Sunday, February 9, 2020

తుపాకి మాట్లాడితే



చరిత్రను రికార్డు చేయటం కూడా కవిత్వానికి బాధ్యతే.

ప్రశాంతతలో జ్ఞాపకం చేసుకొనే ఉద్వేగాలలోంచి కవిత్వం పుడుతుందన్న వర్డ్స్ వర్త్ మాట – నిత్యం జాతి వివక్షతో ప్రజలు సామూహిక ఊచకోతకు బలి అయ్యే సందర్భాలలో వర్తించదనే విషయం, జీన్ అరసనాయగం బ్లాక్ జులై గురించి వ్రాసిన Apocalypse 83 సంపుటిలోని కవిత్వం చదివితే అర్ధమౌతుంది.

శ్రీలంకలో తమిళులపై జులై, 1983 లో జరిగిన మూక దాడులను ‘బ్లాక్ జులై’ అంటున్నారు చరిత్రకారులు. ఈ దాడులలో దాదాపు మూడువేలమంది ప్రాణాలు కోల్పోయారు. తమిళులకు చెందిన సుమారు ఎనిమిదివేల ఇళ్ళను, ఆరువేలకుపైగా షాపులను తగలబెట్టారు. లక్షా యాభైవేలమంది నిర్వాసితులయ్యారు. ఇదంతా చరిత్ర. చరిత్రపుస్తకాలలో పైన చెప్పిన తారీఖులు, లెక్కలు, కారణాలు మాత్రమే ఉంటాయి. ఆనాటి బాధితుల మనోద్వేగాలు, హంతకుల ఉన్మత్తత, తటస్థుల ప్రవర్తన లాంటివి ఒక్క కవిత్వంలో మాత్రమే లభిస్తాయి. జీన్ అరసనాయగం ఆ దాడులలో ఒక బాధితురాలు కనుక అవన్నీ ఆమె కవిత్వంలో ప్రతిబింబించాయి. చివరి వూపిరిదాకా శ్రీలంక వ్యథని కవిత్వం చేస్తూనే వున్న ఆమె ఈ నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళిగా ఈ అనువాదాలు.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగ ఎక్కడ వివక్షతో ఊచకోత జరిగినా అరసనాయగం కవిత్వాన్ని గుర్తుచేసుకొనే పరిస్థితి ఉంది.

*
తుపాకి మాట్లాడితే – If the gun speaks

తుపాకి మట్లాడితే
అంతా నిశ్శబ్దమే
భయం తాలూకు నిశ్శబ్దం
రక్తంతో, బుల్లెట్లతో తుపాకి మాట్లాడితే.

గణేష్ విగ్రహ తొండానికి గుచ్చిన
ఎర్ర మందారం
ఒక రక్తవాంతులా ఉంది

చేతులపై, కాళ్ళవద్దా ఉంచిన
ప్రతీ పువ్వూ
ఒక తెరిచిన గాయం

నల్లూరు ఆలయవీధిలో బంగారు రథాన్ని
తాళ్ళతో లాగుతున్నారు మనుషులు
ఇసుకలో మెల్లగా కదులుతోందది

ఠాప్ మనే శబ్దాలు
ఓ వేయి కొబ్బరికాయలు పగిలుంటాయి
వాటి తీయని నీరు
అనాచ్ఛాదిత దేహాలపై, తలలపై
ప్రవహించింది

తుపాకుల శబ్దాలు నిలచిపోయాకా
అంతా నిశ్శబ్దం
మంటల చిటపటలు
అగ్నిసముద్రంలా వ్యాపించాయి

చిధ్రమైన బూడిద నేలపై
ఓ వేయి చితులు కాల్తున్నాయి.

(నల్లూరు- ఊరిపేరు. ఇక్కడ పోలీసుల ఫైరింగ్ లో అనేకమంది చనిపోయారు.

అరసనాయకం కవిత్వంలో భక్తిని, మనిషి చేస్తున్న హింసను పారలల్ గా నిలపటం చాలాకవితల్లో కనిపిస్తుంది. నువ్వు సృష్తించిన మానవుడు ఇంత హింసను చేస్తుంటే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది)

భయం Fear

గొంతులో భయం అడ్డుపడుతుంది
మాటలు బయటకు రావు
అల్లరి మూకల భయం

రాత్రి భయం
వెలుగు భయం
శత్రువుని చూపించే,
పగలంటే భయం
గజగజ వణుకుతూన్న దేహం మొత్తం
భయంగా మారుతుంది

మంటలు, మంటలు, మంటలు.

మృత్యు దృశ్యాలతో కిక్కిరిసిన నేత్రాలు
జ్వరంతో, దిగ్భ్రమతో
రాయిలా అంధత్వం పొందుతాయి.

నిద్రలో భయం, కలల్లో భయం
మాట్లాడితే భయం
వీధులో నడిస్తే భయం
మనవైపు ఎవరైనా
తేరిపార చూస్తే భయం
ప్రతి చూపులో, భంగిమలో భయం,
అడుగువేయాలంటే భయం
వాళ్ళు మమ్మల్ని చంపటానికి
వస్తున్నారంటే భయం
పారిపోవాలంటే భయం

మోకరిల్లటానికి ఇంకేమాత్రమూ శక్తి లేని దేహంతో
ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు
నా ఆత్మలో ఏ కొంతైనా సారం మిగిలి ఉంటుందా?

శరణార్ధి శిబిరం – Refugee camp 1983

నేను ధరించిన ఒకే బట్ట
అది భరిస్తోన్న నా చమట, మురికి
నాకొక గుర్తింపు, హోదాను ఇస్తోంది

నేనెవరినో నాకు తెలిసింది

నేనెవరితో ఉన్నానో, మాట్లాడుతున్నానో
కలిసి దుఃఖపడుతున్నానో
మా అందరకూ ఒకటే పేరు
-శరణార్థి-

ఈ స్కూలు ఆవరణలో
రెండు చేతులు ముందుకు చాచి
ఈ ప్లేటులో వేయించుకొన్న గుప్పెడు మెతుకులు
నా ఆకలిని శాంతింప చేయొచ్చు
బహుసా నీది కూడా.
ఇదోరకమైన ఆకలి, తొందరగానే తీరుతుంది
ఏ భయము, ఏ అపాయమూ లేకుండా
జీవించాలనే ఆకలి అలా కాదు.

కొన్ని గుడ్డలేవో మడతపెట్టుకొని
తలగడగా చేసుకొని సిమెంటు నేలపై పడుకొంటాను
స్కూలు డెస్క్ లే నా పొలిమేరలు.
సురక్షిత ప్రాంతపు అంచుల్లో ఉండేదాన్ని
తటస్థ భూమి.

లక్షమందో ఇంకా ఎక్కువమందో ప్రజలతో పాటూ
నేనూ నిర్వాసితమయ్యాను
-అందరూ శరణార్థులే-

అనువాదం: బొల్లోజు బాబా

(ఈ వ్యాసం సారంగ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)

1 comment: