Sunday, February 9, 2020

యాకూబ్ కవిత్వ “తీగలచింత’


కవిత్వం జీవితాన్ని ప్రతిబింబించాలి అనేది అందరూ అంగీకరించే విషయం. ఏ కవికైనా ఇది కాస్త సాధన చేస్తే అబ్బే విద్యే. కవిత్వాన్ని జీవితంగా చేసుకొని జీవించటం ఒక యోగం. దానికి సాధన ఒకటే సరిపోదు తపస్సు చేయాలి. అలాంటి తపోసంపన్నుడే యాకూబ్. సమకాలీన తెలుగు కవిత్వరంగాన్ని కవిసంగమానికి ముందు తరువాతా అని భవిష్యత్ సాహిత్యచరిత్రకారులు సరిహద్దులు గీస్తారు. డిజిటల్ యుగానికి తగ్గట్టుగా తెలుగు కవిత్వరంగాన్ని సమాయుత్తం చేసి, మెరికల్లాంటి యువకవులకు ఒక వేదికను ఏర్పాటుచేసిన యాకూబ్ మేలు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక ప్లాట్ ఫామ్ లేక ప్రతీ తరంలో ఎంతోమంది కవులు పాఠకపాత్రలలోకి ఇమిడిపోవటం అనాదిగా జరిగేదే.

ఇప్పుడు పిట్టలన్నీ వచ్చి వాలాయి. ఈరోజు అంతర్జాలంలో లేని కవి, బయటా లేనట్టే. ఇది కాలమార్పు. అంగీకరిద్దాం. తెలుగు కవిత్వానికి సంబంధించి ఆ మార్పుకు దోహదపడిన వ్యక్తులలో యాకూబ్ ఒకడని గుర్తుంచుకొందాం.

ఇలాంటి యాకూబ్ వ్రాసిన కవిత్వం ఎలా ఉంటుంది.? “ప్రవహించే జ్ఞాపకం” లాగే ఉంటుంది. “నదీమూలంలాంటి ఇల్లు” లాగే ఉంటుంది…. కిరీటాలు, భుజకీర్తులు అతని ఆత్మను తాకలేవని ఇటీవల విడుదలైన “తీగల చింత” నిరూపిస్తుంది. మనిషిగా, కవిగా యాకూబ్ విజయమిది.
***
యాకూబ్ కు తన అస్తిత్వం స్పష్టంగా తెలుసు. తను ఏ ఒడ్డున నిలుచుని ఉన్నాడో తనకు తెలుసు. వ్యక్తిగతమూ రాజకీయమే అన్న స్పృహ అతనిలో ఉంది. అందుకే అతని కవిత్వంలో సహిష్ణుత పుష్కలంగా ఉంటుంది. కాబట్టే ఈ వాక్యాలను ఎంతో ఇష్టంగా రాయగలిగాడు

కాశిరాజు కోటకు వీపునాన్చి
నీళ్లలో పాదాలు ఆడిస్తున్న చిన్నిపాప
పాప ప్రక్షాళన కోసం పరుగులెత్తుతున్న కాలానికి
ఎదురుగా వచ్చి చేయందించే మనిషి

గంగ:
కొన్ని శంఖాలు, కొంత విభూది, పగలుగా మారే రాత్రి
ఎనభైనాలుగు ఘాట్ లు
సందులు గొందులుగా నడిచే కాశిపురి, మరణించిన షెహనాయి
శోకం, మరికొంత హరిశ్చంద్రుని వారణాసి (కాశిగంగ).

కాశిని చూసిన దృష్టిలో కవి ప్రకటించే విశ్వజనీన ప్రేమే కనిపిస్తుంది. నీళ్లలో పాదాలు ఆడిస్తున్న చిన్నిపాపంత హృదయంలా నిర్మలంగా, స్ఫటికంలా మెరుస్తుంది.
***
ఈ దేశ సహిష్ణుతను భగ్నం చేసే ఏ శక్తులనైనా ఛాతీ చూపించి ఎదుర్కొంటాడు. ఈ యుద్ధం భౌతికం కాకపోవచ్చు. కానీ సహిష్ణుత కోరుకొనే ప్రతి పౌరునికీ ఎంతో మానసిక ధైర్యాన్నిచే తెగింపు ఇది.

ఈనాడు ప్రతీ ఒక్కరూ తన అస్తిత్వాన్ని పదిలపరచుకోవాల్సిన సందర్భం. ఒక మహారక్కసి విలయతాండవం చేస్తూ మనుషులను, సంస్కృతులను, విశ్వాసాలను ఊడ్చుకుపోతున్న సమయమిది. ఈ వలయపు అంచులలో ఉండేవారి పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. కాళ్ళను బలంగా ఈ నేలపై ఆన్చి ఇది నా అస్తిత్వం, ఇవి నా మూలాలు అని చెప్పుకోలేకపోతే మనుగడే ప్రశ్నార్ధకం.

సిరియా బాల శరణార్ధి ఐలన్ కుర్దీని
అలలపై మోసుకువచ్చే చీకటి
రోహింగ్యా కళ్లపై ఎండిన చూపులాంటి చీకటి
కాలంలోంచి కాలంలోకి వొత్తిగిలే చీకటి
వెలుగును లోపలికి జొరబడనీయని చీకటి// (కల చెదిరింది)

సిరియా, రోహింగ్యాల సంక్షోభానికి తెలుగునేలపై జీవించే సగటు మనిషికి సంబంధమేమిటని అమాయకంగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ రోజు ప్రపంచం ఒక ఇంటర్ కనెక్టెడ్ సాలెగూడు. ఒకచోట దారం తెగితే గూడంతా కంపిస్తుంది. ఇదొక బటర్ ఫ్లై సిద్ధాంత ప్రభావం. యాకూబ్ కు ఈ ప్రాపంచిక సత్యం తెలుసు. వెలుగును అడ్డుకొంటున్న చీకటి నీడల్ని ఎరుకపరుస్తున్నాడు పై కవితలో. అస్తిత్వ కవిగా ఇది అతని బాధ్యత.
***
కథువా ఒక్కటే కాదు
పసిప్రాణాలపై వేటువేసే కాటువేసే వేటగాళ్లు
వారికి వంతపాడే నేతలు.
ఆవులు భద్రంగా ఇంటికి చేరే లోకంలో
ఆడపిల్లలను మేసే కాలంలో
తల్లులు ఇక తల్లులను కనడానికి వణికిపోతారు (గిరఫ్తార్ హమ్ హువే)

ఈ రోజు ఆవు భక్తి స్థాయినుంచి ఒక రాజకీయ సింబల్ గా మారిపోయింది. మూక హత్యలు, మూక దాడులు వెనుక ఉన్నది భక్తికాదు. ఉన్మాదం. పై కవితలో కథువాలో రేప్ కు గురయి చనిపోయిన ఎనిమిదేళ్ల పసిపాప ప్రస్తావన, ఆ ఉదంతంలో ఉన్న మతకోణాన్ని ప్రస్తావించి చదువరిని ఆలోచింపచేస్తాడు కవి.
***
1.
నీకిక్కడ చోటులేదు పో….
2.
గుర్తింపు పత్రం ఉందా?
నీ బాబెక్కడ పుట్టాడు?
వాడి తాతెక్కడ పుట్టాడు?
పుట్టినప్పుడు ఈ నేల మట్టి ఒక గుప్పెడు
అమ్మకడుపులోంచి తెచ్చావా లేదా?
తెచ్చినట్టు దృవీకరణ పత్రం ఎక్కడ?
లేదా, అయితే …. పో…పో..// (పౌరసత్యం)

నేడు సిటిజన్ షిప్ ఆక్ట్ పై దేశం మొత్తం మతాలకు అతీతంగా ఆందోళనకు గురవుతున్నది. ఇది నిజమైన సెక్యులరిజం. ఆరువందలేళ్లుగా ఈ మట్టి హృదయాలలో పాదుకొన్న మానవీయ పరిమళం అది. నేనున్నాను అనే నమ్మకాన్ని రాజ్యం కలిగించలేకపోవటం నేటికాలపు విషాదం.

అమ్మకడుపులోంచి గుప్పెడు మట్టి తెచ్చావా అని అడగటంలోని సార్కాజం ఒక పతాక స్థాయి నిరసన. ఈ కవిత మూడునెలల క్రితమే రాయటం గమనార్హం.
***
యాకూబ్ మౌలికంగా భావుకుడు. నిర్మల హృదయుడు. అస్తిత్వవేదన, తన సమూహపు దుఃఖగానం ఇతనికి అనివార్యం. అయినప్పటికీ ఇతనిలోని భావుకుడిని అనేక కవితలు ఇట్టే పట్టి చూపుతూంటాయి.

నీటికొమ్మలమీద తేలియాడుతూ
లేత పసుపువర్ణపు పండులా
ఈ తీయటి సూరీడు (ఫ్రాగ్మెంట్స్)

//వర్షం కురిసినందుకు
మొక్క కృతజ్ఞతగా లేచి నిలబడుతుంది
కొమ్మలు కొన్ని చినుకుల్ని తమకోసం వచ్చే
పిల్లలకోసం దాచుకుంటాయి.// (తడి గురించి) – లాంటి కవితా వాక్యాలలోని సౌందర్యం యాకూబ్ కళాదృష్టికి రుజువులు.
***

తీగల చింతలోని కొన్ని కవితలలో పలుచని నైరాశ్యం తారాడుతుంది. చింతలు తీగెలుతీగెలుగా విస్తరించి “ఇక ఎప్పటికీ తెల్లారనే తెల్లారదా?” అని బేలగా ప్రశ్నింపచేస్తాయి.

“అతనొస్తాడు, తప్పక” అనే కవిత వెండి అంచులాగా మెరుస్తుంది. గొప్ప ఆశావహ ముగింపుతో తళుక్కుమంటుంది.

//అతడి రాక అవసరం-
రావాల్సినపుడు, కావాల్సినప్పుడు, కాపాడాల్సినప్పుడు
తప్పక తప్పక తప్పక
అతడొస్తాడు.

అవును అతడొస్తాడు. అతని కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. అంతవరకూ జీవితమొక “వెయిటింగ్ ఫర్ గోడో” నాటకం.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment