Monday, December 2, 2019

కల్నల్ కాలిన్ మెకంజి

కల్నల్ కాలిన్ మెకంజి

కాలిన్ మెకంజీ 1754 లో స్కాట్లాండులో జన్మించాడు. 2 సెప్టెంబర్ 1783 న ఈస్టిండియా కంపనీ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టాడు. అది మొదలు 1821 లో కలకత్తాలో చనిపోయేవరకూ మెకంజీ ఇండియాలోనే ఉన్నాడు.

1784-90 ల మధ్య ఇతను రాయలసీమ-కృష్ణా పరిసర ప్రాంతాలలో కంపనీ సైనిక ఇంజనీరుగా పనిచేసాడు. 1799 లో టిపు సుల్తాను ఓటమి కారణంగా కంపనీ పరమైన కర్ణాటక జిల్లాలను, నిజాం దఖలు పరచిన సీడెడ్ జిల్లాలను సర్వే చేసే బాధ్యతను మెకంజీకి అప్పగించింది కంపనీ. ఆ సమయంలో సర్వే నిమిత్తం కృష్ణా దిగువ ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించాడు. కావలి వెంకట బొర్రయ్య, వెంకటనారాయణ, వెంకట రామస్వామిల సహాయంతో అనేక శాసనాలను, గ్రామచరిత్రలను సేకరించాడు.

వీరందరిలో బొర్రయ్య చాలా చురుకైన వాడు. ఇతను తెలుగు, సంస్కృతం, పర్షియన్, ఆంగ్లభాషలలో ప్రావీణ్యుడు. బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది. తనపేరుతో కాక తన క్రింద పనిచేసే బొర్రయ్యకే ఆ వ్యాస కర్తృత్వాన్ని ఇవ్వటం మెకంజీ నిజాయితీని ప్రతిబింబిస్తుంది.

ఈ కావలి వెంకట బొర్రయ్య అనేక సంస్కృత, కన్నడ శాసనాలను ఇంగ్లీషులోకి అనువదించినట్లు ఏసియాటిక్ జర్నల్స్ లో కనిపిస్తుంది. ఆ తరువాత చాలా సంచికలలో “బొర్రయ్య నిర్ధారించాడు” అంటూ ఇతరులు వ్రాసిన వ్యాసాలలో కొన్ని రిఫరెన్సులు కనిపిస్తాయి. గొప్ప మేథావి అయిన బొర్రయ్య 1803లో 27 సంవత్సరాల వయసులోనే మరణించాడు.
.
బొర్రయ్య స్థానాన్ని అతని సోదరుడు కావలి వెంకట లక్ష్మయ్య కొనసాగించాడు. ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా 1817 లో మద్రాసు సమీపంలో ఒక గ్రామాన్ని వంశపారంపర్యంగా అనుభవించేలా ఈస్ట్ ఇండియా కంపనీ దానం చేసింది. (రి. ఎన్సైక్లోపెడియా ఏసియాటికా వా. 5)

మెకెంజీ చేస్తున్న కృషిని గుర్తించిన కంపనీ 1810 లో ఇతనిని మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేయర్ జనరల్ గా నియమించింది. కానీ వెంటనే జావా ద్వీపానికి బదిలీ చేయటంతో 1811-1813 మధ్య మెకంజీ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అక్కడే 18 నవంబరు 1812 న డచ్ సంతతికి చెందిన Petronella jacomina Bartels ను వివాహమాడాడు.

తిరిగి ఇండియా చేరుకొన్నాకా 1815 లో మెకంజీ సర్వేయర్ జనరల్ గా నియమించబడ్డాడు. కలకత్తా సెయింట్ జార్జి కోటలో లో ఇతని ఆఫీసు ఉన్నప్పటికీ – అంతవరకూ ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రాంతాలలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటం కొరకు మద్రాసులో ఉండేందుకు కంపనీ అనుమతి తీసుకొని 1817 వరకూ మద్రాసులోనే ఉన్నాడు.

1, ఫిబ్రవరి 1817 న మెకంజి తన మిత్రుడైన అలెగ్జాండర్ జాన్ స్టన్ కు వ్రాసిన ఒక లేఖలో ఈ స్థానిక చరిత్రలను సేకరించటంలో తన ఉద్దేశాలను, నిబద్దతను, కష్టాలను ఇలా చెప్పుకొన్నాడు.

1. 1799 లో కంపనీకి సంక్రమించిన ప్రాంతాల హద్దులను నిర్ణయించే పని నాకు అప్పగించినపుడు- సరిహద్దులే కాక ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తానని నేను చెప్పిన ప్రణాళికను కంపనీ ఆమోదించి, ముగ్గురు గుమస్తాలను, ఒక నాచురలిస్ట్ ను నాకు సహాయకులుగా ఇచ్చింది. కానీ 1801 లో వీరిని తొలగించటంతో నా ప్రణాళికలన్నీ భగ్నమయ్యాయి. ఈ ప్రాంతాల జీవరాశిని రికార్డు చేద్దామనే నా ఆలోచన ఫలించలేదు. అంతే కాక నా జీతం, నాకు ఇచ్చే కంటింజెన్సీ డబ్బులు కూడా తగ్గించేసారు. దీనివల్ల నా ప్రణాళిక దాదాపు కుంటుపడింది.

2. అయినప్పటికీ నేనీ పనులు చేయగలిగాను

జైనులు, బుద్ధులు వేరు వేరు అని నిర్ధారించగలిగాను (అప్పట్లో వీటిని హిందూ మతంలో అంతర్భాగాలుగా గుర్తించేవారు); ప్రాచీన మతసాంప్రదాయాలైన లింగాయత్, శైవం, పాండరం, మఠాలు వివిధ శాఖలు వాటి పుట్టుపూర్వోత్తరాలు స్పష్టపరిచాను; సుమారు మూడు వేల వివిధ శిలా శాసనాలు, తామ్రపత్రాలకు నకళ్ళు తీయించాను; ఢిల్లీ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న Veeracul, Maastie cull లలోని పురాతనజాతుల సంస్కృతిని వెలికితీసాను. (పైన చెప్పిన అన్ని అంశాలను మెకంజీ మొత్తం 12 రీసెర్చ్ పేపర్లుగా ఆసియాటిక్ జర్నల్ లో ప్రచురించాడు)

3. కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచమని కోరటానికి కారణాలు ఈ లేఖలో ఇలా చెప్పుకొన్నాడు మెకంజీ – “నాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులతో నా అనుబంధం వ్యక్తిగతమైనది. వాళ్ళు ఈ ప్రాంతపు స్థానికులు, కలకత్తాకు నాతో పాటు వచ్చి జీవించలేరు. మేము సేకరించిన విషయాలను కేటలాగ్ చేయాలి. చాలా వాటిని అనువదించాలి. ఇది కలకత్తాలో సాధ్యపడదు. నేను ఇంగ్లాండు వెళ్ళే లోగా కనీసం స్థానిక వ్రాతప్రతులు, పుస్తకాలు, శాసనాల సంక్షిప్తసమాచారాన్ని పుస్తక రూపంలో చూడాలని నా కోరిక. దీనికి నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనీసం విద్యావంతులకు తదుపరి పరిశోధనలకు వీలుగానైనా వీటిని కేటలాగ్ చేయించాలి"

అలా ఇంగ్లాండు వెళ్లాలని ఆశపడ్డ మెకంజీ పాపం వెళ్ళనే లేదు కలకత్తాలో 8 మే 1821 న మరణించాడు. మెకంజీ సేకరణలు శిధిలమౌతున్నాయని గమనించిన సి.పి. బ్రౌన్ 1840 ల ప్రాంతంలో వాటికి నకళ్ళు తయారు చేయించాడు. వాటికి మరలా తిరిగి 1930-40 లలో బ్రిటిష్ ప్రభుత్వం మరోసారి నకళ్ళు తీయించటం జరిగింది. నేడు మద్రాసు లైబ్రేరీలో ఉన్నతెలుగు మెకంజీ కైఫీయత్తులు చదవటానికి వీల్లేని విధంగా పూర్తిగా పాడయిపోయాయిని తెలుస్తూన్నది.
******
మెకంజీ సేకరణా విధానం

మెకంజీ ఒక సర్వేయరు. ఆఫీసులో కూర్చునే అధికారి కాదు. సర్వే అనేది వెళ్ళి స్థానికంగా చేయాల్సినపని. అందువలన ఇతనికి అనేక ప్రాంతాలలో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. దీనిని వినియోగించుకొని అక్కడ గ్రామ కరణాల వద్ద ఉండే కవిలెకట్టలలో గ్రామ చరిత్రలను, స్థానికంగా లభించే తాళపత్ర గ్రంధాలను, పుస్తకాలను సేకరించాడు. వివిధ ఆలయశాసనాలను చూసి వాటి ప్రతులను తయారు చేయించాడు. శిల్పాలకు డ్రాయింగులు గీయించాడు. ఇతను నియమించుకొన్న ఉద్యోగుల జీత భత్యాలు కంపనీ భరించేది. ఇది లక్షరూపాయిల మేరకు అయినట్లు రికార్డులు చెపుతున్నాయి. క్రమేపీ కంపనీ, డబ్బులు ఇవ్వటం మానేసాకా ఒకానొక దశలో వారికి జీతాలు మెకంజీయే స్వయంగా ఇచ్చాడు. మెకంజీ సేకరణలలో ఎక్కువ భాగం ఈ విధంగా స్వయంగా సేకరించినవే.

తాను స్వయంగా వెళ్లలేని ప్రదేశాలకు తన అనుచరులను పంపి రిపోర్టులు తెప్పించుకొనే వాడు. అలా నారాయణరావు అనే వ్యక్తి పంపిన అనేక రిపోర్టులు మెకంజీ కైఫీయత్తులలో లభిస్తాయి. (ఇతని రిపోర్టులలో ఆ యా ఊర్లకు ఎలా వెళ్ళిందీ, ఎంతదూరం, ఎక్కడ బసచేసాడు, ఎంతెంత ఖర్చయిందీ లాంటి వివరాలు కూడా ఉండటం విశేషం).

మెకంజీ సేకరించిన ప్రతులు సుమారు “14 భాషలకు” సంబంధించినవి. వీటిని మెకంజీ కూడా సంపూర్ణంగా పరిశీలించలేదు. వాటిని ఎప్పటికైనా స్థిమితంగా కూర్చొని క్రోడికరించాలని అనుకొని, తనదారిలో కనిపించిన ప్రతి చిన్న అంశాన్నీ సేకరించుకొంటూ పోయాడు. వీటన్నింటిని అనువదించటమో క్రోడీకరించటమో ఒక వ్యక్తి వల్ల అయ్యేపని కాదు.

మెకంజీ మరణం తరువాత

మెకంజి మరణానంతరం అతని భార్య మరొకరిని వివాహం చేసుకొని దేశం విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొంది. మెకంజి సొంతడబ్బులు పెట్టికొనుక్కొన్న పుస్తకాలు, పురాతన వస్తువుల విలువ సుమారు లక్షరూపాయిలు ఉండొచ్చని గుర్తించారు. వీటన్నింటిని ఇరవై వేల రూపాయిలకు మెకంజీ భార్య బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చివేసింది. (బహుసా అన్నీ ఒకచోట ఉంటాయని భావించి ఉండవచ్చు). ఇవి ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రేరీ, బ్రిటిష్ మ్యూజియం, మద్రాస్ మ్యూజియం లలో భద్రపరచబడి ఉన్నాయి.

ఇవి కాక ప్రభుత్వోద్యోగిగా మెకంజీ సేకరించిన వస్తువులు అనేకం ఉన్నాయి. మెకంజీ మరణించాక అతని స్థానంలోకి వచ్చిన అధికారికి దాదాపు “లక్ష పేజీల” వరకూ ఉన్నవ్రాతప్రతులను, వేలకొలది ఇతర సేకరణలను ఏం చెయ్యాలో తెలియలేదు. ఇవన్నీ కంపనీకి చెందిన ఆస్తి అయినప్పటికీ వీటిని ఎలా వదిలించుకోవాలా అని కంపనీ అధికారులు తలలు పట్టుకొని కూర్చునేవారట. అలాంటి సమయంలో H H Wilson అనే అధికారి, వీటిని క్రోడికరించటానికి ముందుకురాగా కంపనీ బోర్డు వెంటనే అనుమతినిచ్చింది.

అప్పటికే మెకంజీ తన సేకరణలకు రఫ్ కేటలాగు తయారుచేసినట్లు విల్సన్ గుర్తించాడు. దాని ప్రకారం మొత్తం వ్రాతప్రతులను స్థానిక చరిత్రలు (2070), శాసనాలు (8076), సాహిత్యవిషయాలు (1568), అనువాదాలు (2159), చిత్రాలు/డ్రాయింగ్స్ (2559), నాణాలు (6218) అంటూ వేరుచేసి వాటికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి మొత్తం మెకంజీ సేకరణల వివరాలను Meckenzie Collection - A Descriptive Catalogue of the Oriental Manuscripts and Other articles అనే రెండువాల్యూముల పుస్తకాలుగా 1828 లో వెలువరించాడు.

విల్సన్ కేటలాగు ప్రకారం తెలుగుకు సంబంధించి 285 కావ్యాలు, సీడెడ్ జిల్లాల 358 గ్రామ చరిత్రలు, ఇతర తెలుగు తమిళ గ్రామచరిత్రలు 274 ఉన్నట్లు తెలుస్తున్నది. ఎనిమిది వేల శాసనాలలో తెలుగు శాసనాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు.

విల్సన్ ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో- వీటన్నింటిలో శాసనాలు, స్థానిక చరిత్రలు ముఖ్యమైనవని, వీటిని మరింత శోధించవలసి ఉందని బావించాడు. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సంస్కృత అనువాదాలు ఉన్నాయని, కొద్దిగా మాత్రమే స్వతంత్ర రచనలు లభించాయని అన్నాడు.

మెకంజీ సేకరణలు కృష్ణా నదికి దక్షిణభాగం (రాయలసీమ ప్రాంతం) నుంచి ఎక్కువ ఉన్నట్లు, ఉత్తరభాగం నుంచి పెద్దగా లేనట్టు గుర్తించాడు. బహుసా ఆ కారణం వల్లనే కడపజిల్లా కైఫీయత్తులు ఏడు సంపుటాలుగా మనకు లభించినట్లుగా ఇతరకోస్తా జిల్లాల కైఫీయత్తులు లభించవు.

కాలిన్ మెకంజీ ప్రాసంగికత

కైఫీయత్తు అంటే స్థానిక చరిత్ర అని అర్ధం. మెకంజీ సేకరించిన ఈ కైఫీయత్తులలో ఆనాటి సామాజిక వ్యవస్థ, చరిత్ర, సాహిత్యం, గ్రామాల సరిహద్దులు, అప్పటి పాలకుల వంశావళి వంటి అనేక అపురూపవిషయాలు తెలుస్తాయి. ఇవి స్థానికుల నుండి సేకరించినవి కనుక అప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తుల వంశ చరిత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామ ఆలయాలు, వాటికి గల మాన్యాలు, అక్కడ పండే పంటలు, పన్నులు, వృత్తికులాల మాన్యాలు, గ్రామ పుట్టుపూర్వోత్తరాల గురించిన ఆనాటి కట్టుకథలు గాథలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు లాంటి అనేక సంగతులు కైఫీయత్తులలో ఉన్నాయి.

అమరావతిలోని బౌద్ధ స్థూపాన్ని కూలగొట్టి ఏదో భవన నిర్మాణానికి అక్కడి అవశేషాలను వినియోగిస్తున్నట్లు తెలుసుకొన్న మెకంజి అమరావతి వెళ్ళి, తవ్వకాలు జరిపి అక్కడి బౌద్ధ స్థూప ఉనికిని ప్రపంచానికి తెలియచేసాడు.

రెండు శతాబ్దాల క్రితం తెలుగు నేల ఎలా ఉండేది అనే విషయాలు నేడు తెలుసుకోగలుగుతున్నామంటే ఆనాడు మెకంజీ జరిపిన కృషివల్లనే అనేది అక్షర సత్యం. లేనట్లయితే చాలావిషయాలు కాలగర్భంలో కలసిపోయి ఉండేవి.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment