Sunday, February 9, 2020

హిందూ ఆలయాలకు ఏం జరిగింది?



ముస్లిం పాలకులు హిందూ ఆలయాలను ధ్వంసం చేయటానికి రెండు కారణాలు కనిపిస్తాయి ఒకటి అన్యమత ద్వేషం, రెండవది ఆలయాలలో దాచిపెట్టిన సంపదలను దోచుకొనటం కొరకు అంటూ Sita Ram Goel వ్రాసిన Hindu Temples What Happened to them పుస్తకం ప్రారంభమౌతుంది. ఈ పుస్తకంలో భారతదేశంలో మొత్తం మీద చిన్నా పెద్దా కలిపి 60000 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని అలా చేయటంలో మతవిశ్వాసాలే ప్రధాన కారణమని అనేక రసవత్తరమైన ఉదాహరణలు ఇస్తాడు గోయల్. ఆంధ్రప్రదేష్ నుంచి 140 ఆలయాలు అలా ధ్వంసం చేయబడ్డాయని లెక్కలు చెప్పాడు. చరిత్రలోంచి సెలక్టివ్ ఉదంతాలను తీసుకొని కొన్నింటిని పరిగ్రహించి విద్వేషాలను రగిల్చే రాతలు ఎక్కువమందిని ఆకర్షిస్తాయి. ఈ వాదన ఈనాటిది కాదు. హిందూ సమాజంలో వందలసంవత్సరాలుగా నడుస్తున్నదే!

ముస్లిముల దాడిలో కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక 1324 లో ఆంధ్రదేశరాజ్యాధికారం చేపట్టిన ప్రోలయనాయకుడు ఇచ్చిన “విలస తామ్రశాసనం” లో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఈ శాసనం ద్వారా--

“మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్కనుపై చేసిన దండయాత్ర; సారాయితాగుతూ, పశుమాంసం తింటూ ముస్లిం పాలకులు ఆలయ విగ్రహాలను ధ్వంసం చేసి, బ్రాహ్మణులను ఊచకోత కోసి, వారి మాన్యాలను బలవంతంగా లాక్కొన్నారని; ధనవంతులను చిత్రహింసలు పెట్టి వారి సంపదలను దోచుకొన్నారని; రైతులను,సామాన్యులను హింసించారని, స్త్రీలను అపహరించారని; అలాంటి పరిస్థితులలో ప్రోలయనాయకుడు రాజ్యాధికారం చేపట్టి సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పి బ్రాహ్మణులు కోల్పోయిన హక్కులను పునరుద్దరించి, ఆలయాల పునర్నిర్మాణం జరిపి, హిందూధర్మాన్ని తిరిగి నెలకొల్పినట్లు” తెలుస్తుంది. (Epigraphia Indica –Vol. 32)

ముస్లింపాలకులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసారు అనే మాట ఇన్ని వందల సంవత్సరాలుగా ప్రతిఒక్క హిందువు బుర్రలోను బలంగా నాటుకుపోయిన అంశం. అలాంటి విద్వేషపూరిత పునాదులపైనే నేటి రాజకీయాలు కొనసాగటం దురదృష్టకరం.

అసలు ఆలయాలు దేనికి సంకేతం? ఆలయాలపై ఎందుకు దాడి చేస్తారు? ముస్లింలు మాత్రమే ఆలయాల ధ్వంసం చేసారా లేక హిందురాజులు కూడా చేసారా? అనే ప్రశ్నలకు Richard M Eaton, Cynthia Talbot లు వ్రాసిన వ్యాసాల ద్వారా అనేక ఆసక్తికరమైన జవాబులు దొరికాయి

***

1. కొద్దిగా చరిత్ర

ఎనిమిదో శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిమ్ సింధుని ఆక్రమించుకొని కొంతకాలం పరిపాలించాడు. ఈ కాలంలోనే భారతీయ శాస్త్రవిజ్ఞానం బాగ్దాద్ చేరి అరబిక్ భాషలోకి అనువదించబడింది. అలా పదకొండవ శతాబ్దంవరకూ హిందు-ముస్లిమ్ కలయిక చాలా ప్రశాంతంగా కొనసాగింది.

పదకొండవ శతాబ్దం నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. గజని మహమ్మద్ (998-1030) ఆఫ్ఘనిస్తాన్ ని కేంద్రం గా చేసుకొని పరిపాలన సాగిస్తూ- సమీప నగరాలు, ఆలయాలపై దాడి చేసి సంపదలను కొల్లకొట్టి తన రాజ్యాభివృద్ధికి వాడుకొనేవాడు.

ఇతను ఇరాన్ వద్ద నున్న రే అనే నగరాన్ని కొల్లకొట్టినపుడు ఏడున్నర లక్షల దినార్ల విలువైన సంపద లభించగా భారతదేశంలోని సోమనాథ్ ఆలయంలో ఇరవై మిలియన్ దినార్ల సంపద లభించింది. గజని భారతదేశంపై దండయాత్రలు చేసి సంపదలు పట్టుకుపోవటమే తప్ప ఏనాడూ ఇక్కడ స్థిరపడాలని భావించలేదు. ఇతను మరణించాక దాదాపు ఒక శతాబ్దంపాటు ఏ దాడులు జరగలేదు.

మహమ్మద్ ఘోరి 1194 నాటికి ఉత్తరభారత దేశంలో చాలామట్టుకు రాజ్యాల్ని జయించి ఢిల్లీలో కుతుబుద్దిన్ ఐబక్ అనే తన ప్రతినిధిని నియమించాడు. 1206 లో ఘోరి చనిపోవటంతో ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తానుగా అవతరించటంతో భారతదేశంలో ముస్లింల ప్రత్యక్షపాలన మొదలైంది.

2. హిందూ రాజ్యంలో ఆలయం యొక్క పాత్ర

హిందూ రాజ్యానికి ఒక రాష్ట్రదైవం ఉంటుంది. రాజ్యాన్నేలే రాజు ఆ దైవాన్ని కొలుస్తూంటాడు. ఆ ఆలయం ఆ రాజ్యలక్ష్మికి, సౌభాగ్యానికి, ప్రతిష్టకు సంకేతం. అంతేకాక ఆలయాలలో రహస్య మాళిగలలో సంపదలను భద్రపరచుకోవటం జరిగేది.

ఒక హిందూ రాజు మరో హిందూ రాజ్యాన్ని జయించినపుడు ఓడిపోయిన రాజ్యంయొక్క రాష్ట్రదైవాన్ని తరలించుకొని తనరాజ్యంలో ప్రతిష్టించుకోవటం రెండువేల సంవత్సరాలుగా ఈ గడ్డపై నడిచిన ఒక సంప్రదాయం. అలా చేయటం ద్వారా మాత్రమే ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం పూర్తయినట్లు భావించేవారు.

కళింగరాజ్యాన్ని మగధరాజులు జయించినపుడు రిషభనాథుని విగ్రహాలను ఎత్తుకుపోగా, ఆ తరువాత ఖారవేలుడు అనే కళింగరాజు మగధసామ్రాజ్యంపై దండెత్తి ఆ విగ్రహాలను తిరిగి తెచ్చుకొన్నట్లు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన హతిగుంఫ శాసనం ద్వారా తెలుస్తున్నది.

ఇలాంటి ఉదంతాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి

A. పల్లవరాజైన నరసింహవర్మన్ I చాళుక్యరాజధాని వాతాపిని 642 CE లో జయించి అక్కడి గనేష విగ్రహాన్ని తీసుకుపోయాడు. యాభైఏళ్ల తరువాత చాళుక్యులు ఆ విగ్రహాన్ని తిరిగి తెచ్చుకొన్నారు.

B. పదకొండవ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు దండయాత్రలలో – చాళుక్యరాజ్యంనుంచి గనేష, కళింగులనుంచి భైరవ, భైరవి, తూర్పుచాళుక్యులనుంచి నంది, బెంగాలు నుంచి శివుని విగ్రహాలను తరలించుకొని వచ్చాడు.

C. కాశ్మీర రాజు హర్షుడు శత్రుదేశ ఆలయాలపై దాడి చేసి సంపదలను తరలించుకుపోవటం చేసేవాడు

D. గుజరాత్ లో పరమర వంశానికి చెందిన రాజులు జైన ఆలయాలను ధ్వంసం చేసారు

E. కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించి బాలకృష్ణుని విగ్రహాన్ని, పండరిపురాన్ని ఆక్రమించుకొని విట్టలనాథుని విగ్రహాన్ని ఎత్తుకొనిపోయి విజయనగరంలో ప్రతిష్టించుకొన్నాడు.

1192-1729 మధ్యకాలంలో హిందుత్వవాదులు వాదిస్తున్నట్లు 60 వేల ఆలయాల విధ్వంసం జరగలేదని, 80 ఆలయాలు మాత్రమే ధ్వంసానికి గురయినట్లు స్పష్టమైన చారిత్రిక ఆధారాలు లభిస్తున్నాయని ప్రముఖ చరిత్రకారుడు Eaton అభిప్రాయం.

3. ఆలయాల విధ్వంసం జరిగిన తీరులో ఒక పాటర్న్ కనిపిస్తుంది.

విధ్వంసమైన ఆలయాల భౌగోళికతను పరిశీలిస్తే, ముస్లిం సేనలు దండయాత్రచేసిన మార్గంలోని ఆలయాలు మాత్రమే దాడికి గురయ్యాయని అర్ధమౌతుంది. ఉత్తరభారతదేశం నుంచి దక్కనువైపుకు రాజ్యవిస్తరణ జరుపుకొంటూ వస్తున్నప్పుడు మొదట రాజస్తాన్, బిహార్, గుజరాత్ చివరగా దక్కన్ ప్రాంత ఆలయాలు ధ్వంసమవటంలోని పాటర్న్ సైన్యం నడిచిన మార్గాన్ని సూచిస్తుంది. ప్రతీచోటా యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కనిపించదు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బహుమని సుల్తానులు ఒరిస్సా, విజయనగర సామ్రాజ్యాలపై యుద్ధం చేసిన సమయంలో ఆ రాజ్యాలలోని ఆలయాల విధ్వంసం జరగటాన్ని గమనిస్తాం. హిందూరాజ్యాలపై దండయాత్రలు జరిగిన ప్రతీసారీ ఆ రాజ్యంలోని ఆలయాలను సంపదలకొరకు కొల్లకొట్టటం జరిగింది. కొన్నిచోట్ల ఆలయాల స్థానంలో మసీదులను నిర్మించటం జరిగింది.

కొన్ని సందర్భాలలో ముస్లిం అధికారులు ఓడించిన రాజ్యంలోని ఆలయ మూలవిరాట్టులను ఢిల్లీబాదుషాకు కానుకలుగా పంపించేవారు. 1299 లో సోమనాథ్ ఆలయ మూలవిరాట్టును, 1359 లో ఒరిస్సా జగన్నాధ ఆలయవిగ్రహాలను ఢిల్లీకి తరలించారు.

ఢిల్లీ సుల్తానులపై తిరుగుబాటుచేసిన సామంతులను శిక్షించటానికి వారి రాజ్యాలకు చెందిన ఆలయాలపై దాడిచేసి విగ్రహాలను తరలించుకుపోవటం జరిగేది. గ్వాలియర్ రాజపుత్ సామంతుపై అనుమానం వచ్చి, ఇబ్రహిం లోడి గ్వాలియర్ కోటలోని శివాలయంలో చొరబడి అక్కడి విగ్రహాలను ఢిల్లీకి తరలించుకొని పోయాడు.

1579 లో అహోబిలంపై జరిగిన దాడి ఆసక్తికరం. గోల్కొండనవాబు వద్ద పనిచేసే మరాఠి బ్రాహ్మణుడైన మురహరిరావు – రాయలసీమ ప్రాంతాలను గోల్కొండరాజ్యంలో కలిపే యత్నంలో అహోబిలం నరసింహస్వామి ఆలయంలోని విగ్రహాన్ని గోల్కొండకు తరలించుకొనిపోయాడు. ఈ ఆలయం శ్రీ కృష్ణదేవరాయలకు ఎంతో ప్రీతిపాత్రమైనదన్న ఒకే ఒక రాజకీయకారణం కనిపిస్తుంది.

గోల్కొండ నవాబుపై కళింగ రాజులు చేస్తున్న తిరుగుబాటును అణచివేసే క్రమంలో 1599 లో శ్రీకూర్మం, సింహచలం ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అదే సమయానికి పూజలందుకొంటున్న ఇతర ప్రముఖ ఆలయాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, పిఠాపురం, కుమార భీమారామం లాంటి ఆలయాలపై ఎలాంటి దాడులు జరగకపోవటానికి కారణం ఆ ప్రాంతాలలో ఏ రకమైన రాజకీయ అలజడులు లేకపోవటమే అని భావించాలి.

4. తెలుగునాట ముస్లిములను ఎలా చూసారు?

పద్నాలుగో శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనదశలో ముస్లిం సేనలను రాక్షసులతో పోల్చటం పైన ఉదహరించిన “విలస తామ్రశాసనం” లో కనిపిస్తుంది. ఉత్తరబారతదేశంలో ఇస్లాం ప్రభావంనుంచి హిందూమతాన్ని స్థిరీకరించుకోవటానికి రామాయణాన్ని ఎలాగైతే ఒక సమాంతర శక్తిగా హిందువులు నిలబెట్టుకొన్నరో ఆంధ్రదేశంలో కూడా అన్నమయ్య, రామదాసుల భక్తితత్వం హిందూధర్మ ప్రచారానికి తోడ్పడింది. ఇది మొదటి దశ.

రెండో దశలో- కాల క్రమేణా పదిహేనవ శతాబ్దానికి వచ్చేసరికి ఆంద్రప్రాంతం గోల్కొండ పాలనలోకి వచ్చింది. కృష్ణదేవరాయలవద్ద సైన్యంలో ఎక్కువభాగం ముస్లింయోధులు ఉండేవారు. వారికొరకు మసీదులు కూడా కట్టించాడు. పర్షియన్ దుస్తులను మక్కువగా ధరించేవాడు. పర్షియన్ తరహా నిర్మాణాలు చేపట్టాడు. “హిందురాజులలో సుల్తాను” (హిందురాయ సురత్రాన) అని చెప్పుకోవటం ఒక బిరుదుగా మారింది. ఇబ్రహిం కుతుబ్ షాను మల్కిభరామునిగా కవులు ఓన్ చేసుకొన్నారు. సాహిత్యంలో, శాసనాలలో ముస్లిం వ్యతిరేకత పెద్దగా కనిపించదు. కుతుబ్ షాయి పాలనలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా వెలువరించేవారు. ఈ సమయంలోనే తెలుగులోకి అనేక ఉర్దూపదాలు వచ్చి చేరాయి. ఒరిస్సారాజులకు గజపతులని, విజయనగర రాజులను నరపతులని, గోల్కొండ రాజులను అశ్వపతులని సమానహోదాతో హిందూ ముస్లిము రాజులు వ్యవహరించుకొన్నారు.

విజయనగరరాజ్య పతనంతో మరలా తెలుగునాట హిందు ముస్లిం ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాజ్యవిస్తరణలో భాగంగా ఆలయాల విధ్వంసం జరిగింది. (అహోబిలం, శ్రీకూర్మం, సింహాచలం) ఇది మూడవ దశ. పదిహేడవ శతాబ్దం వచ్చేసరికి బ్రిటిష్ వారి రాకతో మొత్తం రాజకీయ, సామాజిక సమీకరణాలన్నీ మారిపోయాయి.

5. యుద్ధాలు లేని సమయంలో ఆలయాలపట్ల ముస్లిమ్ పాలకుల వైఖరి

బీదరు జిల్లాలో అంతకు పూర్వం ధ్వంసం చేసిన ఈశ్వరాలయాన్ని పునరుద్దరించి, పూజాదికాలు నిర్వహించమని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదేశాలు ఇచ్చినట్లు 1326 నాటి ఒక శాసనం చెపుతున్నది. (kalyana inscription of sultan Muhammad - Epigraphia Indica 32)

అక్బర్ పరిపాలనలో అనేక హిందూ సామంతులు తమ రాజ్యాలలో వివిధ హిందూదేవాలయాలను నిర్మించుకొన్నారు. ఉదాహరణ: రాజామాన్ సింగ్ బృందావనంలో నిర్మించిన గోవిందదేవ ఆలయం.
1590-1735 ల మధ్య ఒరిస్సా పూరిజగన్నాధుని రధయాత్రకు ముఘల్ చక్రవర్తి ప్రతినిధులు వచ్చి ఒక రధంపై కూర్చుని ఆ ఉత్సవాన్ని పర్యవేక్షించేవారు.

ఔరంగజేబు 1659 లో – “కాశిలో కొంతమంది అక్కడి బ్రాహ్మణులను వేధిస్తున్నట్లు తెలుస్తున్నది- కాశిలోని ఆలయాలను కానీ అక్కడి పూజారులను కానీ వేధించటంకానీ తొలగించటం కానీ చేయకండి” అంటూ ఒక ఉత్తర్వును జారీ చేసాడు. ఇదే ఉత్తర్వులో “ప్రాచీన ఆలయాలను కూల్చరాదని పవిత్రగ్రంధం చెపుతున్నది” అని అనటం గమనార్హం.

శ్రీకూర్మ ఆలయదాడి అనంతరం కులికుతుబ్ షా- అక్కడి పరిస్థితులను చక్కదిద్దమని అశ్వారాయుడు అనే ఒక హిందూ అధికారిని ఇక్కడకు పంపించాడు.
1604 నాటి ఒక శాసనం ద్వారా- రాజప్రతినిధిగా వచ్చిన అశ్వారాయుడు ఈ ఆలయాలను తిరిగి తెరిపించి, ధార్మిక విధులను కొనసాగేలా చేసాడని తెలుస్తున్నది.

ముగింపు

ముస్లిం పాలనలో అనేక హిందూదేవాలయాలపై దాడిజరగటం వాస్తవం. చాలా ఆలయాలను మసీదులుగా మార్చటం కూడా వాస్తవమే. హిందూధర్మం ప్రకారం దేవాలయాలు అనేవి రాజ్యపు అస్తిత్వరూపాలు. ఒక్కోరాజ్యానికి ఒక్కో రాజ్యదేవత ఉంటుంది. ఆ దైవాన్ని కాపాడుకోవటం ఆ రాజు విధి. ఆ రాజ్యం ఓడిపోయినపుడు ఆ రాజ్యదేవతను విధ్వంసం చేయటమో తరలించుకుపోవటమో విజయానికి ఒక సింబాలిక్ చర్య. ఈ పనిని హిందూరాజులు కూడా చేసారు. అంతే కాక ఆలయంలో ఉండే గుప్తనిధులు కూడా ఆలయవిధ్వంసానికి మరొక కారణం.

భారతదేశంలో జరిగిన హిందూ ఆలయవిధ్వంసం ఎక్కువగా యుద్ధసమయంలోను, తిరుగుబాట్లు జరిగినపుడు శిక్షించే క్రమంలోను జరిగినట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి.

ముస్లిమ్ లకు విగ్రహారాధనపట్ల వ్యతిరేకత బహిరంగమే అయినప్పటికీ ఆలయాల విధ్వంసంలో యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం ఉందని నిర్ధారించలేం.

చివరగా ప్రముఖ చరిత్రకారుడు Mohammad Habib 1931 లో అన్న మాటలు నేటికీ ప్రాసంగిత కోల్పోకపోవటం సమకాలీన విషాదం.

“హిందూ మూలాల్ని కలిగి శాంతిని కోరుకొనే భారతీయ ముసల్మాను - అనాగరిక దుస్తులు ధరించిన, ఆలయాలను ధ్వంసంచేసిన, ఆవుమాంసం తినేవాడిగా, ముప్పై నలభై శతాబ్దాలపాటు నివసించిన సొంతగడ్డనే ఆక్రమించుకొన్న ఆక్రమణదారుడిగా చరిత్రలో వక్రీకరించబడ్డాడు. దాని ఫలితం నేడు భారతదేశం ఎదుర్కొంటున్న మతవాతావరణం” -- Mohammad Habib

బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Temple Desecration in Pre-modern India part I and II by Richard M Eaton
2. Hindu Temples What happened to them by Sita Ram Goel
3. Inscribing the Other, Inscribing the Self: Hindu-Muslim Identities in Pre-Colonial India by CYNTHIA TALBOT
4. Epigraphia Indica Vol 32

No comments:

Post a Comment