మధ్యతరగతి జీవనాల “ఉమ్మడి స్వరం” – ఈ “జీవన స్వరం”శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారి కథలసంపుటి పేరు “జీవన స్వరం”. ఈ సంపుటిలో మొత్తం ఇరవైనాలుగు కథలున్నాయి. ఇది వీరి ప్రధమ కథల సంపుటి. శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు 1967 నుంచీ కథలు వ్రాస్తున్నా ఈ ఇరవైనాలుగు కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ఇటీవల ప్రచురింపబడినవే కావటం గమనార్హం. ఈ కథలనిండా మధ్యతరగతి జీవితాలకు చెందిన అనుభవాలు, ఆత్మీయతలు, కష్టాలు, సుఖాలు, మంచితనం, మానవత్వం, కపటత్వం లాంటి ఉద్వేగాలు అడుగడుగునా కనిపిస్తాయి. వాటిని నేర్పుగా తన కథనంలో లీనం చేయగలిగారు మూర్తిగారు. ఈ కథలను చదువుతున్నంతసేపూ వాటిలోని అనేక పాత్రలతో మనల్ని మనం పోల్చుకొంటాం, మమేకమౌతాం, సొంతం చేసుకొంటాం. ఈ కథలు ఆలోచింపచేస్తాయి, మనం ఇలా జీవించాలి కదా అనే స్పృహను కలిగిస్తాయి. ఈ కథలన్నీ మధ్యతరగతి జీవనాల “ఉమ్మడి స్వరం”మంచి కథకు ఉండాల్సిన లక్షణాలలో థీమ్, ప్లాట్, కాన్ ఫ్లిక్ట్ లను ప్రధానంగా పేర్కొంటారు. కథమొత్తాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెపుతామో అదే థీమ్. ఉదాహరణకు రామాయణానికి థీమ్ “ఆదర్శం”. కన్యాశుల్క నాటకం థీమ్ “సంఘ సంస్కరణ”, చలం మైదానానికి థీమ్ “స్త్రీ స్వేచ్ఛ” ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.నరసింహమూర్తి గారి చాలా కథలలో స్థూలంగా “మంచితనం’, “మానవ సంబంధాలు” థీమ్స్ గా కనిపిస్తాయి. ఈ సంపుటిలోని జీవితచక్రం, కరణేషు మంత్రి, బలిపశువు, ఆదిత్యహృదయం కథాశీర్షికలు కూడా కథ థీమ్ ని ఒక్క ముక్కలో చెప్పేస్తాయి. శీర్షికను బట్టి కథను కొంత ఊహించుకోవచ్చు.ఇక ప్లాట్ అంటే సంఘటనలు, సంభాషణలు, వర్ణనలు తో కథ థీమ్ ను చెప్పిన విధానం. దీన్నే కథనం అంటారు. మూర్తిగారి కథనశైలి క్లిష్టంగా ఉండదు. సూటిగా హాయిగా చదివించేరీతిలో సాగుతుంది.కాన్ ఫ్లిక్ట్ ను సంఘర్షణ అంటారు. కథలో కాన్ ఫ్లిక్ట్ అంటే పరస్పరవ్యతిరేక భావాల మధ్య సంఘర్షణ. విరుద్దభావాలను ప్రకటించే పాత్రలను సృష్టించి ఒకదానితో ఒకటి సంఘర్షించుకొనేలా చేసినపుడు ఆ కథ పాఠకులకు ఆసక్తి కలిగిస్తుంది. ఆలోఛింపచేస్తుంది. ఎక్కువకాలం గుర్తుంటుంది. ఏ కథైనా మనకు గుర్తుండిపోయిందంటే ఆ కథలోని కాన్ ఫ్లిక్టే కారణం. కాన్ ఫ్లిక్ట్ రెండురకాలు. ఇంటర్నల్ కాన్ ఫ్లిక్ట్, ఎక్స్ టర్నల్ కాన్ ఫ్లిక్ట్. ఇంటర్నల్ కాన్ ఫ్లిక్ట్ అంటే ఒక పాత్ర తనలో పరస్పరవైరుధ్యభావాలను సమన్వయపరుచుకోలేక మధనపడటం. షేక్స్ పియర్ “To be or not to be” దీనికి చక్కని ఉదాహరణగా చెపుతారు. ప్రసిద్ధి చెందిన డా. ఫాస్టస్ చివరి ఉపన్యాసం కూడా అంతర్ సంఘర్షణే. అలా కాక పాత్రలు బయట శక్తులతో తలపడినపుడు ఏర్పడే కాన్ ఫ్లిక్ట్ ను ఎక్స్ టర్నల్ కాన్ ఫ్లిక్ట్ అంటారు. విలన్ తోనో, ప్రకృతితోనో, సమాజంతోనో వచ్చే కాన్ ఫ్లిక్ట్స్ లు ఈ కోవకు చెందుతాయి.కథనైనా, కవితనైనా నిలబెట్టేది దానిలోని కాన్ ఫ్లిక్టే. మూర్తిగారి కథలలో కాన్ ఫ్లిక్ట్ ఎలా వ్యక్తీకరించబడిందో చూద్దాం.ఈ సంపుటిలోని మొదటి కథ “ఆదిత్య హృదయం”. అరుణకుమారి, శాంతి స్వరూప్ లకు పెళ్ళి నిశ్చయమౌతుంది. నాలుగు నెలల వరకూ ముహూర్తాలు లేకపోవటంతో తాంబూలాల ప్రక్రియ వాయిదాపడుతుంది. ఈ వ్యవధిలో అరుణకుమారి ఒంటిపై తెల్లమచ్చలు వచ్చిన కారణంగా శాంతిస్వరూప్ పెళ్ళికి నిరాకరిస్తాడు. అరుణకుమారికి వచ్చిన తెల్లమచ్చలు విటమిన్ లోపం వలన వచ్చినవని ఆదిత్యరాం అనే ఆయుర్వేద వైద్యుడు గుర్తించి వైద్యం చేసి నయం చేస్తాడు. ఆదిత్యరాం, అరుణకుమారిలు ఒకరినొకరు ఇష్టపడటంతో వారిద్దరికి వివాహం జరిపిస్తారు పెద్దలు.అయిదు పేజీల కథయినా దీనిలో మూర్తిగారు రెండు కాన్ ఫ్లిక్ట్ లను బలంగా చెప్పగలిగారు. కథప్రారంభంలో “పెళ్ళికింకా నాలుగునెలలు ఆగాలా” అని ఆందోళనపడ్డ శాంతి స్వరూప్ చివరకు వచ్చేసరికి “ఒక రకంగా అదృష్టవంతుణ్ణి, పెళ్ళికాకముందే రోగం బయటపడింది” అని భావిస్తాడు. ఇది కరుణ, సహానుభూతి లేకపోవటం వల్ల మానవసంబంధాలలో ఏర్పడిన కాన్ ఫ్లిక్ట్.ఇక రెండో కాన్ ఫ్లిక్ట్ – కార్పొరేట్ వైద్యం, ప్రకృతి వైద్యంల మధ్య నడుస్తుంది. అరుణకుమారికి వచ్చిన తెల్లమచ్చల చికిత్సకొరకు కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే, ఆ పరీక్షలనీ, ఈ పరీక్షలనీ వేలకు వేలు గుంజుతారు. ఇచ్చిన వందరకాల మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆదిత్యరాం పాత్రద్వారా మానవుల చర్మ ఆరోగ్యం కొరకు సూర్యకిరణాల అవసరాన్ని చెప్పిస్తారు రచయిత. ఆ రకంగా వ్యాపారపోకడలు పోతోన్న ఆధునిక వైద్యానికి, ప్రకృతి జీవనానికి మధ్య కాన్ ఫ్లిక్ట్ ను సమర్ధవంతంగా ఎదురెదురుగా నిలిపి, ప్రకృతి జీవన ఆవశ్యకతను గుర్తుచేస్తాడు కథకుడు.“జీవిత చక్రం” కథలో ఒక స్త్రీ సంపూర్ణ జీవితాన్ని పుష్కరాల నేపథ్యంలో వర్ణిస్తారు మూర్తిగారు. ఈ కథలో ప్రధాన పాత్రపేరు గౌతమి. ఆమెకు 84 సంవత్సరాలు. అదేనెల తన రిటైర్మెంట్ కారణంగా శెలవు దొరకని ఆమె కొడుకు ఆమెను ఒంటరిగా రాజమండ్రి పుష్కరాలకని ట్రైన్ ఎక్కించటంతో కథ మొదలవుతుంది. ఆమె తనజీవితంలో చూసిన పుష్కరాలను ఒక్కొక్కటిగా నెమరువేసుకోవటమే ఈ కథ. ఈ కథకు జీవితచక్రం అన్న పేరు చక్కగా అమరింది. పన్నెండేళ్ల వయసులో గౌతమి తన మొదటి పుష్కర స్నానం తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి చేస్తుంది. రెండో స్నానం భర్త, అత్తమామలు, ఆడపడుచులతో, మూడవసారి భర్త ఇద్దరు పిల్లలతో చేస్తుంది గౌతమి. నాలుగో పుష్కరానికి అత్తమామలు గతించిపోతారు. చిన్నప్పుడు నలభైమందితో కలిసి పుష్కరాలకు వెళ్లగా ఇప్పుడు నలుగురుం మిగిలాం అనుకొంటుంది గౌతమి. అయిదో పుష్కరసమయానికి తల్లిదండ్రులు గతించటం, భర్త రిటైర్ కావటం, పిల్లలు పెళ్ళిల్లు అయి ఎక్కడెక్కడో స్థిరపడటం లాంటి మార్పులెన్నో జరుగుతాయి గౌతమి జీవితంలో.తనజీవితంలోని ఆరో పుష్కరసమయం ఈ కథలోని కథాకాలం. అప్పటికి భర్తను కోల్పోయింది గౌతమి. కొడుకు రిటైర్మెంట్ తీస్కొంటున్నాడు. మూడో మునక వేసే సమయంలో గౌతమికి భర్త గుర్తుకొస్తాడు, గుండె లయతప్పుతుంది, పట్టుతప్పి ప్రవాహంలో కొట్టుకొని పోవటంతో కథ ముగుస్తుంది.ఈ కథలో కాన్ ఫ్లిక్ట్ ఎక్కడ ఉందని అనిపించవచ్చు. అనాదిగా కాలంతో మనిషి పడుతున్న సంఘర్షణే ఈ కథలోని కాన్ ఫ్లిక్ట్. కాల గమనము, జీవితాలలో వచ్చేమార్పులు, గోదావరి ప్రవాహమూ ఎవరికొరకూ ఆగక, గంభీరంగా సాగిపోతూనే ఉంటాయి అన్న సత్యం ఈ కథ ఎరుకపరుస్తుంది.ఈ సంపుటిలోని “స్థితప్రజ్ఞత” కథ ఆసక్తికరంగా, మంచిబిగితో సాగుతుంది. శశికాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కాళింది అతని భార్య. కాళింది అమ్మనాన్నలు పల్లెటూరి వాసులు. వారి ఆహార్యం, అలవాట్లపట్ల శశికాంత్ కు చిన్నచూపు. కాళింది అమ్మ, ఆమె తాతగారినుంచి నేర్చుకొన్న ఆయుర్వేదవైద్యంతో ఇరుగుపొరుగువారి చిన్నచిన్న రోగాలకు ఉచితంగా మందులిస్తూంటుంది. అదంతా మిడిమిడిజ్ఞానమని శశికాంత్ ఎద్దేవా చేస్తూంటాడు.కాళింది గర్భవతి అయి నెలలు నిండుతాయి. కూతుర్ని పంపమంటే పల్లెటూర్లో సరైన వైద్యం ఉండదు అని పంపడు శశికాంత్. చేసేదేమీ లేక కూతురికి సహాయంగా తల్లి అల్లుడి ఇంటికి వస్తుంది. పురిటినొప్పులు మొదలయ్యే సమయానికి భారీవర్షాలు వచ్చి రోడ్లపై, సెల్లార్ లో నిలువెత్తు నీళ్లు నిలబడి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. హాస్పటల్ వారు చేతులెత్తేస్తారు. ఆ సమయంలో శశికాంత్ అత్తగారు మంత్రసానిగా వ్యవహరించి కూతురు పురుడుపోసి పండంటి బిడ్డను శశికాంత్ చేతికందిస్తుంది. అప్పటికి కానీ శశికాంత్ కు అర్ధం కాదు అత్తగారి గొప్పతనం.ఈ కథ చదవటానికి చందమామ కథలా అనిపించినప్పటికీ- అనూచానంగా వస్తున్న విజ్ఞానానికి ప్రకృతి ప్రకోపానికి నిస్సహాయంగా మిగిలిపోయే ఆధునిక విజ్ఞానానికి మధ్య జరిగే కాన్ ఫ్లిక్ట్ ను ఈ కథలో అద్భుతంగా పలికించారు మూర్తిగారు. ఒక వ్యక్తి సౌశీల్యం వారి అలవాట్లు, ఆహార్యం వల్ల తెలియదని; ఆపత్సమయాలలో వారు ప్రదర్శించే స్థితప్రజ్ఞత వల్ల బయటపడుతుందన్న జీవితసత్యం ఈ కథ మనకు తెలియచేస్తుంది.“కరణేషు మంత్రి” కథలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకొని సంసారాన్ని సౌఖ్యంగా, ఆదర్శవంతంగా ఎలా నడిపించుకోవచ్చో – కృష్ణమూర్తి, అర్చన పాత్రలద్వారా చెప్పిస్తారు మూర్తిగారు. కథా ప్రారంభంలో కృష్ణమూర్తి, అర్చనలది అందరూ ఈర్ష్యపడే దాంపత్యం. కొంతకాలానికి కృష్ణ మూర్తిలో మార్పు వస్తుంది. పరధ్యానంగా ఉంటూంటాడు. భార్యపిల్లల పై చిర్రుబుర్రులాడుతూ అసహనం ప్రదర్శిస్తూంటాడు. అదికాక ఇంట్లో నక్లెస్ ను దొంగతనం చేస్తాడు. కృష్ణమూర్తి ప్రవర్తనలో వచ్చిన మార్పుకు ఆందోళనకు గురవుతూంటుంది అర్చన. కృష్ణమూర్తి ఆఫీసుకు సెలవలు పెడ్తున్నాడని, లక్షరూపాయలు అప్పుతీసుకొని వాయిదాలు కట్టటం లేదన్న విషయం అర్చన తెలుసుకొంటుంది. ఆ రోజు రాత్రి భర్తను నిలదీస్తుంది. భార్యను ఇంకా మోసం చేయటం ఇష్టం లేని కృష్ణమూర్తి నిజం చెప్పేస్తాడు. తాను ఒక మిత్రుని నమ్మి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టానని నష్టమొచ్చిందని. అర్చన అతని నిస్సహాయతను అర్ధం చేసుకొని- ఖర్చులు తగ్గించుకొందామని, తనుకూడా ఏదైనా ఉద్యోగం చేస్తానని, నెమ్మదిగా అప్పులు తీర్చుకొందామని భర్తకు భరోసా చెప్పటంతో కథ ముగుస్తుంది.ఈ కథలో ఉన్న కాన్ ఫ్లిక్ట్ భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు. డబ్బంతా తగలేసావు అంటూ అర్చన భర్తపై సాధింపు మొదలు పెడితే వారి కాన్ ఫ్లిక్ట్ మరింత పెద్దదయి ఉండేది. వారి సంసారము, జీవితాలు దుర్భరమయిఉండేవి. అలా కాక అపోహలను తొలగించుకొని సమస్యను పరిష్కరించుకొనే దిశగా అడుగులు వేయటం ద్వారా మంచి దాంపత్యం ఎలా ఉండాలో సూచిస్తున్నారు మూర్తిగారు. భార్యాభర్తల మధ్య ఏర్పడే సంఘర్షణలు శృంగారంలో ముగియటం సహజంగా జరిగేదే. ఆ విషయాన్ని ఎంతో నర్మగర్భంగా చెపుతారు ఇలాభర్త ఎంత డబ్బు తెచ్చాడని భార్య చూడదండీ…. ఎంత ప్రేమ పంచుతుంటే అంత సంతోషిస్తుంది” అంటూ భర్తను అనునయించింది. భార్య ఎదపై వాలిపోయాడు భర్త. ఆమె అతనికి దగ్గరైంది. ఇద్దరి మధ్య గాలి స్థంభించింది.కూతురిపై ఏసిడ్ దాడి చేస్తాను అని బెదిరిస్తున్న ఒక రౌడి కుర్రాడిపై, ఒక తల్లి ముసుగువేసుకొని యాసిడ్ దాడి చేసి శిక్షించటం ఇతివృత్తంగా “మాతృదేవోభవ” కథ సాగుతుంది. ముందుమాటలో MVS ప్రసాదు గారు అన్నట్లు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం సబబేన అన్న ప్రశ్న ఉదయించకమానదు ఈ కథ చదివాక. బహుసా “పొయిటిక్ జస్టిస్” చేయాలనుకొన్నారేమో కథకుడు అనిపించింది.నేడు బాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాలను “బలిపశువు” కథలో చక్కగా ఎత్తిచూపారు. “తిరుగుబాటు” కథలో పాత్రల అంతఃసంఘర్షణ బాగుంది. మామగారికి ఇష్టంలేకపోయినా ఇంట్లోకి ప్రవేశించిన పాత్ర చివరలో మామగారి మనసు ఎలా గెలుచుకొందో తెలిపే కోడలి కథ “ఆకాశంలో సగం”.ఈ కథలలో చాల పాత్రలు తమతప్పుతెలుసుకొని చివరలో పరివర్తన చెందుతూంటాయి. అలా పరివర్తన చెందినట్లుగా చెప్పటం కథాప్రవాహంలో అసహజంగా అనిపించదు. ఎందుకంటే పాత్రల చిత్రణ, పరివర్తనకు దోహదపడే బలమైన సన్నివేశాల కల్పన, కథనశైలి లాంటివి కారణాలుగా నిలుస్తాయి. కథానిర్మాణంలో ఎత్తుగడ ప్రాముఖ్యం తెలిసిన వ్యక్తి మూర్తిగారు. కథల ఎత్తుగడ ఆసక్తికరంగా ఉండి ఆకర్షిస్తుంది. మొదటి పారాగ్రాఫు కథముగింపును కొంత ఊహించేవిధంగా ఉండటం మూర్తిగారి శైలి.ఈ “జీవనస్వరం” గురించి ఒక్కవాక్యంలో చెప్పాలంటే “ఈ లోకంలోని మంచివాళ్లగురించి, ఒక మంచి మనసున్న మనిషి వ్రాసిన కథలు” అని అంటాను.బొల్లోజు బాబాxx
Wednesday, December 4, 2019
కవిత్వనిర్మాణము- మెలకువలు
(కవిసంథ్య ఆధ్వర్యంలో 21-3-2019 న యానాంలో జరిగిన ప్రపంచకవితా దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం)
కవిత్వం అంటే ఏమిటి?
ఒక ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో లేక ఈ మూడింటినీ కలగిలిపో కళాత్మకంగా చెప్పిన భాషారూపమే కవిత్వం. కవిత్వం భాష యొక్క భాష అంటారు ‘మో’. వచనాన్ని, కవిత్వాన్ని వేరుచేసేది వ్యక్తీకరణ పద్దతి. వచనంలో చెప్పే విషయమే ప్రధానం కానీ చెప్పే పద్దతి కాదు. సాధారణ భాషకు అర్ధస్ఫూర్తి నివ్వటం ఒక్కటే పని. అంటే తాను చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పటంతో దాని బాధ్యత తీరిపోతుంది. కవిత్వభాష అర్ధాంతర స్ఫూర్తి నిస్తుంది. అంటే చెపుతున్న విషయంతో పాటు చెప్పని విషయాన్ని కూడా ధ్వనింపచేయటం. దీన్నే ధ్వని, వక్రోక్తి, లేటెంట్ కంటెంట్ అంటూ వివిధ పేర్లతో ఆలంకారికులు పిలిచారు.
ఉదయాన్నే నిద్రలేచి, మత్తు వదిలించుకొని ఓ కప్పుడు కాఫీ తాగి రోజు వారి పనులకు సిద్దమౌతాం. ఇది అందరి ఇళ్లల్లో జరిగే పని. దీన్ని ఒక వాక్యంగా రాయవలసి వస్తే ఇలా రాస్తాం
సూర్యుని రాకతో తెల్లారింది. ఆమె డికాషను, పాలు, చక్కెరా కలిపి, కాఫీ తయారుచేసి కప్పులో వేసి భర్తకు ఇచ్చింది. ఇది వచనం. మొయిద శ్రీనివాసరావు
అదే దినచర్యను ‘ఓ కప్పు సూర్యోదయం’ అనే కవితలో ఇలా వర్ణించి కవిత్వం చేసాడు.
తూర్పు కొండల్లో… రూపాయి కాసులా
పొద్దు పొడుచుకొస్తున్నప్పుడు
ఆమె… చీకటిని వెన్నెలను కలిపేసి
మిణుక్ మంటున్న నక్షత్రాలను
ఓ చెంచాడు పోసి
కప్పుడు సూర్యోదయాన్ని అతడికిస్తుంది//
సూర్యుడిని రూపాయి కాసు అనటంలో ఈ జగాన్ని నడిపించేది డబ్బేనని సూచిస్తున్నాడు. చీకటిని వెన్నెలను కలిపి అన్నప్పుడు- తెలతెలవారుతున్న వాతావరణంతో పాటు నల్లగా ఉండే డికాషనును, తెల్లగా ఉండే పాలను స్ఫురింపచేస్తున్నాడు.
చెంచాడు నక్షత్రాలను అనటం ద్వారా చక్కెరను గుర్తుచేస్తాడు.
“సూర్యుని రాకతో తెల్లారింది. ఆమె డికాషను, పాలు, చక్కెరా కలిపి, కాఫీ తయారుచేసి కప్పులో వేసి భర్తకు ఇచ్చింది” అన్న వాక్యంలో సమాచారం మాత్రమే ఉంది. ఇక ఏ రకమైన అదనపు అర్ధాలు లేవు. కానీ అదే విషయాన్ని కవిత్వం చేసినపుడు భావం విస్తృతమైంది. చెప్పని అంశాలు అనేకం గోచరిస్తాయి. వాక్యాలలో చెప్పని విషయాన్ని ధ్వనింపచేయటమే మంచి కవిత్వలక్షణంగా ఉండాలి.
కవిత్వ వస్తువు
ఒక కవిత వ్రాయాలి అని నిశ్చయించుకొన్నప్పుడు, దేని గురించి వ్రాయాలనుకొంటున్నామో దానిపై స్పష్టత ఉండాలి. దాన్నే కవితా వస్తువు అంటారు. నేడు మానవజీవితంలోని సమస్త కోణాలు కవితా వస్తువులే.
ప్రేమ,సౌందర్యం, మానవ సంబంధాలు, ప్రకృతి, భక్తి, అన్వేషణ, ఆత్మగౌరవం, వ్యవస్థలోని లోపాలపై ఆగ్రహం, అసమానతలు, కవిత్వంపై కవిత్వం, ప్రయాణం, చిన్ననాటి జ్ఞాపకాలు, వాడే వస్తువులు, పర్యావరణం, దేశభక్తి, రాజకీయాలు, స్నేహం, పేదరికం, ఆశ, ప్రేరణాత్మకం, సామాజిక రుగ్మతలు, చిన్నపిల్లలు, జీవితము, కాలము, కన్నీళ్ళు, మరణం, ఒంటరితనం, గ్రామం, పట్టణం, కలలు, పెంపుడు జంతువులు….. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా అనంతంగా సాగుతుంది. మన అనుభవంలోకి వచ్చే ఏ అంశాన్నైనా చక్కని కవితావస్తువుగా మలచుకోవచ్చు.
ఏ కవితనన్నా మొదలు పెట్టటం ఒక సవాలు దాన్నే కృత్యాదవస్థ అంటారు. Write Poetry now – 366
prompts అనే పుస్తకంలో రాబర్ట్ లీ బ్రువర్ 366 రకాలుగా కవితను ప్రారంభించే పద్దతులను చెపుతాడు. వాటిలో కొన్ని ఆసక్తి కరమైనవి చూద్దాం
1.
ఇప్పటికే ఆలస్యమైంది…… అంటూ కవితను మొదలు పెట్టి ఏ ఏ సందర్భాలలో ఆలస్యమైందో చెప్పుకొంటూ వెళ్లటం. ఉదా. ఇప్పటికే ఆలస్యమైంది/ కరివేపాకు దొంగిలించినపుడే దండించి ఉండాల్సింది…. అంటూ కొనసాగించవచ్చు
2.
ఏమేమి మనకొరకు ఎదురుచూడవో ఒక లిస్టు పేర్చుకొంటూ వెళ్లవచ్చు…. ఉదా. నీపై ఎగబాకటానికి నీ పెంపుడుకుక్క నీ అనుమతి కొరకు ఎదురుచూడదు …
3.
ఎందుకు అంటే – ఆకాశం ఆరోజు ఎర్రగా మారింది ఎందుకంటే, ఒక వీరుని రక్తం అది పులుముకొంది.
4.
ఇక శలవు అంటూ ఎందుకు శలవు తీసుకోవలసి వస్తుందో కారణాలతో కవిత వ్రాయొచ్చు.
ప్రతి కవికి జీవితం పట్ల తనదైన దృక్ఫధం, సిద్ధాంతము ఉంటాయి. కానీ ప్రతీ వస్తువును తాను నమ్మిన సిద్దాంతాల చట్రంలో ఇరికించాలని ప్రయత్నించటం- సృజనకారునిగా అతనికి ఉన్న స్వేచ్ఛను తాకట్టు పెట్టటం క్రిందే వస్తుంది. మీ “హృదయంలో నిదురించే చెలి” ఎవరంటే కమ్యూనిజం అని అన్నాట్ట శ్రీశ్రీ… కానీ అందరూ అంత అందంగా తప్పించుకోలేరు.
మెటఫర్, సిమిలీ లు
వీటిని తెలుగులో ఉపమానం, రూపకం అంటారు. ఒక ఊహను కవిత్వం చేయటంలో ఈ రెండూ ముఖ్యమైనవి. కాళిదాసు ఈనాటికీ నిలిచిఉన్నాడంటే
కారణం అతని కవిత్వంలో పలికించిన అబ్బురపరచే ఉపమానాలే.
కవులు నిత్యం మెటఫర్ కొరకు అన్వేషిస్తుంటారు. కొత్త మెటఫర్ ని కల్పనచేయటంలోనే కవి గొప్పతనం ఉంటుంది.
కొత్త మెటఫర్ ను సృష్టించటానికి ఎంతో ఊహాశక్తి, ప్రతిభ అవసరం.
మెటఫర్ కవిత్వాన్ని దేదీప్యమానం చేసి ఎక్కువకాలం గుర్తుండి పోయేలా చేస్తుంది.
మెటఫర్ అంటే రెండు వేరు వేరు లక్షణాలు కలిగిన వస్తువులను పోల్చి చెప్పటం.
ఇలా చేసినపుడు
ఒక వస్తువును దేనితో అయితే పోల్చామో దాని లక్షణాలు పోల్చబడిన వస్తువుకు వచ్చి చేరతాయి.
ఉదాహరణకు ఆమె మొఖం ఒక చంద్రబింబం అన్నప్పుడు- చందమామ లక్షణాలైన గుండ్రంగా, చల్లనికాంతులతో ప్రకాశవంతంగా ఉండటం అనే లక్షణాలు ఆమె మొఖానికి ఆరోపితమౌతాయి.
సిమిలీలో కూడా రెండు వస్తువులను పోలుస్తాం.
సిమిలీలో మొదటివస్తువును రెండవ వస్తువుతో వలె/లాగ/రీతిగా/పోలె వంటి పదాలనుపయోగించి పోల్చటం జరుగుతుంది.
మెటఫర్ లో అలా ఉండదు.
మొదటి వస్తువే రెండవ వస్తువు అని చెప్పబడుతుంది. సిమిలీ నేరుగా పోలికతీసుకొస్తుంది, మెటఫర్ కొంచెం నర్మగర్భతంగా ఉంటుంది.
పై ఉదాహరణననే తీసుకొంటే “ఆమె మొఖం చంద్రబింబంలా ఉంది” అనటం సిమిలీ.
“ఆమె ముఖం ఒక చంద్రబింబం” అనటం మెటఫర్.
మెటఫర్ ని వాడటం వల్ల కవితకు గొప్ప లోతు, విస్త్రుతి వస్తుంది. వచనంలో పేజీలకొద్దీ పట్టే భావనను ఒక్క మెటాఫర్ ద్వారా చెప్పవచ్చు.
మంచి మెటఫర్ ఉన్న కవిత్వాన్ని ఏ భాషలోకి అనువదించినా భావం చెడదు. అమూర్తభావనలను మూర్తభావనలుగా మార్చటంలో మెటాఫర్ సహాయపడుతుంది. మెటఫర్ ఇతర వర్ణణలతో కలిసినపుడు మంచి కవిత్వంగా మారుతుంది.
ఒక ఊహను కవిత్వం చేసే ప్రక్రియలో మెటఫర్, సిమిలీ లు ముఖ్యమైనవి అయినప్పటికీ, వీటితో పాటు పెర్సొనిఫికేషన్, మెటానమి, అల్యూజన్, అల్లిగొరి, స్టేట్ మెంట్స్, ఐరనీ, పారడాక్స్, ఆక్సిమొరాన్ లాంతి ఇతర అలంకారాలు కూడా అవసరమే.
అరిగిపోయిన ప్రయోగాలు
కవిత్వంలో ఎప్పటినుంచో వాడబడుతూ, మామూలు మాటలుగా మారిపోయిన మెటఫర్ లను డెడ్ మెటఫర్ లు అంటారు.
చూపులబాణాలు, కన్నీటికెరటాలు, ఆకలి కేకలు, నిప్పులు వర్షించటం, కలల అలలు, ప్రేమగులాబీ, పుడమి పురిటినెప్పులు, నవ్వులపువ్వులు, మతంకంపు, బాల్యంనెమలీక, బాధలసుడిగుండాలు, కాంక్రిటువనం… చెప్పుకొంటూ పోతే చాలా ఉంటాయి.
వీటిని వాడటం అంటే కక్కినకూడుని తినటంగా భావించాలి.
ఒక వేళ అదే భావాలను వ్యక్తీకరించవలసి వస్తే చూపుల బాణాలు బదులుగా చూపుల మురళీగానం అని, కన్నీటి కెరటాలు బదులుగా కన్నీటి శిశిరపత్రాలు అని మార్చటం ద్వారా నూతనత్వాన్ని ఆవిష్కరించవచ్చు.
మంచికవి డెడ్ మెటఫర్లను వాడడు.
ఎప్పటికప్పుడు కావలసిన మెటఫర్లను సృష్టించుకొంటాడు. అప్పుడే అతని కవిత్వం ఉత్తమ కవిత్వంగా నిలుస్తుంది.
ఇలా పాతపోలికలను చెరిపేసి కొత్త
కవిత్వభాషను నిర్మించటాన్ని ఇస్మాయిల్ గారు “భాషను శుభ్రపరచటం” అని అన్నారు.
ఏదైనా ఒక వస్తువుపై కవితను వ్రాయాలనుకొన్నప్పుడు అదే వస్తువుపై ఇదివరలో వచ్చిన కవితలను పరిశీలించటం అవసరం. దానికి భిన్నంగా ఏం చెప్పగలం అని ఆలోచించుకొని వ్రాయటానికి పూనుకోవాలి. అంతకన్నా భిన్నంగా చెప్పలేను అనిపించినపుడు మరొక కొత్తవస్తువును ఎంచుకోవటం ఉత్తమమైన పని. మహా మహా శ్రీశ్రీ యే “ఏంరాసినా ఏం లాభం, ఇదివరకు ఎవరో వ్రాసే ఉంటాడు. ఆ అన్నదేదో నా కన్నా బాగానే అని ఉంటాడు” అని వాపోతాడు ఒకచోట. కనుక వస్తువు ఎంపిక, వ్యక్తీకరించిన పద్దతి చర్విత చరణంలా కాకుండా చూసుకోవాలి.
కవిత్వంలో ఇమేజెస్
కవిత్వంలో ఇమేజ్ అంటే పదాలతో నిర్మించిన ఒక చిత్రం.
ఆ పదాలను చదువుకొన్నప్పుడు మనసులో ఒక దృశ్యం ఊహకు వస్తుంది.
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకొని
గరగరలాడుతోంది - (దాహం) ఇస్మాయిల్
పై ఖండికలో దాహమనే ఇంద్రియానుభవాన్ని అనేక ఇమేజెస్ ద్వారా చెపుతున్నాడు కవి .
వివిధ మూర్త చిత్రాలను వరుసగా పేర్చుకొంటూ వెళ్లాడు.
ఆ ఆరులైన్లు చదివేసరికి పాఠకునికి ఏదో ఎడారిలో మైళ్ళదూరం నడిచి, దాహంతో గొంతు పిడచకట్టుకుపోయిన అనుభూతి కలుగుతుంది.
ఎందుకంటే ఆవాక్యాలు దాహం అనే అమూర్తభావనను- ఎడారి, ఖర్జూరచెట్టు, ముళ్ళగరగర వంటి మూర్తచిత్రాలు నేరుగా అనుభవంలోకి తీసుకొస్తాయి. ఇది ఇమేజెరీ గొప్పదనం. ఇలా భావాలను దృశ్యరూపంలో చెప్పే పద్దతిని ఇమేజిజం అంటారు
అమూర్త భావాలతోకన్నా మూర్తభావాలలో చెప్పటం
మనం చూడగలిగి, స్పర్శించగలిగే వాటిని concrete లేదా మూర్త భావాలు అని ఊహించుకొనే విషయాలను abstract లేదా అమూర్త భావాలు అని అంటారు. ఆకాశం, చెట్లు, సముద్రం, ఈ బల్ల, మైకు లాంటి మూర్తవిషయాలతో ఈ ప్రపంచం నిండి ఉంటుంది. ప్రేమ, వేదన, దేశభక్తి, హృదయం, శాంతి, శోకం లాంటి అమూర్త భావాల వ్యక్తీకరణ జీవకోటిలో మానవులకే సొంతమైన విషయాలు. కవిత్వంలో వీటిని స్పష్టంగా వ్యక్తీకరించటం చాలా ముఖ్యం. కవితను అమూర్త భావాలతో నింపినపుడు అది చదివేటపుడు అర్ధం చేసుకోవటానికి అడ్డంపడుతుంది.
నీడల నటన బాధించదు ఇంద్రియాలను
ఆవేశం అలసటగా, చైతన్యం వేడిలేని వెలుతురుగా
కలగా, అలగా, ఒక తీయని జలగా మారిన ఈ వేళలందు
తెలుస్తున్నది చావు బ్రతుకులిక్కడ లెక్కకు రావని
లెక్కకు వచ్చేవిచ్చట ఒక చూపని,
ఒక నవ్వని, ఒక కిరణం, ఒక పూవని తెలుస్తున్నది. ----- బైరాగి వ్రాసిన పై వాక్యాలలో నీడలనటన, అలసట చెందే ఆవేశం, వేడిలేని వెలుతురు చైతన్యం, లెక్కకు వచ్చే చూపులు లాంటి అమూర్తవిషయాలు ఆ కవితను అర్ధం చేసుకోవటంలో అడ్డు తగులుతాయి.
ఇటీవల వచ్చే కవిత్వంలో కూడా ఇదే ధోరణి మనకు అక్కడక్కడా తగులుతుంది.
ఆకలి మీద ఊచకోత కోసిన ప్రతిసారీ
పచ్చగా పండిన మండువాలోగిళ్లలో
మరక్కాగిన పొలిమేరలే ఊపిరి తెగ్గోసుకుంది – అనే వాక్యం లో కనిపించే ఆకలిమీద ఊచకోత, మరక్కాగిన పొలిమేర, ఊపిరి తెగ్గోసుకోవటం అనే భావాలలోని ఆబ్ స్ట్రాక్ట్ నెస్స్ అర్ధాన్ని సంక్లిష్టం చేస్తుంది.
కవిత్వం అంటేనే అమూర్తభావాలను సమర్ధవంతంగా చెప్పగలగటం. ఎలా చెప్పాలి అన్న ప్రశ్న వస్తుంది. చేయితిరిగిన కవులు అమూర్త భావాలను చెప్పేటప్పుడు వాటిని మూర్త చిత్రాలతో మిళితం చేయటాన్ని గమనించవచ్చు. అలా చేయటం ద్వారా ఎంతటి క్లిష్టభావన నైనా పాఠకునికి అర్ధం చేయించవచ్చు.
చెవులు రిక్కించి పచ్చిక మేసే
కుందేలు పిల్లల్లా
జ్ఞాపకాలు గెంతుతూంటాయి. రాళ్లమధ్య ఖాళీలలోంచి
బిళ్లగన్నేరు పూవుల్లాస్వప్నాలు తొంగిచూస్తుంటాయి – (మరణించిన మిత్రుని ఫేస్ బుక్ – సచ్చిదానందన్).
పెద్దజబ్బు చేసింది
చనిపోతాడనుకొన్నారు అందరూ
పదిరోజుల లంఖణాల తరువాత
చారు అన్నం తిని
అరుగుపై కూర్చొన్నాడు
సైకిల్ తొక్కుకొంటూ
పరుగులెత్తుతో
కేకలు వేస్తూ
ఆడుకొంటున్నారు రోడ్డుపై
సౌందర్యం
కొద్ది కొద్దిగా అర్ధమౌతోంది వాడికి
దివ్యమైనట్టి శృంగార కావ్యముండి
పరవశము చేయగల మధుపాత్ర ఉండి
పాడుచును హాయిగా నీవు పక్కనుండ
వట్టిబయలున స్వర్గమే ఉట్టిపడును.
ఓ రొట్టె ఓ కావ్యమధువు
నా పక్కన కూచుని నీవు పాడుతో
ఎడారి స్వర్గమవుతుంది
x
పెద్దజబ్బు చేసింది
చనిపోతాడనుకొన్నారు అందరూ
పదిరోజుల లంఖణాల తరువాత
చారు అన్నం తిని
అరుగుపై కూర్చొన్నాడు
సైకిల్ తొక్కుకొంటూ
పరుగులెత్తుతో
కేకలు వేస్తూ
ఆడుకొంటున్నారు రోడ్డుపై
సౌందర్యం
కొద్ది కొద్దిగా అర్ధమౌతోంది వాడికి
దివ్యమైనట్టి శృంగార కావ్యముండి
పరవశము చేయగల మధుపాత్ర ఉండి
పాడుచును హాయిగా నీవు పక్కనుండ
వట్టిబయలున స్వర్గమే ఉట్టిపడును.
ఓ రొట్టె ఓ కావ్యమధువు
నా పక్కన కూచుని నీవు పాడుతో
ఎడారి స్వర్గమవుతుంది
x
పై వాక్యాలలో మిత్రుని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనటం మామూలు వాక్యం. ఎలా గుర్తొస్తున్నాయో చెప్పటం అనేది ఒక అమూర్త భావన. అలాంటిచోట్ల భాష విఫలమౌతుంది. ఆ జ్ఞాపకాల కదలికల్ని గెంతుతున్న కుందేళ్ళు అనే ఒక మూర్త ఇమేజ్ తో పోల్చటం ద్వారా ఆ జ్ఞాపకాలు ఎలా మెదులుతున్నాయో పాఠకునికి స్పష్టమైన రూపాన్ని ఇవ్వగలిగాడు కవి. అదే విధంగా స్వప్నాలకు కూడా.
సమకాలీనతను ప్రతిబింబించాలి
ప్రతీ తరంలోను సాహిత్య వ్యక్తీకరణ కొత్త మోసులెత్తుతుంది. ప్రజల అభిరుచులు, వస్తువు, భాష, డిక్షన్ మారిపోతుంటాయి. దీన్ని ప్రతీకవి గమనించుకోవాలి. శివారెడ్డిగారు ముప్పై ఏళ్ళక్రితం వ్రాసిన కవిత్వానికి ఇప్పుడు రాస్తున్న కవిత్వానికి గల తేడాను గమనిస్తే ఈ విషయం అర్ధమౌతుంది. కవిత్వంలో వస్తూన్న కాలానుగుణ మార్పులను గుర్తించాలంటే సమకాలీన కవిత్వాన్ని నిత్యం పరిశీలిస్తూ ఉండాలి.
లేకపోతే “-పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు” అని చలం తాత చేసిన ఎద్దేవా మనకూ వర్తిస్తుంది. కవి అనేవాడు నిరంతర అధ్యయనం చేయాలి అనేది ఇందుకే.
` నేటికాలపు కవిత్వాన్ని గమనిస్తే- భాష సరళమైంది; నైరూప్య చిత్రణ తగ్గింది; సమకాలీన సమస్యలు, సంక్షోభాలు కవిత్వమౌతున్నాయి; కవితల నిడివి తగ్గింది; వస్తువుకన్నా చెపుతున్న విధానానికి (శిల్పం) ప్రాధాన్యత పెరిగింది; కాల్పనిక భావాలకన్నా వాస్తవిక జీవితం ప్రతిబింబిస్తోంది; అనుభూతి ప్రాధాన్య కవిత్వం వస్తోంది; సిద్దాంతాలను నేరుగా చెప్పటం తగ్గి, వైయక్తిక అనుభవాలతో వాటిని మిళితం చేసి చెప్పటం జరుగుతోంది.
పసునూరి రవీందర్ వ్రాసిన ఈ కవితావాక్యంలో పై లక్షణాలన్నీ ఒదిగిపోయిన విషయాన్ని గమనించవచ్చు.
వెలివాడ నన్ను వదలని నెట్ వర్క్
కులం నావెంట నడిచే వైఫై - ఈ వాక్యం ఆధునిక వ్యక్తీకరణకు చక్కని ఉదాహరణ. హంగు ఆర్భాటం ఏమీ లేదు. సూటిగా, స్పష్టంగా ఒక దృక్ఫధాన్ని చెపుతున్నాడు కవి. ఆధునిక పరిభాషలో ఒక అనాది దుఃఖాన్ని రికార్డు చేస్తున్నాడు.
కథనాత్మక శైలి
నేడు సాహిత్యంలో కవిత్వాన్ని కథ ఆక్రమిస్తోంది. ఒక దినపత్రిక తన సాహిత్య పేజీలో కవిత్వాన్ని తొలగించేసింది కూడా. పాఠకులు కూడా కథను ఆదరిస్తున్న స్థాయిలో కవిత్వాన్ని ఆదరించటం లేదు. ఈ నేపథ్యంలో కవిత్వాన్ని కథనాత్మకంగా చెప్పటానికి ప్రాధాన్యత పెరుగుతోంది. కవిత్వాన్ని కథనాత్మకశైలిలో వ్రాయటం వల్ల అది మరింతమంది పాఠకులకు చేరుకొనే అవకాశం ఉంతుంది. కవితద్వారా ఒక కథను చెప్పటం వలన అస్పష్టతకు తావు లేకుండా ఒక విస్త్రుతమైన విషయాన్ని లోతుగా సూటిగా చెప్పవచ్చు. చక్కటి ముగింపు నివ్వటం ద్వారా కవితను వేరే ప్లెన్ లోకి తీసుకెళ్ళ వచ్చు. పాఠకునికి ఒక కథను చదివిన అనుభూతిని కలిగించవచ్చు.
ఆట
ఆ పిలగాడికి
వాడి స్నేహితులు
జీవించి
ఉండటంలోని
పై కవితలో ఒక కథ చెప్పబడింది. జీవించి ఉండటాన్ని, ఉల్లాసంగా ఉండటటాన్ని జీవనసౌందర్యంగా చెప్పబడింది. ఇది మంచి ఉద్వేగాన్ని ఇవ్వటమే కాక పాఠకుని స్వీయానుభవాలతో మమేకం అయ్యేలా చేస్తుంది. ఇలాంటి కవితలకు బరువైన ముగింపు లేకపోతే తేలిపోయి వచనాత్మకంగా మిగిలిపోతుంది కనక జాగ్రత్తపడాలి.
సజీవ భాష
కవిత్వానికి సజీవభాష సహజత్వాన్నిస్తుంది. కవిత్వం అంటే బరువైన సంస్కృతపదాలు గుప్పించటం, సమాసభూయిష్టంగా రాయాలని భావించటం, పదాడంబరమే కవిత్వమని తలచటం పొరపాటు. మామూలు వాడుకొనే పదాలతోనే లోతైన భావాలను వ్యక్తీకరించాలి అప్పుడే ఆ కవిత పాఠకునికి దగ్గరౌతుంది పదాడంబరత కవిత్వాన్ని కృతకంగా మారుస్తుంది. చలం చేసిన గీతాంజలి, రుబాయీల కవిత్వానువాదాలు ఈనాటికీ నిలిచి ఉన్నాయంటే వాటిలో వాడిన సజీవభాషే. రుబాయిలను అనేకమంది అనువదించారు. ముద్దుకృష్ణ అనువాదం ఇలాఉంటుంది.
ముద్దుకృష్ణ 1968
చెట్టునీడుండి
రుచియైన రొట్టె ఉండి
పైన వాడిన ఉండి ఉండి లాంటి అంత్యప్రాసలు, అనుప్రాసలు ఆ
పద్యంలో వెలిబుచ్చిన స్వేచ్ఛాప్రియత్వాన్ని, ప్రేమైక భావనను ఏదో కృతక చర్యలలాగ చేస్తాయి. ముద్దుకృష్ణ కంటే
పదేళ్ల ముందే ఇదే రుబాయీకి చలం చేసిన
అనువాదం ఇలా ఉంటుంది.
చలం 1960
చెట్టునీడలో
కూచున్న మనకేం కావాలి
చలం రుబాయీ సహజంగా, ఏ పదాడంబరత లేకుండా, నిజాయితీగా, ఉద్వేగబరితంగా ఉంటుంది. అందుకనే కాలానికి తట్టుకొని ఈనాటికీ నిలిచే ఉంది. కవిత్వానికి సజీవ భాష అవసరం అనే విషయానికి ఇంతకుమించిన ఉదాహరణ దొరకదు.
ముగింపు
కవిత్వం అనేది సమాజాన్ని విమర్శించటానికో, మార్చేయటానికో కాదని తనలోపల రూపుదిద్దుకొనె సత్యాలను ఆవిష్కరించటమే దాని విధి అని ఆధునిక కవి గుర్తించాడు. ఆ సత్యాలు రాజకీయ, సామాజిక, మానవీయ, ప్రకృతి వంటి వివిధ అంశాలకు సంబంధించినవై ఉంటాయి. లోపలి స్వరం కవిత్వం అవ్వాలి.
సాహిత్యం ఒక అనంతమైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ మానవజాతి భౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థలకాలాదులను, విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీతరపు రచనలూ కాలక్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. మానవజీవితాలను, ఉద్వేగాలను అక్షరబద్దం చేసేది సాహిత్యం మాత్రమే. చదివితే వచ్చే రాంకుల్లాగ, మార్కుల్లాగా సాహిత్యం చేసే పని పైకి కనిపించదు. మరీ ముఖ్యంగా కవిత్వం చేసే పని.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)