Tuesday, July 14, 2020

అయాన్ రాండ్ ఫౌంటైన్ హెడ్ – శ్రీ రెంటాల వారి తెలుగు అనువాదం


Bolloju Baba
8 February ·



అయాన్ రాండ్ ఫౌంటైన్ హెడ్ – శ్రీ రెంటాల వారి తెలుగు అనువాదం
అయాన్ రాండ్ పేరును మొదటిసారిగా ఒక యండమూరి నవలలో చదివాను. నాకు అన్నీ తెలుసు అంటూ గొప్పలు పోయే ఒక పాత్ర అయాన్ రాండ్ ప్రస్తావన వచ్చినపుడు- “నాకు అతను తెలుసు, వాడి నవలలు అనేకం నేను చదివాను. భలేగా రాస్తాడు” అంటూ వాగుతుంటే “అయాన్ రాండ్ అతను కాదు ఆమె” అంటుంది మరోపాత్ర.
ఆ తరువాత ఈ అయాన్ రాండ్ పేరు చాలా వ్యాసాల్లో, రచనల్లో విన్నాను. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఫౌంటైన్ హెడ్ చదవటం మొదలెట్టి ముగించలేకపోయాను.
గనారా గారు ఈ పుస్తకపరిచయ సభ మనం చెయ్యాలి అన్నప్పుడు “నాకు ఈ పుస్తకంపై మాట్లాడే అవకాసం ఇవ్వండి” అని అడిగాను. ఎప్పటినుంచో తీరని కోరికను ఈ వంకనైనా తీర్చుకొందామని.
***
శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదు. మీ అందరిలాగే నేను కూడా ఆయన అభిమానిని. వారు పెర్ ఫెక్షనిస్ట్. రెంటాల వారు రాసే గజలైనా, విమర్శనా వ్యాసమైనా చెక్కిన శిల్పంలా ఉంటుంది. ఒక్క మాట పొల్లుపోదు, ఒక్క వాక్యం హద్దు మీరదు.
అనువాదరచనలలోని వాక్యనిర్మాణం ఒక్కోసారి గుర్రబ్బండి ప్రయాణంలా కుదుపులతో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఒక భాషలోని సౌందర్యం మరొక భాషలోకి తీసుకురావటం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ అనువాదం విషయానికి వస్తే హాయిగా ఉంది వచనం. ఏ కుదుపులూ లేని పడవ ప్రయాణంలా ఉందీ అనువాదం.
అనువాద రచనలను పరిశీలించినపుడు ఆ అనువాదకుడు మూలానికి విధేయుడై ఉన్నాడా, లేక పాఠకునికి విధేయుడై ఉన్నాడా అనే రెండు విషయాలు పరిశీలనార్హం.
ఈ రచనను చదివాకా ‘ రెంటాల వారు మధ్యేమార్గాన్ని ఎన్నుకొన్నట్లు నాకు అనిపించింది. అంటే మూలానికి నిబద్ధులై ఉంటూనే సమకాలీన పాఠకులను దృష్టిలో ఉంచుకొని సరళమైన భాషను వాడారు. మనం రోజూ వాడుకునే మాటలనే వాడారు. వందలాది ఇంగ్లీషు పదాలను యధాతథంగా ఉంచేసారు. సుదీర్ఘంగా సాగే వాక్యాలను చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టారు చాలా చోట్ల. ఇదంతా అనువాదకునిగా ఆయన తీసుకొన్న శ్రద్ధ, చూపించిన ప్రతిభ.
నిజానికి అనువాద రచనలపై మాట్లాడటం కత్తి మీద సాము. ఈ మాటలలో అనువాదకుని కన్నా మూల రచయితగురించీ, మూల కృతి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలివస్తుంది. ఇది ఒకరకంగా అనువాదకునికి ఇబ్బందిగా ఉండొచ్చు- కానీ అనువాదం యొక్క ముఖ్య లక్ష్యం “మూల రచన గురించి చర్చించటం” కనుక అది తప్పదు.
***
ఫౌంటైన్ హెడ్ అనువాద నవలను నాలుగు అంశాలుగా పరిశీలిద్దాం.
1. ఫౌంటైన్ హెడ్ కథ, పాత్రలు,
2. ఈ నవల చెప్పే ఫిలాసఫీ ఏమిటి?
3. సమకాలీన సమాజం లో ఫౌంటైన్ హెడ్ నవల ప్రాసంగికత ఏమిటి?
4. అనువాద విశ్లేషణ
1. ఫౌంటైన్ హెడ్ కథ పాత్రలు,
అయాన్ రాండ్ 1905 లో రష్యాలో జన్మించింది. 1926 లో అమెరికా వలస వచ్చి అక్కడే స్థిరపడింది. ఫౌంటైన్ హెడ్ నవలను ఈమె 1943 లో రచించింది. ఈ నవల ముప్పై భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు దీన్ని ముప్పై ఒకటిగా భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫౌంటైన్ హెడ్ పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఈ నవలకు మొదట “సెకండ్ హాండర్స్” అనే పేరు పెడదామని భావించి అది నెగటివ్ అర్ధాన్ని ఇస్తున్న కారణంగా నదీ మూలం (Source of Stream) అనే అర్ధం వచ్చేలా ఫౌంటైన్ హెడ్ అన్న పేరు పెట్టింది అయాన్ రాండ్.
ఫౌంటైన్ హెడ్ ఆర్కిటెక్చర్ నేపథ్యంలో అల్లబడిన సుమారు ఎనిమిదివందల పేజీల నవల. కథాకాలం సుమారు 1920-30 లు. కథా ప్రాంతం న్యూయార్క్. ఈ నవలలో ప్రధానమైన అయిదు పాత్రలను గుర్తించవచ్చు.
హోవార్డ్ రోర్క్
ఇతను ఈ నవలకు హీరో. గొప్ప ఆర్కిటెక్ట్. ఇతని పాత్ర ఒక ఆదర్శపురుషునిగా చిత్రించబడుతుంది. పేదకుటుంబంలో పుట్టి చిన్నచిన్న పనులు చేసుకొంటూ చదువుకొంటాడు. ఇతనికి జీవితం పట్లా వృత్తి పట్ల కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయలు ఉంటాయి. ఇతరుల కొరకు తన అభిప్రాయాలను మార్చుకోవటానికి ఇష్టపడడు. రోర్క్ గీసిన బిల్డింగ్ ప్లాన్ లను ఎవరెన్ని చెప్పినా మార్చటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోడు. ఈ క్రమంలో చాలా గొప్ప గొప్ప వ్యాపార అవకాసాలను రోర్క్ కోల్పోవలసి వస్తుంది.
వ్యక్తివాదానికి రోర్క్ పాత్రను ప్రతీకగా నిలుపుతుంది అయాన్ రాండ్. స్థిరమైన అభిప్రాయాలను కలిగిఉన్న రోర్క్ పాత్రకు, మిడిమిడి జ్ఞానంతో సమాజం ఎటు నడిపితే అటు కొట్టుకుపోయే ఇతర పాత్రలకు మధ్య నడిచిన నాటకీయతే ఫౌంటైన్ హెడ్ నవల. ఈ పాత్ర ఒక రకంగా ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ పాత్రలా అనిపిస్తుంది.
డొమినిక్ ఫ్రాంకన్
డోమిన్క్ పాత్ర నిగూఢతను కలిగి ఒక పట్టాన అర్ధం కాదు. ఆమెకు ఏం కావాలో, ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తున్నదో అంతుచిక్కదు. వ్యక్తి స్వేచ్ఛ సిద్దాంతానికి రోర్క్ పురుషరూపం అనుకొంటే డోమినిక్ స్త్రీరూపమని అన్వయం చేసుకోవాలి.
ఈమె ఈ నవలకు హీరోయిన్. నవల ప్రారంభంలో తన చుట్టూ ఉండే మిడిమిడి జ్ఞానం కలిగిన మనుషుల పట్ల డొమినిక్ విసుగుచెంది, ఈ ప్రపంచం అంతా కుళ్ళిపోయింది అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకొంటుంది. ఇలాంటి కుళ్ళిన సమాజంలో స్వతంత్ర ఆలోచనలకు తావు లేదు అని నమ్ముతుంది. పరిపూర్ణ మానవుడి కోసం చేసిన అన్వేషణలో డొమినిక్ మొదట పీటర్ కీటింగ్ ని, తరువాత గెయిల్ వేనాండ్ ని పెళ్లి చేసుకొని నవల చివరలో రోర్క్ ని చేరుకొని తన అన్వేషణను ముగిస్తుంది. డొమినిక్ ప్రవర్తన ఒక్కోసారి అనూహ్యంగా ఉండటం వల్ల ఆమె ఒక న్యూరోటిక్ అని విమర్శకులు విమర్శించారు.
పీటర్ కీటింగ్
ఇతడు రోర్క్ క్లాస్ మేట్. స్వంత అభిప్రాయాలను కలిగి ఉండడు. స్వశక్తిని నమ్ముకోకుండా ఇతరులపై ఆధారపడుతూంటాడు. వృత్తిలో విజయాలు సాధించుకోవటం కొరకు అబద్దాలు ఆడటం, దొంగతనం చేయటం చివరకు పెద్ద కంట్రాక్ట్ ఇస్తానంటే భార్య అయిన డొమినిక్ ను వైనాండ్ కు ఇచ్చేస్తాడు/అమ్మేస్తాడు కూడా. మిడిమిడి జ్ఞానంతో సమాజం ఎటునడిపితే అటునడిచే ఒక మిడియోక్ర్ వ్యక్తి కీటింగ్.
గెయిల్ వైనాండ్
ఈ నవలలో వైనాండ్ పాత్రను చిత్రించిన తీరు ఉద్వేగ భరితంగా ఉంటుంది. వైనాండ్ పాత్రరూపకల్పనలో జర్మన్ తత్వవేత్త నీషే ఫిలాసఫీ ప్రభావం ఉందని విమర్శకులు అంటారు. గంజి నుంచి బెంజి వరకు అన్నట్లు మురికివాడలనుంచి న్యూస్ పేపర్ ప్రపంచానికి అధినేతగా ఎదిగి, సమాజాన్ని శాసించే స్థాయికి చేరతాడు వైనాండ్. ఇతను వ్యాపారప్రపంచంలో ఎదిగిన తీరు నేటి తెలుగు రాజకీయాలను శాసిస్తున్న రెండుపత్రికలు, ఒక పెద్ద న్యూస్ చానెల్ యజమానుల్ని తలపిస్తుంది. ఇతరులను శాసించటమే మానవ లక్ష్యమని భావిస్తాడు. ఈ క్రమంలో డొమినిక్ ను పెండ్లాడతాడు. రోర్క్ యొక్క నిబద్దతను గుర్తించి అతని స్నేహితుడౌతాడు. వ్యాపారంలో వైఫల్యం చెంది నవల చివరలో ఆత్మహత్యకు సిద్ధపడతాడు. (సినిమాలో ఆత్మహత్య చేసుకొన్నట్లు చూపించారు)
`
రోర్క్ పాత్ర ఒక రాయిలాగా ఏ స్పందనలను చూపించదు. గైల్ వైనాండ్ పాత్ర ఎంతో ఆకర్షిస్తుంది. తన నమ్మకాలకు, సమాజం ఆశిస్తున్న దానికి మధ్య వైరుధ్యాలున్నప్పుడు ఆ వ్యక్తి పడే ఘర్షణ వైనాండ్ పాత్రలో కనిపించింది. వైనాండ్ పాత్ర వల్లే ఈ నవల సాహిత్యరూపం పొందింది. వైనాండ్ పాత్ర లేకపోతే ఈ నవల వ్యక్తివాదానికి, సమిష్టి వాదానికి మధ్యనడచిన సిద్ధాంత చర్చగా మిగిలిపోయి ఉండేది.
ఎల్స్ వర్త్ టూహీ
టూహీ అందరికీ ఒక తెలివైన ఆధ్యాత్మిక వేత్తగా కనిపిస్తూ తెరవెనుక గోతులు తవ్వే పాత్ర. ఈ నవలలో విలన్ టూహి. త్యాగం చేయటం ఉత్తమ మానవ విలువ, మనకోసం కాక ఇతరుల కోసం బ్రతకటంలోనే జీవిత పరమార్ధం ఉంటుంది అని టూహి ప్రవచిస్తూ ఇతరులను వ్యక్తిత్వం లేనివారిగా మార్చేస్తూంటాడు. టూహి ఒక రకంగా – భక్తులలో మూఢనమ్మకాలు పెంచుతూ, వారి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే దొంగ ఆధ్యాత్మిక ప్రవచనకారుడి లా అనిపిస్తాడు.
రాండ్ ఈ పాత్రను చాలా తెలివిగా తీర్చిదిద్దింది. తన అభిప్రాయాలను గౌరవించి తన ఔన్నత్యాన్ని అంగీకరించిన వారితో టూహీ కి ఏ సమస్యా లేదు. అలా అంగీకరించకుండా స్వతంత్రంగా ఆలోచించే రోర్క్ లాంటి వ్యక్తులపట్ల టూహి కక్ష పెంచుకొని వాళ్ళని నాశనం చేయటానికి ప్రయత్నిస్తాడు. టూహిని సోషలిజానికి ప్రతినిధి గా నిలబెడుతుంది రాండ్.
కథ
స్టాంటన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుకొంటున్న హావార్డ్ రోర్క్, లెక్చరర్లను విమర్శించినందుకు సస్పెండ్ చేయబడటంతో నవల మొదలౌతుంది. రోర్క్ ఆర్కిటెక్ట్ గా అవకాసాలు వెతుక్కొంటూ న్యూయార్క్ చేరుకొంటాడు. ఇతని క్లాస్ మేట్ అయిన పీటర్ కీటింగ్ కూడా న్యూయార్క్ చేరుకొని అంచలంచెలుగా ఎదిగిపోతూంటాడు. కస్టమర్లు కోరిన విధంగా బిల్డింగు ప్లానులు మార్చని కారణంగా రోర్క్ ఉద్యోగం కోల్పోయి, న్యూయార్క్ విడిచిపెట్టి ఓ మారుమూల గ్రామానికి వెళ్లిపోయి అక్కడ ఒక గ్రానైట్ క్వారీ లో వర్కర్ గా పనిచేస్తుంటాడు. అక్కడ ఒకరోజు రోర్క్ ఆ గ్రానైట్ ఓనర్ కూతురైన డొమినిక్ ని కలుస్తాడు. ఒకరికొకరు ఆకర్షితులౌతారు. ఆ క్రమంలో రోర్క్ ఆమెను రేప్ చేస్తాడు.
రోర్క్ కు ఒక క్లయింటు నుండి పిలుపు రావటంతో న్యూయార్క్ తిరిగి వచ్చేస్తాడు. డొమినిక్ కూడా వస్తుంది. డొమినిక్ మొదట కీటింగ్ ను తరువాతా న్యూస్ పేపర్ అధినేత అయిన వైనాండ్ ను పెండ్లాడుతుంది.
రోర్క్ కు క్రమక్రమంగా క్లయింట్లు పెరుగుతూంటారు. ఎల్స్ వర్త్ టూహి రోర్క్ కారీర్ ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూంటాడు.
కీటింగ్ కు వచ్చిన ఒక పెద్ద ప్రొజెక్టును తను చెయ్యలేక, రోర్క్ తో డిజైన్ చేయించుకొంటాడు. ఈ ప్లాన్ ను ఏమాత్రం మార్చను అన్న మాట తీసుకొని రోర్క్ డిజైన్ చేసి ఇస్తాడు. ఇచ్చినమాటకు విరుద్ధంగా ఆ ప్రొజెక్టులో అనేక మార్పులు చేయటంతో రోర్క్ ఆ బిల్డింగులు మొత్తాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తాడు. పోలీసులు రోర్క్ ను అరెస్టుచేస్తారు. రోర్క్ ను పోలీసులు అరస్టు చేయటాన్ని వైనాండ్ తన పేపర్ లో ఖండించినందుకు ప్రజల అసహనానికి గురయి దివాళా తీస్తాడు అరస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినపుడు “ఆ ప్లాను నాది, దాన్నిపై సర్వహక్కులు నాకుంటాయి. దాన్ని మార్చటానికి కుదరదు అనే ఒప్పందం పైనే చేసి ఇచ్చాను. అదే నా ఫీజు గా భావించాను. కానీ ఆ ప్రొజెక్టు డిజైన్ ను మార్చినందుకు దాన్ని పేల్చివేసాను. ఇది నా వ్యక్తిత్వానికి, నాకు ఉండే వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని వాదించి నిర్దోషిగా విడుదలవుతాడు.
నవల చివరలో రోర్క్ పేరున్న ఆర్కిటెక్ట్ గా మారతాడు. డొమినిక్ రోర్క్ ను చేరటంతో కథ ముగుస్తుంది.
2. ఈ నవల చెప్పే ఫిలాసఫీ ఏమిటి?
ఈ నవలలో- ప్రసంగాలలాగ అనిపించే సంభాషణలు, హీరోయిన్ పాత్ర చిత్రణను ఫెమినిష్టులే అంగీకరించలేకపోవటము, రోర్క్ కొన్ని సంఘటనలలో అసహజంగాను, మూర్ఖునిగాను కనిపించటం, మానవ సంబంధాలను బలోపేతం చేసే త్యాగాన్ని ఉత్త నాన్సెన్స్ వ్యవహారంగా కొట్టిపాడేయటం వంటి సాహిత్యపరమైన అనేక లోపాలున్నప్పటికీ- ఫౌంటైన్ హెడ్ నవల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతూ ఉండటానికి ప్రధాన కారణం ఆ నవలలో అయాన్ రాండ్ చొప్పించిన ఫిలాసఫీ.
అయాన్ రాండ్ ఈ పుస్తకంలోని చొప్పించిన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో పిలుచుకొంది. అంటే మనకోసం మనం బ్రతకటం, చేసే పనిద్వారా, సొంత ఆలోచనలద్వారా, ప్రవర్తన ద్వారా ఆనందాన్ని పొందటం. కష్టపడటం ద్వారా విజయాన్ని చేరుకొనవచ్చు అని నమ్మటం.
ఈ రకపు ఆలోచనలు వ్యక్తిప్రధానంగా సాగుతాయి. అయాన్ రాండ్ తన ఈ అభిప్రాయాలను రోర్క్ పాత్రద్వారా చాలా బలంగా, ఏ నాన్చుడూ లేకుండా చెప్పింది.
వ్యక్తివాదానికి ప్రతిరూపంగా నిలిచిన హావార్డ్ రోర్క్ ఈ నవలలో మూడు రకాల వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటాదు.
ఒకటి సాంప్రదాయవాదులు. రెండు కన్ ఫర్మిస్టులు, మూడు సోషలిష్టులు. సంప్రదాయ వాదులు పూర్వీకులు చెప్పిన వాటిని అనుకరించే వ్యక్తులు. కన్ ఫర్మిస్టులు సమకాలీన ఆలోచనలను అనుకరించేవ్యక్తులు. సోషలిస్టులు వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను తప్పు పట్టేవ్యక్తులు. ఈ ముగ్గురినీ “సెకండ్ హాండర్స్” అంటుంది రాండ్. వీళ్లందరూ సమిష్టివాదానికి ప్రతినిధులు.
వ్యక్తివాదంలో వ్యక్తికి స్వేచ్ఛ, స్వతంత్రత ఉంటాయి. సమిష్టివాదంలో వ్యక్తి స్వేచ్ఛకు, అతని ఆలోచనలకు ఏ విలువా ఉండవు, సమాజంకొరకు అతను స్వేచ్ఛను, సొంత ఆలోచనలను త్యాగం చేయవలసి ఉంటుంది.
ఈ నవలలో సోషలిజాన్ని టూహి పాత్రద్వారా చర్చకు పెడుతుంది అయాన్ రాండ్. ప్రతిమనిషి సమాజం కొరకు త్యాగం చేయాలి, వ్యక్తిగత ఇష్టాలకు తావుండకూడదు, సమాజ హితమే మనిషి తన ధ్యేయంగా కలిగి ఉండాలి అంటూ టూహి పాత్ర ద్వారా చెప్పిస్తుంది రాండ్. ఈ అభిప్రాయాలను వంటపట్టించుకొన్న టూహి మేనగోడలు సామాజిక సేవ చేయటంలో మొదట్లో ఆనందాన్ని పొందినా క్రమేపీ ఒక యాంత్రిక జీవనాన్ని గడిపే విఫలురాలిగా మిగిలిపోతుంది. స్వతంత్రంగా ఆలోచించే రోర్క్ ని మార్చటానికి ప్రయత్నిస్తాడు టూహి, అతను మారడని తెలుసుకొని అతన్ని పతనం చేయటానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తాడు.
టూహి పాత్ర ద్వారా సోషలిజాన్ని చెడ్డదిగాను రోర్క్ పాత్రద్వారా వ్యక్తివాదం మంచిదిగా ను అయాన్ రాండ్ సూత్రీకరిస్తుంది.
నవల చివరలో సంప్రదాయవాదుల్ని, కన్ఫర్మిష్టులను, సోషలిస్టులను హోవార్డ్ రోర్క్ జయించటం ద్వారా వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉండటమే ఉత్తమ మానవ విలువగా అయాన్ రాండ్ ప్రతిపాదించినట్లు అర్ధమౌతుంది.
3. సమకాలీన సమాజం లో ఫౌంటైన్ హెడ్ నవల ప్రాసంగికత ఏమిటి?
సమిష్టివాదం కన్న వ్యక్తివాదం ఉత్తమమైనదని చాలా ప్రతిభావంతంగా అయాన్ రాండ్ ఈ పుస్తకంద్వారా చెప్పింది. ఈ ప్రతిపాదన ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. ఈ నవల 1930 లలో వ్రాయబడింది. అప్పటికి ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయిఉంది. ఒక వైపు రష్యా ప్రాతినిధ్యం వహిస్తున్న సోషలిజం మరొక వైపు అమెరికా ప్రాతినిధ్యం వహిస్తున్న కేపిటలిజం. ఈ రెండు ధృవాలలో దేన్ని ఎంచుకోవాలనే డైలమాలో ప్రపంచం ఉంది.
సరిగ్గా అలాంటి సమయంలో ఫౌంటైన్ హెడ్ విడుదలైంది. సమిష్టివాదంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసిందీ నవల. మనిషి స్వేచ్ఛను కలిగిఉండటం ఎంత అవసరమో చెప్పింది. కాలక్రమేణా రష్యా పతనమవ్వటము, కేపటలిస్టిక్ పంధాలో ప్రపంచం ముందుకు సాగటము కాలానుగుణ పరిణామాలు.
పరమ దుర్మార్గమైన కేపిటలిస్టిక్ వ్యవస్థను అంగీకరించటానికి ప్రజలను సమాయుత్తపరచిందనే ఆరోపణ - ఫౌంటైన్ హెడ్ పై వచ్చిన విమర్శలన్నింటిలో నేటికీ అత్యంత ప్రధానమైనది.
ఫౌంటైన్ హెడ్ లో మానవ జీవితానికి సంబంధించిన మౌలిక మైన అంశాలైన ఎలా బ్రతకాలి, గౌరవ ప్రదమైన విజయవంతమైన జీవనానికి మార్గాలేమిటి, అలాంటి జీవనమార్గాలకు అవరోధాలేమిటి? అనే ప్రశ్నలకు అయాన్ రాండ్ సమాధానాలు పాత్రల ద్వారా చెప్పించింది.
ఈ ప్రశ్నలు సార్వజనీనమైనవి, సర్వకాలాలకూ వర్తించేవి. ప్రతీ తరం వేసుకొంటుంది.
వ్యక్తి వాదము, సమిష్టి వాదముల మధ్య ఘర్షణను ఫౌంటైన్ హెడ్ చర్చకు తెస్తుంది. ఈ ఘర్షణ రాజకీయపరమైనది కాదు మనిషి హృదయంలో జరిగేది అని అయాన్ రాండ్ చెప్పినప్పటికీ ఈ చర్చ సోషలిజాన్ని ఇరుకున పెట్టిందని అంగీకరించక తప్పదు.
మన దైనందిక జీవితంలో ఎక్కువగా ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం భారతీయ సమాజ లక్షణం. సమూహం ఎలా ఆలోచిస్తే అలాగే జీవించటానికి ప్రయత్నిస్తాం మనం. నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అనటం సర్వసాధారణం.
ఇప్పుడిప్పుడే నేటి యువతఆలోచనలలో మార్పులు వస్తున్నాయి. నన్ను ఆలోచించుకోనీ, అది నా తత్వానికి సరిపడదు, నేను ఇంతే ఇలాగే ఉంటాను, నాక్కొంచెం స్పేస్ కావాలి లాంటి మాటల్ని నేటి యువతరం ఎక్కువగా వాడుతుంది. సరిపడని సంసారాలలో మగ్గిపోయి క్షోభపడే కంటే విడాకులు తీసుకొని స్వతంత్రంగా బ్రతకటం నేడు సాధారణమైంది. నేడు నిందితులకు కూడా మానవ హక్కులు ఉంటాయని సమాజం అంగీకరిస్తున్నది. ఇది కాలధర్మం.
అమెరికన్ సమాజం ఆలోచించినట్లుగా భారతదేశ సమాజం ఆలోచించటానికి యాభై ఏళ్ళు పడుతుంది అని అంటారు. ఈ పుస్తకంలోని భావజాలాన్ని అంగీకరించటానికి భారతీయ సమాజం నేడు తెరుచుకొని ఉంది. ఆ రకంగా చూస్తే సరైన సమయంలో వచ్చిన అనువాదం ఇది.
4. అనువాద విశ్లేషణ
A. హృద్యమైన అనువాదం:
రోర్క్ చదువుతున్న కాలేజ్ డీన్ తో సంభాషణ ఇది. రెంటాల వారి అనువాదం ఎంత ఆహ్లాదంగా, హాయిగా ఉందో ఈ వాక్యాలద్వారా అర్ధం చేసుకొనవచ్చును.
I don’t intend to build in order to have clients. I intend to have clients in order to build. నేను క్లయింట్లకోసం కట్టాలనుకోను. కట్టడం కోసం క్లయింట్లు కావాలని కోరుకొంటాను.
"My dear fellow, who will let you?"
"That’s not the point. The point is, who will stop me?
“ఓరినాయినా! ఎవరు కట్టనిస్తాడు నిన్ను?
ఎవరు కట్టనిస్తారు అన్నది కాదండి విషయం. ఎవరు ఆపుతారు అన్నది పాయింటు”
ఒకచోట స్వేచ్ఛను నిర్వచిస్తూ డొమినిక్ ఇలా అంటుంది.
To ask nothing. To expect nothing. To depend on nothing.”
ఏమీ కావాలనుకోకపోవటం. ఏమీ ఆశించకపోవడం. దేనిమీదా ఆధారపడి ఉండకపోవటం.
రోర్క్ ఒక సందర్భంలో వైనాండ్ తో ఇలా అంటాదు.
“I could die for you. But I couldn't, and wouldn't, live for you.”
మీకోసం చనిపోగలను గాని మీకోసం బతకలేను, బతకను.
B. మూలం పట్ల విధేయత
"Howard--anything you ask. Anything. I’d sell my soul..."
ఏదడిగినా సరే. ఏదైనా. నా ఆత్మని ఇచ్చేస్తాను.
“To sell your soul is the easiest thing in the world. That's what everybody does every hour of his life. If I asked you to keep your soul - would you understand why that's much harder?”
నీ ఆత్మని ఇచ్చేయడం అన్నింటికన్నా తేలిక. ప్రతివాడూ ప్రతినిముషం చేస్తున్నపనే అది. నీ ఆత్మని నువ్వు ఉంచుకో అని చెప్పాననుకో, అది ఎందుకు మరింత కష్టతరమౌతుందో తెలుసా?
పై సంభాషణలో రెంటాల వారు Sell my soul అన్న ఇడియంను “ఆత్మను అమ్ముకోవటం” గా అనువదించలేదు. Sell my soul అన్నమాట రెండు సార్లు వచ్చింది. ఆత్మను అమ్ముకోవటం అనే మాట రోర్క్ సంభాషణకు పొసుగుతుందేమో కానీ కీటింగ్ సంభాషణకు పొసగదు. అందుకని రెండుచోట్లా అతికే “ఆత్మను ఇచ్చేయటం” అనే మాట వాడారు. ఇది మూలం పట్ల విధేయతగా భావించవచ్చు.
తాగుడికి బానిస అయిన సందర్భంలో “ పీతలాగ తాగేస్తున్నాడు” అని అనటం తెలుగు వాడిక. He drinks like a fish. అనే వాక్యాన్ని చేపలాగ తాగేస్తున్నాడు అని అనువదించారు. ఇది కూడా మూలం పట్ల విధేయతగానే అనుకొంటాను.
C. పాఠకుని పట్ల విధేయత
ఈ క్రింది సంభాషణ వైనాండ్ కి డొమినిక్ కి మధ్య జరుగుతుంది.
“I love you so much that nothing can matter to me - not even you...Only my love- not your answer. Not even your indifference”
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డొమినిక్, ఎంతగా ప్రేమిస్తున్నానంటే, దేన్నీ పట్టించుకోను- నిన్నుకూడా. అర్ధమైందా? కేవలం నా ప్రేమ ఒక్కదాన్నే పట్టించుకొంటాను. నీ స్పందనని కాదు. నీ పట్టించుకోనితనం కూడా పట్టదు నాకు.
మూలంలో రెండువాక్యాలుగా ఉన్న భావాన్ని తెలుగులోకి అయిదువాక్యాలుగా అనువదించారు. మూలంలో లేని డొమినిక్ అన్న సంబోధన, అర్ధమైందా అనే ప్రశ్నా? లాంటివి ఆ సందర్భంలోని లోతును, గంభీరతను చదువరికి అర్ధం చేయించటానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చు.
చాలా చోట్ల ఇంగ్లీషు పదాలను యధాతథంగా ఉంచేసారు. ఇంటర్వ్యూ, ఆర్కిటెక్టు, ప్రొజెక్టు, డెస్క్, డెజైన్, పెయింట్, గ్రానైట్, లైబ్రేరీ, అపార్ట్ మెంటు, ఫీలింగు లాంటి వందలాది ఇంగ్లీషు పదాలకు తెలుగు చేయలేదు. దీన్ని కూడా ఒకరకంగా పాఠకుల పట్ల విధేయతగానే గుర్తించాలి.
స్థిర తిరస్కృతులు (firm refusals), పరివేషం (Halo), అసుఖం (uncomfortable), క్షయీకృత (emaciated), విరసప్రశాంతి (serenity), ఉపన్యాస శృంఖల (series of Lectures) లాంటి అనువాదాలు ఇబ్బంది పెట్టాయి. అది సద్యస్ఫురణ కావొచ్చు.
మొత్తం మీద అనువాదం హృద్యంగా ఉంది. మూలానికి విధేయంగా ఉంటూనే అందంగా మంచి బిగితో సాగింది.
***
ఫౌంటైన్ హెడ్ లో అయాన్ రాండ్ స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచన, ఇంటిగ్రిటీ మానవులకు ఉండాల్సిన ఉత్తమ లక్షణాలు అంటుంది. మొదటి రెండు మానవులుగా మన హక్కులు అనుకొంటే ఇంటిగ్రిటీతో జీవించటం మన బాధ్యతగా భావించాలి.
ఫౌంటైన్ హెడ్ పుస్తకం ఈనాటికైనా తెలుగులో రావటం ఆనందించదగిన సందర్భం. రెండు మూడు తరాలుగా ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తున్న నవల ఇది. ఈ పుస్తకాన్ని ప్రేమించేవాళ్లు ఎంతమందైతే ఉన్నారో ద్వేషించే వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అందుకనే ముందుమాటలో శ్రీ రెంటాల వారు “విభేదించటానికి అయినా చదవాల్సిన రచయిత్రి అయాన్ రాండ్” అంటారు. నామట్టుకు నేను ఆత్మశోధన చేసుకోవటానికి ఈ పుస్తకం తప్పని సరిగా చదవాలని అనుకొంటాను.
ఫౌంటైన్ హెడ్ పుస్తకం ఒక మానసిక ఆవరణం. అక్కడ మానవ జీవితానికి సంబంధించిన అనేక దృక్ఫధాలు యుద్ధం చేసుకొంటూ కనిపిస్తాయి. ఆ భిన్న దృక్ఫధాల మధ్య మనం ఎక్కడ ఉన్నామో తరచి చూసుకోవటానికైనా ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలి.
బొల్లోజు బాబా
8/2/2020

3 comments:

  1. Please give the book publishers details and phone no.
    Thanks.

    ReplyDelete
  2. బాగా విశ్లేషించారు బాబా గారు. రెంటాల వారి అనువాదం చాలావరకు మూలవిధేయం గా సాగింది.తెలుగు వారికి ఎలా చెపితే లోపలకి వెళుతుందో అటువంటి అనువాద వ్యూహాల్ని అనుసరించారు. అయినప్పటికీ కూడా కొంత ఓపిక తోనే చదవ వలసి వచ్చింది.దానికి కారణం అసలు మూలరచన యే ఒక ఇన్స్పిరేషన్ తో కాక ,ఏదో ఒక భావజాలాన్ని గ్లోరిఫై చేయడానికి కృత్రిమంగా రాసినట్లు గా ఉంటుంది.మూల రచన ని కూడా కొన్ని యేళ్ళ క్రితం చదివాను.అంత గొప్ప నవల ఏమీ కాదు నా దృష్టి లో..! బహుశా నాకే అలా అనిపించిందో..!

    ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ పరిచయ కార్యక్రమానికి గనారా గారు నాకు కూడా మెసేజ్ పెట్టారు.రాజమండ్రి లో అదే రోజున పని ఉండి వచ్చి కాకినాడ దాకా వద్దామని బయలుదేరాను బస్సు లో..! ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల ట్రాఫిక్ జాం అయి రాలేకపోయాను.ఏది ఏమైనా నాటి మీ విశ్లేషణ ని ఈ రూపలొ ఇక్కడ చదవగలిగాను.అభినందనలు.



    బాగా విశ్లేషించారు బాబా గారు. రెంటాల వారి అనువాదం చాలావరకు మూలవిధేయం గా సాగింది.తెలుగు వారికి ఎలా చెపితే లోపలకి వెళుతుందో అటువంటి అనువాద వ్యూహాల్ని అనుసరించారు. అయినప్పటికీ కూడా కొంత ఓపిక తోనే చదవ వలసి వచ్చింది.దానికి కారణం అసలు మూలరచన యే ఒక ఇన్స్పిరేషన్ తో కాక ,ఏదో ఒక భావజాలాన్ని గ్లోరిఫై చేయడానికి కృత్రిమంగా రాసినట్లు గా ఉంటుంది.మూల రచన ని కూడా కొన్ని యేళ్ళ క్రితం చదివాను.అంత గొప్ప నవల ఏమీ కాదు నా దృష్టి లో..! బహుశా నాకే అలా అనిపించిందో..!

    ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ పరిచయ కార్యక్రమానికి గనారా గారు నాకు కూడా మెసేజ్ పెట్టారు.రాజమండ్రి లో అదే రోజున పని ఉండి వచ్చి కాకినాడ దాకా వద్దామని బయలుదేరాను బస్సు లో..! ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల ట్రాఫిక్ జాం అయి రాలేకపోయాను.ఏది ఏమైనా నాటి మీ విశ్లేషణ ని ఈ రూపలొ ఇక్కడ చదవగలిగాను.అభినందనలు.







    బాగా విశ్లేషించారు బాబా గారు. రెంటాల వారి అనువాదం చాలావరకు మూలవిధేయం గా సాగింది.తెలుగు వారికి ఎలా చెపితే లోపలకి వెళుతుందో అటువంటి అనువాద వ్యూహాల్ని అనుసరించారు. అయినప్పటికీ కూడా కొంత ఓపిక తోనే చదవ వలసి వచ్చింది.దానికి కారణం అసలు మూలరచన యే ఒక ఇన్స్పిరేషన్ తో కాక ,ఏదో ఒక భావజాలాన్ని గ్లోరిఫై చేయడానికి కృత్రిమంగా రాసినట్లు గా ఉంటుంది.మూల రచన ని కూడా కొన్ని యేళ్ళ క్రితం చదివాను.అంత గొప్ప నవల ఏమీ కాదు నా దృష్టి లో..! బహుశా నాకే అలా అనిపించిందో..!

    ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ పరిచయ కార్యక్రమానికి గనారా గారు నాకు కూడా మెసేజ్ పెట్టారు.రాజమండ్రి లో అదే రోజున పని ఉండి వచ్చి కాకినాడ దాకా వద్దామని బయలుదేరాను బస్సు లో..! ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల ట్రాఫిక్ జాం అయి రాలేకపోయాను.ఏది ఏమైనా నాటి మీ విశ్లేషణ ని ఈ రూపలొ ఇక్కడ చదవగలిగాను.అభినందనలు.


























    ReplyDelete