Wednesday, December 4, 2019

సర్వాయి పాపన్న – ఒక చారిత్రిక పరిశీలన

సర్వాయి పాపన్న – ఒక చారిత్రిక పరిశీలన
దళితబహుజనులు ఏకమై ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని 17 వ శతాబ్దంలోనే నిరూపించిన విప్లవకారునిగా కొందరు చరిత్రకారులు సర్వాయి పాపన్నకు పట్టం కట్టారు. చరిత్రలోంచి వ్యక్తులను తీసుకొని వారిద్వారా సమకాలీన రాజకీయ ప్రాసంగిత కలిగిన దృక్పథాన్ని ప్రకటించటం నేడు సర్వదా నడుస్తున్న వ్యవహారం.
సర్వాయి పాపన్న జీవితం జానపదగాథలలో నిక్షిప్తమై ఉంది. ఇదొక కళాత్మక రూపం. సాధారణంగా కళాత్మక రూపంలో కల్పన ఉంటుంది. కథానాయకుడి చుట్టూ వ్యతిరేక వాతావరణ రూపంలో ఒక ఘర్షణ చిత్రించబడుతుంది. చివరకు ప్రొటగానిస్ట్ మరణించటంతో కథ ముగుస్తుంది. ఆనందోపదేశాలు కళ బాధ్యతలు. చరిత్రను మోసే అవసరం కళకు ఉండదు. అందుచేత ఆ రచయిత కళారూపానికి విరుద్ధంగా ఉండే కొన్ని సామాజిక, చారిత్రిక వాస్తవాల పట్ల అయితే మౌనమైనా వహించాలి లేదా వాటిని వంకరలైనా తిప్పాలి. అందుకే వీరగాథలలో కనిపించే కథానాయకులకు చరిత్రపుస్తకాలలో కనిపించే కథానాయకులకు హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంటుంది.
J.A. Boyle, 1874 లో Telugu Ballad Poetry అనే వ్యాసంలో పాపారాయుని వీరగాథను బళ్ళారికి చెందిన ఒక బోయవాని నోటివెంట విన్నట్లు, అది ఇటీవలే వ్రాసినదని పేర్కొన్నాడు. అందులో పాపన్న తల్లితో తన జీవితాశయాలను ఇలా చెపుతున్నాడు.
తల్లీ కొలువుకు వెళ్లను/
ఎంగిలి ముంత ఎత్తలేను
కొట్టుదును గొల్కొండ పట్టనము
ఢిల్లికి మొజుర్ నవుదును
మూడు గడియల బందరు కొట్టుదును
బంగార కడియాలు పెట్టుదును
ఆ తరువాత సర్వాయి పాపన్న వీరగాథను వచనరూపంగా మార్చి సర్వాయి పాపన్న చరిత్ర పేరుతో 1931 వచ్చింది. ఇది మరింత కాల్పనికతో ఉంటుంది.
***
I. సర్వాయి పాపన్న చరిత్ర
పాపన్న పన్నెండేళ్ల వయసులో చెట్టుక్రింద పడుకొన్నప్పుడు పన్నెండు తలల నాగుపాము అతనికి నీడపట్టింది. అటే పోతున్న కొంతమంది బ్రాహ్మణులు అది చూసి పాపన్న మహర్జాతకుడని, పల్లకిలో తిరుగుతాడని, గోల్కొండను ఏలుతాడని చెపుతారు. (పాపన్న కల్లుగీత వృత్తి చేసే గౌండ కులానికి చెందిన వ్యక్తి. అప్పట్లో బ్రాహ్మణ, క్షత్రియులకు తప్ప ఇతరులకు పల్లకిలో తిరిగే అర్హత ఉండేది కాదు),
అప్పటినుంచి పాపన్న నోటిమాటకు మహత్యం వచ్చిందట. తాడిచెట్టును కల్లు ఇమ్మని అడిగితే ఒంగి ఇచ్చేదట. తల్లి దాచుకొన్న కొంత సొమ్మును దొంగిలిస్తాడు. వెంకటరావు అనే ఒక భూస్వామిని శిక్షించి అతని ధనాన్ని లాక్కొంటాడు. ఒక ఎరికల ఆమెను పెండ్లిచేసుకొంటాడు. వజ్రనబుద్దు అనే జమిందారుని కొల్లగొడతాడు. గోల్కొండ సైనికులతో తలపడి విజయం సాధిస్తాడు. గోల్కొండకోటపై దాడి చేసి ఆక్రమించుకొంటాడు. తరువాత ముస్లిం సైనికులు చుట్టుముట్టినప్పుడు ఇక చిక్కక తప్పదని తెలుసుకొని కత్తితో తలనరుక్కొని చనిపోతాడు.
గోల్కొండ నవాబు ఇతని గొప్పదనాన్ని గుర్తించి రాజలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటంతో కథ ముగుస్తుంది.
సమకాలీన కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఈ గాథలో బ్రాహ్మణ వ్యతిరేకత (వర్ణ వ్యవస్థను ధిక్కరించి పల్లకిలో తిరగటం), సామ్రాజ్య వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేకత, దళితబహుజన రాజ్యాధికార సాధన లాంటి రొమాంటిక్ ఊహలు అనేకం కనిపిస్తాయి.
వీరగాథలు చరిత్రగా చలామణీ అయ్యేచోట చారిత్రిక వాస్తవాలు నిర్ధాక్షిణ్యంగా మరణిస్తాయన్నది ఒక నిష్టుర సత్యం.
****
II. చరిత్ర రికార్డులలో సర్వాయి పాపన్న (1650-1710)
1. ఆనాటి రాజకీయ పరిస్థితులు
సర్వాయి పాపడు 1695 నుంచి 1710 మధ్యలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఔరంగజేబు1687 లో గోల్కొండను వశపరచుకొని గోల్కొండ రాజు అబుల్ హసన్ ను బంధీగా తీసుకొనిపోయి దక్కనును నేరుగా ఢిల్లీ పాలనలోకి తీసుకొచ్చాడు. స్థానికేతరులు అధికారులుగా రావటంతో స్థానిక జమిందార్లు, కులీనులు అసంతృప్తితో ఉండేవారు. పన్నుల భారం అధికమైంది. కరువుకాటకాలు చుట్టుముట్టాయి. ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యం రాజకీయంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. అప్పటికే ఔరంగ జేబుకు తొంభైఏళ్ళు దాటాయి. ఇక చక్రవర్తి రేపోమాపో చచ్చిపోతాడని దేశం అంతా ఎదురుచూసే పరిస్థితి. వారసత్వ పోరు ఉండనే ఉంది. సామంతులు ఎవరి మట్టుకు వారు స్వతంత్రతను ప్రకటించుకొనే ఆలోచనల్లో ఉన్నారు. కేంద్రంలో కానీ, స్థానీయంగా కానీ బలమైన నాయకత్వం లేదు.
పరిస్థితి ఎంతెలా ఉండేదంటే ఔరంగజేబు 1700 లో Riza Khan అనే సైనికాధికారిని, బీదరు అల్లర్లను కట్టడి చేయమని పంపిస్తే అతను ఇక్కడకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకొని, సమీప సంస్థానాలను ఆక్రమించుకొని, గ్రామాలను దోచుకొంటూ ఆ ప్రాంతాన్ని ఒక నియంతలా ఏలటం మొదలెట్టాడు.
2. పాపడి రంగ ప్రవేశం
ఇలాంటి అస్థిర పరిస్థితులలో సర్వాయి పాపడు తెరమీదకు వచ్చాడు.
వరంగల్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తరికొండ గ్రామంలో పాపడు జన్మించాడు. 1690 ల ప్రాంతంలో పాపడు ధనికురాలైన తన విధవ సోదరిని చంపి ఆమె ధనాన్ని దొంగిలించాడు. ఈ డబ్బుతో కొంతమంది అనుచరులను కూడగట్టుకొని తరికొండపై చిన్న దుర్గాన్ని నిర్మించుకొన్నాడు. (అనుచరులు అంటే కూలి ఇచ్చి పెట్టుకొనే వ్యక్తులు. అప్పట్లో సైన్యం అంటే కూడా కూలికి పోరాడే వ్యక్తులు. అంతే తప్ప ఆశయాలకు ఆకర్షితులై వచ్చి చేరే ఆదర్శపురుషులు కారు. యుద్ధంలో జయిస్తే రాజుకు భూములు, అధికారం, అందమైన స్త్రీలు దక్కితే; ఓడిన రాజ్యంలోని ప్రజల డబ్బులు, నగలు, బిందెలు, చెంబులు లాంటివి ఈ సైనికులు బలవంతంగా లాక్కొని పంచుకొనేవారు. సైనికులకు ఇదొక అదనపు ఆకర్షణ. యుద్ధానంతరం దొమ్మీ అనివార్యం).
అలా పాపడి నాయకత్వంలో ఈ దండు, దుర్గంలో ఉంటూ రాజమార్గం (Highway) పై హైదరాబాదువైపు వెళ్ళే వ్యాపారస్తులను, ధనిక పరివారాన్ని అటకాయించి దోపిడీలు చేసేది. ఇది చూసిన స్థానిక నాయకులు పాపడిని తరిగొండనుంచి తరిమేసారు. అక్కడనుంచి వందమైళ్ల పారిపోయి వెంకటరావు అనే జమిందారు వద్ద సేనానిగా చేరాడు పాపడు.
అక్కడ కూడా పాపడు తన పాతపద్దతులలో దారిదోపిడీలు చేస్తున్నట్లు తెలుసుకొన్న వెంకటరావు ఇతన్ని ఖైదుచేయించాడు. వెంకటరావు భార్య, తనబిడ్డకు అస్వస్థత తగ్గాలని ఖైదీలనందరినీ విడిపించిన సందర్భంలో పాపడు కూడా విడుదలై తిరిగి జనజీవనంలోకి వచ్చాడు.
3. పాపడి దురాగతాలు
పాపడు తన పుట్టిన ఊరు సమీపంలో షాపూర్ (Shahpur) అనే ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకొని మరలా దారిదోపిడీలు కొనసాగించాడు. ఇక్కడ ఇతనికి సర్వాయి అనే మిత్రుడు తగిలాడు. వీరిద్దరి స్నేహం బలపడి కొండపై ఒక బలమైన దుర్గాన్ని నిర్మించి మరిన్ని క్రూర కృత్యాలు చేయటం మొదలెట్టారు. వీరి అరాచక చర్యలకు ముస్లిమ్, హిందువులు ఇద్దరూ కూడా బాధితులుగా ఉండేవారు. ఈ విషయాలు కొంతమంది ఔరంగజేబుకు తెలియచేయటంతో అతను కాసిం ఖాన్ అనే సేనాధిపతిని పాపడిని తొలగించమని పంపించాడు.
పాపడిని పట్టుకోవటానికి వెళ్ళిన కాసిం ఖాన్ ను పాపడి అనుచరులు చంపేయటంతో వీరు మరింత విజృంభించటం మొదలెట్టారు.
1702 లో గోల్కొండ డిప్యూటి గవర్నల్ రుస్తుం దిల్ ఖాన్ స్వయంగా పాపడిని అంతమొందించటానికి షాపూర్ వచ్చి రెండునెలలపాటు పాపడి బృందంతో పోరాడాడు. ఈ పోరాటంలో పాపడు, సర్వాయిలు తప్పించుకోగా, రుస్తుం దిల్ ఖాన్ కోటను ధ్వంశం చేసి హైదరాబాదు తిరిగి వచ్చేసాడు.
రుస్తుం దిల్ ఖాన్ వెళిపోయాక పాపడు, సర్వాయిలు తిరిగి వచ్చి కోటను మరింత విస్తరించి కట్టుకొని తమ కార్యకలాపాలు కొనసాగించటం మొదలెట్టారు. ఇదే సమయంలో పాపడి అనుచరులు- సర్వాయికి పుర్దిల్ ఖాన్ కి మాటామాటా వచ్చి కొట్టుకొని ఇద్దరూ హతమవటంతో పాపడు నాయకత్వానికి తిరుగులేకుండా పోయింది. పాపడు బృందం సమీపంలో ఉన్న కోటలను ముట్టడించి ఆక్రమించుకోసాగింది.
1706 లో గోల్కొండ డిప్యూటి గవర్నరు పైన చెప్పిన మరొక దోపిడిదారుడు Riza Khan ను పాపడిని నిలువరించమని అభ్యర్ధించాడు. బహుసా ముల్లును ముల్లుతో తీయాలని గోల్కొండ పాలకులు భావించి ఉంటారు. రిజాఖాన్ కొంతమంది సైన్యాన్ని పంపాడు. పాపడి ముందు వీరు నిలువలేక వెనక్కి వచ్చేస్తారు.
ప్రజలనుండి వస్తున్న ఒత్తిడులకారణంగా 1707 లో డిప్యూటి గవర్నరు రుస్తుం దిల్ ఖాన్ పాపడిని పట్టుకోవటానికి సైన్యంతో షాపుర్ వచ్చి పాపడితో తలపడ్డాడు. ఈసారి పాపడు తెలివిగా భారీ ధనాన్ని రుస్తుం దిల్ ఖాన్ కు లంచంగా ఇచ్చి తప్పించుకొన్నాడు. రుస్తుం దిల్ ఖాన్ హైదరాబాదు వెళిపోయాడు.
4. వరంగల్ కోటపై దాడి
రుస్తుం దిల్ ఖాన్ కు లంచమిచ్చి తప్పించుకొన్న పాపడు తనకు ఇక తిరుగే లేదని భావించి ఏప్రిల్ 1708 లో మూడువేలమంది అనుచరులతో వరంగల్ కోటపై దాడి చేసి, వశపరచుకొని అపారమైన సంపద, వస్తువులను చేజిక్కించుకొని; వేలమంది ధనిక వర్గానికి చెందిన స్త్రీలను బంధీలుగా తనవెంట తీసుకొని పోయాడు.
పాపడి అనుచరులు వరంగల్ పట్టణాన్ని లూటీ చేసారు. వరంగల్ మేలుజాతి కార్పెట్లకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. పెద్ద పెద్ద కార్పెట్లను తీసుకెళ్లలేక ముక్కలు చేసి పట్టుకెళ్లారు.
షాపూర్ కోటలో ఎత్తైన గోడలతో నిర్మించిన ప్రదేశంలో అపహరించిన స్త్రీలను, పిల్లలను బంధించారు. వీరిలో వరంగల్ పట్టణ న్యాయాధికారి భార్య, ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉన్నారు. అపహరించిన వారి బంధువులనుండి పెద్దమొత్తాలలో ధనాన్ని వసూలు చేయటానికి డబ్బు ఉన్న వారి స్త్రీలను పిల్లలను పాపడు ఎంచుకొనేవాడు.
(ఆ న్యాయాధికారి భార్యను పాపడు సొంతానికి ఉంచుకొని, కూతురిని నాట్యకత్తెగా తర్ఫీదు ఇమ్మని భోగం స్త్రీలవద్దకు పంపించాడు. ఆ చిన్నిపాప తాత పేరు షా ఇనాయత్. ఇతను ఆనాటి సమాజంలో గౌరవనీయుడు. ఇతను డిల్లీ వెళ్ళి బహదూర్ షా వద్ద తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నప్పుడు, బహుదూర్ షా పెద్దగా స్పందించలేదు. చేసేదేమీ లేక ఇతను ఇంటికి వచ్చి తన నౌకరులందరికీ కానుకలిచ్చి స్వేచ్ఛగా బ్రతకమని పంపించేసి కొద్దిరోజులకే బెంగతో చనిపోయాడు)
5. భోనగిరి కోటపై దాడి
వరంగల్ కోటపై చేసిన దాడిద్వారా పాపడు విపరీతమైన ధనాన్ని కూడగట్టాడు. దీనితో ఆంగ్లేయులు, డచ్చివారినుండి 700 తుపాకులు కొన్నాడు. బంగారు పల్లకిలో తిరగటం మొదలెట్టాడు. చుట్టూ 700 మంది సాయుధులైన సైనికులను రక్షణగా పెట్టుకొన్నాడు.
ఆహారధాన్యాలు పెద్దఎత్తున కొంటానని పాపడు ఒకరోజు వ్యాపారస్తులకు కబురు పెట్టి, వారి ధనాన్ని, వస్తువులను, బండ్లను, పదివేల పశువులను బలవంతంగా లాక్కొని, వారిని బంధించి ఖైదులో పడేయించాడు. ఆ పశువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాలను సాగుచేయించటం మొదలు పెట్టాడు.
వరంగల్ కోటదాడి తరువాత భోనగిరి కోటపై జూన్ 1708 లో దాడి చేసాడు. ఈ సమయంలో తన అనుచరులకు- స్త్రీలను తీసుకొచ్చిన వారికి వెండినాణాలు, ఉన్నతవర్గ స్త్రీలను ఎత్తుకొచ్చినవారికి 5 బంగారు నాణాలు ఇస్తానని చెప్పాడు. అలా భోనగిరి కోటదాడిలో సుమారు 2000 మంది స్త్రీలు అపహరింపబడ్డారు.
ఉన్నతవర్గాలు వైభవంగా జరుపుకొనే పెళ్ళిళ్లలో పాపడు మెరుపుదాడులు చేసి స్త్రీలను అపహరించి, వారి బంధువులనుండి అధికమొత్తాలలో ధనాన్ని రాబట్టేవాడు. Kilpak జమిందారు పాపడికి లొంగనందుకు తన వద్ద బంధీగా ఉన్న అతని భార్య నాలుకను కోసి అతనికి కానుకగా పంపించి హెచ్చరించాడు.
ఈ దోపిడీలలో హిందువు ముస్లిమ్ అనే వ్యత్యాసం ఉండేది కాదు. అందువల్ల ముస్లిమ్ శ్రీమంతులు, తెలుగు జమిందార్లు పాపడి అరాచకాలకు బలయ్యి, ఇతని పీడను ఒదిలించమని గోల్కొండకు మొరపెట్టుకొనేవారు.
6. చక్రవర్తి తో సన్మానం
ఔరంగజేబు చనిపోయాకా ఏర్పడిన వారసత్వపోరులో బహదూర్ షా సింహాసనాన్ని చేజిక్కించుకొన్నాడు. ఇది నచ్చని బహదూర్ షా సోదరుడు Kam Baksh హైదరాబాదుకు స్వతంత్ర రాజుగా ప్రకటించుకొన్నాడు. ఇదివిన్న బహదూర్ షా దక్కను వచ్చి అతనితో పోరాడి అంతమొందించి దక్కను సామ్రాజ్యానికి తన చక్రవర్తి స్థానాన్ని స్థిరపరచుకొన్నాడు. ఆ సందర్భంలో బహదూర్ షా హైదరాబాదు ప్రముఖులతో దర్బారు ఏర్పాటు చేసినప్పుడు పాపడు 14 లక్షల రూపాయిలు కానుకగా ఇచ్చి ఔరంగజేబుచేత సన్మానం పొందాడు.
పాపడి చేతిలో బలయినవారు ఈ చర్యతో తీవ్ర అసంతృప్తిచెందారు. ముఖ్యంగా పాపడు వద్ద బంధీలుగా స్త్రీలు, పిల్లల బంధువర్గాలు. వీరంతా కలిసి బహదూర్ షాకు తమ అసంతృప్తిని తెలియచేసారు. వారి విజ్ఞాపనల మేరకు హైదరాబాద్ నూతన గవర్నరైన Yusuf Khan కు పాపడిని అంతమొందించమని ఆదేశాలిచ్చాడు చక్రవర్తి. Yusuf Khan తిరిగి ఆ పనిని Dilawar Khan అనే సేనాపతికి అప్పగించాడు.
1709 లో పాపడు ఒక జమిందారుపై దాడుచేయటానికి వెళ్ళినపుడు షాపుర్ కోటలో పాపడిచే బంధింపబడిన వారు తిరుగుబాటు చేసి చెరనుంచి విడిపించుకొన్నారు. వీరందరికీ నాయకత్వం వహించింది పాపడి బావమరిది కావటం విశేషం. పాపడి భార్య తన భర్తలేనప్పుడు బంధీగా ఉన్న తమ్ముడికి, రహస్యంగా ఆకురాయిలను భోజనంలో దాచి అందించగా వాటి సహాయంతో అతను తన సంకెళ్లను తెంచుకొని మిగిలిన వారిని కూడా విడిపించాడు. ఇది తెలుసుకొన్న పాపడు షాపూర్ కోటకు వచ్చినపుడు అంతవరకూ బంధీలుగా ఉన్నవారు కోటలోంచి ఫిరంగులు కాలుస్తూ పాపడు అనుచరులపై ఎదురుదాడి చేసారు.
కోపోద్రిక్తుడైన పాపడి ఆదేశాలతో- కోట గుమ్మాలను తగలపెట్టి, గేదెలను చంపి రక్తంతో తడితడిగా ఉన్న వాటి చర్మాలను తొడుక్కొని ఆ మంటలలోంచి కోటలోకి వెళ్లటానికి ప్రయత్నించారు అతని అనుచరులు. ఇదే సమయానికి దిలావర్ ఖాన్ తనసైన్యంతో పాపడిని బంధించటానికి అక్కడికి వచ్చాడు. ఇలా రెండు వైపులనుండి దాడి ఎదురవ్వటంతో పాపడు తరికొండ కోటకు పారిపోయ్యాడు.
7. పాపడి పతనం
దిలావర్ ఖాన్ పాపడిని బంధించటంలో విఫలమవటంతో యూసఫ్ ఖాన్, మార్చ్ 1710 లో ఇరవై వేలమంది సైనికులను తీసుకొని తానే స్వయంగా తరికొండ కోటను చేరి పాపడి తో తలపడ్డాడు. పాపడు సైనికులకు యూసఫ్ ఖాన్ రెట్టింపు కూలి ఇస్తానని ప్రకటించటంతో అలసిపోయిన చాలామంది పాపడిని విడిచి యూసఫ్ ఖాన్ సైన్యంలో చేరిపోయారు. పాపడు కొద్ది నెలలు ప్రతిఘటించి, మందుగుండు అయిపోవటంతో మారువేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా రహస్యమార్గం ద్వారా కోటవిడిచి పారిపోయాడు. అప్పటికి అతని కొడుకులు ఇంకా యూసఫ్ ఖాన్ తో పోరాడుతున్నారు.
పాపడు మారువేషంలో హసన్నబాద్ అనే గ్రామాన్ని చేరుకొని అక్కడ ఒక కల్లు దుకాణంలో కూర్చొని కల్లు కావాలని అడగగా, ఇతన్ని ఆ దుకాణదారుడు గుర్తుపట్టి సైనికులకు అప్పగించటం జరుగుతుంది. వాళ్ళు పాపడిని బంధించి యూసఫ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్లారు. దొంగిలించిన సొత్తు ఎక్కడదాచాడో చెప్పమని ఎంత హింసించినా పాపడు ఏమీ చెప్పకపోవటంతో - పాపడి తలనరకి బహదూర్ షా వద్దకు పంపించి దేహాన్ని హైదరాబాద్ గేట్ కు వేలాడదీయించాడు యూసఫ్ ఖాన్.
అలా పాపడు కథ 1710 లో ముగిసింది.
****
III. చారిత్రిక పాపడికి వీరగాథ పాపన్నకు ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు?
పాపన్న జీవితం వీరగాథగా మారటానికున్న కారణాలలో ముస్లింలపై తిరుగుబాటు అనే అంశం ప్రధానంగా వినిపిస్తుంది. కానీ పాపన్న అనుచరులలో హుస్సైన్, తుర్కా హిమాన్, కొత్వాల్ మీర్ సాహిబ్ లాంటి ముస్లిమ్ వ్యక్తులు ఉన్నారు. అంతే కాక పాపడు దోపిడీ చేసిన వారిలో ముస్లిమ్ ఫౌజ్ దార్ లతో పాటు అనేక మంది హిందు జమిందార్లు కూడా ఉన్నారు. పాపడి ప్రధాన అనుచరులైన సర్వా హిందువు, పుర్దిల్ ఖాన్ ముస్లిము. కనుక పాపడి తిరుగుబాటు ప్రత్యేకించి ముస్లిముల ఒక్కరిపైనే కాదని అనుకోవచ్చు.
పాపడు అప్పటి అగ్రవర్ణ ఆధిపత్య వ్యవస్థపై తిరుగుబాటు చేసాడు అనేది మరొక కారణం. దీనికి ఆధారంగా- పాపడి అనుచరులలో చాకలి సర్వన్న, మంగలి మన్నన్న, కుమ్మరి గోవిందు, మేదరి యెంకన్న, యెరికల చిట్టేలు, యానాది పశేలు వంటి బలహీన వర్గాల వ్యక్తులు ఉండటం కనిపిస్తుంది.
అప్పట్లో వ్యవసాయ పనులులేని రోజుల్లో సగం ప్రజలు ఖాళీగా ఉండేవారు. వీరందరూ పాపడిని అనుసరించి ఉండొచ్చు అనే వాదనను త్రోసిపుచ్చలేం. అంతే కాక ఆనాటి సమాజంలో దొంగతనాన్ని వృత్తిగా కలిగిన కులాలు కూడా ఉండేవి. వీరు పాపడికి నాయకత్వంలో నడిచారు. వీరికి పాపడు వ్యవసాయ భూమిని ఇచ్చాడు. అందువల్ల వీరు పాపడిని ఒక వీరుడిగా జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు.
ఇక మరొకవాదన- పాపన్న సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నాడు అనేది. J.A. Boyle, 1874 లో సేకరించిన వీరగాథలో గోల్కొండను, బందరును కొల్లకొడతాను, బంగారు కడియాలు చేయిస్తాను అన్నపదాలు ఉన్నాయి. కొల్లకొడతాను అంటే దొంగతనం చేస్తాను అని అర్ధం. బంగారు కడియాలు చేయిస్తాను అంటే అందులో వ్యక్తిగత లాభాపేక్షే తప్ప సామ్రాజ్య వాదాన్ని అంతమొందిద్దామనే ఉద్దేసాలున్నాయనటం పాపన్నకు లేని ఔన్నత్యాన్ని ఆపాదించటంగా అనుకోవచ్చు.
****
IV. పాపడిని సామాజిక బందిపోటు అనుకోవచ్చా?
Eric Hobsbawn అనే చరిత్రకారుడు శ్రామిక వర్గాల తిరుగుబాట్లను విశ్లేషిస్తూ “Social Bandit” అనే ఒక పదాన్ని వాడాడు. అంటే రాబిన్ హుడ్ లా ధనికులను కొట్టి పేదలకు పెట్టే బాపతు అని.
ఈ సామాజిక బందిపోట్లకు సిద్ధాంత నేపథ్యం ఉండదు. రాజకీయ, ఆర్ధిక అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు వీరు తెరపైకి వస్తారు. వీరికి మార్గం ముఖ్యం కాదు గమ్యం ప్రధానం. ఇలాంటి వ్యక్తుల చర్యలు హింసాపూరితంగా, అమానవీయ ధోరణిలో ఉంటాయి.
అలాంటి పనులను ఈనాటి రాజ్యాంగం ప్రకారం విశ్లేషించవలసి వస్తే క్రిమినల్ చర్యలుగా పరిగణించాలి. ఇలాంటి వారిని రాజ్యం దోపిడి దారులుగా జమకడితే, సామాన్యజనం వీరులుగా కీర్తిస్తారు. వీరగాథలు అల్లుకొంటారు. పాపడిని ఈ కోణంలోంచి చూస్తే Social Bandit గా భావించవచ్చు.
పాపడు ధనికులను కొట్టటం అనే మాట సత్యమైనా ఆ సంపదలను నిర్మాణాత్మక పనులకు ఉపయోగించినట్లు కనిపించదు. (గుళ్ళూ, పంట చెరువులు తవ్వించాడని చెపుతున్నా అవి ఫ్యూడల్ వ్యవస్థలో పరోక్ష దోపిడీ మార్గలే).
***
ఉపసంహారం
పాపడి జీవితాన్ని గమనిస్తే సొంత భార్య, బావమరిది, చివరలో ఇతని అనుచరులు, సాటి కులస్తుడైన కల్లువ్యాపారి ఇతడిని విశ్వసించలేదని అర్ధమౌతుంది. ఇది బహుశా అంతవరకూ పాపడు చేస్తున్నది పులిస్వారీ అని అతని సన్నిహితులకు అర్ధమై ఉంటుంది. అందుకనే అందరూ చివరలో తనని విడిచిపెట్టేసారు.
వాతావరణం, విద్యావిధానం, మూఢనమ్మకాలు, కట్టుకథల పట్ల మోజు లాంటి కారణాలవల్ల హిందువులలో చరిత్రపట్ల ఉదాసీనత, నిర్లక్ష్యము ఏర్పడ్డాయని అన్న మెకంజీ అభిప్రాయం నేటికీ ప్రాసంగితను కోల్పోలేదు. అందుకనే దేవాలయాల స్థలపురాణాలకు ఉన్న ప్రాధాన్యత చారిత్రిక అంశాలకు ఉండదు.
బహదూర్ షాతో సన్మానం అందుకున్న తరువాత పాపన్న దొంగతనాలకు స్వస్థి చెప్పి తాను ఆక్రమించుకొన్న జమిందారీలను అనుభవించుకొంటూ ఉండినట్లయితె బహుసా రెడ్డి, వెలమ, నాయక రాజుల్లా ఒక రాజవంశాన్ని నిర్మించిన మూలపురుషుడిగా చరిత్రలో నిలిచిపోయేవాడేమో. అప్పుడు
సర్వాయి పాపన్న వీరగాథ ఉండేది కాదేమో- అది వేరే విషయం.
బొల్లోజు బాబా
References
1. J. F. Richards and V. Narayana Rao, “Banditry in Mughal India: Historical and Folk Perceptions,”
2. A Social History of the Deccan, 1300–1761 edited By Richard M. Eaton, Chapter 7 Papadu (F L. 1695–1710): Social Banditry In Mughal Telangana
3. The Mughal State 1526-1750 Edited By Muzaffar Alam Sanjay Subrahmanyam
4. The Indian Antiquary, A Journal Of Oriental Research. Telugu Ballad Poetry By J. A. Boyle, Esq., Mos.
5. Khafi Khan, Muntakhab al-lubab (Calcutta, 1874).
6. సర్వాయి పాపన్న పై వికిపీడియా వ్యాసం
7. సర్దార్ సర్వాయి పాపన్న, దళిత బహుజన వీరుడు, కొంపెల్లి వెంకట్ గౌడ్.

No comments:

Post a Comment