Sunday, February 9, 2020

A Wonderful insight in to the poetry of all my three books.



Thank you Sreeram Puppala for a wonderful gift
-

గుండె పూడిక ఎవరైనా తీస్తే బాగుణ్ణు  -   శ్రీరామ్ - 24

****

“అస్తిత్వం అనేది గోనె సంచిలో తీసుకెళ్ళి ఊరిచివర విడిచినా తోకూపుకుంటూ వచ్చి చేరే పిల్లి పిల్ల లాంటిది". బాబా కొత్తపుస్తకంలోని కవితా వాక్యమిది.

బాబా పేరెత్తగానే నాకెందుకో ఇస్మాయిల్ గారూ,శిఖామణిగారు చఠుక్కున గుర్తొస్తారు.అదొక అసంకల్పిత చర్య.దానికొ సంకల్పిత కారణముంది.బాబా ఇస్మాయిల్ అవార్డు స్వీకరించినందుకో, బాబా కవిత్వమంటే ఇస్మాయిల్ స్కూలనే సూత్రీకరణం కోసమో కాదు.ఇస్మాయిల్ గారి ఆల్టర్నేట్ నేరేటివ్స్ (alternate narratives) కావాలీ రావాలీ అని సమయం చిక్కినప్పుడల్లా అరచిగీపెట్టే బాబా ఉద్దేశ్యం దాచేస్తే దాగేది కాదు. మరింకే వ్యతిరేకవాదమో (?) తటస్థించినా నా తప్పు కాదు.

‌అలాగే శిఖామణిగారెందుకు గుర్తొస్తారంటే ఆయన బాబాకు సాహితీ గురువు ;దళితసాహిత్యసృహ, ‌సామాజిక సంవేదన‌ల్ని పక్కనబెడితే శిఖామణిగారి కవిత్వంలోని దయ కరుణ,మృదుత్వం ఇత్యాది మానవీయ లక్షణాల ప్రభావం బాబామీదుంది.

ఆకుపచ్చని తడిగీతం,వెలుతురుతెర కవితా సంపుటాలు కవిగా బాబా సత్తాని ఇప్పటికే నిరూపించాయి. ఇప్పుడు మూడో కన్నీటి చుక్క సంపుటి తెచ్చాడు. బాబా అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం పట్ల కొత్తగా చర్చేమీ అవసరం లేదు కానీ బాబా లేటెస్టు పుస్తకం మునుపటి పుస్తకాల కన్నా చాలా భిన్నంగా కన్పించింది. ఏం డిఫరెన్సు కనబడిందో తెలుసునా ? ఫ్రాగ్మెంట్స్ అలానే వున్నాయి.తనకిష్టమైన పిచ్చుక మీద ఈసారీ మరో కవిత రాశాడు. ప్రకృతిని ఆలంబన చేసుకున్న చాలా కవితలూ ఎప్పటిలానే వున్నాయి.మరి మార్పేమిటంటే..మూడో కన్నీటి చుక్కలో కేవలం బాబా అభిరుచి కన్నా కొత్త ఆలోచనాభిముఖత ఎక్కువ నచ్చుతుంది. ఇది సాధారణీకరణ చెయ్యడం కాదుగానీ బాబా కవిత్వమీ పుస్తకంలో చాలా సూటిగా స్పష్టంగా వుంది. శైలిలో ఎక్కువ మెలికలు లేవు. మెలికలనగా తన భావచిత్రావిష్కరణలో వుండే వివిధ పొరలూ (layers); సంక్లిష్టతా ఈ బుక్ లో లేవు. ఉదాహరణకి ఆకుపచ్చని తడిగీతంలో “అంతరించబోతున్న పిచ్చుకలపై” అన్న కవితలో

“నువ్వు వస్తావని గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటిస్లాబ్ ఇనుపకొక్కానికి,కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తుంది.
తరువాత 'మీ వంతు' అంటూ భయపెడుతోంది" అంటాడు. అదే వస్తువు మీది లేటేస్టు కవిత చూడండి

పిచ్చుకా!నిన్నటిదాకా నీవు ప్రయాణించిన మార్గాన్నీ
పడిలేచిన నీ ఆత్మనీ చూడాలనిపిస్తుంది
కొత్త రహస్యాలేమైనా బోధపడుతాయేమో!(పిట్టగోడపై వాలిన పిచ్చుక)

బాబా ఆలోచనాభిముఖ ధోరణి కొత్తదేమీ కాదు.ఆ మాటకొస్తే అతను ప్రతీ వాక్యాన్ని సంవేద్యీకరణంగానే వ్రాస్తాడు. చేతనావంతమైన కవిలానే రాస్తాడు.అయితే ఇప్పుడతని ఆలోచనలోకి వ్యక్తికన్నా,వ్యక్తిగతానుభవం కన్నా తన చుట్టూ జరుగుతున్న కుట్రలకు, అన్యాయాలకు అతను ప్రతిస్పందించడం కనిపించింది. అతని అనుభవంలోకి వచ్చినా రాకున్నా కూడా దాన్ని గురించి ఆలోచించడంలో కవిగా తన కొత్త ఉనికిని గుర్తుచేస్తుంది.'ఇప్పడీదేశానికి ఏమైందీ' (మూ.క.చు - కుట్రలు) అని నేరుగా అడుగుతాడు.'అప్రియసత్యాలు చెప్పినందుకు నా దేహాన్ని బూడిద చేశారనే' కొత్త వాక్యహృదయంతో విలవిల్లాడిపోతాడు.దేశ కాలాల గురించి బాబా కన్నీరుమున్నీరైన గొప్ప సోషలిస్టు వాస్తవిక కవిత్వం రాశాడననుగానీ,ఇప్పటిదాకా తనలో తానే వినిపించుకునేట్టుండే శబ్దాలిప్పుడు బయటకి గుసగుసల్లా మాత్రం వినపడవు.

మొదటి పుస్తకంలో బాబా కవిత్వమంతా సమూహంలోంచి బయటపడాలన్న ప్రయత్నంగా కనిపిస్తుంది. ఏకాంతధ్యానం. టీచరుగా తన శిష్యుల "సార్ గారండి" మాటకి పరవశిస్తాడు.

సముద్రం తరపున నీళ్ళు వకాల్తా తీస్కుని
ఎట్లయితే ఆటుపోట్లని సృష్టించలేవో;అలాగే
ఒకరి దప్పిక, ఆకలి నొప్పులను,మరొకరు పూరింపలేరు
అయినాసరే లోకం దృష్టిలో మనిద్దరిదీ ఎప్పటికీ అన్యోన్య దాంపత్యమే (ఆ.త.గీ - నువ్వు నువ్వే-నేను నేనే) అంటాడు.

ఇతని ఒంటరితనాన్నేమనాలి? వెలుతురు తెర పుస్తకంలోనూ బాబా కవిత్వాన్ని గురించి -- స్వగతం కాదు, ఉపన్యాసం కాదు (ఫ్రాగ్మెంట్స్) అని నిర్వచిస్తాడు. నాకు శ్రీకాంతశర్మగారే గుర్తొచ్చారు."మానవ జీవితంలో ఎన్నో సున్నితమైనవీ, తళతళమెరిసేవీ, కళ్ళు మిరిమిట్లు గొలిపేవీ,అంతరంగానికి ఒక విస్పోటనంలాగ ఎరుక కలిగించేవీ అనుభూతులున్నాయి.వాటికి సాహిత్యంలో ప్రవేశించే హక్కుంది.దీనిని కాదని ఏ రాజకీయాన్ని తెచ్చి కవిత్వంగా నమ్మించజూసినా సహించవలసిన అవసరం ఏ కవికీ లేదు-(అనుభూతి కవిత్వం). బాబా అదే నమ్మకాన్ని కలిగిన కవి. సౌందర్యోపాసకుడు. ఈ కవితలు చూడండి

కాలానికో, ప్రేమకో వినమ్రంగా నమస్కరించి అస్తిత్వాన్నో ఆత్మనో
ఆనందంగా సమర్పించుకోవడంలో ఎంతటి జీవన సౌందర్యముందీ (ఆ.త.గీ -- జీవన సౌందర్యం) -- సమర్పించడం దేన్ని పొందడం కోసం ?
**
ఆమె నీడ నగ్నంగా మారి నన్ను కౌగిలించుకుంది. బిరుతెక్కిన కుచాగ్రాలు గుచ్చుకున్నాయి వృత్తిధర్మం ఎరిగిన వేశ్యలా నన్ను నేను విప్పుకుని అర్పించుకున్నాను (మూ.క.చు -- మోహం)-- ఈ అర్పించడం ఏమిటి ?

**
వాస్తవాన్నొప్పుకోనిదో, ఒప్పుకునేదో కవి తన సౌందర్యారాధనలోని అనుభూతి దగ్గరే ఆగిపోతున్నడప్పుడు మనకే ఫీలింగ్ కలుగుతుంది ? కవిగానీ, కథకుడుగానీ, ఆ మాటకొస్తే ఏ సాహిత్యకారుడైనా తన అనుభవంతో లింకై వున్న వాస్తవికతకి హేతుబద్దంగా ప్రతిస్పందించే లక్షణాన్ని బట్టే ఆ కవి ఏ ప్రపంచాకాశానికి కావాల్సిన సూర్యుడో చంద్రుడో తెలుస్తుంది.హేతుబద్దత సౌందర్యాధనకీ,దాని అనేకానేక భావనలకి,అతీతమైనది కాదు. "సౌందర్యం కేవలం వస్తువుల సహజసిద్ద లక్షణాల ఫలితం మాత్రమే కాదని, అది మానవుని కార్యాచరణ, మానవుని దృక్కోణం ఫలితంగా మానవీకరణ చెందడం ద్వారా బహిర్గతమయ్యేదని" (బీ సూర్య సాగర్ - సాహిత్యం సౌందర్యం) చెబుతారు. బాబా జీవనసౌందర్యంలో అతను జీవితం ఎలా ఉందో ఎలా ఉండాలని కోరుకుంటాడో మనకు తెలుస్తుంది. అందుకే "జీవించి ఉండటంలోని సౌందర్యం కొద్ది కొద్దిగా అర్ధమవుతోంది వాడికి" (మూ.క.చు -- ఆట) అని అంటాడొకచోట.

బాబా మొదట్నుంచీ ఏ పక్షం వహించి రాస్తున్నాడన్నదాన్ని నిర్ధారించాల్సొస్తే అదంత తేలిగ్గా తేలే విషయం కాదు.ఒక‌ స్టాండ్ తీస్కున్న నేల కనబడదు.ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ నేరేటివ్స్ (Alternate narratives) కనుక్కోవడంలోనే బాబా నిమగ్నమయ్యాడనిపిస్తుంది.అనిర్ధిష్టత (నైరూప్య ప్రేమ కాదు) పట్ల బాబాకి గల సుముఖతే అతని దృక్పధాతీత వ్యక్తీకరణకి ప్రధానకారణం. అతనికి వయక్తికమూ, సామాజికమూ లాంటి రొటీన్ చట్రాల్ని బద్దలుకొట్టాలన్న తీవ్రమైన కాంక్ష ఉంది. లేకపోతే ఈలాంటి కవిత రాయడు. చూడండి-

ఈ ప్రపంచం నిన్నెలా చూడాలనుకుంటుందో అలా వేషం కట్టి ఆత్మలోకంలో అమ్ముడుపోకు.
అబద్దపు వేషం పదే పదే కట్టి
నువ్వే ఓ నిలువెత్తు అబద్దంగా మారిపోకు
ఈ ప్రపంచం ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తుందో
అదే నీ అస్తిత్వం; వాటిని కోల్పోకు;
కర్ణుడు కవచకుండలాల్ని కోల్పోయినట్లు (మూ.క.చు - అస్తిత్వం)
అంటాడు. అతనే పర్స్పెక్టివ్ (Perspective) తో రాస్తున్నాడో వెతకాలనిపిస్తుంది కానీ, అతను ఇంకా కవిత్వానికి భౌతికంగా ఆపాదిస్తున్న లక్షణాల్ని వ్యతిరేకిస్తున్నాడు. అందుకే Personal అన్న కవిత రాయగలిగాడు. తనకుతానుగా మతవాదిని, కమ్మ్యూనిస్టుని అని ప్రకటించుకోవడానికి వెనుకాడ్డు. కానీ వాటికిచ్చే కొత్త నిర్వచనాలే కళ్ళను మిరుమిట్లు గొలుపుతాయి. మనం బొక్కబోర్లా పడిపోయినా లెక్కచేస్తాడా ? లేనే లేదు. బేఫికర్ కవి కదా మరి.

“మతం అంటే భగవంతునితో నే చేసే ఏకాంత సంభషణ
చిడతలు పట్టుకున్న సమూహంలోను త్రిశూలాలు తిప్పుతున్న బృందాలలోనూ నే లేను -- జై శ్రీరాం

కమ్మ్యూనిజం అంటే సమాజం పట్ల నాకున్న వ్యక్తిగత బాధ్యత
జండాలు పట్టుకున్న సమూహాలలోను, తుపాకులు మోస్తున్న బృందాలలోనూ నేను లేను -- లాల్ సలాం” అని రాస్తాడు.
అతని ఏకాంత మత సంభాషణ సంగతి పక్కనపెడితే, ఒక రాజకీయార్ధిక సిద్దాంతమైన కమ్మ్యూనిజం పట్ల అతని వైఖరి ఈ పుస్తకంలో తెలియరావడం సంతోషించదగ్గ పరిణామం. ఎర్ర జండాలపట్ల, తుపాకులుమోసేవారిపట్ల బాబా థాట్ ప్రాసెస్ క్షుణ్ణంగా తెల్సిపోయింది. ఇలా ముందు పుస్తకాల్లో రాయలేదు. ఇప్పటిదాకా ఎందుకిలా రాయలేదని నేనంటే కుదిరే పనేనా ? కాలానుగుణంగా కవి తనకుతాను సాధించే స్పష్టతే తన రచనలో ప్రతిఫలించే గొప్ప లక్షణం కదా!

ఆకుపచ్చని తడిగీతం లో స్త్రీట్ చీమలు, పోలవరం నిర్వాసితులకోసం, రెండు దేశాలు, ఆసుపత్రిలో చావు లాంటి కవితల్లో బాబా తను నిర్వచించిన సమాజం పట్ల తన వ్యక్తిగత బాధ్యత మాత్రమే కనిపించదు. కవిగా సామాజిక దుస్తితులపట్ల తన అసహనం, కోపం, నిస్సహాయతల్లో తన Intelectual element ఎక్కువగా లేకపోయినప్పటికీ ఒక ద్రవీభూత ప్రతిస్పందనే మనల్ని కదిలిస్తుంది. బాధ్యతని గుర్తించడానికీ, లిప్తకాలంలో ప్రతిస్పందించడానికీ పోటీపెడితే దేనికి మొదటి స్థానమివ్వాలో, ఏ పాఠకుడైనా దేనికిస్తాడో ఆట్టే ఎక్కువ ఆలోచించనక్కరలేదు. అలానే వెలుతురు తెర లో కూడా ఒక కవితలో--

ఆమెనెందుకు తీసుకురాలేదూ ?
“ప్లీజ్”
రక్తనాళాల్లోకి దొంగలా ప్రవేశించిన అబార్షన్ పిల్ గోడపై విచ్చుకుంటున్న చామంతి మొగ్గను చిదిమేసింది (అపుత్రస్య) అని అన్నప్పుడో --

ఎవరో నా చేతిలో పూల రేకులు పెట్టారు
వాడువేసే అడుగు అడుక్కీ పూల రేకులు చల్లాను
ఇంటికొచ్చి చూసుకుంటే నా చేతుల నిండా రక్తం(రక్తం మరకలు)
అంటాడు.

కవి భ్రూణ హత్య జరిగినప్పుడు బాధపడ్డాడు. అనకిష్టమైన పూలని రక్తంతో సమానంగా భావించాడు. బాబాలో భావవాద- సామాజిక వాస్తవికతల మధ్య ఒక దృక్పధ స్థిరత్వం కోసం జరిగిన పెనుగులాట రెండు పుస్తకాల్లో బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మూడో కన్నీటి చుక్కలో అతని ఆలోచనల్లో ఒక settled; అనగా స్థిరంగా మాత్రమే రాస్తున్న మానసిక స్థితి కనిపిస్తుంది.

మొదటిపుస్తకం లో నే -- నైట్ షిఫ్ట్ కేబిన్ మేష్టారు అన్న కవితలో - తప్పుకున్న పట్టాల మధ్య పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి తనో నిలువెత్తు ఎర్ర జండాయై -- అని కూడా ప్రస్తావిస్తాడు. బీసీ అంటే ఎవరు నాన్నా అన్న కవితలోనూ సమజంలోని కులభూయిష్టమైన ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తాడు. పద్మశాలీయుని, విశ్వబ్రాహ్మనుని, కుమ్మరిని, దూదేకుల వారిని, బెస్తవానిని, గీతకార్మికుని గురించిన వేదన వినిపిస్తాడు. అదే కవితలో -- ద్రోణాచార్యుడు ఒక వేలే అడిగాడు కానీ, పారిశ్రామిక విప్లవాచార్యుడు కోరిన వేన వేళ్ళ దేహాల సంతతి అని చెప్పనా ? అని కూడా అడుగుతాడు. బాబా ముందు రెండు పుస్తకాల్లో ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో తడబడ్డాడేమో కానీ, మూడో కన్నీటి చుక్కలో మాత్రం సమాధానాల్లోని విషయానికి (వస్తువుకి) మాత్రం తనదైన స్పష్టత ఇచ్చాడనిపించింది. జై శ్రీరామనీ అన్నాడు; లాల్ సలామనీ అన్నాడు. శిల్పమెంత ఘనమై ఉన్నదో తనదైన సారమూ అంతే స్పష్టంగా ఉంది. కానైతే బాబా కూడా కవిత్వం యొక్క సామాజిక ప్రయోజకత్వానికి వయక్తిక మార్పు కూడా చదువరి హృదయంలో దీపం పెట్టగలదన్న నమ్మకాన్ని వెల్లడిస్తాడు. “అనుభవాన్ని బుద్దిలా ఖండఖండాలుగా విశ్లేషించకుండా సమగ్రంగా సంపూర్ణంగా స్వీకరించగలదు ఈ హృదయమనేది” (కవిత్వంలో నిశబ్దం) అన్న ఇస్మాయిల్ గార్ని జ్ఞాపకానికి తెస్తాడు. బాబా ప్రధానంగా హృదయవాది. అతని కవితల్లో దేశం, సమాజం, వర్గం, వైరుధ్యం, రాజకీయం, దాని రాక్షసత్వం కన్నా ప్రాణాన్ని భయపెట్టే మృత్యువు, జ్ఞాపకాల్ని వెంటాడే స్వప్నార్హతలు, మళ్ళీ మళ్ళీ ఆత్మల (అంతరాత్మ కాదు) ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది.

మూడో కన్నీటిచుక్క లో కవితా శిల్పం చాలా బిగుతుగా ఉండి విగ్రహం పుష్టిగా ఉంటుంది. స్కిన్ ట్రేడ్, సోషల్ ఇంజినీరింగ్, దుక్ఖ ద్వారం కవితలు ఊపిరి బిగదీస్తాయి. అతని స్వానుభవాన్ని మాత్రమే ఆశ్రయించకుండా కొత్త ఆలోచనలోకి దూకిన బాబా కనిపిస్తాడు.

జీవితం అప్పుడపుడూ కాసేపాగి
తన సెల్ఫీ తానే తీసుకుంటుంది
ఒక్కో ఫోటో రక్తమూ కన్నీళ్ళూ నింపుకున్న కవిత్వమై చరిత్రలోకి ఇంకిపోతుంది (సెల్ఫీ) అన్నప్పుడు -- వెలుతుతెర లో “పునర్జన్మించాల్సిన జీవనకాంక్ష ఎంతకీ కలగట్లేదు. ఇక శెలవ్” (కవిత్వం) అన్నదానికన్నా చాలా బాగుంది. అలాగే మూడో కన్నీటి చుక్క పుస్తకంలో --

జీవించడమంటే ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవడం కదూ ? (Alone but together). లాంటి మాటలకన్నా --

గౌరీ లంకేష్ వర్ధంతిని పురస్కరించుకుని -- అనామక శవాలతో చప్పగా ప్రవహించే చరిత్రకు ఒక వర్ధంతిని బహూకరించడం మామూలు విషయమా ! అభినందనలు లాంటి మాటలకన్నా -

తిరస్కరించిన తరువాత ద్వేషించనక్కరలేదని చక్కగా ప్రేమించుకోవచ్చన్న ! (చక్కగా ప్రేమించుకోక) మాటలు

జీవిత పర్యంతమూ పరిమళించీ పరిమళించీ పూదోటగా విస్తరించడానికే నువు ఇక్కడికి వచ్చావు (పూలదోట) అన్న భావనలు చాలా బాగుంటాయి. బాబా మీద అంతకుముందు లేని ఇష్టం ఎక్కువగా కలుగుతుంది.

ఈ బుక్లో, స్త్రీల పట్ల బాబా ఆలోచనలు, నాన్న తో తన అనుబంధం, గురుప్రేమ బాగుంటాయి. నాన్నతనాన్ని ఎలా అక్షరబద్దం చేస్తాడో చూడండి --

నాన్నతనాన్ని బజార్లో ఎక్కడున్నా ఇట్టే గుర్తుపట్టేయొచ్చు
సైజులు సరిపోకపోతే మారుస్తారు కదూ అంటో పిల్లల బట్టల షాపులోనో; స్కూలు విడిచాక వస్తూన్న పిల్లల గుంపులోంచి "డాడీ" అన్న పిలుపు వచ్చిన వైపు అసంకల్పితంగానో
ఎగ్జాం సెంటర్ వద్దనో...ఎక్కడైనా సరే నాన్నతనం తేలిగ్గానే దొరికిపోతుంది (నాన్నతనం) అంటాడు. నాన్న గురించి ఎక్కడ ఏం చదివినా ఇది కలిగించే భావ సంచలనం వేరు. అలాగే స్త్రీపట్ల ఆ మూడు రోజులు, ముల్లు తీయించుకోవడం, గాయాల స్వాస కవితలు ఆలోచనతో పాటు ఉద్వేగాన్ని కలిగిస్తాయి. చాలా మంది మగవాళ్ళం మనమే ఏదో ఉద్దరిస్తున్నట్టు ఇంట్లో ఆడవాళ్ళతో ఏం పని ఉంటుంది నీకు ? అనేస్తుంటాం. అదే కవితా శీర్షికతో బాబా రాసిన కవిత చద్దివాక ఏ మగవాడూ ఇంకలా అడగడు. నిజం. ఆమె పనిచెయ్యకపోతే ఇల్లెలా ఉంటుందో చివర ఒకేఒక్క మాటలో చెప్తాడు.

ఇల్లు మొత్తం
క్వారీ పక్కన జుత్తు నెరసి కాంతి నశించిన చెట్టులా ఉంది - అంటాడు. గుండెల్లో ముల్లు దిగిపోతుందంతే.

బాబా పరిచయం అక్కర్లేని కవి. ఈ మూడు పుస్తకాలతో పాటుగా రవీంద్రుని స్ట్రే బర్డ్స్ ని స్వేచ్చా విహంగాలుగా, సూఫీ అత్తరులు, ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతం లాంటి అనువాదాలు చేశాడు. చాలా చక్కగా ఉంటాయి. బాబా అనువాదాల ఎఫెక్ట్ నిస్సందేహంగా తన మౌలిక రచనలపై కూడా ఉంది. రెంటినీ పక్క పక్క పెట్టుకుని చూస్తే వాక్య నిగ్రహం పట్ల మనం పడే కొంత అసౌకర్యం తెలుస్తుంది. అతనింకాస్త స్వేచ్చాయుతంగా ఉండొచ్చు. అతని కవిత్వ భాష పుస్తకం వర్ధమాన కవులందరికీ figures of speech పట్ల మౌలిక జ్ఞాన్నాన్నిస్తుంది. అలంకార శాస్త్రం పట్ల ఒక మంచి అవగాహన తెస్తుంది. అతని చారిత్రక వ్యాసాల్లో ఉండే నిబద్దత, వాస్తవికప్రేమ కవిత్వం లోకూడా ఉంటే చాలా బాగుంటుందనేంత చక్కటి చారిత్రక వ్యాసాలు రాస్తాడు. కడప కైఫియత్తులు, బ్రౌన్ కృషి, పాలెగాళ్ళ చరిత్ర, మీద అతని వ్యాసాలు మాణిక్యాల్లాంటివి. ఒక జువాలజీ లెక్చరర్ ఇవన్నీ చేశాడంటే ఆశ్చర్యమేస్తుంది. అందుకే నాకూ ఒక జ్ఞానోదయమయ్యింది. బాబాని "అన్నా నువ్వెందుకు మార్క్స్ కి వ్యతిరేకం" అనడగదలుచుకోలేదు. తిలక్ ని గురించి రారా గారిలా ఆనంద నిష్యందం, ప్రమత్తతా పర్యవసాయి లాంటి భేదాల్లోంచి తర్కించదలుచుకోను. మూడు పుస్తకాలొచ్చాక మళ్ళీ అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడం వృధా కదా ? అఫ్సర్ అతని narrative poetry లో ( Also read - Narrative verse, Narratology) సంప్రదాయ కవిత్వ శైలి వ్యతిరేకత, కవిత్వంలో ఒదగని సాంస్కృతిక లక్షణాల్ని బాబా 'చక్కదిద్దుతున్నాడంటారు'. అదేమో గానీ, బాబా తనకు వీలుగాని ప్రయోగాలు మాత్రం చేయట్లేదు. తన స్వభావాన్ని నేరుగా కధనం చేయడాన్ని మనం హర్షించి తీరాలి. మూడో కన్నీటి చుక్కలో అతనికి తెల్సిన, అనుభవించిన జీవితాన్నే చిత్రించాడు. అంతకు మించి ఆ అనుభవంలోంచి ఇంకొంత కొత్తగా ఆలోచించి మంచి కవితలు రాశాడు. అతనిలో కొత్తదనానికి సామాజిక స్పృహ పురివిప్పి నాట్యం చేసిందని కితాబులు రాయను. అతనొక కొత్త దారి వేసేందుకు చమటోడుస్తున్నాడు. కవినేది నిలబెడుతుందో కాలమే ఎప్పుడూ నిరూపించింది. భయ్యా ! మనల్నందరూ గమనిస్తూనే ఉంటారు. కవిని కలవడాన్నెవరూ అస్సలు మిస్సవరు. బాబానైతే మరీనూ.

మూడో కన్నీటి చుక్క; బాబాలోని అంతర్నేత్రాన్ని చూపిస్తుంది.

మిత్రులారా ఇదందరూ చదివితీరాల్సిన కవిత్వ సంపుటి. బాబా ప్రేమగా హత్తుకోవల్సిన కవి; @ 98493 20443

శెలవు మరి
మీ
శ్రీరామ్
99634 82597

No comments:

Post a Comment