట్లో బ్లాగులుండేవి. ఎవరైనా తమ బ్లాగులో కొత్తగా ఏదైనా వ్రాస్తే వాటి లింకులు కూడలి, మాలిక లాంటి అగ్రిగేటర్లలో కనిపించేవి. ఆ లింకులు పట్టుకొని ఆ పోస్టులను చదువుకోవలసి వచ్చేది. అలాంటి సమయంలో "కవి సంగమం" తెలుగు కవులనందరినీ ఒక చోటికి చేర్చింది. ఒకరికొకర్ని పరిచయం చేసింది.

కవిత్వానికి ప్రింటు మీడియాలో స్పేస్ తగ్గిపోతున్న కాలంలో ఉన్నాం మనం. తెలుగు కవిత్వానికి యువకులు దూరమౌతున్నారు అనుకొనే సమయంలో వారిలో కవిత్వం పట్ల ఆసక్తిని రేకెత్తించింది కవిసంగమం. ఎంతో మంది యువకవుల్ని తయారు చేసింది. నిజానికి తెలుగు సాహిత్యాన్ని "కవి సంగమం" ఒక మలుపు తిప్పింది. ఇదంతా నేను కళ్లారా చూసిన విషయం.

నా "కవిత్వ భాష" పుస్తకాన్ని కవి సంగమానికి అంకితం ఇవ్వటానికి కూడా ప్రధానమైన కారణమిదే.

కవి సంగమం ఎంతమంది యువకవుల్ని తీసుకొచ్చింది, అంతవరకూ వచ్చిన కవిత్వాన్ని ఏఏ వ్యాసాల ద్వారా మదింపు చేసింది, ఏ ఏ ప్రపంచకవుల కవిత్వాన్ని అనువదించి అందించింది, కవిత్వ నిర్మాణ రహస్యాలను ఎలా విప్పిచెప్పింది - వంటి అంశాలపై ఎవరైనా పరిశోధన చేస్తే అది గొప్ప గ్రంధంగా మిగిలిపోతుంది.
***

ఇక నా కవిత్వం గురించి మీకందరకూ కొన్ని అభిప్రాయాలున్నట్లు గానే నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. నా ఆకుపచ్చని తడిగీతంలో చాలా మెత్తని కవిత్వం ఉంటుంది. ప్రకృతి, జీవితం, జీవనానుభూతులు ఎక్కువగా ఉంటాయి. సమాజం తక్కువగా ఉంటుంది.
రెండో పుస్తకం 'వెలుతురు తెరలో" వైయక్తిక అనుభవాలను సామాజిక అనుభవాలు చేయటానికి కొంత ప్రయత్నించాననుకొంటాను. ఉదాహరణకు- నేను జువాలజీ అద్యాపకుడిగా కొన్ని వేల కప్పల డిసెక్షన్లు చేసి ఉంటాను. కప్పలను చంపటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతుందని డిసెక్షన్ లను నిషేదించారు. ఈ రెండు అంశాలను లింక్ చేస్తూ సమతుల్యత అనే కవిత వ్రాసాను.
అదే విధంగా కాలెజి ఫంక్షన్లలో తెల్లగా అందంగా ఉండే అమ్మాయిలతో బొకేలు ఇప్పించటం, ఆహ్వానం చెప్పించటం లాంటివి చేస్తాం. అలాంటి ఒక సందర్భంలో చామనఛాయతో ఉండే ఒక అమ్మాయి హర్ట్ అవ్వటం గమనించాను. ఆ అనుభవం "చర్మం రంగు" కవితగా రూపుదిద్దుకొంది.

ఆ సంపుటిలోని చాలా కవితలకు కూడా ఏదో ఒక సామాజిక సంఘటనా నేపథ్యం ఉంది. నా కవిత్వానికి సైద్దాంతిక నేపథ్యం తక్కువ అనుకొంటాను. అలాగని సమాజానికి దూరంగా ఉండదు. సమాజంలోనే ఉంటుంది.

నా చిన్ని జీవితంలోని, నేను చూసిన, అనుభవించిన అంశాలనే కవిత్వీకరించటానికి ప్రయత్నించాను. నేను చూడని, నాకు తెలియని ప్రపంచాలగురించి నేను మాట్లాడ లేదు.

వెలుతురు తెరలో కథనాత్మక, సంభాషణాత్మక శైలి కనిపిస్తుంది. కధను కవితాత్మకంగా చెప్పటం, కవితలలో సంభాషణలు చొప్పించటం నాకు ఇష్టం. సంభాషణల ద్వారా నా అనుభూతిని సంపూర్ణంగా చెప్పగలుతుతున్నానని నాకు అనిపిస్తుంది. ఇది శిల్ప పరమైన విషయం గా భావిస్తాను.

వెలుతురు తెర తరువాత వ్రాసిన కవితలలో నా కవిత్వంలో కొంత మార్పు గమనించాను. మన చుట్టూ జరుగుతోన్న సంఘటనలు ఎంత మనకు సంబంధం లేక పోయిన అవి మనల్ని పరోక్షంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని గుర్తించాను. సంపుటి సంపుటికీ నా కవిత్వ సారంలో మార్పులు రావటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
***

ఈ రోజు అంతర్జాలంలో దొరకని కవి ఉండడు. నేను ఇతరభాషా కవిత్వాన్ని బాగానే చదువుతూంటాను. ఇలా చదివే ప్రక్రియలో ఒక్కో సమయంలో ఒక్కో కవి పట్ల పిచ్చి పట్టుకొంటుంది. వాటిని కాస్తో కూస్తో అనువదిస్తే తప్ప ఆ పిచ్చి తగ్గదు. 2008 లో టాగూర్ కవిత్వం, 2010 లో సూఫీ కవిత్వం, 2012 లో పాబ్లో నెరుడా, 2015 లో గాధాసప్తశతి, 2016 లో రూమీ వాక్యాలు, ఇదిగో ఇప్పుడు మళయాల కవి కె. సచ్చిదానందన్.
ఇంతవరకూ రెండువందలకు పైగా ప్రపంచ, దేశీయ కవుల కవితలను అనువదించాను.

శ్రీ సచ్చిదానందన్ 100 కవితల అనువాద సంపుటి, నా సొంత కవితల సంపుటులను తీసుకురావాలని ఉంది. త్వరలో తీసుకొని వస్తాను.

కవిత్వభాష పుస్తకంలో కవిత్వం పై వెలిబుచ్చిన నాకున్న కొన్ని అభిప్రాయాలను పంచుకొని ముగిస్తాను

"సాహిత్యం ఒక అనంతమైన నదీప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ, మానవజాతి బౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థల కాలాదుల విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీ తరపు రచనలూ కాల క్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. కవి ఒట్టి సాక్షి మాత్రమే కాక తన ఆలోచనలను కళాత్మకంగా వెలువరించే సృష్టి కర్త కూడా. భక్తికవిత్వం, భావకవిత్వం, సంస్కరణోద్యమ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, దళిత కవిత్వం వంటివి ఆ కాలపు రాజకీయ, సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తాయి.

మానవ జాతికి రెండు చరిత్రలుంటాయి. ఒకటి యుద్ధాలతో, తారీఖులతో, రాజకీయాలతోను మరొకటి సాంస్కృతిక భావాలతోను నిండి ఉంటాయి. రెండో దాన్ని కవులు రచయితలు నిర్మిస్తారు.
****
నా కవిత్వానికి ఇంతటి గౌరవాన్ని, ప్రేమను అందించిన ఈ అవార్డు ప్రదాతలకు సదా కృతజ్ఞుడను.
బొల్లోజు బాబా – 7/10/2018



No comments:

Post a Comment