Wednesday, December 4, 2019

Abbé Dubois (1765 – 1848)

దుబాయిస్ పుస్తకం గురించి కస్తూరి మురళి కృష్ణగారి వాల్ పై నేను చేసిన కామెంటు....
Abbé Dubois (1765 – 1848) వ్రాసిన "Hindu Manners, Customs and Ceremonies" అనే పుస్తకం పై నే పెట్టిన పోస్టుకు స్పందిస్తూ మిత్రులు కస్తూరి మురళి కృష్ణ గారు అది ఒక మిస్చివస్ పుస్తకమని, హిందువుల పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగించేదిగా ఉంటుందని, దాన్ని చరిత్రపుస్తకం అని నేను అనటం తప్పుపట్టారు.
దానికి నా సమాధానం.
నేను అన్న వాక్యం ఇది.
"ఈ పుస్తకాన్ని ఏదో ఒక మతానికి చెందిన పుస్తకంగా అనుకొంటే అంత మజా ఉండదు. ఒక చరిత్ర పుస్తకంలా భావించాలి"
దాని అర్ధం.....
దుబాయిస్ మత ప్రచారకుడు. అతనికి హిందు అలవాట్లు, ఆచారాలు వింతగానో కొంతమేరకు అసహనంగానో అనిపించి ఉండొచ్చు. ఇలా ఒక మతకోణంలోంచి పుస్తకాన్ని చదివితే రుచించదు అని ముందే హెచ్చరించటం.
ఇక చరిత్ర అంటే నా ఉద్దేశం, దుబాయిస్ అనేవాడు చరిత్రలో ఉన్నాడుగా, అతడు కొన్ని అభిప్రాయాల్ని వెలిబుచ్చాడుగా, ఆకాలానికి చెందిన కొన్ని సంఘటనలను ఉదహరించాడుగా. అంతే అంతవరకే ఆలోచించాలి అని.
సమస్య ఎక్కడ వస్తుందంటే... ఆ కాలంలో మనగురించి మనం రాసుకొన్న పుస్తకాలు లేవు. మరీ ముఖ్యంగా సామాన్యజీవితానికి సంబంధించి. గట్టిగామాట్లాడితే ఏ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో జాలరులగురించి చెప్పిన పద్యమో, శ్రీనాధుడు రాయలసీమలో కరువుగురించి చెప్పిన పద్యమో, చౌడప్ప వేశ్యలగురించి చెప్పిన పద్యమో ఉదహరిస్తారు. ఇంకా ఏవైనా ఉన్నప్పటికీ ఈనాడు నాకు అర్ధంకాని గ్రాంధికభాషలోనే ఉండి ఉంటాయి. అప్పటి సామాన్యుల జీవితాలను తెలుసుకోవాలనే నా కోర్కె ఎలా తీరుతుంది? ఇలాంటి పుస్తకాల ద్వారా కాక?
అలాగని ఆ విషయాలను నేను ప్రమాణంగా తీసుకోమని అనలేదే. చదవటం అనేది మజా కలిగించే అంశం అని మాత్రమే అన్నాను గమనించండి.
రెండు శతాబ్దాల క్రితం నాటి ఒక రచనకు ఈ రోజు అనేక వ్యాఖ్యానాలు ఉండొచ్చు. మనకు నచ్చిన కోణాన్ని తీసుకోవటం మన ఇష్టం.
ఈ పుస్తకం చదివాకా నాకు అర్ధమైన విషయం --- ఈ రోజు అత్యంత గొప్పది హిందూ మతమని ఊరేగుతున్న మనందరం గమనించాల్సింది ఏమిటంటే - ఓ మూడు శతాబ్దాల క్రితం మన పూర్వీకులు పాటించిన ఆచారవ్యవహారాలలో 99% నేడు మనం పాటించటం లేదని. మరీ ముఖ్యంగా బ్రాహ్మణులు  ఇది సత్యం. నమ్ము నమ్మక పొండి.
కాబట్టి ఇప్పటి ప్రజాస్వామిక జీవనానికి గర్వపడదాం.
నేను నా పోస్టులో అన్నట్టు మన పూర్వీకులు అజ్ఞానంతోను, విజ్ఞానంతోనూ బ్రతికారు
నా వరకూ నేను అలాగే అనుకొంటాను.
నాకు తెలిసి మనజీవనవిధానాలపై రచనలు చేసిన వారిలో దుబాయిస్ లాంటి మతప్రచారకులే కాదు వివిధమతాలకు చెందిన మామూలు ట్రావెలెర్స్ కూడా ఉన్నారు. వారూ దాదాపు ఇలాగే చెప్పారు. వారికి కూడా మతం రంగు పూద్దామా?
చరిత్రను మనకు అనుగుణంగా మార్చుకోవాలి అనుకోవటం వ్యర్ధం. దాన్ని అన్ని అవలక్షణాలతో అంగీకరించటం హుందాతనం అని అనుకొంటాను.
చరిత్రలో మానవజాతి ప్రయాణం ఎప్పుడూ మంచివైపుకే ఉంది, ఉంటుంది.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment