చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1820- 1822 మరియు 1826-1829 ల మధ్య కడపలో పనిచేసాడు. 1846 నుండి 1855 వరకూ మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్ గా ఉద్యోగం చేసాడు.
అదే సమయంలో జరిగిన ఉయ్యలవాడ తిరుగుబాటు బ్రౌన్ ను ఆకర్షించి ఉంటుంది, కడపలోని తన పాత మిత్రులవద్ద ఆ ఉదంతం గురించి కూపీ తీసి ఉంటాడు.
ఉయ్యలవాడ తిరుగుబాటు ఉదృతంగా సాగుతున్న సమయంలో సిపి సుబ్బయ్య అనే వ్యక్తి 14 సెప్టెంబరు, 1846 న బ్రౌన్ కు వ్రాసిన లేఖ ఈ విధంగా ఉంది. అప్పటికి ఇంకా ఉయ్యలవాడ నరసింహారెడ్డి పట్టుబడలేదు.
ఉయ్యలవాడ సరసింహారెడ్డి చరిత్రకు సంబంధించి ఇదొక ఆనాటి కాలానికి చెందిన విలువైన చారిత్రిక ఆధారంగా భావించాలి.
****
మహారాజశ్రీ సి.పి. బ్రౌన్ ఇస్కోయరు గారి సముఖానికి
శేవకుడు సుబ్బయ్య అనేక సలాములు చేసి వ్రాసుకున్న విజ్ఞాపనము. ఈ నెల 14 వ తేది వరకు ప్రభువులవారి అనుగ్రహము వల్లను కడపలో క్షేమం. అచ్చట ప్రభువులవార్లయొక్క క్షేమ సంతోషాతిశయములు మాకు తెలిపి సంతోషం పొందుటకు అనుగ్రహ పత్రికె దయచేసి అంపించవలయునని ప్రార్థిస్తున్నాను.
ఇటీవల కర్నూలులో రెడ్డిగారిగుండా ఎక్కువలు జరిగినట్లు తెలియనందున విజ్ఞాపనం వ్రాసుకోనభ్యంతరమైనది.... సముఖానకు వస్తున్నానని తెలియపరుచుకున్న ప్రకారం ఈ నెల 6 తేదిని ప్రయాణమై మొన్నటి రోజున కడపకు వచ్చి చేరినాను.
ఇచ్చట కడపలోనున్న చుట్టుపక్కల 5, 6 ఆమడ పరియంతం రెడ్డియొక్క భయం వల్లను ధనికులు ఊళ్ళు విడిపెట్టిపోయినారు. ధనము మాత్రం బైట జాగ్రతపరచుకొన్నారు.
కడమ సాధారణమైనవారు సాయింత్రం అయిదు, అయిదున్నర గంటలకు వీధి తలుపులు పెరటి తలుపులు వేసుకునేవారు. కొందరు ఆ వేళకే భోజనములు కాచేసుకొని పక్కవీధులలో నిరుపేదలైన వారి ఇండ్లలో పరుండేవారున్ను పల్లెలకు పోయి పరుండేవారుగా ఉన్నారు.
ఇదికాక పదిరోజుల నాడు ఇచ్చటి సెషన్ జెడ్జి గారికి రెడ్డి అర్జి మూలముగా కడప ఖజానా కొళ్ళకు వస్తున్నాను మీరు వుండవలసిన జాగ్రతలో వుండవలసినదని తెలియజేసుకున్నాడు. అది మొదలు ఖజానా వద్దను 200 సిపాయిలను కత్తులు తుపాకిలతో సిద్దపరచి కావలి వుంచినారు. జావాన్ లు మొదలు తుపాకిలు కత్తులతో వుషారుగా ఉన్నారు.
అయితే రెడ్డిగారి తరపు దివిటీ దొంగల వుపద్రవము వల్లను ప్రజలు అత్యంతమైన భీతిని పొందుతున్నారు. 5-6 రోజుల కిందట దివిటి దొంగలు వచ్చి రెండు ఇండ్లు దోచుకునిపోయినారు. వారు రావడం 150-200 దివిటీలు వేసుకొని బొగ్గులు పూసుకుని తుపాకిలు కాల్చుకుంటూ వచ్చి యిండ్లలో జొరబడి వున్నవల్లా యెత్తుకొని చేతుల వేళ్లకు గుడ్డలు చుట్టి నూనె పోసి ముట్టించి వున్న ద్రవ్యమంతా అగుపరచమని శ్రమపెట్టుతున్నారని ఇచ్చటి వార్తలవల్లను తెలిసినది.
నేను ఇచ్చటికి వచ్చిన రోజు సమాచారం బెతం చెరువువద్దను రెడ్డిగారు ఉన్నారని కడప కలకటరు వారు యింకా కొంత జనమున్ను కర్నూల్ నుంచి కమిషనర్ వారు కొంత తురుపున్నుపోయి కాచివుండగా, సదరు రెడ్డిగారు కొవెలగుంట తాలూకాకు వచ్చి పొద్దుటూరిలో ఉండేవారికి ఒక వుత్తరం మూలంగా రెండు మూడు రోజులలో ఈవూరు కొళ్ళకు వస్తున్నాను మీరు తగు జాగ్రత్తలో వుండవల్సినదని వ్రాసిన వుత్తరమును కలకటరువారి వద్దికి అంపించగా కలకటరు వారు పొద్దుటూరికి పోవుటకు 4 కుంపిణిలను దౌడు అంపించమని వ్రాసిన ప్రకారం అంపించినారున్ను, కొంతమంది జవానులను నూతనముగా జీవనము కలగచేసి అచ్చటికి సహాయార్ధమై అంపించినారు. యింతకు మించిన సమాచారములు తెలియలేదు. చక్కగా విచారించుకొని వస్తున్నాను.
కర్నూలు వద్ద జరిగే సంగతులు ప్రభువుల వారికి విశదమయ్యేకొరకకు అచ్చట వుండే రైటరు గుండా సముఖానకు అర్జీవచ్చును. ఒక వేళ నా పేర వచ్చిన దొరవారు చిత్తగించవలసినది. ఇచ్చట జరిగే సమాచారములు ఇచ్చట నాకు మిక్కి స్నేహితుడున్నాడు గన్కు ఆయనగుండా ముందు వుత్తరములు వచ్చేలాగున జాగ్రత్త పరచివున్నాను. దివ్యచిత్తానకు తేవలెను.
నేను రేపటిదినం ఇచ్చటనుండి తర్లి వస్తున్నాను. దివ్యచిత్తానకు తెచ్చి రక్షించకోరుతున్నాను
ఇదే అనేక సలాములు
sir,
your most obedient
humble servant
C. Soobiah
Cuddapah
14-sept. 1846
*****
ఈ లేఖను బంగోరె మద్రాసు ఆర్చైవ్స్ నుండి వెలికి తీసాడు. ఈ లేఖ బంగొరె సంకలన పరచిన "బ్రౌన్ జాబుల్లో కడప చారిత్రిక శకలాలు" (1977) అనే పుస్తకంలో ఉంది.
బ్రౌన్ బహుసా తనవద్దకు వస్తాను అన్న ఈ సుబ్బయ్య అనే వ్యక్తిని కడప వెళ్లి నరసింహారెడ్డి తిరుగుబాటు విషయాలు తెలియచేయమని అడిగి ఉంటాడు. సుబ్బయ్య మద్రాసు వస్తూ వస్తూ కడపలో ఆగి వివరాలు సేకరించి అక్కడ నుంచి ఈ ఉత్తరం వ్రాసి - తదుపరి సమాచారం బ్రౌన్ కు తెలియచేయమని ఒక స్నేహితుడికి, అక్కడి ఓ రైటరుకు అప్పగించి బయలుదేరి ఉంటాడు. వాళ్ళిద్దరూ బ్రౌన్ కు వ్రాసిన జాబులు దొరికితే వుయ్యలవాడ గురించి మరింత సమాచారం లభించే అవకాసం ఉంటుంది.
మొత్తం ఉత్తరంలో ఆసక్తి కలిగించే అంశమేమంటే కొల్లగొట్టటానికి వస్తున్నాను అంటూ ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయటం. ఇది ధైర్యమా, పక్కదోవపట్టించే వ్యూహమా, లేక పుకార్లా అనేది తెలియదు. ఎందుకంటే సెప్టెంబరునాటికే కాలికి గాయమై నరసింహారెడ్డి నల్లమల అడవులలో దుర్భేద్యమైన రహస్యప్రదేశాలకు వెళ్ళిపోయినట్లు రికార్డులు చెపుతున్నాయి.
నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్యద్వారా 16 ఏండ్ల కొడుకు, రెండో భార్యద్వారా ఒక కుమార్తె, మూడో భార్యకు ఇద్దరు కొడుకులు. వీరందరినీ అప్పటికే కడపలో ఒక బంగళాలో గృహనిర్భంధం చేసి నరసింహారెడ్డికి రావాల్సిన పించనును వాళ్లకు బృతిగా ఏర్పాటు చేసింది కంపనీ.
1846 అక్టోబర్ 6 న వంటమనిషి ద్వారా మత్తుమందు ఇప్పించి నరసింహారెడ్డిని అరెస్టు చేసాడు కడప కలక్టర్ కాక్రేన్
బొల్లోజు బాబా
(రిఫరెన్స్: బంగోరే బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు కడపజాబుల సంకలనం అనుబంధం 1 ---- దీనికి మూలం మద్రాసు ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రేరీలో బ్రౌన్ జాబుల సంపుటం ఎమ్ 419 పేజీ 126)
No comments:
Post a Comment