Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 6


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
ఇతర వృత్తులు
.
ఆనాటి సమాజంలో - చాతుర్వర్ణాలు ఉన్నాయి; వృత్తులు ఇంకా కులాలుగా స్థిరపడలేదు. సప్తశతిలో వృత్తులను పరోక్షంగా సూచించే అనేక గాథలు కనిపిస్తాయి.
నాగలి, అంకుశం, రంపం, సూదులు, ఆభరణాలు, కలశాలు, శిల్పాలు, గంటలు, బిందెలు లాంటి అనేక వస్తువుల ప్రస్తావనలను బట్టి పంచవృత్తులవారు; మరికొన్ని గాథలలో కుండలు, రంగురంగుల దుస్తులు, కంబళులు వర్ణనల ద్వారా కుమ్మరి, నేతకారుడు లాంటివారు ఆనాటి సమాజంలో ఉత్పాదకరంగంలో గణనీయమైన పాత్రపోషించారని అర్ధమౌతుంది.
***
.
నీ జఘనాన్ని తాకటం సామాన్యుల తరమా!
ఎన్నిసార్లు కొలిమిలో కరిగి, నీళ్ళల్లో చల్లారి
ఎన్నెన్ని సుత్తిదెబ్బలు ఓర్చుకొని బంగారం
వడ్డాణంగా మారి నిన్ను తాకగలుగుతోంది. (211)
.
ఒక అపూర్వ సౌందర్యరాశిని పొందటానికి యోగ్యతను కూడా కలిగి ఉండాలి అని చెప్పటానికి తీసుకొన్న ఉపమానంలో స్వర్ణకారుడి శ్రమను పరోక్షంగా చెపుతున్నాడీ గాథాకారుడు.
***
.
కాటుకతో కలిసిన కన్నీటి చారిక
హ్రుదయాన్ని కోసే వియోగమనే రంపానికి
దారిచూపే నల్లని కొలత రేఖలా ఉన్నది. (153)
.
హృదయాన్ని కోస్తుందట వియోగమనే రంపం. కాటుకతో కలసిన కన్నీటిచారిక ఆ రంపానికి దారిచూపుతోందట. ఎంత రమ్యమైన పదచిత్రమిది. ఒక ఊహను ఎంతదూరం తీసుకువెళ్ళొచ్చో అంతదూరమూ తీసుకెళ్ళి ఒదిలిపెడతాడు ఆ ప్రాచీనగాథాకారుడు.
ఎన్ని మిషన్లు వచ్చినా నేటికీ వడ్రంగి తనకు కావలసిన షేప్ లో చెక్కను కోసేందుకు దానిపై పెన్సిల్ తో మార్కింగ్ చేయటం గమనించవచ్చు.
***
ఇంటికొచ్చిన పడుచుపిల్లతో గొల్లవాడు ముచ్చట్లాడుతోంటే
అతని కొత్తపెండ్లాం రుసరుసలాడుతూ
లేగదూడల కట్లు విప్పి ఎలా ఒదిలివేస్తుందో చూడు. (731)
.
పై గాథ ఉత్తచమత్కారం కావొచ్చు. ఆ కొత్తపెండ్లాం అసూయ, పొసెసివ్ నెస్ ల గురించే అవ్వొచ్చు గాక. కానీ రెండువేలేండ్లనాటి ఒక యాదవుని ఇల్లు ఎలా ఉండేదో, ఆనాటి ఒక యువజంట తమజీవితాల్ని ప్రేమతో ఎలా వెలిగింపచేసుకొన్నారో ఒక లాంగ్ షాట్ లాగ చిత్రిస్తుందీ గాథ.
***
.
కత్తులు ధరించిన కసాయివాళ్ళు తోలుకుపోతూంటే
వెనక్కు తిరిగి తోటను చూస్తూ
ఇక శెలవు అంటూ సాగిపోయాయి దున్నపోతులు (780)
.
ఘనీభవించిన విషాదమిది. ఈ గాథలోని ఉద్వేగం వియోగాన్ని వ్యక్తీకరించే ఎలాంటి సందర్భానికైనా అన్వయించుకోవచ్చు. ఆనాటి సమాజంలో అంటరానితనం చండాలవర్గానికి మాత్రమే పరిమితమై ఉండేది. శూద్రులందరిలో అంతర్వివాహాలు ఉండేవి. కులం ఇంకా స్థిరీకరింపబడలేదు. ఇక పైన చెప్పబడిన "కత్తులు ధరించిన కసాయివాళ్ళు" ని కులంగా కాక వృత్తిగా గుర్తించాలి.
***
.
ఒక చేత్తో జారిపోతున్న దుస్తుల్ని పట్టుకొని
మరో చేత్తో ముడివిడిన జుత్తును సవరించుకొంటూ
క్షురకుని చూసి భయపడి పారిపోతున్నపిల్లాడిని
పట్టుకోవటానికి వెంటపడి పరుగెడుతోంది ఆ ఇల్లాలు. (291)
.
ఒకనాటి అందమైన దృశ్యానికి అద్భుతమైన స్టిల్ ఫొటో ఈ గాథ. పిల్లలకు హెయిర్ కటింగ్ చేయించటం ఇప్పటికీ ఒక ప్రయాసే. గాట్లు పడకుండా పుట్టివెంట్రుకలు తీయించగలిగిన తల్లితండ్రులు అదృష్టవంతులె, ఆ క్షురకుని కూడా గొప్పసహనశీలి అనుకోవచ్చు. ఇంటికి వచ్చి క్షురకక్రియలు అందించటం నిన్నమొన్నటివరకూ సామాజికంగా కొనసాగిన ప్రక్రియే. (ఇంకా వుంది)
బొల్లోజు బాబా
(Poems on Life and Love in Ancient India, Translated from the Prakrit and Introduced by Peter Khoroche and Herman Tieken నుండి చేసిన స్వేచ్ఛానువాదాలు)

No comments:

Post a Comment