Bolloju Baba
23 March ·
తెలుగునాట జైన బౌద్ధాలను అణచివేసిన రాజు – ముక్కంటీశ్వరుడు
ముక్కంటీశ్వరుడు అనే రాజు ప్రస్తావన వివిధ మెకంజీ కైఫియత్ లలో కనిపిస్తుంది. తెలుగునేలపై విలసిల్లుస్తున్న జైన మతాన్ని సమూలంగా నిర్మూలించటంలో భాగంగా, అనేక వేలమంది జైన బ్రాహ్మణులను ఈ ముక్కంటీశ్వరుడు చంపించాడని వివిధ కైఫియత్ లు చెపుతున్నాయి. ఇతను అయిదో శతాబ్దంలో నెల్లూరునుంచి కృష్ణా వరకూ గల ఆంధ్రప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతనికి సంబంధించిన శాసనాధారాలు చాలా తక్కువ. కొంతమంది చరిత్రకారులైతే అసలీ పేరుగల రాజే లేడని, అదొక పురాణ పాత్ర అని కొట్టిపడేసారు కూడా. మరికొందరు ఇతను సాతవాహన వంశస్థుడని మరికొందరు పల్లవరాజని అభిప్రాయపడ్డారు. ఇతనికే త్రిలోచన పల్లవుడు, త్రినయన, త్రినేత్ర ఇంకా ముక్కంటి అనే వివిధ పేర్లు కలవు.
తెలుగునేలను పాలించిన రాజులలో ఈ ముక్కంటీశ్వరుడిని అత్యంత వివాదాస్పదుడుగా భావించవచ్చు. ఇతని తండ్రి పేరు ఎక్కడా కనిపించదు. తల్పగిరి గ్రామ కైఫియత్తు ద్వారా ఇతను శివానుగ్రహం వల్ల ఒక బ్రాహ్మణ కన్యకు జన్మించాడని తెలుస్తుంది. అకస్మాత్తుగా తెర పైకి వచ్చిన శైవమతానికి చెందిన రాజు కావొచ్చు. ఇతను అధికారం చేపట్టే సమయానికి తెలుగునాట జైనం, బౌద్దం, ప్రధానమతాలుగా ఉండేవి. జైనులే అధికారం లో ఉండేవారని తెలుస్తుంది. శైవం ఇంకా వైదిక సాంప్రదాయపద్దతులను ఒంటపట్టించుకోలేదు. శూద్రులైన జంగములే పూజారులుగా ఉండేవారు. బహుసా అది క్రింది తరగతి ప్రజల మతం గా మనుగడ సాగిస్తూ ఉండవచ్చు.
అలాంటి రాజకీయ పరిస్థితులలో, హైందవేతర మత నేపథ్యంలో ముక్కంటి మహరాజు అధికారం చేపట్టి జైనులను ఊచకోత కోయించాడని, గానుగులలో వేసి తొక్కించాడని, బౌద్ధ బస్తిలను నేలమట్టం చేసాడని మెకంజీ కైఫియత్తులలో పదే పదే ప్రస్తావనలు కనిపిస్తాయి. ఉత్తరభారతదేశం నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణులను రప్పించి వారికి అగ్రహారాలు, మాన్యాలు ఇచ్చి హిందూ మతాన్ని ఆంధ్రదేశంలో స్థిరీకరించే ప్రయత్నం చేసాడు. శైవాలయాలలోని శూద్రపూజారులను తొలగించి వాటిని హైందవీకరించి బ్రాహ్మణులకు అప్పగించాడు. వైష్ణవాలయాలను కట్టించాడు.
తెలుగువారి చరిత్ర లో ఇవేవీ సామాన్యమైన విషయాలు కావు. మతపరంగా, రాజకీయపరంగా తెలుగుజాతిని మలుపు తిప్పిన సందర్భాలివి. చరిత్రను విశ్లేషించేటపుడు పర్యవసానాలను పరిశీలించాలి తప్ప మంచి, చెడుల తీర్పులు చేయకూడదంటారు. ముక్కంటి చేసింది మంచా చెడా అన్న చర్చ అనవసరం. ముక్కంటి మహరాజు చేసిన చర్యలవలన తెలుగునేలపై జైన బౌద్ధాలు కనుమరుగయ్యాయనేది ఒక చారిత్రిక సత్యం. శైవ సంప్రదాయం హైందవీకరణకు (Sanskritization) గురయ్యింది. ఈ ముక్కంటి మహరాజు ఒకే వ్యక్తా లేక అనేకులా అనేది కూడా సందేహాస్పదమే!
చరిత్రకారులు ముక్కంటీశ్వరుని ఉనికిని ఒక పురాణపాత్రగా భావించటానికి కారణం- ఆధారాల లేమి, ఉన్న ఆధారాలలో పొంతనలేకపోవటమూ. ముక్కంటీశ్వరుడు అయిదో శతాబ్దానికి చెందిన చాళుక్యరాజైన విజయాదిత్యుని యుద్ధంలో సంహరించినట్లు తెలుగునాట లభించిన ఆధారాలు చెపుతున్నాయి. రెండో శతాబ్దానికి చెందిన కరికాల చోళుని చేతిలో ఓడిపోయి ఘోరంగా అవమానించబడినట్లు తమిళనాట లభించిన ఆధారాలు చెపుతున్నాయి. ఈ రెంటి మధ్యా కనీసం రెండు శతాబ్దాల అంతరం ఉండటం వల్ల ముక్కంటీశ్వరుడిని ఒక మిథికల్ పాత్రగా తేల్చారు కొంతమంది చరిత్రకారులు.
***
అయినప్పటికీ ముక్కంటీశ్వరుని చారిత్రికతకు అనేక ఆధారాలు లభిస్తాయి.
1. శాసనాలు
ముక్కంటి మహరాజు చేసిన దానాల కాల గడువు ముగిసిపోయాక తరువాత వచ్చిన రాజులు వాటిని పునరుద్దరణ చేసినట్లు వేయించిన శాసనాలు అనేకం కనిపిస్తాయి. వీటిలో మొదటిది పశ్ఛిమచాళుక్యరాజైన విక్రమాదిత్యుడు- ముక్కంటి మహరాజు చేసిన అన్నవరం గ్రామ దానం కొనసాగేలా క్రీశ 660 లో నెల్లూరులో ఒక శాసనం వేయించాడు.
అదే విధంగా కేత మహారాజు - ముక్కంటి మహరాజు సప్తరుషుల పేర్లమీదుగా చేసిన (కారసాల కైఫియత్తు) దానాలను పునరుద్ధరణ చేస్తున్నట్లు క్రీశ. 1197 లో వేయించిన శాసనం ముక్కంటి చారిత్రికతను నిర్ధారించే అతి ముఖ్యమైన శాసనము.
భీమనాయకుడు, మహామండలలీకుడు, అల్లాడ సుద్ధదేవుడు లాంటి వివిధ చిన్న చిన్న రాజులు తాము ముక్కంటి మహరాజు వారసులమని ద్రాక్షారామ ఆలయ శాసనాలలో చెప్పుకొన్నారు.
ముక్కంటి మహరాజు నుండి కృష్ణకు దక్షిణాన కల ఆరువేల గ్రామాలను దానంగా పొందినట్లు- మల్లరాజు, కోటరాజులు, ఒకేరకమైన శాసనాలను కలిగి ఉండటం చరిత్రకారులను తికమక పెట్టే ఒక అంశం.
త్రిలోచన పల్లవుడు, తెనాలిలో జైన వసతిని నిర్మూలించి, ఆ ప్రదేశంలో ముక్కంటి రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. నేటి రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో వర్ధమాన మహావీరుని ప్రతిమ దొరకడం ఆ అంశాన్ని బలపరుస్తున్నది. (''ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాలు'' గ్రంథం నుండి, రచన ప్రొ||బి.ఎస్.ఎల్. హనుమంతరావు, పేజీ 145)
ముక్కంటి అనే పల్లవరాజు తనతో పాటు మంచి, కొండ అనే ఇద్దరు నాయకులను వెంటతెచ్చుకొన్నాడు. వీరిద్దరు మంచికొండ అనే పట్టణాన్ని నిర్మించారని, వీరి వంశస్థులకు మంచికొండ గోత్రనామంగా స్థిరపడిందని శ్రీరంగం తామ్రపత్రాలద్వారా తెలుస్తున్నది. (history of the reddi kingdoms, M. Somasekhara Sarma)
2. సాహిత్యం
కరికాల చోళుడు క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి తమిళ చోళ రాజు. ఇతను హిమాలయాలవరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడని అంటారు. సాగునీటికోసం కావేరి నదిపై కల్లణై అనే ఆనకట్ట నిర్మించాడు. ఇది నేటికీ పనిచేస్తూ ఉన్న ప్రపంచంలోని రెండవ అత్యంత పురాతనమైన ఆనకట్టగా పేరుతెచ్చుకొంది. దీనిని బ్రిటిష్ వారు పంతొమ్మిదో శతాబ్దంలో రినోవేట్ చేసారు.
కరికాల చోళుడు కల్లణై ఆనకట్ట నిర్మించే సమయంలో సమీప సామంతులను, రాజులను వచ్చి సహాయపడమని ఆజ్ఞాపించాడు. ధరణికోటను కేంద్రంగా చేసుకొని రాజ్యం చేస్తున్న ముక్కంటి మహరాజు నేను అతనికి బానిసను కాను అని ఎదురితిరిగితే, కరికాల చోళుడు అతని గర్వాన్ని అణచి అతనితో తట్టలతో మట్టి మోయించినట్లు ఒక నేరేటివ్ అనేక కావ్యాలలో కనిపిస్తుంది. ఈ కథనాన్ని జయంగోండన్, ఇరంగేశ వేంబ లాంటి తమిళ కవులు, పండితారాధ్యచరిత లో పాల్కురికి సోమనాథుడు తమరచనలలో ప్రస్తావించారు.
3. మెకంజి కైఫియత్తులలో ముక్కంటి మహరాజు
అనూచానంగా చెప్పబడుతూ వస్తున్న విషయాలకు సరైన ఇతర ఆధారాలు లేనిదే చరిత్రకారులు పరిగణలోకి తీసుకోరు. కాలిన్ మెకంజీ సేకరించిన కైఫియత్తులను యధాతథంగా తీసుకోవటానికి చాలామంది చరిత్రకారులు సందేహిస్తారు. అయినప్పటికీ మెయిన్ స్ట్రీమ్ చరిత్రలో కనిపించని అనేక విషయాలు వీటిద్వారా తెలుస్తాయి.
క్రిందచెప్పబడిన కైఫియత్తులలోని మాయాపాదుకలు, మూడోకన్ను లాంటి కొన్ని విషయాలు మిథికల్ గా అనిపించినా వాటిద్వారా దేనినో మెటఫోరికల్ గా చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లు భావించాలి. ఉదాహరణకు ముక్కంటి ఈశ్వరానుగ్రహంతో ఒక బ్రాహ్మణ కన్యకు పుట్టాడని చెప్పే కథనం ద్వారా ఇతను బహుసా ఏదో పల్లవరాజు ఉంపుడు కత్తెకు పుట్టి ఉండవచ్చని కనుక తండ్రి పేరు చెప్పుకోలేని పరిస్థితి అయి ఉంటుందని అంటారు చరిత్రకారుడు ఎం. వెంకట రమణయ్య.
ముక్కంటీశ్వరుని గురించిన ఈ సమాచారం అంతా కడప, కర్నూలు, నెల్లూరు, క్రిష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల కైఫీయత్తులలో ఎక్కువగా కనిపించటం గమనార్హం.
*. బందరు కైఫియత్తు:
ముక్కంటి మహరాజు నిర్మించిన బందరు పట్టణ శివాలయాలలో జంగం వారు పూజారులుగా ఉండేవారు. వారు వైదిక సంప్రదాయానికి విరుద్ధంగా పూజలు నిర్వహించేవారు. ముక్కంటి మహరాజు ఆ జంగములను తొలగించి బ్రాహ్మణులను నియమించి వైష్ణవాలయాలలో వలే వేదనియమానుసారం పూజలు జరిపించమని ఆజ్ఞాపించాడు.
*జల్లూరు కైఫియత్తు:
చాళుక్యరాజైన విజయాదిత్యుడు తన చతురంగబలాలతో దిగ్విజయయాత్ర జరుపుతున్నప్పుడు, పశ్చిమదేశమందు త్రిలోచనపల్లవుడితో తలపడి విధివశాత్తు మరణించెను. ఆ సమయంలో విజయాదిత్యుని భార్య ఆరునెలల గర్భవతి. ఈమె “ముడిలేము” అనే అగ్రహారమునకు పోయి అక్కడి వాస్తవ్యుడు అయిన విష్ణుభట్ట సోమయాజి అనే ముని సంరక్షణలో విష్ణువర్ధనుడు అనే కుమారుడిని కన్నది.
* చందవోలు కైఫియత్తు:
కావేరి నదిపై ఆనకట్ట కట్టిన కరికాల చోళుడు ముక్కంటీశ్వరుని, ఇతర రాజులను జయించాడు.
*పల్లి కులం పుట్టుపూర్వోత్తరాలు కైఫీయతు:
కరికాల చోళుడు కావేరినదిపై ఆనకట్ట కడుతున్న సమయములో వివిధ ప్రాంతాలను ఏలే రాజులను ఆ నిర్మాణానికి సహాయపడ వలసినది అని ఆజ్ఞాపించాడు.
అప్పట్లో ధరణి కోటలో అమరేశ్వర మహాప్రసాదంబున నుదుట కన్నుగలిగిన ముక్కంటీశ్వరుండనే రాజు వద్దకు కరికాల చోళుని భటులు వచ్చినపుడు "నేను మూడు కన్నులు కలిగిన వాడను, రెండుకన్నులు కలిగిన వాడికి (కరికాలునికి) ఎందుకు వెట్టి చేస్తానని" ఆగ్రహించి పలికెను. ఈ విషయాన్ని ఆ భటులు కరికాలునికి విన్నవించినపుడు అతడు ముక్కంటీశ్వరుని ఆకారమును నేలపై వ్రాయించి, బొటనవ్రేలుతో నుదుటకన్నును ద్రొక్కిన అక్కడ అతని కన్ను రక్తంబు మెరుగ దర్పంబుమాని వచ్చి వెట్టి చేసెను.
*చౌడేశ్వరీ నందవరీకుల సారాంసం కైఫియతు:
త్రిలోచనమహారాజు గంగాస్నాన నిమిత్తమై వారణావర్తమునకు పోయి యుండగా స్నానకాలమందు అనేక బ్రాహ్మణ్యులు వచ్చి తమకు ఒక అగ్రహారం కావలెనని యాచించగా, వారిని మహారాజు మీకు ఏ సీమలో కావలెను అని అడుగగా, వారు శ్రీశైల ప్రాంత్యమునందు కావలెనని యాచించినారు.
పిమ్మట పద్దెనిమిది గోత్రాలకు చెందిన నూట ఎనిమిదిమంది ఆ బ్రాహ్మణులను త్రిలోచన మహారాజు తన వెంటబెట్టుకొని శ్రీశైల పర్వతసమీపములో, అహోబిల నరసింహాలయనకు పశ్చిమభాగమునందు కల అరణ్యములను నరికించి గ్రామనిర్మాణము చేయించి, అక్కడ ముక్కంటీశ్వరుడు అనే యీశ్వరదేవాలయము కట్టించి ఆ ఊరికి త్రిలోచన పురమనే నామధేయము చేసి, నూట ఎనిమిది వృత్తులవారిని అమర్చి ఆ గ్రామమును ఆ బ్రాహ్మణులకు దానమిచ్చెను.
*సంతరావూరు-శాసనములు కైఫియత్తు:
ఇది ప్రకాశం జిల్లా సంతరావూరు గ్రామానికి చెందిన కైఫియత్తు. ఈ ప్రాంతమున జైనులు ప్రాలులై (మంగళకరముగా) చాలాదినములు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అటుపిమ్మట యీశ్వరాంశం చేతను ముక్కంటి మహారాజు- జైనులను, బౌద్దులను, చార్వాకులను తరిమివేసి, వారి రాజ్యములను జయించి, దివ్యప్రభావ సంపన్నుడై యోగవాగములు గ్రహించి, గంస్నానమున్ను, విశ్వేశ్వర ఆరాధనలు చేస్తూ చాలా దినములు ప్రభుత్వము చేసెను.
*ఉప్పుటూరు (గుంటూరు) కైఫియత్తు:
ముక్కంటి మహారాజు వద్ద మాయాపాదుకలు ఉండేవి. వీటి సహాయంతో ప్రతీరోజు ధరణికోటనుండి కాశి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించుకొని పూజచేసుకొని తిరిగి వచ్చేవాడట. ఒకరోజు అలా కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి తన మాయాపాదుకలు కనిపించలేదట. తిరిగి తన రాజ్యానికి ఎలా చేరుకోవాలో తెలియని మహారాజు దుఃఖితుడై ఉండగా, కొంతమంది బ్రాహ్మణులు వచ్చి తమ యోగబలంతో ఆ మాయాపాదుకలను కనుగొని మహారాజుకు ఇచ్చారట. దీనికి సంతసించిన ముక్కంటి మహారాజు ఆ బ్రాహ్మణులను ధరణికోట రప్పించుకొని వారికి వందగ్రామాలను కలిగి ఉన్న ఉప్పుటూరు అనే అగ్రహారాన్ని సర్వమాన్యంగా ఇచ్చినాడు.
*మోటుపల్లి (కృష్ణా) కైఫియత్తు:
ముక్కంటి మహరాజు ధరణికోటను రాజధానిగా చేసుకొని పాలిస్తున్న కాలంలో, కొంతమంది బౌద్ధులు వచ్చి ద్వేలానగరం పేరుతో ఒక నగరాన్ని ఏర్పరచుకొని అక్కడ ప్రాకారంతో కూడిన ఒక బుద్ధుని ఆలయాన్ని నిర్మించుకొని నివసించుచున్నారు. ముక్కంటి మహరాజు తనరాజ్యంలో బౌద్ధులను నిర్మూలించే క్రమంలో ఈ ద్వేలానగరానికి వచ్చినపుడు దానిని ధ్వంసం చేసి, ఆ ప్రాంతానికి ముకుళానగరమని పేరు పెట్టి (మోటుపల్లి) అక్కడ కోదండరామస్వామి, మల్లికేశ్వరుల ఆలయాలను నిర్మించి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కొంతకాలానికి ఆ ప్రాంతం సముద్రంలో మునిగిపోయింది.
*కారసాల గ్రామ కైఫియత్తు:
చిల్కలూరిపాడు తాలుకా కారసాల గ్రామంలో కలియుగం ప్రవేశమైన తర్వాత జయినులు ప్రబలులై బస్తిలు ఏర్పరచుకొని దేశం యొక్క ప్రభుత్వములు ఆక్రమించుకొని అధికారం చేసే సమయమందు, కొంతమంది జయినులు ఈ కారసాల గ్రామం కట్టి నివాసం చేసిరి.
తదనంతరం రుద్రవరప్రసోదోద్భవులయినషువంటి ముక్కంటి మహారాజులుంగారు ప్రభుత్వానకు వచ్చి జయన బౌద్ధ చార్వాక మతస్తులను ఖిలపరచి గంగాతీరమందు వున్న బ్రాహ్మణులను యీ దేశానకు రప్పించి 700 అగ్రహారములిచ్చినారు. అంతే కాక సప్తరుషుల పేర్లు మీదుగా- వశిష్టస్థానంగా వుప్పుటూరు, కశ్యప స్థానంగా మగ్గిపురం, ఆత్రేయ స్థానంగా కారంచేడు, భరద్వాజ స్థానంగా సొలస, గౌతమ స్థానంగా గుంటూరు, జమదగ్ని స్థానంగా ఇనగల్లు ఇచ్చి ఈ కారసాల గ్రామమును విశ్వామిత్రుని స్థానంగా దానం ఇచ్చాడు. ఇక్కడ శ్రీలక్ష్మి నారాయణ స్వామి, లక్ష్మి నరశింహస్వామి, కేశవ స్వామి అనే మూడు విష్ణ్వాలయాలను, శ్రీ మల్లేశ్వరస్వామి వారనే లింగమూర్తిని ప్రతిష్టచేసి ఆలయములు కట్టించి, యీ గ్రామానకు ఉత్తరాన చెర్వు తవ్వించినారు.
*యాబుతి గ్రామ కైఫియత్తు:
సత్తెనపల్లి తాలుకాలో కల యాబుతు గ్రామం సమీపంలో పూర్వం బుద్ధ అనే పేరుతో బౌద్దుల బస్తీ ఉండెడిది. ఈశ్వరాంశశంభూతుడయిన ముక్కంటి మహరాజు జయిన, బౌద్ధాచార్యులను నిర్మూలించి దేశం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం చేసినపుడు ఆ బస్తీ పాడుపడినది.
*రేటూరు (గుంటూరు) గ్రామ కైఫియత్తు:
ఈ గ్రామానికి ఈశాన్యమందు పూర్వము జయనులు రాజ్యము చేసేటపుడు కొండ్రాజుపాలెం అనే గ్రామం జయిన బస్తిగా ఉండేది. ముక్కంటి రాజ్యకాలమందు కాశీనుంచి వచ్చిన బ్రాహ్మణులకున్ను, జయినులకున్ను సిద్ధాంత వివాదములు జరిగినపుడు జయినులు హీనవాదులు (ఓడిపోయారు) అగుట వలన ఈ కొండ్రాజుపాలెం అనే జయిన బస్తి పాడయిపోయినది.
*అనంతవరం (గుంటూరు) కైఫియత్తు: మాధవవర్మ గతించినతరువాత ఈశ్వరానుగ్రహముతో ముక్కంటి జన్మించాడు. ఇతను తపోధన సంపన్నులైన బ్రాహ్మణులను దక్షిణభారతదేశానికి రప్పించి వారికి స్థిరనివాసములు కల్పించాడు. ఇతను జైనులను, బౌద్దులను, చార్వాకులను నిర్మూలించి ధరణికోటను, వరంగల్ ను కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించాడు.
***
చారిత్రికంగా ముక్కంటి/త్రిలోచన పల్లవ రాజుగురించిన సమాచారం పెద్దగా లభించదు. ఆ తరువాత వచ్చిన వివిధ శతృరాజులు పూర్వరాజుల ఆనవాళ్లను చెరిపేసే పద్దతి ఒకటి సహజంగానే ఉండటం దీనికి కారణం కావొచ్చు. అయినప్పటికీ ఈ మహరాజు గురించి ఈ క్రింది అంశాలను అంగీకరించవచ్చు
1. ముక్కంటి/త్రిలోచన పల్లవుడు అయిదో శతాబ్దాంతంలో తెలుగు నేలను ధరణికోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన ఒక రాజు.
2. ఇతను తెలుగునాట ప్రబలంగా ఉండి జైన, బౌద్ధ, చార్వాక మతాలను అణచివేసి, వైదిక హిందూ మతాన్ని ప్రవేశపెట్టటానికి విశేషంగా కృషి చేసాడు. ఉత్తరాదినుంచి బ్రాహ్మణులను పెద్దఎత్తున రప్పించాడు. శైవుడైనప్పటికీ శైవ, వైష్ణవాలను సమాదరించాడు.
3. క్రీశ 486 లో ముక్కంటి మహరాజు, చాళుక్యరాజైన విజయాదిత్యుని యుద్ధంలో సంహరించి ఉండొచ్చని ఎన్. వెంకట రమణయ్య అభిప్రాయపడ్డారు.
4. ఈ ముక్కంటి మహరాజు కరికాల చోళుని సమకాలీనుడని చెప్పే ఒక గాథ "పల్లెకులం పుట్టుపూర్వోత్తరాలు" కైఫియత్తులో కనిపిస్తుంది. ముక్కంటి మహరాజు పాలించిన సమయంలో కరికాల చోళుడు అప్పటి ముక్కంటి రాజ్యాలైన నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాలలో అడవులను నరికించి గ్రామాలను ఏర్పరచాడని తమిళ శాసనాలు చెపుతున్నాయి. బహుసా అనంతవరం, చందవోలు కైఫియత్తులలో చెప్పబడినట్లు ముక్కంటి మహరాజు కారవేలుని చేతిలో ఓడిపోయి అతనికి సామంతుగా వ్యవహరించి ఉండాలి.
ముక్కంటి మహరాజు కావేరినదిపై ఆనకట్టకట్టిన కరికాల చోళుని సమకాలీనుడా కాదా అనే అంశంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకంటే వీరిద్దరిమధ్యా కనీసం రెండు శతాబ్దాల అంతరం ఉంది. జర్నల్ ఆఫ్ ఆంధ్ర హిస్టారికల్ రీసర్చ్ సొసైటి వాల్యూమ్ 4 పే.నం 122 లో బి.వి.కె వ్రాసిన ఒక రివ్యూలో- ముక్కంటిని కరికాలచోళుని సమకాలీనులుగా అంగీకరిస్తే తమిళ సంగం యుగపు తేదీలన్నీ మొత్తం తలక్రిందులవుతాయి, కనుక చరిత్రకారులు అంగీకరించలేరు అంటాడు. చరిత్రకారులకు ఈ అంశం ఒక బండరాయి.
5. ఒకప్పుడు దుర్గమారణ్యాలుగా ఉండే తెలుగు ప్రాంతాలలోని అరణ్యాలను తొలగించి వ్యవసాయభూములుగా మార్చినందుకు ఇతనికి కాడువెట్టి (అడవులు నరికిన) ముక్కంటి అనే పేరుకూడా కలదు
6. చాలా కైఫియత్తులలో ముక్కంటి మహరాజు ధరణికోటను రాజధానిగా చేసుకొని పాలించినట్లు ఉంది, కానీ అనంతవరం కైఫియతులో వరంగల్ ను రాజధానిగా చేసుకొని కూడా పాలించినట్లు ఉండటాన్ని బట్టి ఇతను కృష్ణానదికి దక్షిణం వైపు మాత్రమే కాక దక్కనులో కూడా కాలుమోపాడని అనుకోవాలి.
( రానున్న నా తదుపరి పుస్తకం “తూర్పుగోదావరి జిల్లా- మెకంజీ కైఫియత్తులు” నుండి)
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. Trilochana pallava and karikala chola by N. Venkata ramanayya
2. History of the Tamils from the earliest times to 600 A.D by Srinivas Iyengar,P.T
3. A P Archives Kaifiyats R No 1083__pallikulam kaiphiyat
4. A P Archives Kaifiyats R No 1426_ చౌడేశ్వరినందవరీకుల సారాంసం
5. A P Archives Kaifiyats R No 1222_ సంతరావూరు
6. Mackenzie Vol 001_1963_ కారసాల, యబూతి
7. Journal Of The Andhra Historical Research Society,vol.vii,pt.1 To 4
8. ''ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాలు'' గ్రంథం , రచన ప్రొ||బి.ఎస్.ఎల్. హనుమంతరావు, పేజీ 145
9. వికిపీడియా
10. History of the Reddi kingdoms, M. Somasekhara Sarma
Baba garu A P Archives Kaifiyats R No 1083__pallikulam kaiphiyat.........e book akkada dorukutundhi???
ReplyDeleteమీ మెయిల్ ఐడి చెప్పండి... bollojubaba@gmail.com to message చెయ్యండి పంపుతాను.
Delete