Wednesday, December 4, 2019

sri sri

శ్రీ నున్నా నరేష్ గారి వాల్ పై నే చేసిన కామెంట్
****
ఈ మహా అనేది రెలటివ్. శ్రీశ్రీ సమకాలీకులే ఆయన్ను విభేదించారు.
శ్రీశ్రీ ని యుగకవి అంటే రోణంకి అప్పలస్వామి వ్యతిరేకించారు.
ఆరుద్ర, సోమసుందర్ లు, నారాయణబాబును ముందుకు తెచ్చి శ్రీశ్రీ రచనాచోరుడు అని నిరూపించబోయారు. (చెర్రీ ఆర్చర్డ్ అనువాదం విషయమై)
అంతోటి అభ్యుదయవాది శ్రీశ్రీ కూడా తనకు మహాకవి అని బిరుదు ఇచ్చినందుకో ఏమో... సనాతన, సంప్రదాయవాది అయిన విశ్వనాధను మెత్తమెత్తగా విభేదిస్తూ చివరివరకూ గుండెల్లోనే పెట్టుకొన్నాడు. అదొక వైరుధ్యం. చలాన్ని కూడా సరిగ్గా అంచనా వేయలేదు శ్రీశ్రీ. ఏదో ఒక నవలా రచయిత అన్నట్లుగానే పరిగణించాడు. రావిశాస్త్రిని, కొడవటిగంటిని ప్రొమోట్ చేస్తాడు.
మహాప్రస్థానంలో ఆ బ్రాహ్మణీయ పదజాలం ఎందుకు రాసారు అని అడిగితే - "ఒదిలించుకోలేక- ఇప్పటికి ఒదిలించుకోగలిగాను" అంటాడు శ్రీశ్రీ. అరవైల తరువాత వ్రాసిన కవిత్వంలో అలాంటి పదజాలం కనిపించదు. గమనించొచ్చు.
శ్రీశ్రీ మంచి కవి. తనకాలానికి ముందున్నాడు. తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించాడు. మహాప్రస్థానంలో కమ్యూనిజాన్ని, మరో ప్రస్థానంలో సాయుధవిప్లవాన్ని సమర్ధించాడు. సిద్దాంతాన్ని మనసావాచా కర్మణా నిజాయితీగా నమ్మాడు. దాన్నే తన కవిత్వంలో ప్రతిబింబించాడు.
ఆ సిద్దాంతం భారతీయ సామాజిక భూమికను అర్ధం చేసుకోవటంలో విఫలమయ్యింది కనుక, నేడు శ్రీశ్రీ రిలవెన్స్ కూడా ప్రశ్నార్ధకమైంది. శ్రీశ్రీ ది పూర్తిగా వర్గ దృష్టి.
వర్గాలు కులాలుగా చీలిపోయాయి కదా అని శ్రీశ్రీని ప్రశ్నిస్తే- "అందుకే కదా కులనిర్మూలనను సమర్ధిస్తున్నది విరసం" అంటాడు చిత్రంగా. అంత మేధావి నుండి ఇంత లోతుతక్కువ సమాధానం ఆశ్చర్యం కలిగించక మానదు.
అయినప్పటికీ శ్రీశ్రీ కుట్రపూరితంగా తక్కువకులాల్ని విస్మరించాడు అనే విషయంలో బెనెఫిట్ ఆఫ్ డౌట్ శ్రీశ్రీ కే ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే - శ్రీశ్రీ కులనిర్మూలన కోరుకోవటం, వర్ణాంతరవివాహాలను ప్రోత్సహించటం, స్వయంగా జరిపించటం, అస్పృశ్యతపై ఉపరితల వ్యాఖ్యానాలు, చివరిదశలో సత్యమూర్తిని, వంగపండుని, గద్దర్ ని, చెరబండరాజుని అక్కున చేర్చుకోవటం లాంటివి స్థూలంగా కనిపిస్తాయి. (సూక్ష్మంగా చూస్తే అవేమంత వాదనకు నిలబడే అంశాలు కాకపోవచ్చు. అది వేరే విషయం)
ముందుగా అన్నట్లు మహా అనేది రెలెటివ్. లోకో భిన్నరుచి. తెలుగుసాహిత్యానికి శ్రీశ్రీ ఒక్కడు మాత్రమే మహాకవి అంటే నేనూ అంగీకరించను.
కవిత్వానికి సంబంధించి నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఇస్మాయిల్ గారిని నేను మహాకవిగా భావించుకొంటాను. దీనికి ఒకరి అంగీకారం అవసరం లేదు, ఎవ్వరూ ఒప్పుకోకపోయినా నేనేం పట్టించుకోను.
గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు నాకు సంబందించి ఇది స్వస్థి.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment