Wednesday, December 4, 2019

ఒక పక్షి చిత్తరువు వెయ్యాలంటే -To Paint The Portrait Of A Bird by Jacques Prevert

ఒక పక్షి చిత్తరువు వెయ్యాలంటే -To Paint The Portrait Of A Bird by Jacques Prevert
మొదట ఒక పంజరాన్ని చిత్రించు
దాని తలుపు తెరిచుండాలి
తరువాత
ఆకర్షణీయమైనది ఏదైనా
అందమైనది ఏదైనా
ఉపయోగపడేది ఏదైనా
డాంబికము లేనిది ఏదైనా
పక్షికొరకు చిత్రించు
ఇపుడు ఆ కాన్వాస్ ను
ఏదైనా ఒక చెట్టువద్ద ఉంచు
తోటలోనో, వనంలోనో లేదా అరణ్యంలోనో.
ఇక ఆ చెట్టు వెనుక దాక్కో
ఏమీ మాట్లాడకు
ఏమాత్రం చప్పుడుచేయకు
ఒక్కోసారి పక్షి వెంటనే రావొచ్చు లేదా
రావటానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు
నిరాశ చెందకు
నిరీక్షించు
అవసరమైతే సంవత్సరాల తరబడైనా.
నీ చిత్తరువు యొక్క విజయం
అది తొందరగా వచ్చిందా లేక ఆలస్యంగా వచ్చిందా
అన్నదానిపై ఆధారపడి ఉండదు
పక్షి అంటూ వస్తే.
పక్షి వచ్చాకా
గంభీరమైన నిశ్శబ్దాన్ని పాటించు
అది పంజరంలోకి వెళ్ళేవరకు ఎదురుచూడు
లోపలకు వెళ్లగానే
కుంచెతో పంజరం తలుపు మృదువుగా మూసెయ్యి.
తరువాత
పంజరం ఊసల్ని ఒక్కొక్కటిగా చెరిపేయి
పక్షి ఈకలను ఏమాత్రం తాకకుండా చేయి ఆ పని
అలాగే ఓ చెట్టు బొమ్మను చిత్రించు
దాని అందమైనకొమ్మలలో ఒకదాన్ని
పక్షి కొరకు కేటాయించు.
ఇంకా పచ్చని ఆకులను, తాజా గాలులను
సూర్యకాంతి తుంపరలను, వేసవి మద్యాహ్నపువేళ
పచ్చికలోంచి వచ్చే కీటకాల శబ్దాలను కూడా చిత్రించు.
ఇక ఆ పక్షి గొంతువిప్పి పాడేవరకు ఎదురుచూడు
పాడలేదా! అది అశుభం
నీ చిత్తరువుకు అది అపశకునం
పాడిందా! అది చక్కని శుభసంకేతం
మెల్లిగా ఆ పక్షి ఈకనొకదాన్ని సేకరించు
కాన్వాసు కు ఒక మూల నీ పేరును రాసుకో!
మూలం: To Paint The Portrait Of A Bird
by Jacques Prevert (tr. John Dixon Hunt)
తెలుగు: బొల్లోజు బాబా

No comments:

Post a Comment