Sunday, February 9, 2020

"యానం కవితలు" ఒక పరిశీలన

(ప్రముఖ కవి శ్రీ శిఖామణి తాజా కవిత్వ సంపుటి "యానం కవితలు" ఒక పరిశీలన)

Is Sikhamani an Exile Poet?

‘When you are in your home, you don’t glorify home: you don’t feel its importance and its intimacy, but when deprived of home, it turns into a need and a lust, as if it is the ultimate aim of the whole journey.’ Mahmoud Darwish

Exile Poetry పై నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి చర్చ జరుగుతున్నది. Mohmoud Darwish, Wadih Saadeh, Adonis, Bertolt Brecht, Yehuda Amichai ల కవిత్వం ఈ రకపు పాయను ఏర్పరచింది. డయాస్పొరా సాహిత్యం సామూహిక అస్తిత్వ ప్రకటన అయితే Exile Poetry వైయక్తికం.

Jo-Marie Claassen States “Exile is a condition in which the protagonist is no longer living or be able to live, in the land of his birth” అంటె మన స్వస్థలం, తల్లిదండ్రులు, స్నేఇతులు ఇంకా చెప్పాలంటే ఇదీ మన ప్రపంచం అని అనుకొంటున్న అన్నింటినుంచీ ఒక్కసారిగా దూరమవటం. ఇది స్వచ్ఛందం కావొచ్చు లేదా బలవంతం కావొచ్చు. చాలామంది తాము చేరుకొన్న కొత్తప్రాంతాలలో- అక్కడి ప్రజల సంస్కృతి, భాష ఇంకా యాసను కూడా నేర్చుకొని చక్కగా కుదురుకొని పరాయీకరణ చెందుతారు. కానీ కవి అలా ఉండలేడు. స్వస్థలపు జ్ఞాపకాలు అతని ఆత్మను దహింపచేస్తూంటాయి. ఆ వియోగం అతన్ని నిత్యం దుఃఖపెడుతూంటుంది. ఆ వియోగం నుంచి విముక్తమవటానికి కవులు తమ స్వస్థలపు బౌతిక మానసిక స్వరూపాలను తమ కవిత్వంలో ఆవిష్కరిస్తారు.

దేశబహిష్కరణకు గురైన కవులు రాసే కవిత్వంలో రాజకీయాలు ఉంటాయి. కానీ శిఖామణి మెరుగైన ఉపాధికొరకు స్వస్థలాన్ని వీడిన కవి. శిఖామణి కవిత్వంలో రాజకీయాల స్థానంలో, జ్ఞాపకాల తలపోత ఉంటుంది. మానవ సంబంధాలలోని ఆర్థ్రత ప్రకటింపబడుతుంది.
***
ఎనిమిదవ శతాబ్దంలో రోమ్ నుంచి బహిష్కరించబడిన Ovid అనే కవి ఆనాటి రోమ్ లోని తన మిత్రులను, తిరిగిన ప్రదేశాలను, జ్ఞాపకాలను కవిత్వంలో భద్రపరచినట్లుగా, యానాం అనే ఒక ప్రాంత అస్తిత్వాన్ని శిఖామణి తన కవిత్వంలో దాచుకొన్నాడు. ఈ కవిత్వం అంతా ఒక కాలానికి చెందిన యానాం భౌగోళిక, సాంస్కృతిక, మానవసంబంధాల ఆవరణం. ఇది చరిత్రపుస్తకాలలో లభించదు. “Nations are to a very large extent invented by their poets and novelists” అని Aldous Huxley అన్నది దీనిగురించే. ఈ కవిత్వం అంతా ఒక Exile కవిగా శిఖామణి ఆత్మావిష్కరణ. ఆత్మావిష్కరణకు సాహిత్యం వినా మరో మార్గం లేదు మానవజాతికి.
***
‘మువ్వల చేతికర్ర’ నాటికి స్వస్థలాన్ని వీడలేదు శిఖామణి. ఆ సంపుటిలో యానాం కవితలు కనిపించవు. ఆ తరువాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వెళ్లవలసి వచ్చినప్పుడు రాసుకొన్న “ఆంతరంగికుని వుత్తరం” కవితలో తాను ఏం కోల్పోయి ఏం పొందుతున్నాడో స్పష్టంగానే చెపుతాడు శిఖామణి

నడివేసవి పొలంగట్టున
తుమ్మచెట్టు నీడలోని నిద్రలాంటి ఊరొదిలి
కలత నిద్రల నగరానికి
కళవల పడి నువ్వెందుకొచ్చావు నా తండ్రీ//
హఠాత్తుగా అర్ధరాత్రి
సిద్దార్థుడు కపిల వస్తును వొదిలినట్లు
ఏయే ధ్యేయాల గమ్యాల పరిసమాప్తి కోసం
ఈ దొంగ ఊబిలో
అడుగు మోపడానికి సాహసించావు?// అనే వాక్యాలలో స్వస్థలం పట్ల తనకున్న అనురాగాన్ని, తాను చేరుకొన్న మహానగరంపై తన ప్రధమ అభిప్రాయాల్ని నిక్కచ్చిగానే చెపుతాడు. ఆ తరువాత రాసిన కవిత్వంలో మహానగరంపై చేసిన వ్యాఖ్యలు కనిపించవు కానీ స్వస్థలంపై ఉన్న మోహం మాత్రం మరింత చిక్కబడి నేటివరకూ నిలిచిఉండటం చూడవచ్చు.

స్వస్థలంలో లేనందుకు వేదన చెందటం, అక్కడే ఉండిపోయిన లేదా గతించిన తల్లిదండ్రులను తలచుకొని దుఃఖపడటం Exile poetry లక్షణం. శిఖామణి అనేక కవితలలో ఈ అంశం కనిపిస్తుంది.

పొట్టచేతపట్టుకొని
కన్న వూరొదిలి
నగరం నట్టడవికొచ్చాను కాబట్టి
ఇంకానీవు
మన స్వస్థలంలో స్వస్థతగానే
ఉన్నావనుకొంటున్నాను
అవున్నాయినా!
మనిషికి స్వస్థలం ఏది?
మనిషికి స్వస్థత ఎక్కడ? (నాయిన 2) పై వాక్యాలలో తాను కన్న వూరొదిలి వచ్చాను కాబట్టి స్వస్థతగా లేదు అన్న అర్ధాన్ని ధ్వనిస్తున్నాడు. చివరకు మనిషికి సొంతూరు ఏది, శాంతి ఎక్కడా అంటూ తాత్వికతలోకి వెళిపోతాడు. ఇదంతా Exile వలన కలిగే ఎడతెగని దుఃఖం పలికించే నిర్వేదం.

Exile కవిత్వంలో తాను చనిపోయాకా స్వస్థలంలోనే తనను పండించాలన్న ఆకాంక్షలు కవులు పదే పదే చెప్పుకోవటం గమనించవచ్చు. Ali foda అనే పాలస్తీనియన్ కవి ఇలా అంటాడు

It is a sin to die in exile
Oh be merciful to me
And take me as a wheat in birds mouth
And bury me there// (2009)

శిఖామణి కవిత్వంలో మృత్యు ఊహలు, మరణానంతర కోర్కెల ప్రస్తావన దాదాపు కనిపించవు. మరీ ముఖ్యంగా ఈ సంపుటిలోని కవిత్వంలో. పై కవితలో ఆలి ఫోదా వెలిబుచ్చిన మనోభీష్టం శిఖామణి తన కవిత్వంలో ఎక్కడా నిక్షిప్తం చేయకపోయినా, సన్నిహితుల వద్ద “ఏదైనా జరిగితే యానాం తీసుకెళ్ళండి” అని చెప్పుకునే ఉన్నాడు. ఎవరికీ అసౌకర్యం కలగకూడదని ఎప్పుడో బంధువులకు ఇచ్చివేసిన పూర్వీకుల ఇంటిని డబ్బు వెచ్చించి తిరిగి కొనుక్కొన్నాడు కూడా.

స్వస్థలానికి దూరమైన కవులు తమ ఊరి భౌగోళిక స్వరూపాన్ని, చిన్ననాటి వ్యక్తులను అనుబంధాలను తమ జ్ఞాపకాలలోంచి వెలికితీసి కవితా వస్తువులుగా చేసుకొంటారు. ఉపరితలంగా చూస్తే ఇది నాస్టాల్జియా కవిత్వంలా కనిపిస్తుంది. లోతుగా గమనిస్తే ఒక ప్రాంతపు ఉనికిని, ఔన్నత్యాన్ని చరిత్రలో దాచిపెడుతున్నారని అర్ధమౌతుంది. Exile సాహిత్యాన్ని ఒకప్పుడు మానవ దుఃఖం, మనోవేదన కోణాలలోంచి చూసిన విమర్శకులు, నేడు Pride, Glorification, Enrichment in the National Literature దృష్టితో అధ్యయనం చేస్తున్నారు. ఇది శిఖామణి కవిత్వానికి కూడా అన్వయం చేసుకోవాలి. ఈ కవితలలోని యానాం తలపోతలు నాస్టాల్జియా కాదు. ఆ మట్టికి, అక్కడి మానవసంబంధాలకు శిఖామణి ఎత్తిన హారతి ఈ కవిత్వమంతా.

ఆది ఆంధ్రపేట, అక్కడి మంచినీటి చెరువు, ఆ చెరువుగట్టున ముత్యాలుగారి ఇల్లు, ఫ్రెంచి జెండాని ఎగరేసిన జెండా స్తంభం, పాతబస్ స్టాండ్ సెంటర్ లోని ఆరణాల షాపు, కవిగారి ఇంటిచుట్టూ ప్రహరీలా విస్తరించిన అడ్డసరం కట్టవ, ఈ ప్రాంతంలో మాత్రమే లభించే పులస చేపలు, ఆర్టోస్ కూల్ డ్రింకు, యానాం-ఎదుర్లంక వారధి వంటి వివిధ విషయాలు యానాం నైసర్గిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి.

శిఖామణి మౌలికంగా మానవసంబంధాల కవి. Exile కవులు తమ జ్ఞాపకాలలోని వ్యక్తులను కవిత్వంలో బ్రతికించుకొంటారు. కవికి సంబంధించినంతవరకూ ఇది ఆయా వ్యక్తుల వియోగభారాన్ని దింపుకొనే ప్రయత్నం కావొచ్చు. ఈ కవిత్వంలో కూడా - తోకమీద నిలబడిన ఆరడుగుల నల్లతాచులాంటి బాప్ప; అవసరానికి చేతిగాజులు ఇచ్చిన శిఖామణి సాహిత్య గురువు శ్రీమతి కందర్ప వెంకట నరసమ్మ గారు; పదే పదే జ్ఞాపకానికొచ్చి కన్నీళ్ళు తెప్పించే దొండపాటి మీరాబాయి; నాయుడు బావకే మందు పెట్టిన గంగిరెడ్ల మరిడమ్మ; ఇవ్వటమే తప్ప తిరిగితీసుకోవటం తెలియని నాయిన, అంకులు గారు; బ్రహ్మ దేవుని మూడు ముఖాల్లా ఎడమొహం పెడమొహం పెట్టుకొనే ముగ్గురు కవులూ; బాల్యాన్ని మూరమూర కోసుకొని అమ్ముకొనే పూలబ్బాయి; ఇద్దరు ప్రభాకరరావు, భాస్కరరావు; చిన్నప్పుడు కవి నోట్లో వడ్లగింజ పడకుండా కాపాడిన చెల్లి గోపెమ్మ; లాంటి వ్యక్తులు రక్తమాంసాలతో సంచరిస్తారు. ఆయా కవితలను చదివిన వారి హృదయాలలోకి సొంతవ్యక్తులుగా ఇంకి పోతారు. ఈ లక్షణమే మానవసంబంధాలను గొప్ప ఆర్థ్రతతో ఆవిష్కరించగలిగే ఒకే ఒక సమకాలీన కవిగా శిఖామణిని నిలిపింది.

శిఖామణి యానాం విడిచి వెళ్ళినా యానాంతో సంబంధాలను కలిగి, పండగలకో పబ్బాలకో వస్తూపోతూనే ఉన్నాడు ఇన్నాళ్ళూ. ఆ వచ్చినప్పుడు కూడా కొన్ని కవితా వస్తువులను ఇక్కడనుంచి ఏరుకొని వెళ్ళిన సందర్భాలు కనిపిస్తాయి. కవి వంకే ఉత్తినే దిగులుగా రాతి చూపులు చూసే రంగూను సన్నికల్లు; ఆకాశమే హద్దుగా, వొఠి ఆరుబయలుగా మిగిలిపోయిన సన్ థియేటర్ లాంటి కవితలు అలా పాత జ్ఞాపకాలను మారిన పరిస్థితుల నేపథ్యంలోంచి దర్శింపచేస్తాయి.
కవి స్వస్థానం విడిచి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అతని జ్ఞాపకాలు చెదలు తినేసిన పటంలా కొద్దికొద్దిగా వాస్తవంలోంచి కనుమరుగు అవుతూంటాయి. కవికి వయసు పెరుగుతున్న కొద్దీ తన జ్ఞాపకాలలో దాచుకొన్న వ్యక్తులు, ప్రదేశాలు కాలక్రమేణా అదృశ్యమౌతూంటాయి. మారిన భౌతిక స్వరూపం, చేరిన కొత్తవ్యక్తులు తాను అంతవరకూ నిర్మించుకొన్న ఊహల్ని భగ్నం చేస్తాయి. ఈ అనుభవాన్ని కూడా శిఖామణి పట్టుకొని “మనిషిలేని ఊరు” కవితలో ఇలా వర్ణిస్తాడు.

ఇప్పుడు
కుశలమడగడానికి
ఇక్కడ మనుషులేరి?
మనిషి లేని వూరూ
ఒక వూరేనా? – అని ప్రశ్నిస్తాడు. గుండెలు పిండే వాస్తవమిది. “యానమా నా ఆరో ప్రాణమా” అని ఎలుగెత్తి , అల్లర్లతో తల్లడిల్లిన యానానికి హ్రుదయాన్ని నవనీతం చేసి పూసి, తనని తాను అరిటాకు చేసుకొని స్వాంతన చేకూర్చి దాన్ని తన కవిత్వంలోకి ఆవాహన చేసిన కవికి ఎదురైన గొప్ప జీవన వైచిత్రి ఇది.
***

మనుషులకు స్వస్థలాల్ని విడిచి పోవటం కొత్తేం కాదు. మానవనాగరికత అంతా అలా పోగుపడిందే. విడిచివచ్చిన స్వస్థలాన్ని గురించి బెంగపడటమూ కవిత్వానికి కొత్తకాదు. ప్రతీ కవీ తన ఊరిగురించో, ఊరిలో చెరువుగురించో, పండగనాటి సంబరాలగురించో కవితలు అల్లే ఉంటాడు. కానీ శిఖామణిలా తన స్వస్థలపు మనుషుల్ని, ప్రదేశాలను, కాలానుగుణంగా వచ్చిన మార్పులను మూడు దశాబ్దాలపాటు కవిత్వంలో నిక్షిప్తం చేస్తూ వచ్చినవారు తెలుగుసాహిత్యంలో మరొకరు కనిపించరు. ఆ రకంగా శిఖామణిని ఒక Exile కవిగా, ఈ పుస్తకంలోని కవిత్వాన్ని Exile కవిత్వంలా భావించటానికి సందేహించక్కరలేదు.

శిఖామణి నిక్కమైన కవికనుక అలా రికార్డు చేసిన చరిత్రాత్మక కవితలలో కనిపించే కవిత్వాంశ కూడా అద్వితీయమే. అందుకనే బాప్ప కవితనో, యానాం సరస్వతి కవితనో, పూలకుర్రాడు కవితనో ఉత్త వైయక్తిక వ్యక్తీకరణలుగా కొట్టిపారేయలేం. ప్రతిఒక్కరూ ఎక్కడో ఒకచోట ఈ కవితలతో కనెక్ట్ అవుతారు. వాటిని సార్వజనీన అనుభూతులుగా హ్రుదయగతం చేసుకొంటారు. శిఖామణి ఏదో సభలో “నేను మూడు రాష్ట్రాల కవిని” అని చమత్కారంగా అన్నట్లు ఈయనకు రెండు అస్తిత్వాలు. ఒక దానిలో నల్లగేటు నందివర్థనం పూలు ఉంటాయి, మరొక అస్తిత్వంలో యానాం కవితలు ఉంటాయి.

(నా సాహితీగురువు శ్రీ శిఖామణి గారి ఆదేశం పై ఈ నాలుగు వాక్యాలు రాయటానికి నాకు ఉన్న అర్హత, నేనుకూడా ఆయనలాగే యానాంలో పుట్టి పెరగటమే అని తలుస్తాను)

బొల్లోజు బాబా
4/10/2019
కాకినాడ

No comments:

Post a Comment