నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు తెలుగు లెక్చరరా, హిస్టరీ లెక్చరరా అని.
నా ఉద్యోగం గురించిన సమాచారం నేనింతవరకూ ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకో ఈరోజు కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తోంది.
***
1994 లో జంతుశాస్త్రంలో M.Sc, M.Phil, BEd పుర్తయ్యాక కొన్నాళ్ళు ప్రెవైట్ స్కూల్ టీచర్ గా, నెల్లూరు రొయ్యలచెరువు అక్వాటెక్నిషియన్ గా, డిగ్రీకాలేజ్ లో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పనిచేసి - 1998 లో ప్రభుత్వ జంతుశాస్త్ర జూనియర్ లెక్చరర్ గా సర్వీస్ కమిషన్ పరీక్షద్వారా ఎంపికయి నా కారీర్ మొదలుపెట్టాను. అప్పట్లో నేను వ్రాసిన ఇంటర్మీడియట్ జువాలజీ స్టడీ మెటిరియల్ ఆనాటి ఆర్.ఐ.ఒ శ్రీ గౌస్ గారు ముద్రించి అన్ని కళాశాలలకు పంపిణీచేసారు. 2010 లో డిగ్రీ లెక్చరర్ గా ప్రమోట్ అయ్యాను.
2013 లో కాకినాడ పి.ఆర్. కళాశాలకు బదిలీపై వచ్చినప్పుడు, మిత్రుడు శ్రీ పి. అనిల్ కుమార్ ప్రోత్సాహంతో డిపార్ట్ మెంటల్ బ్లాగ్ ను ఒకదానిని క్రియేట్ చేసాం.
పాఠం అయిపోగానే పిల్లలకు నోట్స్/మెటీరియల్ ను బ్లాగులో పోస్ట్ చేసి అక్కడనుంచి వాళ్లు డౌన్ లోడ్ కానీ ప్రింటవుట్స్ కానీ తీసుకొని చదువుకోవటం అలవాటు చేసాను. ఈ ఏడేళ్లలో దానిలో సుమారు 180 టాపిక్స్ పై తెలుగు, ఇంగ్లీషు మీడియంకు చెందిన మెటీరియల్ పోగుబడి ఉంది. దీన్ని మా విద్యార్ధులే కాక చాలా మంది చూస్తున్నారని అర్ధమౌతోంది. ఈనాటికి 31,567 వ్యూస్ కలిగి ఉన్నది.
రెండేళ్లక్రితం నేను వెళ్ళే క్లాసు విద్యార్ధులతో Moodle గ్రూపును ఏర్పరచి, వారి అసైన్మెంట్స్, ప్రొజెక్ట్స్ అన్నీ Moodle ద్వారా సబ్మిట్ చేయటం అలవాటు చేసాను. విద్యార్ధులు వారికివ్వబడిన అసైన్మెంటును పేపర్ పై వ్రాసి దానిని పి.డి.ఎఫ్ గా మార్చి గడువులోపల ఆన్ లైన్లో సబ్మిట్ చేస్తారు. దాన్ని నేను ఇవాల్యుయేట్ చేసి రాంక్ ఇస్తాను. అలాగే క్విజ్ లు. ఇంకా విడియో సెమినార్లు, విడియో ప్రొజెక్ట్ వర్క్స్. వీటన్నిటి క్యుములేటివ్ మార్కులను వారి 40% ఇంటర్నల్ మార్క్స్ గా కన్వర్ట్ చేసి పరీక్షల విభాగానికి అందచేస్తున్నాను.
దీనిద్వారా నాకు అర్ధమైన విషయం ఏమిటంటే కాస్త ప్రోత్సాహం ఇస్తే విద్యార్ధులు తొందరగా అప్ డేట్ అయ్యి మెరుగైన ఫలితాలను చూపిస్తారని. (విడియోలు చూడండి)
బ్లాగు లింకు: https://zoologyprgc.blogspot.com/
వీడియో సెమినర్: https://www.youtube.com/watch?v=Ycj6LuZJYbI&feature=youtu.be
వీడియో ప్రొజెక్ట్ వర్క్: Identification of any two Cattle breeds
***
ఈ రోజు జూమ్ క్లాసులద్వారా పాఠాలు చెప్పమంటున్నారు. చెపుతున్నాను. నాకు తృప్తినివ్వటం లేదు. కనీసం పదిశాతం విద్యార్ధులు కూడా రావటం లేదు. రకరకాల కారణాలు. వాటిజోలికి పోను.
విద్య అనేది క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయుడు, విద్యార్ధి మధ్య జరిగే ముఖాముఖి సంభాషణ అనుకొంటాను. టెక్నాలజీ అనేది ఆ సంభాషణకు కొనసాగింపుగా ఉండాలి అని భావిస్తాను.
***
రోజులో ఎనిమిది గంటలు ఉద్యోగానికి, మరో ఎనిమిది గంటలు కుటుంబం, సాహిత్యం కొరకు వెచ్చిస్తాను. ఉద్యోగవిషయాలు ఇంటికీ, ఇంటి/సాహిత్య విషయాలు ఉద్యోగస్థలానికీ ఏనాడూ తీసుకెళ్లలేదు.
బొల్లోజు బాబా
పిఎస్. I am very well aware that I am being paid to do all these. I just wish to share my experiences. Thats it.
No comments:
Post a Comment