Sunday, February 9, 2020

"ఒక… " లో అనేకత్వమే సిద్దార్థ కవిత్వం





(సిద్దార్థ కట్టా కవిత్వ సంపుటి “ఒక…” రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ )

సిద్ధార్థ కట్టా కవిత్వం జీవితంలోని మల్టిప్లిసిటీని ప్రతిబింబిస్తుంది. అందుకే ఇతని కవిత్వంలో కాషాయమయమైన రాజకీయాలు; సానిటరీ పాడ్ల మీడ పన్నులు వేసే రాజ్యం పట్ల ధిక్కారం; గాయాలగేయాలతో రాజ్యానికి ఉరితాళ్లు పేనటం; విప్లవాన్ని స్వప్నించే తూనీగలు; నేలను లాక్కెళ్ళి నేలమీద పడేసే పసిపాప పాదాలు; పూలను మొక్కలకే ఉంచవా, నేను అమ్మవద్దే ఉన్నట్టు అని అభ్యర్ధించే పసిహృదయాలు; చీరమడతల్లో వెయ్యో అరవెయ్యో దాచిపెట్టే అమ్మలు; నోటుపై గాంధిబొమ్మ బదులు నాన్న బొమ్మ ఉండాలనేంతగా ప్రేమించబడే నాన్నలు; error 404 page not found లాంటి అత్యాధునిక పరిభాషలో పలికే వీడ్కోలు గీతాలు; మాట్లాడే సీతాకోకలు; ప్రేమలో ప్రతీదీ ప్రాణం పోసుకొంటుందన్న ఎరుకా; ….. లాంటి భిన్న జీవన పార్శ్వాలు అద్భుతంగా పలికాయి.

వస్తు విస్త్రుతి సిద్ధార్థ కవిత్వానికి గొప్ప బలం. చంద్రికల నుంచి ఉరికొయ్యలదాకా ఇతని కవిత్వం విస్తరించి ఉంది. యువకవుల్లో ఇది అరుదుగా కనిపించే లక్షణం. మంచి కవినుండి గొప్పకవిని వేరుచేసేది ఈ లక్షణమే.

ఇతని వ్యక్తీకరణ పరిధి చాలా విశాలమైనది. “రాత్రికి పెరుగన్నంలోకి చందమామను నంజి పెట్టేది” అని అమ్మగురించి ఎంత సౌకుమార్యంగా వర్ణిస్తాడో “పురుషాంగాలకు కత్తులు /మొలిచినపుడే మీ జాతి అంతరించింది” అంటూ పసిపిల్లలను అత్యాచారాలు చేయటం పట్ల తీవ్రంగా ఆక్షేపణ చేయగలడు.
నేడు మనుషులను మనుషులుగా కాక సమూహాలుగా మాత్రమే గుర్తించుకొంటున్న కాలం. సిద్ధార్థ కవిత్వం మనుషులను ప్రేమించటంలోని సౌందర్యాన్ని పట్టిచూపుతుంది. ఇది మానవసంబంధాలను వ్యక్తీకరించే అంశం. మానవసంబంధాలకవిత్వం కాలం ఉన్నంత వరకూ నిలిచిఉంటుంది.

ఎవరైనా జ్ఞాపకం వస్తే
ఒక దీపాన్ని వెలిగించి
చుట్టూతా చేతులను ఉంచండి
స్పర్శతడి సజీవంగా ఉన్న
మీ చర్మాలకు అతుక్కు పోతారు//
మీరో పూలవనాన్ని నిర్మించుకోండి
ఆప్తుల మాటలన్నీ
అత్తరులో మునిగిన తూనీగలై
తచ్చాడుతాయి (జ్ఞాపకమొస్తే) …. లాంటి వాక్యాలలోని ఆర్థ్రత మనుషులు ప్రేమైక జీవులని, ఇచ్చిపుచ్చుకోవటంలోనే జీవితపు అత్తరుపరిమళాలు ఉంటాయని చెపుతాడు సిద్ధార్థ.

కవిత్వంలో సౌందర్యవర్ణణలు ఆక్షేపణకు గురవుతున్న సందర్భమిది. సామాజిక ఘర్షణే కలిగిఉన్నదే ఉత్తమ కవిత్వమని తీర్మానించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాసిన ఈ వాక్యాలు- జీవితంలోని అన్ని పార్శ్వాలను కవిత్వం స్పృశించినపుడు అది సంపూర్ణమౌతుందన్న సత్యాన్ని ఆవిష్కరిస్తాయి.

ఒక రోజు ఎలా వస్తుందో తెలుసా
నీ అరచేతుల మీద సీతాకోక చిలుకలు వాలినట్లు
నల్లటి చెరువులో చంద్రుడు బంతిపువ్వై ఈదుతున్నట్టూ
ఒకపూట తన హంసపాదాలతో వెతుకుతుంది నిన్ను
పాల మీద మీగడ కట్టుకున్నట్టు భలే నవ్వుతావప్పుడు మెత్తగా
నీ నోరు 32 నక్షత్రాల ఆకాశం మరి// (ఎలా వస్తుందో తెల్సా) వాక్యాలలో - చంద్రుడుని నల్లటి చెరువులో బంతిపువ్వుగా పోల్చటం గొప్ప ఊహ. ముత్యాల లాంటి పళ్ళు అనటం ఒకనాటి కవిసమయం. నోరారా నవ్వటాన్ని 32 నక్షత్రాల ఆకాశం అనటం బహుసా ఏ పూర్వకవీ చేయని ప్రయోగం. మనల్ని, మనజీవితాల్ని ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరిచేసి, నిలువనీయని జీవనసౌందర్యపు అనుభూతులు ఇవన్నీ. అందంగా, ప్రతిభావంతంగా చెప్పినప్పుడు ఇవికూడా కవిత్వానికి అర్హమే!

మనిషి ఒక అద్భుతం అనేకవితలో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు సిద్ధార్థ. మానవ జన్మ ఉత్తమమైనదని ప్రవచన కారులు చెప్పొచ్చు. వాటి అర్ధాలు వేరు, వాటి ఉద్దేసాలు వేరు. మనిషి ఎందుకు అద్భుతమయ్యాడో ఒక కవిగా ఇలా అంటాడు సిద్ధార్థ.
నువ్వు ఊహించు
బతకటం ఎంత అద్భుతం//
ఎండకి గొంతెండిన పావురం
దాహాన్ని గ్రహించగలవు
కిటికీ చివర
రెండు దోసిళ్ల నీటిని పూయగలవు

అవన్నీ కాదు గానీ
ఓ పొడిగుండెని నువ్వు కనిపెట్టలేవా?
దానిని తడి చేసే మాయ నీలో ఇంక లేదా?
మనిషివి కదా
తడి చేయటం నీ లక్షణం
ఇప్పుడు చెప్పూ మనిషెంత అద్భుతం (మనిషి ఒక అద్భుతం) ఏ వాక్యమూ వాచ్యం కాదు. ప్రతీ వాక్యమూ ధ్వన్యాత్మకమే. మనిషి జన్మ రహస్యం, దాహాన్ని గుర్తించటం, తడిచేయటం….. అంతే ఈ రెండే. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా ఇదే అంతిమ సత్యం. దాన్ని గుప్పెడు వాక్యాల్లోకి కుదించిన సిద్ధార్థను కవి అని ఎలా అనగలం? ఒక అద్భుతమని కాక.

పిల్లలంటే సిద్ధార్థకు ప్రేమ. పసిపాపల ప్రస్తావన అనేక కవితల్లో వస్తుంది. వచ్చిన చోటల్లా ఆల్చిప్పలో కృత్రిమ ముత్యాన్ని పెట్టినట్లు కాక సహజంగా అమరిపోవటం కవి ప్రతిభ.

దాచుకున్న బొమ్మకు స్నానం చేయించినట్టు
నేల బుగ్గపై పసిపిల్ల ముగ్గురాసింది
ఆకాశం ఆశపడి నీళ్ల ముద్దు పెట్టింది
ఒక నాన్న చెంపలు తడిచిపోయాయి (ఐదు రెక్కలు) కూతురు వేసిన ముగ్గు వానకు కొట్టుకుపోతే నాన్న ఏడ్చాడట. ఎంత ఉదాత్త ఊహ. ఆ ఊహను కవిత్వీకరించిన విధానం ఎంత దీప్తిమంతంగా ఉందీ! ఇక్కడ వానకు కూడా పాపంటే ఇష్టమేనని ఎంత గడుసుగా అంటున్నాడూ కవి.

//పూలమొక్కను
నన్నుగా పరిగణించి
కొద్దిగా నీళ్ళను ఇవ్వండి
మీ పిల్లల అలంకరణకు
కొన్ని పూలను ఇస్తాను// (Error 404) ఇదొక వీడ్కోలు గీతం. నాకోసం వెతక్కండి అంటున్నాడు కవి. ఇక్కడ “నేను” లో ఉన్నది జీవన పరాజితుడో, రాజ్యం మాయం చేసిన అమరుడో ఎవరైనా కావొచ్చు. ఈ సందర్భానికి పిల్లల అలంకరణ ప్రస్తావనలో కవి ప్రేమే కనిపిస్తుంది.

//పక్కింటి పసిపిల్ల జ్వరం వాసన
పక్కింటి పూలతోటను రాతిరెవరో ఖాళీ చేశారట మరి// (పసి పిల్లకు జ్వరమొచ్చింది) వాక్యంలో కవి ఆడుకొనే పసి పిల్లలను పూలతోటగా వర్ణించటం ఒక రమణీయ ప్రతిపాదన.
Our kid కవిత ఒక భీభత్సరసప్రధాన మోదాంత మహాకావ్యం. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి తెచ్చిన విషాదాన్ని అక్షరీకరిస్తుంది. ఈ కవితలో వివిధ ఇంగ్లీషు వాక్యాలవాడటం కూడా చెపుతున్న వస్తువుకు బలం చేకూర్చటానికే. “Every school is a corporate prostitute, //
Do you know how much I do for you,//
Really no one loves me except this bubbly bus driver// సంజయ్ రిమెంబెర్ ఇట్/ ఇఫ్ యు గెట్ ఎ బెటర్ రాంక్, డాడ్ విల్ బై ఎ ప్లే స్టేషన్ ఫర్ యు//
Sanjay kumar roll num: 532/Got caught by squad while copying” లాంటి వాక్యాలు నేటి విద్యా వ్యవస్థలో పిల్లలు గురవుతున్న హింస తాలూకు బీభత్సాన్ని కళ్లకు కడతాయి. మనం ఇంతటి అమానవీయతకు అలవాటుపడిపోయామా అని జలదరింపచేస్తాడు.
కవితను అలా నడిపించి మనం ఏం చేయటంలేదో ఒక్కొక్కటీ గుర్తుచేస్తాడు సిద్ధార్థ కవిత మిగిలిన సగభాగంలో. “ఒంటికి వెన్న పూసుకున్న పాపాయి ఒక మెత్తని రహస్యమట”, "దూది చేతులు చాచి ఇక ఎత్తుకోమని అడుగుతాయట", "ఒక పాప భూజాల గూటిలోకి దప్పిక పిచ్చుకలా చేరుతుందట". ఆ కవిత చివర్లో ఇలా ముగిసి మనల్ని రకరకాల ఆలోచనల్లోకి నెట్టేస్తుంది.
బావి చుట్టూ చేరి
లోపలి చంద్రుణ్ణి చూపిస్తూ
వాళ్ళకోసమే రాలాడని
అబద్దం చెప్పండి//

మీలాంటి వాళ్ళనీ, మీమీ నాన్నల వంటి వాళ్ళనీ
అచ్చూ అలాంటి పోలికే అని
వాళ్ళలోకి ప్రవహించకండి
పిల్లలు మీ వారసత్వం కాదు
వాళ్ళు మీ అనుచరులూ కారు
పిల్లలు వట్టి పిల్లలే…… (our kid). మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ కవిత, జిబ్రాన్ పిల్లలపై వ్రాసిన కవితకు ఒక పొడిగింపుగా అనుకొంటాను.

సిద్ధార్థ కవిత్వంలో సౌందర్యం ఎంత తేటగా పలుకుతుందో సమకాలీన రాజకీయాల పట్ల ఆవేదన, కోపం కూడా అంతే నిజాయితీగా పలుకుతాయి.
//రాజ్యమిపుడు
ఆవులా ఉంది, కాషాయంలా ఉందీ
పోలీసు బూటు కాలంత బలంగా ఉంది
రంగురంగుల గూండాల చేతిలాఠీలాను ఉంది
మొన్నటి వరకూ నాకో అనుమానం ఉండేది
ఇప్పుడు నివృత్తి అయింది
తూటాలదిప్పుడు కాషాయపు రంగే// (ప్రశ్న అనుకొని) -- గౌరీలంకేష్ హత్యపై రాసిన ఈ కవిత నేటి మత రాజకీయాలను స్పష్టపరుస్తుంది.

చివరగా అన్నీ దాటుకుని
ఓ చిన్నారి తూనీగ
సూర్యుని నెత్తిమీద వాలుతుంది
అప్పుడు నీకూ అనిపిస్తుంది
విప్లవం ప్రకృతి ధర్మమని. -- (విప్లవ ప్రకృతి ధర్మం). ఎన్ కౌంటర్ల పేరిట ఎంతమందిని చంపినా అంతిమంగా విప్లవమే జయిస్తుందని, ఎందుకంటే విప్లవం అనేది ప్రకృతి ధర్మమని అంటాడు. ఈ తరహా కవిత్వంలో ఇదొక నవ్యమైన ఊహ.

ఆధునిక జీవన సారాంసాన్ని కవిత్వం చేయటం సిద్ధార్థ కవిత్వలక్షణం. మంచి పదచిత్రాలను అలవోకగా సృష్టించగలిగే ప్రతిభకలిగినవాడు సిద్ధార్థ. జీవితంలోని మల్టిప్లిసిటీని అర్ధం చేసుకొన్నవాడు. జీవితం పట్ల తనకున్న నిర్ధిష్టమైన ఆలోచనలను సౌందర్యాత్మకంగాను, శక్తివంతంగానూ కవిత్వంలోకి ఒంపగలిగిన నేర్పు కలిగినవాడు.

“ఒక” ఇతని తొలి కవిత్వసంపుటి. భవిష్యత్తులో ఇతను మరిన్ని సంపుటులుగా విస్తరించి, తెలుగు కవిత్వకిరీటానికి మెరుపుల తురాయిలా వెలగాలని ఆశిస్తున్నాను.
రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్నందుకు అభినందనలు.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment