Wednesday, December 4, 2019

కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కాదు


.
నిజాం రాజు తనకు సైనిక సహాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఈస్ట్ ఇండియా కంపనీకి 1800 లో బళ్ళారి, కడప, అనంతపురం ప్రాంతాలను ధారాదత్తం చేసాడు. వీటిని సీడెడ్ జిల్లాలు అంటారు.
కృష్ణదేవరాయల కాలంనుంచీ ఈ ప్రాంతాలలో పాలెగాండ్ర వ్యవస్థ ఉంది. ఒక పాలెగార్ ఆధీనంలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించిన శిస్తులను వసూలు చేయటం, తగాదాలు తీర్చటం అతని విధి. ఇందుకోసం వాళ్ళు సొంత సైన్యం కూడా కలిగిఉండేవారు. వసూలు చేసిన శిస్తులలో కొంతభాగం రాజుగారికి కప్పం రూపంలో చెల్లించాలి.
కప్పాలు సరిగ్గా చెల్లించని పాలెగాళ్లను రాజు తొలగించినపుడు ఆ గ్రామాల హక్కులను ఇతర పాలెగాళ్ళు ధరచెల్లించి పాడుకొనే వారు.
ఈస్ట్ ఇండియా కంపనీకి ఈ ప్రాంతాలు దఖలుపడటంతో ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమనే భాద్యతను థామస్ మన్రో అనే అధికారికి అప్పగించింది కంపనీ. 9, నవంబరు 1800 న థామస్ మన్రో బళ్లారికి వచ్చాడు.
భూమి శిస్తువసూలులో రైతువారి వ్యవస్థను ప్రవేశపెట్టటానికి ఈస్ట్ ఇండియా కంపనీని ఒప్పించాడు థామస్ మన్రో. రైతు వారి వ్యవస్థ అంటే జమిందార్లు, పాలెగాండ్రు లాంటి మధ్యవర్తులకు కాక రైతులకే నేరుగా భూమి అప్పగించి వారినుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థ. ఇది అప్పట్లో గొప్ప విప్లవాత్మక భూసంస్కరణ.
1800 లో ఈ సీడెడ్ ప్రాంతాలలోని భూమినంతా స్వాధీనం చేసుకొంది కంపనీ. పాలెగాండ్రులందరూ తమ అధికారాన్ని, పెత్తనాన్ని రాత్రికి రాత్రి కోల్పోయారు.
అంతవరకూ తరతరాలుగా భూమిపై హక్కులు అనుభవిస్తున్న పాలెగాండ్రు దీన్ని వ్యతిరేకించారు. వారినందరనీ చర్చలకు పిలిచి వారి వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి కంపనీనుంచి పించను ఏర్పాటు చేసి చాలా మట్టుకు పాలెగాండ్ర అసంతృప్తిని తొలగించగలిగాడు థామస్ మన్రో. అయినప్పటికీ తాము కోల్పోయిన హక్కుల్ని పునరుద్దరించుకోవటం కొరకు కోటల్ని ఆక్రమించుకొంటూ, గ్రామాల్లో కంపనీ అధికారుల్ని చంపివేస్తూ అనేకమంది పాలెగాండ్రు తిరుగుబాట్లు చేసారు.
1800 డిసంబరు నెలలో అయిదువందల మంది అనుచరులతో బళ్ళారిలో హరి నాయకన్ తిరుగుబాటు; నూట డబ్బై మూడు మంది కంపనీ సైనికుల మరణానికి కారణమైన 1801 నవంబరు నాటి పొటేల్ తిరుగుబాటు; 1802 జులై నెలలో ముప్పై ఆరుమంది అనుచరులతో దివాకర్ నాయర్ చేసిన అలజడి; వేలమందిని సమీకరించి 1804 లో కుద్రిత్ ఉల్లాఖాన్, ఇతర పాలెగాండ్రు చేసిన తిరుగుబాటు; అయిదువందల మంది అనుచరులతో 1804 మార్చ్ 27 న కొనకొండ్ల కోటను స్వాధీనంచేసుకొన్న గురువప్ప నాయర్ తిరుగుబాటు లాంటి అనేక పాలెగాండ్ర పోరాటాలను కంపెనీ సైన్యం అణచివేసింది. కొంతమందిని ఉరితీసింది.
గొడికోట పాలెగార్ అయిన బొమట్రాజు 1828 జూన్ 28 న తనకు ఇస్తున్న పించను సరిపోవటం లేదని ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నానని "తిండిలేక మేము చచ్చిపోతున్నాము" అని కంపనీ హవాల్దారు వద్ద చెప్పుకొన్నాడు. అధికారులు స్పందించకపోవటంతో కొంతమంది సేవకుల్ని వెంట వేసుకొని కంపనీ అధికారులపై దాడులు చెస్తే అరెస్టు చేయబడ్డాడు.
నొసుమ్ సంస్థానానికి పాలెగార్ నరసింహారెడ్డి. నొసుమ్ సంస్థానాన్ని కంపనీ స్వాధీనం చేసుకొనే సమయానికి, అంతవరకూ బాకీపడిన శిస్తు నిమిత్తమై వచ్చి వివరణ ఇవ్వాల్సిందని 1800 లో థామస్ మన్రో పిలిచినపుడు నొసుమ్ నరసింహారెడ్డి హాజరు కాలేదు.
క్రమేపీ ఏ ఆదాయవనరులూ లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తటంతో తన పంతాన్ని వీడి పించను తీసుకొని, ఇంటికే పరిమితమై 4, నవంబరు 1804 లో చనిపోయాడు.
నొసుమ్ నరసింహారెడ్డి మరణానంతరం అంతవరకూ అతనికి ఇస్తున్న 8,323 రూపాయిల పించనును అతని భార్యకు బదలాయించింది కంపనీ.
నొసుమ్ నరసింహారెడ్డి దత్తత కుమారుడు జయరామిరెడ్డి, అతని మనవడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. 1846 నాటికి మూడు తరాలు గడిచిపోవటం; వారసులకు పించను పంచుకొంటూ రావటం వల్ల నరసింహారెడ్డి వాటా పది రూపాయిల పది అణాల ఎనిమిది పైసలకు చేరింది. అది ఇవ్వటానికి కూడా అవమానించే పరిస్థితులు ఏర్పడటం వల్ల నరసింహారెడ్డి కంపనీ అధికారులపై తిరుగుబాటు చేసాడు. నలభై ఆరు సంవత్సరాలలో వేరే ఏదో జీవనోపాధి ఏర్పాటుచేసుకోకుండా కంపనీ ఇచ్చే పించనుపై ఎందుకు ఆధారపడ్డారనేది ఆసక్తి కలిగించే అంశం.
భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పిన గోసాయి వెంకన్న అనే ఒక సాధువు మాటతో కంపనీతో యుద్ధానికి దిగాడు నరసింహారెడ్డి. ఊరూరూ తిరిగి మిగిలిన బాధిత పాలెగాండ్రను ఏకం చేయగలిగాడు.
వీరంతా నరసింహారెడ్డి నాయకత్వంలో నడిచి 1846 జూలై లో తాహసిల్దారును, కంపనీ గుమస్తాను చంపేయటంతో తిరుగుబాటు మొదలైంది. ఇతని అనుచరుల సంఖ్య అయిదువేలకు పెరిగింది. వీరిలో ఎక్కువగా బోయలు, యానాదులు, చెంచులు ఉన్నారు. నరసింహారెడ్డి కొంతకాలం కంపనీ పోలీసులను గడగడలాడించి 1846 అక్టోబర్ 6 న కడప కలక్టర్ కాక్రేన్ కుయుక్తులవల్ల అరస్టయి ఉరితీయబడ్డాడు.
****
జమిందార్లు, మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతే శిస్తు కట్టే రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన థామస్ మన్రో ఆలోచనలు ఆధునికమైనవి. అప్పటికి అవి విప్లవాత్మకమైనవి. కార్న్ వాలిస్ 1793 లో బెంగాల్ లో ప్రవేశపెట్టిన జమిందారీ వ్యవస్థ వల్ల జమిందార్లు బలిసిపోతున్నారు తప్ప కంపనీకి పెద్దగా లాభాలు రావటం లేదన్న దూరాలోచనను కూడా కాదనలేం.
పాలెగాండ్ర వ్యవస్థ ఫ్యూడల్ సమాజపు నిర్మాణం. ఇందులో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ దాని తాలూకు పీడన, కులాధారిత వెట్టిచాకిరీ ఉంటుంది. దాన్ని పునఃస్థాపించటానికి చేసిన వ్యక్తిగత పోరాటాన్ని దేశభక్తిగా ప్రొజెక్ట్ చేయటం; కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కానిదాన్ని తొలి స్వాతంత్ర్యపోరాటంలా ప్రచారించటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment