Thursday, April 9, 2020

"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటి

"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటిపై ప్రముఖ విమర్శకులు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు వ్రాసిన సమీక్ష. ఈ వ్యాసం పాలపిట్ట, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైనది. వెంకటేశ్వర రెడ్డి గారికి గుడిపాటి గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
***
కాడైపోతున్న వ్యవస్థరాల్చిన “మూడో కన్నీటిచుక్క”
ఒక కవిని అంచనా వేయాలంటే జీవితంలో ఆ కవి తోడిపోసిన జీవ చైతన్య వాక్యాలను బట్టి, గీటురాయిపై కెక్కించి నాణ్యతను చెప్పాల్సి వుంటుంది. కవికి వస్తువుతో పాటు దృశ్యం వీటితోపాటు అనుభవం, అనుభూతినందిస్తుంది. సమాజంలో విస్తరించి ఉంటున్న మౌనగానాన్ని, మౌన సందేశాన్ని ఒడిసిపట్టలేని కవి, వస్తువు మూలాల్ని స్పర్శించలేడు. కవి బహిర్ యాత్రతో పాటు అంతర్ యాత్రను చేయాల్సివుంటుంది. కవి కాళ్ళతోనే కాదు, కళ్ళతోనూ పయనిస్తూ, చెవులతోనే కాదు హృదయంతోను వింటూ, నిదర్శనాన్వితమైన విశాల దృష్టితో స్వశక్తితో పదబంధాలను కూర్చుకున్నప్పుడే, ఆ కవి తనదైన ముద్రతో కనిపిస్తాడు, సాహిత్యలోకంలో రాణిస్తాడు. ఆ కవి ఒక నవ్యచైతన్య కేతనాలను ఎగురవేయగలడు. కవిత్వం రాయడమంటే సమాజాన్ని చదవడమేననే దృష్టి, దృక్పథంతో జ్వలిస్తూ, అక్షరాలకు ఆయుస్సు పోయడమే. కాలం ఒడిలో కన్ను తెరిచిన కవిని కాలప్రవాహపు ఒరిపిడే ఆయన కవిత్వానికి మార్మికతను తాత్త్వికతను అద్దుతుంది. కవి ఆత్మశోధనలోంచి వెలువడిన భావధార పాఠకుణ్ణి తేలిగ్గా ఓన్ చేసుకుంటుంది. పై లక్షణాలను, లక్ష్యాలుగా, మార్గాలుగా చేసుకుంటూ వో సామాజిక శాస్త్రజ్ఞుడిగా, పరిశోధనాత్మకమైన కవిత్వాన్ని “మూడో కన్నీటిచుక్క” గా వెలువరించిన కవి, విమర్శకుడు బొల్లోజు బాబా.
ఈయన కవిత్వంలో సరళమైన భాష లోతైన భావాలు పాఠకుణ్ణి వెచ్చవెచ్చని ఆలోచనా కదలికల్లోకి నెడతాయి. తొలికవిత “ఒక దుఃఖానికి కొంచెం ముందు…” తో రైతు బాధ, వ్యధ, జీవితంలో జరుగబోయే పరిణామం ఎంత చక్కగా చెప్పాడో చూడండి.
“అప్పటికింకా అతను
చెట్టుకొమ్మకు పిడికెడు మట్టై వేలాడలేదు” అంటారు. పిడికెడు మట్టై వేలాడడం అంటే శవమైపోవడమే కదా! రైతు “ఎండిన పంటను ఓదారుస్తున్నాడు” అంటే మండే గుండెలను తమాయించుకోడానికి యత్నించడమే.
“ఇసుక నిండిన హృదయం” అంటే డ్రై అయిపోయిన గుండెలే కదా! కవిత్వాన్ని వచనంగా జారిపోనీయకుండా ప్రతి వాక్యానికి కవిత్వాంశను అద్దాడు
“అప్పటికింకా అతని భార్యలో
సగభాగం ఖననం చేయబడలేదు
కళాయి పోయిన అద్దంలో
చూసుకొంటూ నుదిటిపై
సూర్యబింబమంత కుంకుమ దిద్దుకొంటోంది”
హిందు ధర్మంలో భార్యలో కొన్ని చిహ్నాలు భర్తవిగా గోచరిస్తాయి. కొన్ని ఆనవాళ్ళు ఈమెకు భర్త ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి చెప్పకనే చెప్తుంటాయి. “అందుకనే కవి సంప్రదాయ సూత్రాన్ని పట్టుకొని “అప్పటికింకా అతని భార్యలో సగభాగం ఖననం చేయబడలేదు” అనగలిగాడు. “కళాయి పోయిన అద్దం” రైతు పేదరికాన్ని పట్టిస్తుంది. రైతు పేదరికంలోకి దిగిపోయాడు అనకుండా వివర్ణమైన ఒక వస్తువును పాఠకుని ముందుకు తెచ్చి రైతు పేదరికాన్ని అర్ధమయ్యేలా చేశాడు. అభివ్యక్తిలో మార్మికతను చొప్పించి రాయడం ఈ కవి ప్రత్యేకత. రైతుల ఆత్మహత్యల గూర్చి అద్భుతంగా ఈ కవిత చెప్పబడింది.
“నాలుగు స్తంభాలు” అనే కవితలో దేశవిధ్వంశకర శక్తుల్ని గూర్తి ఎంతో తేలిగ్గా “సీరియస్ నెస్స్” ఉన్నట్లు కాకుండా “క్యాజువల్” గా మనం సాధారణ మాటలు మాట్లాడుకొన్నట్లుగా చెప్పాడు.
“మొన్నో నలుగురు వ్యక్తులు
కొండపై రాత్రి విందు చేసుకొన్నాకా
ఉదయానికల్లా కొండ మాయమైందట
ఆ నలుగురే నదీ విహార యాత్ర జరిపిన మర్నాటికల్లా
నదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయని/ ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు”
ఈ కవితలో కనిపించే ఆ నలుగురు ఎవరు? ప్రకృత సహజ సంపదను దోచుకొనే మహానుభావులే కదా! కొండమీద వారు విందు చేసుకున్నారు అంటే కొండలో దాగున్న ఖనిజ సంపదను దోచుకొనే పన్నాగంతోనే ఆ నల్గురు అక్కడ చేరారని అర్ధం. అట్లే నదిని, నదీ జలాలను, పండ చేలను దోచుకొని ధ్వంసం చేయడమే వారి ప్రధాన వ్యాసంగం. కవిత ముగింపు ఎంత అద్భుతంగా అల్లాడో చూడండి.
“ఇంతలో
‘అలా జరగటానికి వేల్లేదు’ అంటూ
రోడ్డుపై ఒకడు గొణుక్కుంటూ
గాల్లో ఏవో రాతలు వ్రాసుకొంటూ
అడ్డొచ్చిన నన్ను తోసుకొని సాగిపోయాడు
ఎలా జరగడానికి వీల్లేదటా?
అని ఆలోచించాను” అంటూ సామాజిక విధ్వంశక మూలాలను మొదట కనిపెట్టేది మేధావులైన కవులు అని చెప్తాడో కవి. తరువాత ఈ అంశం ప్రజల్లోకి వెడుతుంది. “అవునవును/ నాకూ అన్పిస్తోంది/ ఖచ్చితంగా అలా జరగటానికి వీల్లేదు” అంటూ జనం గొంతు కలపడాన్ని చివర చెప్తాడు కవి. జనంలో చైతన్యాన్ని రగిల్చేది నిజమైన కవిత్వంగా ఈ కవి భావిస్తాడు.
“నాన్నతనం” అనే కవితలో కొత్తకోణంలో నాన్నను ఆవిష్కరించాడు కవి. అందరూ అమ్మను, అమ్మతనాన్ని పుంఖాను పుంఖాలుగా రాశారు. ఈ కవి నాన్న కాపురాన్ని ఎట్లా ఈదుతాడో, ఏ విధంగా కుటుంబానికి సేవ చేస్తాడో గొప్పగా ఆవిష్కరించాడీ కవి. నాన్నని మనమేవిధంగా గుర్తించవచ్చునో చెప్తూ-
“పార్కులో రెండు చేతుల్తో పీచు మిఠాయో
పల్లీల పొట్లాలో తీసుకెల్తూ కనిపించవచ్చు…..
“ఏ పేవ్ మెంటు మీదనో
స్కూలు బేగ్గో, షూసో కుట్టిస్తూ కంటపడొచ్చు….
పార్కు బెంచీపై కూర్చొని మిత్రులతో
కొడుకు సంపాదన, కోడలి మంచితనం
మనవల అల్లరిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ
కనిపిస్తుంది…. నాన్నతనం” అంటారు. నాన్న యౌవనంలో ఉన్నప్పటినుంచి వృద్ధాప్యంలోకి వచ్చిన దాకా ఆయన దినచర్యలను పూసగుచ్చినట్లు వర్ణిస్తాడు కవి.
“చిట్టికురువి” కవిత పర్యావరణ పరిరక్షణ మీద రాసిన కవిత. పచ్చదనం అంతరించిపోవడం, పిట్టలు రాలిపోవడం, దీనికి రాణమైన వస్తువులను ఉదహరించడం ద్వారా చెప్పాడు కవి. చివర పసిపాప హృదయం ఎంత ప్రేమలాలిత్యంగా అమాయకత్వంలో పొదవుకున్న మంచితనాన్ని పట్టిస్తుంది.
“ఒక చిన్నారి పిట్ట
నిలువ నీడలేక, దాహం తాళలేక
నేల కూలింది/ మానవుడు తయారుచేసిన
గొడ్డళ్ళన్నీ పిట్ట చుట్టూ చేరి
దీనంగా చూస్తున్నాయి…
రంపాలన్నీ
ఆ పిట్టకొరకు
కన్నీరు కారుస్తున్నాయి
బుల్ డోజర్లన్నీ పిట్టను బతికించమని
తొండాలెత్తి ప్రార్ధిస్తున్నాయి
అయినా మనిషి జాడ లేదు”
అంటూ మనిషి ఆయుధాలు సైతం కనికరం చూపుతున్నా పిట్టయెడల మనిషికి ఇసుమంత బాధలేదు. పసిపాప
“మెల్లగా నడుచుకొంటూ వచ్చి/
“చిట్టి కురివీ” నిన్నెవరు కొట్టారమ్మా”
అంటూ పిట్టను చేతిలోకి తీసుకుంది
వేళ్ల కొనలలోంచి జలపాతాల్ని పుట్టించింది
దాహం తీర్చుకొన్న పిట్ట
పాపచుట్టూ కాసేపు తిరిగి ఎటో ఎగిరిపోయింది” అంటూ పాప సహృదయతను ప్రేమను ఎత్తిచూపుతాడు కవి. ఇందులో మరో అంశం, గొడ్డళ్ళు, రంపాలు బుల్ డోజర్లు మానవుని చేతిలో ఆయుధాలు. వాటికి కూడా హృదయమున్నట్లు, స్పందించినట్లు చెప్పటం కవి చాతుర్యం. కాని మనిషికి హృదయంవున్నా ప్రకృతిమీద ప్రేమ లేదు, పశు పక్ష్యాదులమీద జాలి లేదు.
“మూడో కన్నీటిచుక్క” లో మొత్తం 78 కవితలున్నాయి. ప్రతి కవిత అనుభవాలను, అనుభూతులను ఆరవోసాయి. ట్రన్స్ పరెంటు చీకటిలా కనిపించినా, లోనవిషయం లోతుగా పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది. సామాన్య స్పృహకు అతీతమైన చైతన్య స్థాయి కవిత్వంలో కనిపిస్తుంది. కవి కవిత్వంలో ఇంకిపోయి బయటకు వచ్చినట్లు సామాజిక తపన, అనుభూతి, లోకానుశీలన పుష్కలంగా కనిపిస్తుంటాయి. “మూడో కన్నీటిచుక్క” అందరూ చదువదగిన పుస్తకంగా భావిస్తూ కవిని అభినందిస్తున్నాను.
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
9948774243

No comments:

Post a Comment